పూతరేకుపై కల్తీ పూత
కల్తీ నెయ్యితో తయారీ
తింటే అనారోగ్యం ఖాయం
అమలాపురం :నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి.. కమ్మనైన రుచిని పంచే ఆత్రేయపురం పూతరేకుకు కల్తీ సెగ తగలింది. పూతరేకులకు అద్భుతమైన రుచిని తెచ్చేందుకు స్వచ్ఛమైన నెయ్యి వినియోగించే బదులు కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు స్వార్థంతో చేస్తున్న ఈ పని.. జాతీయ స్థాయిలో ఆత్రేయపురం పూతరేకుకున్న ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కేంద్రంగా తయారవుతున్న కల్తీనెయ్యి ఇటీవల ఆత్రేయపురం మండలంలో పెద్ద ఎత్తున దొరికిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా సరఫరా అవుతున్నా ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున దొరకడానికి కారణం దీనిని స్థానికంగా తయారు చేస్తున్న పూతరేకుల్లో వినియోగించడమే. ఒక్క ఈ మండలంలోనే ఏటా సుమారు రూ.10 కోట్ల విలువైన కల్తీ నెయ్యి అమ్మకాలు సాగుతున్నాయంటే ఇక్కడ వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆవులు, గేదెల కళేబరాల నుంచి సేకరించిన కొవ్వులో కొంత నెయ్యి కలిపి కల్తీ చేస్తున్నారు. ఇది సువాసన వచ్చేందుకు కొన్ని రకాల ఎసెన్స్ వాడుతున్నారు. కల్తీనెయ్యి వల్ల పెద్దపేగు, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి. కల్తీ మోతాదు పెరిగితే ఫుడ్ పాయిజన్ కూడా జరగవచ్చు. బహిరంగ మార్కెట్‌లో స్వచ్ఛమైన నెయ్యి ధర కేజీ రూ.500 వరకూ ఉండడంతో కొందరు పూతరేకుల తయారీదారులు ఇలా పక్కదారి పట్టారు. రూ.250కే రావడంతో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు.
బ్రాండెడ్ అన్నట్టుగా బిల్డప్
ఆత్రేయపురం మండలం పులిదిండిలోని ఒక వ్యాపారి నిడదవోలు నుంచి పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి దిగుమతి చేసుకుంటున్నాడు. దీనిని స్థానిక వ్యాపారులు కేజీ రూ.110కి కొంటున్నారు. రాజమండ్రిలోని బ్రాండెడ్ కంపెనీ నుంచి తెచ్చినట్టు చెబుతూ వారు పూతరేకుల తయారీదారులను మోసగిస్తున్నారు. కేజీ రూ.250 చొప్పున రోజుకు 15 నుంచి 20 కేజీల వరకూ విక్రయిస్తున్నారు.
ఖండాంతర ఖ్యాతికి మచ్చ
కల్తీ అని తెలిసి కూడా కొంతమంది పూతరేకుల తయారీదారులు లాభాపేక్షతో దీనిని వినియోగిస్తున్నారు. ఇది ఆత్రేయపురం పూతరేకు ఖ్యాతికి మచ్చ తెచ్చింది. ఆత్రేయపురం నుంచి జిల్లాతోపాటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు, అమెరికాకు కూడా పూతరేకులు ఎగుమతి అవుతూంటాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఫంక్షన్లకు ఆత్రేయపురం పూతరేకును అతిథులకు అందించడం సర్వసాధారణమైంది.
వీటి తయారీపై మండలంలో సుమారు 300 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నాయి. ఏటా రూ.25 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు కల్తీ మచ్చవల్ల మొత్తం తయారీదారులపైనే అపనమ్మకం ఏర్పడుతోందని నిజాయితీగా వ్యవహరించే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూతరేకులతోపాటు పలు స్వీట్ల వినియోగంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు.
కొందరే ‘కల్తీ’ని వినియోగిస్తున్నారు
నాణ్యమైన ముడిసరుకుతో తయారు చేయడంవల్లే ఆత్రేయపురం పూతరేకులకు అంత గుర్తింపు వచ్చింది. కొంతమంది స్వార్థపరులు కల్తీ నెయ్యి వినియోగించి పూతరేకుకు చెడ్డపేరు తెస్తున్నారు. వారివల్ల పూతరేకుల పరిశ్రమ దెబ్బతినేలా ఉంది.
- సఖిలేటి రామకృష్ణంరాజు,
పూతరేకుల వ్యాపారం, తాడిపూడి, ఆత్రేయపురం