నో లెర్నింగ్‌.. నో అప్‌డేట్‌ | The latest report from professional networking company LinkedIn | Sakshi

నో లెర్నింగ్‌.. నో అప్‌డేట్‌

Jun 20 2024 4:17 AM | Updated on Jun 20 2024 4:42 AM

The latest report from professional networking company LinkedIn

నైపుణ్యాల మెరుగునకు సిద్ధంగా లేని 90 శాతం మంది భారత వృత్తి నిపుణులు 

ఆయా కంపెనీల యాజమాన్యాలు సానుకూలంగా ఉన్నా ఉద్యోగులు ససేమిరా  

2030 నాటికల్లా ప్రస్తుత జాబ్‌ల స్వరూపం 64 శాతం మేర మారిపోయే చాన్స్‌  

ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ ‘లింక్డ్‌ ఇన్‌’ తాజా నివేదికలో వివిధ అంశాలు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: చేసే పనిలో అప్‌డేట్‌ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్‌మెంట్లు, బిజీ వర్క్‌షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. 

తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. 

కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్‌లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్‌వర్కింగ్‌ సంస్థ ‘లింక్‌డ్‌ ఇన్‌’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 

వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 
 
34 శాతం మంది కుటుంబ బాధ్యతలు,  వ్యక్తిగతంగా  నిర్దేశించుకున్న లక్ష్యాలు 

29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్‌ షెడ్యూ ల్‌

26 శాతం మంది నేర్చుకునేందుకు  వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడం

ఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్‌ లెర్నింగ్‌’
» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు.  
»  తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం 
మంది చెప్పారు.  
»  ఈ విధానంలో  నిమగ్నమై కొత్త  విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.
»  ‘లౌడ్‌ లెర్నింగ్‌’లో భాగంగా తమ టీమ్‌ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్‌ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు.  
»  అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్‌లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్‌లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  
»  నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.  
»  తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement