రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ
తెలంగాణ కులగణనలో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి
సుమారు 90 శాతం దళితులు, ఆదివాసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల వారే..
దేశవ్యాప్తంగా కులగణనను చేపడితేనే అభివృద్ధి నమూనా సాధ్యమని వ్యాఖ్య
కులగణనలో కృత్రిమ మేధను వినియోగించాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నిర్వహించిన కులగణనలో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయని.. జనాభాలో 90శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనార్టీటలు, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశమంతటా ఇదే తరహా ధోరణి ఉందని, కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వ హించిన కులగణన అంశాన్ని ప్రస్తావించారు.
‘‘తెలంగాణలో మేం కుల గణన నిర్వహించాం. అందులో విస్మయపరిచే అంశాలు గుర్తించాం. తెలంగాణలో సుమారు 90శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనార్టీటలు, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. దేశం మొత్తంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నేను నమ్ముతున్నా. దేశంలో ఓబీసీల జనాభా 50శాతానికిపైగా ఉంది. ఇంకా గమనిస్తే అది 55% వరకు ఉండొచ్చు. 16% దళితులు, 9% ఆదివాసీలు, 15% మైనార్టీలు ఉన్నారు..’’అని రాహుల్ పేర్కొన్నారు.
అందరికీ భాగస్వామ్యం అందాలి..
దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అందులో అందరికీ భాగస్వామ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘దళితులు, ఆదివాసీ, ఓబీసీ, మైనార్టీటలు ఈ దేశానికి ఆస్తుల వంటివారు. కానీ దేశంలోని ఎలాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలను పరిశీలించినా.. అవి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీటల యాజమాన్యంలో లేవు. పెద్దపెద్ద మీడియా సంస్థలు ప్రధాని మోదీకి మద్దతిస్తాయి. ప్రతిరోజూ నవ్వు ముఖాన్ని ప్రదర్శిస్తాయి. అలాంటి మీడియా ఎన్నడూ ఈ వర్గాల వారిని పట్టించుకోవడం లేదు. కేంద్రం ఎలాంటి కొత్త అభివృద్ధి నమూనాను ఆవిష్కరించాలని భావించినా.. అది కేవలం కులగణనను ఈ సభలో టేబుల్‌పై ఉంచితేనే సాధ్యమవుతుంది. ఒక్కసారి కులగణన చేస్తేనే దేశంలోని 90శాతం జనాభా సంపద, శక్తి ఉందో తెలుస్తుంది’’అని చెప్పారు.
బీజేపీ ఎంపీలకు అధికారం లేదన్న రాహుల్.. మండిపడ్డ బీజేపీ..
రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో లోక్‌సభలో అధికార పార్టీ సీట్లను చూపిస్తూ.. ‘‘బీజేపీలో ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. జనాభాలో వారు 50 శాతంగా ఉన్నా వారికి కచి్చతంగా అధికారం మాత్రం లేదు. మీరు అధికారపక్షంలో కూర్చున్నా.. నోరు మెదపలేరు. అదే దేశంలో వా స్తవం’’అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఇతర ఎంపీలు లేచి.. ప్రధాని మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన వారని.. మీకు కళ్లు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ప్రసంగాన్ని కొనసాగించిన రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని, వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించాలని కోరారు. ‘‘కులగణనకు ఏఐని వర్తింపజేసినప్పుడు ఆ శక్తిని ఊహించండి. కులగణన నుంచి మనకు లభించే డేటాను ఏఐతో విశ్లేíÙంచినప్పుడు.. ఏఐ తో మనం ఏం చేయగలమో, ఈ దేశంలో సామాజిక విప్లవంతో ఏం చేస్తామో ఊహించండి’’అని రాహుల్ పేర్కొన్నారు.
ఆ హల్వా ఎవరికి తినిపించారో!
ఇటీవలి బడ్జెట్ సెషన్ సందర్భంగా హల్వా తయారీకి సంబంధించిన ఫొటో అంశాన్ని రాహుల్ గుర్తు చేశారు. ‘‘గత సెషన్‌లో హల్వా తయారు చేసే ఫొటో గుర్తుండే ఉంటుంది. ఈసారి ఆ ఫొటోనే బయటికి రాలేదు. హల్వా తినిపించారు. కానీ ఎవరికి తినిపించారో చూపించలేదు’’అని రాహుల్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment