
4000 ‘త్రీ’ పాయింటర్లు సాధించిన స్టీఫెన్ కరీ
ఎన్‌బీఏ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు
శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ స్టీఫెన్ కరీ అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ‘త్రీ’ పాయింటర్లు స్కోరు చేయడంలో సిద్ధహస్తుడైన కరీ.. ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్‌బీఏ)లో 4 వేల త్రీ పాయింటర్లు సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లీగ్‌లో భాగంగా ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 ఏళ్ల కరీ... శుక్రవారం సాక్రమెంటో కింగ్స్ జట్టుతో జరిగిన పోరులో ఈ మైలురాయి దాటాడు.
ఆట మూడో క్వార్టర్ 8వ నిమిషంలో నాలుగో ప్రయత్నంలో కరీ... త్రీ పాయింటర్ సాధించాడం ద్వారా 4000 త్రీ పాయింటర్లు ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా గోల్డెన్ స్టేట్ వారియర్స్ జట్టు 130–104 పాయింట్ల తేడాతో సాక్రమెంటో కింగ్స్‌పై విజయం సాధించింది. సుదీర్ఘ కాలంగా ‘పాయింట్ గార్డ్’ పొజిషన్‌లో ఆడుతున్న కర్రీ... తన జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2009 అక్టోబర్ 30న కరీ తన తొలి ‘త్రీ’ పాయింటర్ సాధించాడు.
ఎన్‌బీఏ చరిత్రలో అత్యధిక త్రీ పాయింటర్లు సాధించిన ఆటగాడిగా రే అలెన్ (2,973) పేరిట ఉన్న రికార్డును 2021లో అధిగమించిన కరీ... అదే జోరు కొనసాగిస్తూ పుట్టినరోజున మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ప్రస్తుతం కరీ తర్వాత జేమ్స్ హర్డెన్ (3,127), డామియన్ లిలార్డ్ (2,794) ఉన్నారు. బాస్కెట్‌కు 23.9 ఫీట్ల (7.24 మీటర్లు) దూరంలోని గీత నుంచి నేరుగా బంతిని లక్ష్యాన్ని చేర్చగలిగితే 3 పాయింట్లు లభిస్తాయి.
అంతర్జాతీయ పోటీల్లో 22.2 ఫీట్లు ఉన్న ఈ దూరం... ఎన్‌బీఏలో మాత్రం 23.9 ఫీట్లుగా ఉంది. ప్రత్యర్థి కళ్లు గప్పగల నైపుణ్యంతో పాటు... దూరం నుంచే లక్ష్యాన్ని గురిపెట్టగల సామర్థ్యం కలగలిసినప్పుడే త్రీ పాయింటర్లు సాధ్యమవుతాయి. ఈ విషయంలో కెరీర్ ఆరంభం నుంచి తన ప్రత్యేకత చాటుకుంటున్న కరీ... ‘త్రీ’ పాయింటర్ స్పెషలిస్ట్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు ఎన్‌బీఏలో రెండుసార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన కరీ... ఈ క్రమంలో ఎన్‌బీఏ చరిత్రలో 25,000 పాయింట్లు సాధించిన 26వ ప్లేయర్‌గా నిలిచాడు.
‘అతడు జట్టుకు ఎంతో ముఖ్యం. కీలక సమయాల్లో అతడు సాధించే పాయింట్లు టీమ్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. ఆటను ఎలా మలుపుతిప్పాలో అతడికి బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన ఏకాగ్రత కోల్పోడు. చిన్నప్పటి నుంచి అతడి నిశిత పరిశీలన నన్ను ఆకట్టుకుంటోంది’ అని కోచ్ స్టీవ్ కెర్ అన్నాడు. ‘నేనెప్పుడూ త్రీ పాయింటర్ల గురించి ఆలోచించలేదు. ఆటలో భాగంగా అవి వాటంతటవే వచ్చి చేరుతున్నాయి.
నా వరకు మ్యాచ్ విజయమే ముఖ్యం. ఈ క్రమంలో 4 వేల త్రీ పాయింటర్లు సాధించడం ఆనందంగా ఉంది. అయితే అది ఒక నంబర్ మాత్రమే’ అని 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్న కరీ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment