![CM Revanth discussion on local body elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/RV-1.jpg.webp?itok=ZsM2-CMz)
స్థానిక ఎన్నికలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు రామకృష్ణారావు, దాన కిశోర్ తదితరులు
మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం
బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటన
అసెంబ్లీలో, పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదానికి సమయం పట్టే చాన్స్
అప్పటివరకు ఎన్నికలు జరిగే అవకాశం లేనట్టే
మే లేదా జూన్‌లో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవచ్చనే అంచనా
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ‘స్థానిక’ ఎన్నికలపై చర్చ
తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరో విడత కులగణన సర్వే..
రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్‌కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
వడివడిగా అడుగులు వేసినా..
బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి.
సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది.
ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య
స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం.
అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్‌తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్‌లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment