సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్‌లో హాట్ హాట్‌గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు.
కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్‌తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు.
మార్కెట్‌లోకి స్సైసీ బిట్టర్‌గార్డ్, గార్లిక్ పూతరేకులు
ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్‌ని హాట్‌గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్‌లోకి విడుదల చేశారు.
అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్‌గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా...
ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం
Comments
Please login to add a commentAdd a comment