లొల్లలాకుల వద్ద ఇరిగేషన్ కార్యాలయం (ఇక్కడే ఘటన జరిగింది)
సాక్షి, కోనసీమ జిల్లా(ఆత్రేయపురం): ఆడపిల్లలకు రక్షణ కరవైంది. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే సంగతి మర్చిపోయి కొందరు మృగాళ్లు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. షాపింగ్ మాల్స్, ట్రైల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలు దుస్తులు మార్చుకునే దృశ్యాలను చాటుగా చిత్రీకరించే విషయాలను చాలా వింటున్నాం. అదే ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలా చేస్తే.. ఎవరిదీ తప్పు.
ఆత్రేయపురం మండలం లొల్లలాకుల ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఫేస్‌బుక్ పరిచయంతో స్నేహితులంతా కలసి లొల్లలాకుల వద్ద కార్తిక మాసం సందర్భంగా ఈ నెల 20న వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. కొందరు యువకులు, యువతులు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే యువతులు దుస్తులు మార్చుకునేందుకు అక్కడే ఉన్న ఇరిగేషన్ కార్యాలయాన్ని అధికారుల అనుమతితో తీసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది.
కానీ ఆ కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్టు సిబ్బంది ఒకరు రహస్యంగా ఆ రూమ్‌లో సెల్‌ఫోన్ రికార్డింగ్ బటన్ ఆన్‌చేసి.. ఎవరికీ కనబడకుండా కేవలం యువతుల దుస్తులు మార్చుకునే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలియని ఆ యువతులు మామూలుగానే ఆ రూంలోకి వెళ్లారు. ఒకరిద్దరు దుస్తులు కూడా మార్చుకున్నారు. మరొకరు ఆ రూంలో చూస్తుండగా సెల్‌ఫోన్ కంట పడింది. దీంతో ఆ యువతులు షాక్‌కు గురై వెంటనే తమను ఇక్కడికి ఆహ్వానించిన స్నేహితులకు విషయం చెప్పి.. సెల్‌ఫోన్ అప్పగించారు.
ఆ సెల్‌ఫోన్ ఎవరిదని ఆరా తీస్తే.. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిది అని తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకుని గట్టిగా దేహశుద్ధి చేశారు. అనంతరం ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడ కొందరు పెద్దలు, అధికారులు కలసి విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా రాజీచేసి కేసు లేకుండా ఆ సెల్‌ఫోన్ రికార్డింగ్ చేసిన ప్రబుద్ధుడిని వదిలేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని సాధారణంగా వదిలేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కుమ్మక్కై వదిలేశారనే ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సై సీహెచ్ సుధాకర్ వివరణ కోరగా జరిగిన విషయం వాస్తమేనని, అయితే తమకు కేసు వద్దని స్నేహితులంతా తెలిపారన్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment