
షాపింగ్ మాల్స్‌ను తలపిస్తున్న ఎయిర్‌పోర్టులు
విమానేతర కార్యకలాపాల ద్వారానే అత్యధిక ఆదాయం
ప్రయాణికుల సంఖ్య పెరగడం మరింత ప్లస్..
విమానాశ్రయాల్లో భారీగా రిటైల్ స్పేస్ విస్తరణ..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణం
ప్రీమియం రిటైల్ స్టోర్స్.. లగ్జరీ బొటిక్స్.. డైనింగ్ ఏరియాలు.. వెల్‌నెస్ సెంటర్లు.. స్పాలు.. కాఫీ షాపులు.. రెస్టో బార్‌లు.. 24 గంటలూ కిటకిటలాడే జనాలు... ఇవన్నీ ఏదైనా భారీ షాపింగ్ మాల్‌లో ప్రత్యేకతలు అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టుల నయా అవతారం ఇది. విమానయాన కార్య కలాపాల నుంచి వచ్చేది అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ.. ఆదాయాలను దండిగా పెంచుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇప్పుడు షాపింగ్ మాల్స్(shopping mall) కు ఎక్కువ.. ఎయిర్‌పోర్టుల(airport)కు తక్కువ అనే రేంజ్‌లో నడుస్తున్నాయి!! – సాక్షి, బిజినెస్ డెస్క్
దేశీయంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణలో దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయం ఢిల్లీతోపాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ కంపెనీ చేతిలోనే ఉంది. ప్రయాణికుల రాకపోకల్లో ఇవి రికార్డులు సృష్టిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికుల ట్రాఫిక్‌తో దుమ్మురేపింది.
తొలి తొమ్మిది నెలల్లో ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టు ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.3,775 కోట్లు. ఇందులో విశేషం ఏముందంటారా? తాజా లెక్కల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే! ఆదాయంలో విమాన (ఏరో) కార్యకలాపాల వాటా 20 శాతమే. మరో 57 శాతం విమానయేతర కార్యకలాపాలు (నాన్–ఏరో) సమకూర్చిపెట్టాయి. అంటే రిటైల్, డ్యూటీ–ఫ్రీ సేల్స్, అద్దెలు, ప్రకటనలు, ఆహార–పానీయాల విక్రయం తదితర మార్గాల్లోనే లభించాయి. దీన్నిబట్టి చూస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇప్పుడో భారీ మాల్ కింద లెక్క!
ఏరో ‘మాల్స్’ కిటకిట..: ఒకవైపు నగరాల్లోని భారీ మాల్స్‌లో రిటైల్ గిరాకీ తగ్గుముఖం పడుతోంది.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ తాజా నివేదిక ప్రకారం... దేశంలోని 8 ప్రధాన నగరాల షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలాల లీజింగ్ గతేడాది 10శాతం తగ్గిపోవడం గమనార్హం. అదే ఎయిర్‌పోర్టుల్లోని మాల్స్ మాత్రం కిటకిటలాడి పోతున్నాయి. జీఎంఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య అద్దెల రూపంలో ఏకంగా రూ.597 కోట్లు (2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో) లభించడం విశేషం. ప్రయాణికుల రద్దీ చూస్తే.. దేశీ ట్రాఫిక్‌లో 17 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్‌లో 28 శాతంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు టాప్‌లో ఉంది.
ఎయిర్‌పోర్టు ఆదాయంలో 28 శాతం రిటైల్, డ్యూటీ–ఫ్రీ షాపుల ద్వారా, 18 శాతం అద్దెల ద్వారా లభించగా, మరో 10 శాతం ఆహార–పానీయాల అమ్మకం ద్వారా తోడైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు డ్యూటీ–ఫ్రీ షాపుల్లో ఒక్కో ప్రయాణికుడి సగటు ఖర్చు రూ.1,026 కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్..
ఎయిర్‌పోర్టుల విమాన సంబంధ ఆదాయాల్లో.. ల్యాండింగ్ ఫీజులు, విమానాల పార్కింగ్ చార్జీలు, ప్రయాణికుల సెక్యూరిటీ ఫీజులు, విమానాల టెర్మినల్ స్పేస్ అద్దెలు, గేట్లు, సర్వీసులకు సంబంధించి వినియోగ ఫీజులు కీలకమైనవి. అయితే అంతపెద్ద ఏరియాలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ ఆదాయం ఏ మూలకూ సరిపోదు. అందులోనూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు భారీ పెట్టుబడులు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. అందుకే ఎయిర్‌పోర్టులను ఫైవ్‌స్టార్ మాల్స్‌గా మార్చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నీ నాన్–ఏరో బిజినెస్‌లపైనే ఫోకస్ చేస్తున్నాయి.
సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్టుకు కూడా 55 శాతం ఆదాయం నానో–ఏరో కార్యకలాపాల ద్వారానే వస్తోంది. రిటైల్, డ్యూటీ–ఫ్రీ, ఫుడ్–బేవరేజ్ షాపులకు అధిక స్పేస్ కేటాయిస్తుండటంతో ఎయిర్‌పోర్టులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. దీంతో షాపింగ్ స్పేస్ పెరిగిపోయి విమానాశ్రయాలు ఇరుకైపోయాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల నాన్–ఏరో ఆదాయం సగటున 40–50 శాతం కాగా.. మన దగ్గర దానికి మించి ఉండటం విశేషం. ఆదాయం కోసం మాల్ సదుపాయాలను విస్తరించినప్పటికీ.. ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దుబాయ్, చాంగి ఎయిర్‌పోర్టులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.
భారత్‌లో అతిపెద్ద మాల్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో..
28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం (బిల్టప్ ఏరియా)తో దేశంలోనే అతిపెద్ద మాల్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోసిటీలో ఏర్పాటవుతోంది. 2027 మార్చి కల్లా ఈ మెగా మాల్ అందుబాటులోకి వస్తుందని అంచనా. దీని అండర్ గ్రౌండ్‌లో 8,000కుపైగా కార్లు పార్క్ చేయొచ్చట! వరల్డ్ మార్క్ ఏరోసిటీ పేరుతో 2.5 బిలియన్ డాలర్లతో చేపట్టిన ఫేజ్–2 విస్తరణ ప్రాజెక్టులో భాగమిది.
భారత్‌లో తొలి ‘ఏరోట్రోపోలిస్ (విమానాశ్రయం చుట్టూ నిర్మిస్తున్న మెట్రోపాలిటన్ ఏరియా)’గా కూడా ఇది రికార్డు సృష్టించనుంది. భారతీ రియల్టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఫేజ్–2లో మొత్తం 35 లక్షల చదరపు అడుగుల లీజింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏరోసిటీలోని 11 స్టార్ హోటళ్లలో 5,000 గదులు ఉండగా.. విస్తరణ తర్వాత 15 హోటళ్లు, 7,000 గదులకు పెరగనున్నాయి. కాగా ప్రస్తుతం కొచ్చిలో ఉన్న లులు ఇంటర్నేషనల్ మాల్ 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో అతిపెద్ద మాల్‌గా ఉంది.
హైదరాబాద్‌లోనూ..
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో కూడా 20 ఎకరాల్లో భారీ మాల్ నిర్మాణంలో ఉంది. మొత్తం విస్తీర్ణం 8 లక్షల చదరపు అడుగులు. 100కు పైగా దేశ, విదేశీ దిగ్గజ బ్రాండ్ స్టోర్లు సహా అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 2,000 సీట్ల సామర్థ్యంలో ఐనాక్స్ 11 స్క్రీన్ల థియేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదే ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా.
68.8 బిలియన్ డాలర్లు.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రిటెయిలింగ్ మార్కెట్ అంచనా ఇది. ఏటా 6.9 శాతం వృద్ధి చెందుతుందని లెక్కలేస్తున్నారు. 2023లో ఇది 43.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
విమాన ప్రయాణికుల జోరు ఇది.. (కోట్లలో)
ఎయిర్ ట్రాఫిక్ 2024 2023 వృద్ధి(%)
దేశీయ 16.13 15.20 6.11
అంతర్జాతీయ 6.45 5.79 11.4
Comments
Please login to add a commentAdd a comment