
42.6 శాతం మందికే అవకాశాలు
గతం కన్నా తగ్గిన నైపుణ్యాలు
10 లక్షల మందిపై అధ్యయనం
దక్షిణాది కన్నా ఉత్తరాది మెరుగు
పురుషులతో మహిళలు పోటాపోటీ
ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్–2025 నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఏం చదివామన్నది కాదు.. ఎలా చదివామన్నది చాలా ముఖ్యం. డిగ్రీ వస్తే చాలదు నైపుణ్యం కూడా ఉండాల్సిందే. లేకపోతే ఉద్యోగాలు రావని ఓ శాస్త్రీయ అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’ అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగా ఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి. అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం.

ఉత్తరాది రాష్ట్రాలదే హవా...
⇒ దేశంలో కనీసం 50 % మంది గ్రాడ్యుయేట్లు ఉపా«ది పొందగల రాష్ట్రాలు కేవలం 4 ఉన్నాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్‌లో రాజస్తాన్‌కు టాప్10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది.
⇒ నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయి

మొక్కుబడిగా చదవొద్దు..
సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినా, అంతగా నైపుణ్యాలు నేర్చుకోకుండా, కొత్త కోర్సులు చేయకుండా ఇంజనీరింగ్ చదివినా వెంటనే ఏదో ఉద్యోగం వచ్చేస్తుందని ఆశిస్తే ఇబ్బందే. కమ్యూనికేషన్, ఇన్‌డెప్త్ డొమైన్ నాలెడ్జి, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ (ఫోర్ పిల్లర్స్) వంటి వాటిపై పట్టుసాధించి ఇండస్ట్రీ సర్టిఫికేషన్ పొందగలిగితే నాన్–టెక్‌లో ఉన్నా నైపుణ్యంతోపాటు మంచి ప్యాకేజీ పొందగలరు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్, ఎడ్‌టెక్ కంపెనీ
నైపుణ్యాలు ఉండాల్సిందే..
నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. – ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్
Comments
Please login to add a commentAdd a comment