
పూర్తయిన రన్‌వే విస్తరణ, అభివృద్ధి పనులు
అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు సర్వ సౌకర్యాలు
అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు
అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాల రాకపోకలకు అనుకూలం
3,810 మీటర్ల పొడవుతో అతి పెద్ద రన్ వే
ఏఏఐ విమానాశ్రయాల్లోని రన్ వేలలో ఇదే పొడవైనది
బోయింగ్ 777, ఎయిర్‌బస్ 330 వంటి పెద్ద విమానాలూ రావొచ్చు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కొండపై కొలువైన వెంకన్నతో ప్రపంచ ఖ్యాతినార్జించిన తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయమూ సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనువుగా రూ.153.16 కోట్లతో రన్ వేను విస్తరించి, అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ట్రాన్స్– ఇన్‌స్టాల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్‌ఎస్), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (డీవీఓఆర్), డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్‌మెంట్ (డీఎంఈ) ఏర్పాటు చేశారు.
ఈ వ్యవస్థల ద్వారా విమానాల నిర్వహణ సామర్థ్యం రోజుకు 100 విమానాల నుంచి 200 విమానాలకు పెరుగుతుందని విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నె చెప్పారు. అత్యాధునిక ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా కనీస దృశ్యమానత (విజిబులిటీ) 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది. గ్‌లైౖడ్ యాంగిల్ కూడా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గింది. వీటి ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాలు సజావుగా రాకపోకలు సాగిస్తాయని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఏదైనా సమస్య తలెత్తినా అక్కడ దిగాల్సిన విమానాలు తిరుపతిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా విమానాశ్రయాన్ని అభివృద్ది చేశారు. ఇప్పటివరకు 2,285 మీటర్ల పొడవు ఉన్న రన్‌న్‌వేను బలోపేతం చేసి, 3,810 మీటర్లకు విస్తరించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహిస్తున్న విమానాశ్రయాలలోని రన్‌వేలలో ఇదే అతి పొడవైనది. తద్వారా బోయింగ్ 777, ఎయిర్‌బస్ 330 వంటి అతి పెద్ద, విశాలమైన విమానాలూ ఇక్కడ దిగే అవకాశం కలిగింది.
ఆధునిక విమానాశ్రయం
ఆధునిక నావిగేషన్ పరికరాల ఏర్పాటు ద్వారా విమానాశ్రయ సేవలు మరింత మెరుగవుతాయి. ముఖ్యంగా అధునాతన ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ వ్యవస్థ ద్వారా విమాన సర్వీసుల రాకపోకలు మరింత సులభంగా, సురక్షితంగా మారతాయి. పెద్ద విమానాల రాకపోకలకూ ఈ విమానాశ్రయం అనువుగా ఉంటుంది.
రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్‌లో పనిచేసే వారి సౌకర్యార్థం తిరుపతి నుంచి నేరుగా కువైట్ విమానం ప్రారంభించాలని ప్రయతి్నస్తున్నాం. విమానాశ్రయంలో నిర్వహణ, మరమ్మతు, సమగ్ర పరిశీలన కేంద్రం (ఎంఆర్‌ఓ) ఏర్పాటుకి గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచారు. ఆ దిశగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరాం. – ఎం. గురుమూర్తి, తిరుపతి ఎంపీ
వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ
తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించడానికి 2017లో శంకుస్థాపన చేశారు. అయితే, భూములు ఇచ్చిన రైతులు పలు సమస్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోవటంతో విస్తరణ పనులు ముందుకు సాగలేదు.
2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ సర్వీసులు నడపాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించారు. నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పలుమార్లు రైతులతో సమావేశమై, వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు.
విమానాశ్రయం అభివృద్ధిపై అనేకమార్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ప్రధానికి విన్నవించారు. దీంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, సంబంధిత అధికారులను కలిసి పెండింగ్ పనులపై చర్చించారు. మూడు రోజుల్లోనే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment