
సరికొత్త గరిష్టానికి చేరిన బంగారం ధర
ఒక్క రోజులో రూ.2,500 పెరుగుదల
రూ. లక్ష దిశగా పయనిస్తున్న పసిడి
ఏడాదిలో ఏకంగా రూ.24 వేలు మించిన ధర
ఐదేళ్లలో రెండింతలు దాటిన గోల్డ్‌రేట్
ధరల పరుగుతో రూ.118 లక్షల కోట్లు పెరిగిన భారతీయుల సంపద
ఏడాదిలోనే రూ.60 లక్షల కోట్లు ఎగిసిన విలువ
సాక్షి, స్పెషల్ డెస్క్: పసిడి దూకుడు ఆగడం లేదు. తాజాగా మరో రికార్డును తిరగరాస్తూ 10 గ్రాముల (24 క్యారట్లు) పుత్తడి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.94,000లకు చేరింది. ఒకానొక దశలో రూ.94,200లను కూడా తాకింది. ఒక్క రోజులోనే ధర రూ.2,500 దూసుకెళ్లడం గమనార్హం. పరిశ్రమ నిపుణులు అంచనా వేసినట్టుగానే రూ.1 లక్షకు చేరువ దిశగా పుత్తడి ధర పరుగులు తీస్తోంది. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై టారిఫ్‌ల పెంపు అమలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది.
ఇన్వెస్టర్లకుతోడు ఆభరణాల వర్తకులు సైతం కొనుగోళ్లకు దిగడంతో పసిడి ధర ఆల్‌టైం హై నమోదు చేసింది. అటు 22 క్యారట్ల పసిడి రూ.86,300లకు చేరింది. మరోవైపు వెండి లో మూడురోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. కిలోకు రూ.500 నష్టపోయి రూ.1,02,500 స్థాయికి పరిమితమైంది. కాగా, గతేడాది ఏప్రిల్ 1న బంగారం ధర రూ.70,000 నమోదైంది. అంటే ఏడాదిలో రూ.24 వేలు పెరగడం విశేషం. ఇక 2020 ఏప్రిల్ 1న పసిడి ధర రూ.46,500 పలికింది. తాజా రి కార్డుతో పోలిస్తే ఐదేళ్లలో ధర రెండింతలకు ఎగిసింది. ధరలో 102 శాతం వృద్ధి నమోదైందన్న మాట.

సురక్షిత ఆస్తుల వైపు..
2025లో ఇప్పటివరకు పసిడి 18 కొత్త గరిష్టాలను తాకింది. 2024లో 40 కంటే ఎక్కువసార్లు ఆల్‌టైమ్ గరిష్టాలను అందుకుంది. ఏప్రిల్ 1న అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రాములు) ధరరూ.2,68,784 దాటింది. రెండు వారాల క్రితం ఇది రూ.2,56,800 ఉంది. యూఎస్ ప్రతిపాదిత సుంకాలు, ఆర్థిక అని శ్చితి ఆందోళనల మధ్య బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఆర్థిక మాంద్యం ముప్పు, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు అవకాశముందన్న అంచనాల కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతోంది. పెట్టుబడికి సురక్షిత సాధనంగా పుత్తడి నిలిచిందని సికింద్రాబాద్‌లోని ఆదినాథ్ జువెల్లర్స్ ఎండీ ముకేశ్‌కుమార్ సురానా వివరించారు.
ఐదేళ్లలో 3,627 టన్నులు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా ప్రకారం 2019 నాటికి భారతీయ కుటుంబాల వద్ద సుమారు 24,000–25,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 2020 నుంచి 2024 వరకు 3,627 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న పుత్తడి నిల్వలు 2019 నాటికి 618.2 టన్నులు. 2024 డిసెంబర్ నాటికి ఇవి 876.18 టన్నులకు చేరాయి.
ఐదేళ్లలో ఆర్‌బీఐ 258 టన్నులు అదనంగా సమకూర్చుకుంది. కరోనా మహమ్మారి, తదనంతర కాలంలో అమ్మకం, తాకట్టు ద్వారా కోట్లాది కుటుంబాలను బంగారమే ఆదుకుంది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో ప్రజల వద్ద పుత్తడి నిల్వలు 25,000 టన్నులు ఉన్నాయని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ వెల్లడించింది.
దాచిందంతా బంగారమే..
అవును మీరు చదివింది నిజమే. దాచిందంతా బంగారమే. ఎంతలా అంటే ఊహకు అందనంత. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,87,50,00,00,00,000 కోట్లు. సింపుల్‌గా రూ.118 లక్షల కోట్లకుపైమాటే. భారతీయ కుటుంబాలు దాచుకున్న 25,000 టన్నుల బంగారం విలువ ఐదేళ్లలో ఈ స్థాయిలో ఎగిసింది. పుత్తడి ధర ఐదు సంవత్సరాల్లో రెండింతలకుపైగా దూసుకుపోవడమే ఇందుకు కారణం.
అయితే ఒక్క ఏడాదిలోనే భారతీయ కుటుంబాల వద్ద బంగారం రూపంలో ఉన్న ఈ సంపద రూ.60 లక్షల కోట్లు వృద్ధి చెందడం మరో విశేషం. ఆభరణం, పొదుపు, పెట్టుబడి.. బంగారం కొనుగోలుకు కారణం ఏదైనా ఈ ‘గోల్డెన్‌డేస్’జనానికి కాసులు కురిపిస్తోందని పెద్దపల్లికి చెందిన బంగారం వ్యాపారి కట్టా సంజీవ్ కుమార్ తెలిపారు. ధర దూకుడుగా ఉన్నా భవిష్యత్ అవసరాల కోసం కొనుగోళ్లు జరుపుతున్నారని చెప్పారు.
ఐదేళ్ల బంగారం ముచ్చట్లు
3,627 టన్నులు భారత్ దిగుమతి చేసుకున్న పుత్తడి
258 టన్నులు ఆర్‌బీఐ అదనంగాసమకూర్చుకున్న బంగారం
రూ. 47,500 అధికమైన పసిడి ధర
పసిడి రూపంలో పెరిగిన సంపద
రూ.118 లక్షల కోట్లు ఐదేళ్లలో
రూ.60 లక్షల కోట్లు సంవత్సరంలో
2,16,265 టన్నులు 2024 డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన పసిడి
11.56 శాతం మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న బంగారం