
సాక్షి, స్పెషల్ డెస్క్: ఓవైపు అగ్ర దేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతంగా కొనసాగుతుంటే ఆ దేశాలతో అన్ని రంగాల్లో పోటీపడుతున్న భారత్ మాత్రం ఏఐని అందిపుచ్చుకోవడంలో ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఏకంగా 60% మంది భారతీయులకు ఏఐ గురించి తెలియదని టెక్నాలజీ దిగ్గజం గూగుల్, మార్కెట్ పరిశోధన సంస్థ కాంటార్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో కేవలం 31% మందే జనరేటివ్ ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు.
జీవితాల మెరుగుదల కోసం..
అత్యధికులకు ఇప్పటికీ ఏఐ గురించి తెలియకపోయినా తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఏఐ వంటి సాధనాలను ఉపయోగించాలనే కోరిక ఎక్కువ మందిలో ఉంది. మరింత ఉత్పాదకత పొందాలని 72% మంది, సృజనాత్మకతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని 77% మంది, మరింత సమర్థంగా సమాచారాన్ని తెలియజేయాలని 73% మంది చూస్తున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రాణించడానికి సహాయపడే సాధనాన్ని 75 శాతం మంది కోరుకుంటున్నారు.
ప్రారంభించడమూ తెలియదు..
పనిప్రదేశం లేదా తరగతి గదికి మించి భారతీయులు రోజువారీ పనుల్లో కూడా సహాయం కోసం ఆసక్తిగా ఉన్నారు. ప్రయాణ ప్రణాళిక నుంచి బడ్జెట్‌లను నిర్వహించడం వరకు 76% మంది తమ సమయం ఆదా చేయడంలో సహాయం కోరుకుంటున్నారు. పిల్లలకు హోంవర్క్‌లో చేదోడు లేదా వంట వంటి కొత్త అభిరుచులను అన్వేషించడం.. ఇలా రోజువారీ జీవితంలో మరింత సృజనాత్మకంగా ఉండాలని 84% మంది ఆశిస్తున్నారు. ఏఐ వినియోగంలో చాలా మంది నిరంతర అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఏఐని ఎలా ప్రారంభించాలో 68% మందికి తెలియడంలేదు. అందుకు నైపుణ్యం లేదా మార్గదర్శకత్వం లేకపోవడాన్ని 52% మంది ఉదహరిస్తున్నారు. అటువంటి అడ్డంకుల కారణంగా వృత్తిపరమైన లేదా సృజనాత్మక ఆకాంక్షను వదులుకున్నామని 61% మంది చెప్పారు.
మార్పు తెచ్చిన జెమినై..
తమ ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినైని మొదటగా స్వీకరించినవారు ఇప్పటికే గణనీయంగా ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారని గూగుల్ తెలిపింది. దేశంలోని 92% జెమినై వినియోగదారుల విశ్వాసాన్ని ఈ సాధనం మెరుగుపరిచిందని వెల్లడించింది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ (94%), విద్యార్థులు (95%), మహిళల్లో (94%) జెమినై అధిక ప్రభావం ఉందని వివరించింది. ఏఐ వినియోగం 93% మంది వినియోగదార్ల ఉత్పాదకతను పెంచిందని తెలిపింది. సృజనాత్మకంగా ఆలోచించడంలో 85% మందికి సహాయపడిందని గూగుల్ వివరించింది. గూగుల్–కాంటార్ తాజా అధ్యయనం..