ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘మూస ధోరణులు, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. రొటీన్‌గా కాకుండా మరింత గొప్పగా పనిచేయాలి. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పనిచేయగలమని రోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చేస్తున్నామనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం’’ అని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం సీఎం పురపాలక శాఖ అంశాలు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని.. అప్పుడే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని చెప్పారు. ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ఉద్యోగుల సమష్టి కృషి కీలకమని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిననాడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు చేరవేయగలుగుతామన్నారు.
నాణ్యమైన సేవలు అందాలి
పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా పెరుగుతున్న ప్రజావసరాలను తీర్చడానికి అందరం కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన అన్ని రంగాలను తీర్చిదిద్ది గాడిలో పెట్టగలిగామని, అన్ని రంగాలు వాటంతట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణలో కనీస వసతులు లేవు. నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు సమకూరాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్నివర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది
సౌకర్యాల పెంపునకు డిమాండ్ పెరుగుతోందంటే ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాటి వలసలు నేడు రివర్స్ అయ్యాయి. 30లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి వలసవచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో రాబడులు, ఆర్థిక వనరులు పెరిగాయి. సంస్కరణలతో గడపగడపకూ పాలనను తీసుకుపోతున్నాం. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల ప్రాథమిక, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
వర్షాలు లేని సమయంలోనే పూర్తి చేయాలి
గతంలో వానాకాలం రెండు మూడు నెలలే వర్షాలు పడేవని, ఇప్పుడు వానలు పడే రోజులు పెరిగి నిర్మాణ పనులకు సమయం తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందువల్ల వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే పనులు వేగంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలని, నిధులకు కొరత లేదని.. రెండు నెలల్లో తాను స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సీఎంకు మంత్రి కేటీఆర్ వివరించారు. సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా?
Comments
Please login to add a commentAdd a comment