సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణా చర్యలను పాటించాలని పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు.
చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ
రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు!
సెక్రటేరియట్ పనులన్నీ సమాంతరంగా వేగంగా సాగాలి
నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డీజీపీ మహేందర్ రెడ్డితో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సిఎం అన్నారు.
ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్ , వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ , ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment