
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
పార్లమెంట్‌లో ఆమోదం పొందాకే 42% రిజర్వేషన్ల అమలు
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
మార్చి తొలివారంలో రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం
పార్లమెంట్‌లో ఆమోదింపజేసే బాధ్యతను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి
రాహుల్‌గాంధీ నా బాస్.. ఆయన మాట తప్ప వేరెవరినీ లెక్క చేయనని వ్యాఖ్య
ప్రధాని కులంపై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఇప్పటికిప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని, వచ్చే నెల తొలివారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలో సమగ్రంగా కులగణన చేపట్టామని, అది దేశానికే ఒక రోడ్ మ్యాప్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. కులగణనలో సేకరించిన వివరాల ఆధారంగానే కమిషన్ లేదా అధికారులతో కమిటీ వేసి భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం అక్కడి తుగ్లక్‌రోడ్డులోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘మేం చేపట్టిన కులగణనలో బీసీలు ఆరు శాతం పెరిగారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతంకాగా.. మిగతా వాళ్లను ఓసీలుగా చూపారు. మేం చేసిన సర్వేలో మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించాం. మా సర్వే ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56 శాతం ఉన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం.
కేసీఆర్ సర్వేలో ఎస్సీల్లో 82 కులాలున్నాయని చెప్పారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారు. లేని కులాలను ఇప్పుడు చూపెట్టాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోను.
ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు..
1994లో ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని నేను చెప్పాను. నేను చేసిన వ్యాఖ్యలను కూడా అంగీకరించాను. కాకపోతే తేదీ, సమయం విషయంలో కొంత తేడా వచి్చంది. కిషన్‌రెడ్డి చెప్పింది నేను అంగీకరిస్తున్నా.. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఆయన హోదాను తగ్గించలేదు. అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు.
రాహుల్ గాందీయే నా బాస్..
కాంగ్రెస్ సీఎంగా నేను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు నడుచుకుంటా. ఆయన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తా. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోను. కేవలం రాహుల్ గాంధే నా బాస్. ఆయన చెప్పినట్టు నడుచుకుంటా. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ నాపై అనేక ఫిర్యాదులు, విమర్శలు వచి్చనా పట్టించుకోలేదు. రాహుల్ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కొందరు నాపై అబద్ధపు ప్రచారాలు, ఊహాగానాలు వ్యాప్తిచేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు..’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
శనివారం సంత్ సేవాలాల్
జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహరాజ్ నిలిచారని
కొనియాడారు.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం..
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాల్సి ఉందని.. ఈ విషయంలో అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను పాటిస్తామని రేవంత్ చెప్పారు. కేటీఆర్ తానే కోర్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారని, కోర్టు తీర్పు రాకముందే తీర్పులు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ ప్రక్రియకు లోబడే ఈ విషయంలో ముందుకు వెళతామని తెలిపారు. అయితే దానం నాగేందర్ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ గుర్తుపై పోటీచేసిన రుజువులున్నాయి కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారు? నేను ఈ అంశంపై ఫిర్యాదులు చేసినా ఏం జరిగింది?’అని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment