
దేశంలో 2023తో పోలిస్తే 1.7 శాతం తగ్గిన నైపుణ్యం
అర్హత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ టాప్.. ఉత్తరాది రాష్ట్రాలదే హవా
టాప్–10లో ఒకే ఒక్క దక్షిణాది రాష్ట్రం తెలంగాణకు చోటు
ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్–2025 నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగాఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది.
30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి.
అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం.
ఉత్తరాది రాష్ట్రాలదే హవా...
» దేశంలో కనీసం 50% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి పొందగల రాష్ట్రాలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి.
» ఓవరాల్ పర్ఫార్మెన్స్‌లో రాజస్తాన్‌కు టాప్ 10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది.
» నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయి
నైపుణ్యాలుఉండాల్సిందే..
ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్
నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని విషయాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే తగిన నైపుణ్యాలు తప్పనిసరి.

» 2023తో పోలిస్తేౖటైర్–1, టైర్–3 కళాశాలలకు చెందిన పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం స్వల్పంగా తగ్గింది. టైర్–1 విషయానికొస్తే.. ఈ సంఖ్య 2023లో 49.1శాతం కాగా.. 2024లో 48.75 శాతంగా ఉంది.
» టైర్–3 లో 44% నుంచి 43.6 శాతానికి పడిపోయింది. టైర్–2 కళాశాలల్లో ఎక్కువ క్షీణత కనిపించింది. 2023లో 47.5% మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి అర్హులుగా ఉంటే.. 2024లో అది 46.2 శాతానికి తగ్గింది.
» ఉద్యోగానికి అర్హులైన గ్రాడ్యుయేట్ విభాగంలో మహిళలు (42%) పురుషుల (43%) కంటే పెద్దగా వెనుకబడి లేరని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment