Degree courses
-
డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నిర్ధిష్ట గడువు ఉంటుంది. డిగ్రీ కోర్సులు సాధారణంగా మూడేళ్లలో పూర్తవుతాయి. తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకొనే లేదా పెంచుకొనే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళికి యూజీసీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించనున్నారు. ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను సాధారణ డిగ్రీలుగానే పరిగణిస్తారు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ నియామకాలకు అవి యథాతథంగా చెల్లుబాటు అవుతాయి. -
ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం
సాక్షి, అమరావతి: ఓ వైపు పేదరికంతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్, మరోవైపు కోర్సుల్లో చేరాక ప్రముఖ సంస్థలతో ఉచితంగా ఇప్పిస్తున్న నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్.. వెరసి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు. బహుళజాతి సంస్థల్లో మంచి పే ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలు పొందేలా కార్యాచరణ అమలు చేస్తోంది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఇంజనీరింగ్ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను అందించడానికి 30కిపైగా ప్రపంచ స్థాయి సంస్థలు, మరో 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ఏకంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. వీటికి తోడు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఫ్యూచర్ స్కిల్స్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో కొనసాగుతోంది. నైపుణ్యాలతో కూడిన ఉన్నత విద్యను అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ.. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.37 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో గణనీయ ప్రగతి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత మూడేళ్లలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు గణనీయంగా పెరిగాయి. 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య కేవలం 37 వేలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఇందులో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో ఉద్యోగాలు పొందినవారు 60 వేల మంది వరకు ఉన్నారు. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే 12వేలకు పైగా ప్లేస్మెంట్లు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. సర్టీఫికెట్లను సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి మరీ తమ పిల్లను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి గరిష్టంగా రూ.35వేలలోపు ఇస్తే.. జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3 లక్షలకు వరకు చెల్లిస్తోంది. అంతేకాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థి తల్లులు ఖాతాల్లోనే క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తోంది. లక్షన్నర మందికి శిక్షణ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజికి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ఎనలిస్ట్ తదితర అంశాల్లో ఈ శిక్షణ అందించింది. ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి వీలుగా ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లించి.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లించడం విశేషం. గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతికి చెల్లింపులు ఏడాదికి సగటున కేవలం రూ.2,428 కోట్లు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లను చెల్లిస్తోంది. భోజన, వసతి ఖర్చు కింద ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గత ప్రభుత్వం కేవలం రూ.4 నుంచి రూ.10 వేల వరకే ఇచ్చేది. ఈ పథకం అమలుకు గత ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయాన్ని బీసీ, ఈబీసీ, కాపు, మైనారీ్టలకు రూ.లక్షకు, ఎస్సీ, ఎస్టీ, పీడీబ్ల్యూలకు రూ.2 లక్షలకు పరిమితం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి లబ్ధి చేకూర్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది.. మాది పేద రైతు కుటుంబం. గతంలో సాగుకే అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. 2017లో అన్న వరుణ్‌కుమార్‌రెడ్డి తిరుపతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే. మిగిలిన ఫీజు అప్పులు చేసి కట్టాల్సి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. దీంతో నేను 2019లో వడ్లమూడిలోని విజ్ఞాన్ లారాలో బీటెక్ సీఎస్ఈలో చేరాను. జగనన్న సాయంతో ఏటా రూ.85 వేల ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండానే నా చదువు పూర్తి చేశాను. ఇప్పుడు బెంగళూరులోని టీసీఎస్‌లో రూ.3.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. – బోరెడ్డి పవన్ కుమార్‌రెడ్డి, సొలస గ్రామం, పల్నాడు జిల్లా జగనన్న విద్యాదీవెన గొప్ప పథకం.. నాన్న హరనాథ్ నిర్వహించే ఫ్యాన్సీ షాపు మాకు జీవనాధారం. నన్ను, అన్నయ్యను చదివించడానికి చాలా కష్టపడ్డారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రావడంతో నేను దిగులు లేకుండా టెక్కలిలో బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాను. ఏడాదికి రూ.80వేల చొప్పున కోర్సు నాలుగేళ్లపాటు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. కాలేజీలో ఉండగానే ఉచితంగా సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ అందించడంతో డెలాయిట్‌లో ఉద్యోగం సాధించగలిగాను. జగనన్న విద్యాదీవెన కచ్చితంగా గొప్ప పథకం. – సత్యవరపు మహాలక్ష్మి, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు మా నాన్న నగేశ్ సామాన్య కూరగాయల వ్యాపారి. నేను విద్యా దీవెన సాయంతో గతేడాది బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశా. ఉన్నత విద్యా మండలి ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు అందించింది. ఫలితంగా సాధారణ డిగ్రీ చేసిన నాకు హెచ్‌సీఎల్‌లో రూ.2.40 లక్షల ప్యాకేజీతో ఫైనాన్స్ ఎనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి నాలుగు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యాను. ఎడ్యుటెక్ సంస్థలో 6.50 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేశారు. కంప్యూటర్స్ కెరీర్లో ఎదగాలని హెచ్సీఎల్ను ఎంపిక చేసుకున్నా. – ముదిలి నాగకార్తీక్, విజయవాడ విద్యాదీవెన ఆదుకుంది మా నాన్న రామచంద్రరావు ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా చేస్తున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములం. నాన్న ఏడాది సంపాదన లెక్కేస్తే మా ఇద్దరి చదువులకే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ అందడంతో నేను బీఎస్సీ (ఐవోటీ) పూర్తి చేశాను. తమ్ముడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేస్తున్నాడు. నాకు మూడేళ్లు రూ.30 వేల చొప్పున పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. – పట్నియక్ శ్రీనివాసరావు, విజయవాడ -
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్‌లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్‌సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు
సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ కాలంలో.. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి. ఇవీ కోర్సులు.. ఎంటెక్‌లో ఆన్లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది. పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సులువు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది. ట్రెండ్ మంచిదే... అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్) -
విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీలో మార్పులు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలోని లయోలా కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ డిగ్రీ, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వీటిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లుప్రారంభమవుతున్న నేపథ్యంలో లయోలా కాలేజీలో సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన విద్యా విధానం అమలులో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులను ఒక సబ్జెక్ట్‌లో నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు మల్టీడిసిప్లినరీ విద్యను అందించేలా డిగ్రీ కోర్సులు రూపొందించామన్నారు. మేజర్ (ప్రధాన) సబ్జెక్ట్‌తో డిగ్రీలో చేరిన విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి మైనర్ (రెండో ప్రాధాన్యం) సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానిపై డిగ్రీ అనంతరం పీజీ స్పెషలైజేషన్ చేయవచ్చని తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత అనంతరం చదువు ఆపేస్తే ‘సర్టిఫికేషన్ కోర్సు’, రెండో ఏడాది తర్వాత ఆగిపోతే ‘డిప్లొమా’, మూడేళ్లు పూర్తి చేస్తే ‘డిగ్రీ’, నాలుగో ఏడాది చదివి ఉత్తీర్ణత సాధిస్తే ‘డిగ్రీ విత్ హానర్స్’ను ప్రదానం చేస్తామని వివరించారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే నాలుగో సంవత్సరం ‘రిసెర్చ్ హానర్స్’ కోర్సు చేయవచ్చని చెప్పారు. ఈ కోర్సు పూర్తిచేస్తే నేరుగా పీహెచ్డీ చేసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ పాసైన విద్యార్థులు నాలుగో ఏడాది హానర్స్ డిగ్రీని చేయవచ్చని, ఇది పూర్తిచేసిన వారు నేరుగా పీజీ రెండో ఏడాదిలో చేరవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మేజర్ సబ్జెక్టులు, ఇందులో 90 వరకు మైనర్ సబ్జెక్టులతో డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. డేటాసైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ క్రైమ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, అగ్రికల్చర్, ఫుడ్‌ప్రాసెసింగ్, టూరిజం వంటి అనేక మైనర్ సబ్జెక్టుల్లో డిగ్రీ విద్యను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అభ్యసించవచ్చన్నారు. ఆర్ట్స్ విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేలా డిగ్రీ కోర్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా కో ర్సుల వివరాలు, సిలబస్‌ను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. -
తెలంగాణలో కొత్త డిగ్రీలు నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. ఇందులోభాగంగా యూజీసీ చైర్మన్ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్‌తో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చర్చించారు. ఆనర్స్ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. ఓయూలో లైఫ్‌సైన్స్ ఆనర్స్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో మండలి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. డిగ్రీలో ఎంచుకునే ఏదైనా సబ్జెక్టును పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, లోతైన బోధన విధానంతో అమలు చేయడమే ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్, బీకాం ఆనర్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్‌సైన్స్ కోర్సును ఆనర్స్‌గా తేవాలనే యోచన ఉంది. కొంతకాలంగా దేశ విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. పారిశ్రామిక అనుభవం తప్పనిసరి ఆనర్స్ కోర్సులకు పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. విదేశాల్లో సైతం ఉపాధి లభించేలా నైపుణ్యాలను తీర్చిదిద్దనున్నారు. బీఎస్సీ ఆనర్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కచ్చితంగా పరిశ్రమల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏట విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఉపాధికి ఊతం: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు వృత్తి విద్య కోర్సులకు పోటీనిస్తాయి. డిగ్రీతో మంచి ఉద్యోగాలు పొందడమే కాదు... సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో వీటిని తెచ్చే లక్ష్యంతో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అనువైన కోర్సులు అన్ని దేశాల్లోనూ సాఫ్ట్వేర్ రంగం విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలూ ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు ఇంజనీరింగ్ బాట పడుతున్నారు. అయితే, డిగ్రీతోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్ కోర్సులను ఆనర్స్‌గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌ను జోడించబోతున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులను తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్సీ (ఆనర్స్) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో పరిమితంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతులివ్వాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఆనర్స్ కోర్సులో మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు. -
TS: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. యాక్షన్ ప్లాన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది నుంచి డిమాండ్ మేరకే కోర్సులు, సీట్లను అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థుల డిమాండ్‌ను బట్టి బ్రాంచ్‌లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. జీరో అడ్మిషన్లున్న కోర్సులు, కాలేజీలను రద్దు చేసే ప్రతిపాదనను కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' ఈ మేరకు రూపొందించిన యాక్షన్ ప్లాన్‌కు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది నుంచే సంస్కరణలకు ఉన్నత విద్యామండలి తెర తీసింది. ప్రవేశాలు, డిమాండ్ లేని కాలేజీల్లో దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేసింది. కాలేజీల అభ్యర్థన మేరకు ఈ ఏడాది తిరిగి అనుమతించినా, వచ్చే సంవత్సరం కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. కోర్సుల హేతుబద్దీకరణ రాష్ట్రంలో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ, ఏటా 2 నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో ప్రవేశాలుంటే, మరికొన్నింటిలో 15 శాతంలోపే ఉంటున్నాయి. ఇలాంటి కాలేజీల్లోని విద్యార్థులు ఇతర కాలేజీల్లోకి వెళ్లేందుకు ఉన్నత విద్యామండలి అనుమతివ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు మించి సీట్లున్న కాలేజీల మూడేళ్ల డేటాను తెప్పించి, వీటిని హేతుబద్దీకరించాలని భావిస్తోంది. ఉదాహరణకు ఒక కాలేజీలో 240 సీట్లు ఉంటే, 110 మందే విద్యార్థులు చేరినప్పుడు 180 సీట్లకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ సెక్షన్‌కు 60 మంది విద్యార్థుల చొప్పున మూడు సెక్షన్లకు అనుమతించి, ఒక సెక్షన్‌ను ఎత్తివేస్తారు. మూడేళ్లలో 60 సీట్లు కూడా నిండని కాలేజీల్లో 120 సీట్లు ఉంటే, వాటిని 60 సీట్లకే పరిమితం చేస్తారు. కోర్సుల మార్పిడి ఇలా.. దోస్త్ ప్రవేశాల డేటాను ప్రామాణికంగా తీసుకుని కోర్సుల మారి్పడి చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఒక కాలేజీకి విద్యార్థులు ఏ కోర్సుకు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారో చూస్తారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుని, ఎక్కువ మంది దరఖాస్తు చేసే కోర్సుల్లో సీట్లు, సెక్షన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని భావించారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు బీఏ కోర్సుల్లో 20 వేలకు మించి దరఖాస్తు చేయడం లేదు. బీఎస్సీ డేటా సైన్స్, కంప్యూటర్ అనుబంధ కోర్సులకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన కొన్ని సంప్రదాయ కోర్సులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మార్పులు అవసరం ఏటా ఇంటర్ ఉత్తీర్ణులు 3.60 లక్షలుంటే, డిగ్రీ సీట్లు 4.60 లక్షల వరకూ ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్–నిష్పత్తి విధానం అమలు దిశగా అడుగులేస్తున్నాం. కోర్సులు, కాలేజీల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తున్నాం. విద్యార్థులు ఇష్టపడే, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సుల్లో సీట్లు పెంచడమే ఈ సంస్కరణల ఉద్దేశం. –ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నష్టం లేకుండా చూడాలి ఇంజనీరింగ్ ప్రవేశాల తర్వాతే విద్యార్థులు డిగ్రీలో చేరడంపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ ఏడాది దోస్త్ ప్రవేశాలు మందకొడిగా ఉన్నాయి. లక్ష సీట్లు ఫ్రీజ్ చేయడం సరికాదని అధికారులకు చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఏ సంవత్సరమైనా ఒక్కో కోర్సులో ప్రవేశాలు ఒక్కో రకంగా ఉంటాయి. పెరగడం, తగ్గడం సహజం. వీటిని దృష్టలో పెట్టుకుని కాలేజీలకు నష్టం జరగకుండా సంస్కరణలు చేపట్టాలి. – ఎకల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సాధారణ డిగ్రీతో పాటు ఉపాధి కోర్సులు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు, ఉపాధి కల్పించే కోర్సులను అనుసంధానం చేసినట్టు యూనివర్సీటీ సహాయ సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ వచ్చిన ఆయన ఆదివారం మద్దిలపాలెం డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో గల ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ డిగ్రీ కోర్సులకు అదనంగా, ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను జోడించినట్టు తెలిపారు. దీని ద్వారా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పైచదువులతో పాటు, ఉపాధి పొందేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై విధిగా సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు ఉపాధి కోర్సును ఓ పాఠ్యాంశంలా చదవాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా 2022–23 విద్యా సంవత్సరానికి సంబం«ధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఫీజులను కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. స్టడీ మెటీరియల్‌ను స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థుల చిరునామాలకు పంపుతామని చెప్పారు. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీఆర్ఓయూఆన్లైన్.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఇంటర్.. దానికి సమాన విద్యార్హతగల వారు డిగ్రీలో జాయిన్ కావచ్చునన్నారు. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్ అవకాశం కల్పించినట్టు తెలిపారు. 1999 తర్వాత అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులకు, 2005 తర్వాత అడ్మిషన్ తీసుకున్న పీజీ విద్యార్థులకు ఆయా కోర్సులు పూర్తి చేసుకోవడానికి రీ అడ్మిషన్ ఇస్తున్నట్టు విజయకృష్ణారెడ్డి వివరించారు. -
240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామన్నారు. ఉన్నత విద్యతోపాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగా 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు– నేడు కింద భవనాల ఆధునికీకరణకు రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉందని భాస్కరరావు తెలిపారు. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. డిగ్రీతోపాటు పలు ఉపాధి కోర్సులు డిగ్రీ కోర్సులతోపాటు విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కరరావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్.ఐ.విజయబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డిగ్రీ నచ్చేలా.. విద్యార్థులు మెచ్చేలా!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మళ్ళించడం ఎలా? డిగ్రీ చేసిన వారికి ఆశాజనకమైన భవిష్యత్ ఇవ్వడమెలా? కార్పొరేట్ స్థాయికి తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడమెలా? ఇప్పుడిది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విదేశీ పాఠ్య ప్రణాళికను సైతం మేళవించి, అదనంగా సాంకేతిక విద్య కోర్సులను జోడించిన హైబ్రిడ్ మోడల్ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులను, కాలేజీలను మళ్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తం మీద అదనపు హంగులు అద్ది ఆకర్షణీయంగా మారిస్తే తప్ప విద్యార్థులు డిగ్రీపై దృష్టి సారించేలా చేయలేమని అనేక సర్వేలు పేర్కొంటుండటంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సైతం డిగ్రీని విభిన్నమైన కోర్సులతో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు ఆశించినంతగా సత్ఫలితాలివ్వకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు, సగానికిపైగా సీట్లు ఖాళీగానే.. రాష్ట్రంలో 1080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,68,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల మంది ఇంటర్ పాసవుతున్నారు. అంటే విద్యార్థుల సంఖ్యకు మించి దాదాపు 1.68 లక్షల సీట్లు అదనంగా ఉంటున్నాయి. మరోవైపు ఇంటర్ పాసై డిగ్రీలో చేరుతున్నవారు సగటున 2.5 లక్షలకు మించడం లేదు. ఈ ఏడాది తొలి విడత దోస్త్ (డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ) కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 1.12 లక్షల మందికి మాత్రమే డిగ్రీ సీట్ల కేటాయింపు జరిగింది. 1.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా, 6 వేల మంది వరకు అసలు వెబ్ ఆప్షన్లే ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తే ఆఖరి విడత వరకు కూడా 2.20 లక్షలకు మించి సీట్లు భర్తీ అయ్యే అవకాశం కన్పించడం లేదు. దీంతో మిగతా వారంతా ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వైపు దృష్టి పెట్టినట్టుగానే భావించవలసి ఉంటుంది. ఉపాధి లభించే కోర్సులపైనే ఆసక్తి సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలావరకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధి లభించాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కన్పిస్తోంది. పోస్టు–గ్రాడ్యుయేషన్, పరిశోధన విద్య వైపు వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యనో, డిగ్రీలో తక్షణ ఉపాధి లభించే కోర్సుల వైపో మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్‌లో సైతం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపే ఎక్కువగా వెళ్తున్నారు. డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజా దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ఈ విధంగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్ లేకపోవడం, తక్షణ ఉపాధి లభించే డిగ్రీలపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తుండటంతో.. డిగ్రీ కోర్సులకు అదనపు హంగులు అద్దాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉపాధి కల్పించేలా డిగ్రీ డిగ్రీని సమూలంగా మార్చి ఆశాజనకంగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధన ప్రణాళికలపై విదేశీ విశ్వవిద్యాలయాలతో సమాలోచనలు జరుగుతున్నాయి. బహుళజాతి కంపెనీలతో కలిసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) మూస విధానం మారితే ఆదరణ విద్యా విధానంలో మూస పద్ధతులు పూర్తిగా మారాలి. ఈ దిశగా ఉస్మానియా యూనివర్సిటీ అనేక ప్రయోగాలు చేస్తోంది. ఏ సబ్జెక్టులో డిగ్రీ చేసినా, అదే సబ్జెక్టులో పీజీ చేయాలనే నిబంధనలు సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం మా రింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకూ మంచి ఆదరణ లభిస్తుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (ఉప కులపతి, ఉస్మానియా వర్సిటీ) కొత్త కాంబినేషన్లతో డిగ్రీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కొత్త హంగులు అద్దుతున్నారు. గతంలో ఉన్న పది రకాల కాంబినేషన్ డిగ్రీ కోర్సులకు ఇప్పుడు మరిన్ని జోడించారు. బీఏలోనే 68, బీఎస్సీలో 73, బీకాంలో 13 రకాల కాంబినేషన్ కోర్సులు చేర్చా రు. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు తీసుకొచ్చారు. బీఎస్సీ గణిత, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ వంటి కాంబినేషన్ కోర్సులు మార్కెట్ అవసరాలు తీర్చేలా ఉన్నాయి. బయోకెమెస్ట్రీ, రసాయన శాస్త్ర కోర్సులకు కాంబినేషన్‌గా కంప్యూటర్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. కమ్యూనికేషన్ ఇంగ్లిష్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను బీఏలో చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే తరహాలో వచ్చే ఐదేళ్ళలో మరిన్ని కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఇష్టమైన డిగ్రీని దేశ, విదేశాల్లోని ఏ యూనివర్సిటీ నుంచైనా ఆన్లైన్ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ విద్యార్థులు డిగ్రీ వైపు మళ్ళేందుకు తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు. -
ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది. డిగ్రీ కోర్సులు పూర్తి చేసి మేనేజ్మెంట్ వైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఎంబీఏ, కామర్స్ కోర్సుల వైపు మొగ్గుచూపి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. చదవండి: ఈఏపీసెట్‌కు 36వేలకు పైగా దరఖాస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు పొందుతున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 14వేల పైచిలుకు ఉంది. రాయలసీమలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగింది అనంతపురం జిల్లాలోనే కావడం విశేషం. తాజాగా 2021–22 సంవత్సరానికి సామాజిక ఆర్థిక (సోషియో ఎకనామిక్) సర్వేలో పలు విషయాలు వెల్లడించారు. ఢిల్లీ తరహాలో మళ్లీ డిగ్రీ కోర్సుల వైపు ఉత్తరాదిన ఇంజినీరింగ్ విద్య నామమాత్రంగా ఉంటుంది. 90 శాతం మంది డిగ్రీ కోర్సులవైపే మొగ్గుచూపుతారు. డిగ్రీ కోర్సులు చేయడానికి ఉత్తరాదిలో చాలామంది ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో 90వేల సీట్లుంటే..అన్నీ భర్తీ అవుతాయి. అంటే డిగ్రీ కోర్సులకు దేశంలోనే ఢిల్లీలో క్రేజ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. గత ఏడాది అనంతపురం జిల్లాలో 14,342 మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ. రాష్ట్రంలోనే రెండో స్థానం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరిన వారి సంఖ్యను చూస్తే రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 17,921 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరగా, ఆ తర్వాతి స్థానంలో 14,342 అడ్మిషన్లతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిలిచింది. అందులోనూ అత్యధికగా బీసీ విద్యార్థులు 8,190 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. 4,260 మంది ఎస్సీ విద్యార్థులు, 827 మంది ఎస్టీలు డిగ్రీ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 30,311 అడ్మిషన్లు జరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉండగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 1,924 మాత్రమే. ఆనర్స్ డిగ్రీతో ఉపాధి అవకాశాలు ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన నూతన సిలబస్ ప్రకారం యూజీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సుతో సెలవు రోజుల్లో ఉద్యోగాధారిత శిక్షణ ఇవ్వడానికి వీలు కలుగుతోంది. స్కిల్ ఆధారిత కోర్సులు పూర్తిచేయాలని నిర్దేశించారు. పరిశ్రమల ప్రాజెక్ట్‌లూ పూర్తి చేయాల్సి ఉంది. ఫలితంగా కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు పొందారు. – ప్రొఫెసర్ ఎ.మల్లికార్జున రెడ్డి, రెక్టార్, ఎస్కేయూ వినూత్నమైన సిలబస్‌పై ఆసక్తి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్ ప్రవేశ పెట్టారు. కళాశాల నుంచి కొలువులు దక్కేలా ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా అవకాశాలు కల్పించారు. డిగ్రీ ఆనర్స్ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. –డి.పులికొండ, బీకాం (కంప్యూటర్స్) బహుళజాతి సంస్థల్లో అవకాశాలు దక్కేలా.. కోర్సు పూర్తయ్యాక బహుళజాతి సంస్థల్లో (మల్టీనేషనల్ కంపెనీస్) ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇందుకు నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు దోహదపడుతోంది. మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేస్తే ఎగ్జిట్ అయి సాధారణ డిగ్రీ పొందవచ్చు. నాలుగు సంవత్సరాలు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. – కె.సురేష్, బీకాం (కంప్యూటర్స్) బీటెక్ కోర్సుకు దీటుగా.. స్కిల్ ఆధారిత కోర్సులతో ప్రత్యేక నైపుణ్యాలు అలవడుతున్నాయి. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. తద్వారా కోర్సులో ఉన్నçప్పుడే పరిశ్రమల అనుభవం వస్తోంది. బీటెక్ కోర్సుకు దీటుగా డిగ్రీ సిలబస్ రూపకల్పన చేశారు. దీంతో డిగ్రీ వైపే ఆసక్తి చూపాం. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉంటే చాలు. డిగ్రీ ఉన్నా.. బీటెక్ ఉన్నా అవకాశాలు దక్కుతాయి. –సంగమిత్ర, డిగ్రీ విద్యార్థిని -
డబుల్ ధమాకా!
అవును... విద్యార్థులకు ఇది అచ్చంగా డబుల్ ధమాకా! ప్రస్తుత విద్యావిధానంలో లాగా ఒకసారి ఒకే డిగ్రీ కాకుండా, ఏకకాలంలో రెండు కోర్సులు చదివి, రెండు డిగ్రీలూ పొందే అరుదైన అవకాశం. నూతన విద్యావిధానంలో భాగంగా వీలు కల్పిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేసిన సరికొత్త ప్రతిపాదన. ప్రతిపాదిత ఏకకాలపు రెండు డిగ్రీల చదువుకు మార్గదర్శకాలను బుధవారం యూజీసీ ప్రకటించింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో రెండు డిగ్రీలు చదువుకొనే వీలు కల్పించే ఈ విధాన మార్పు సంచలనం సృష్టిస్తోంది. నిర్ణీత వ్యవధిలోనే ఒకటికి రెండు డిగ్రీలు చేసేందుకు ఇది మంచి అవకాశమని కొందరు స్వాగతిస్తున్నారు. ఇంకొందరు ప్రొఫెసర్లేమో ఒకేసారి లెక్కలు– సంగీతం... ఇలా రెండు విభిన్న అంశాల్లో డిగ్రీలు చేయడం ఏం విడ్డూరమంటున్నారు. వెరసి ఉన్నత విద్యలో అత్యున్నత చట్టబద్ధ సంస్థ యూజీసీ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ఈ కొత్త ప్రతిపాదన పుణ్యమా అని విద్యార్థులు ఒకేసారి రెండు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కానీ, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కానీ, రెండు డిప్లమోలు కానీ చేయవచ్చు. రెండింటిలోనూ స్వయంగా తరగతి గదికి హాజరై కానీ, లేదంటే ఒక డిగ్రీకి స్వయంగా హాజరై – మరొకటి ఆన్ లైన్లో కానీ, అదీ కాదంటే రెండు డిగ్రీలూ ఆన్లైన్ విధానంలో కానీ చదవవచ్చు. ‘అటు విద్యావిషయకంగానూ, ఇటు విద్యకు సంబంధంలేని ఇతర రంగాల్లోనూ విద్యార్థుల సమగ్ర పురోగతిని ప్రోత్సహించడం కోసమే’ ఈ రెండు డిగ్రీల చదువనేది యూజీసీ ఆలోచన. దీనివల్ల సైన్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, వివిధ భాషలతో పాటు ప్రొఫెషనల్, టెక్నికల్, ఒకేషనల్ – ఇలా ఏ అంశమైనా తీసుకొని చదివే వీలు విద్యార్థికి కలుగుతుంది. ఆ ఉన్నత సంస్థకు చైర్మన్ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి ఎం. జగదీశ్ కుమార్ ఈ ఆలోచనను మంగళవారం ప్రకటించారు. ఆ మర్నాడే దేశవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీలన్నిటికీ దీనిపై మార్గదర్శకాలు చేరాయి. ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకొని, లోతుగా చదువుకొని, జ్ఞానతృష్ణ, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంచుకోవచ్చని యూజీసీ భావిస్తోంది. ఆ మాటెలా ఉన్నా, ఎక్కువమంది చదవని సంగీతం, సాహిత్యం, లలిత కళలు లాంటి కోర్సులకు ఈ సరికొత్త విధాన మార్పుతో కొత్త ఊపు రావచ్చని కొందరు ఆచార్యుల ఆశాభావం. కానీ, అదే సమయంలో అసలే ఒత్తిడితో కూడిన చదువులతో సతమతమవుతున్న విద్యార్థులకు ఇది మరింత ఒత్తిడి కలిగించవచ్చు. అసలే అస్తుబిస్తుగా ఉన్న చదువుల నాణ్యత ఈ ఒకటికి రెండు డిగ్రీల ప్రతిపాదనతో మరింత క్షీణించవచ్చు. పలువురు ప్రొఫెసర్ల అభ్యంతరం కూడా అదే! అయితే గమ్మత్తేమిటంటే – వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఈ కొత్త విధానాన్ని విద్యాలయాలు యథాతథంగా అమలుచేయాలన్న నిబంధన ఏదీ లేకపోవడం! కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సొంత టై–అప్లు పెట్టుకోవచ్చట. ప్రవేశపరీక్షలు ఏమైనా పెట్టుకోవాలా అన్నది నిర్ణయించుకోవచ్చట. కొత్త పద్ధతిలో సైన్సు డిగ్రీ చేస్తూనే, కామర్స్, సోషల్ సైన్స్ లాంటివి చదవచ్చు. కామర్స్ డిగ్రీ చేస్తూనే, సైన్స్ చదవచ్చు. ఇది విభిన్న శాఖల మధ్య జ్ఞానపంపిణీకీ, అర్థవంతమైన సంభాషణలకూ ఉపయుక్తం. సరిగ్గా ఆచరణలో పెడితే, విద్యార్థుల్లో విశాల దృక్పథానికీ, ఆలోచనా పరిధి పెరగడానికీ ఈ ఉదార విద్య దీర్ఘకాలంలో ప్రయోజనకరమే. కానీ, కొత్త విధానం ఏ మేరకు ఆచరణ సాధ్యం? డిగ్రీతో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామో, డిప్లమోనో చేస్తే ఫరవాలేదు. అలాకాకుండా ఏకంగా రెండు డిగ్రీలు చేస్తూ, ఏకకాలంలో అటూ ఇటూ కుప్పిగంతులు వేస్తుంటే ఒక్కటైనా ఒంటపడుతుందా? ఇప్పటికే ‘నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్’ (ఎఫ్‌వైయూపీ) ఉంది గనక ఇప్పుడీ కొత్త రెండు డిగ్రీల పథకంతో ఒరిగేదేమిటి? దీర్ఘకాలంగా ఉన్న ఆనర్స్ కోర్సులకు విలువ పోదా? ఇలా అనేక సందేహాలూ ఉన్నాయి. కొత్త విధానం అమలులో నిర్వహణపరమైన సవాళ్ళు సరేసరి. ఆర్థిక సరళీకరణ అనంతర ప్రపంచంలో పెరిగిన ఆకాంక్షలకు తగ్గట్టు దేశంలో విద్యాసంస్థలు ఏ మేరకు సిద్ధమయ్యాయన్నది ప్రశ్నార్థకమే. వివిధ విశ్వవిద్యాలయాలు దేశంలో టాప్ 100 లో ఉండడమే అరుదు. ఇక, అంతర్జాతీయ ర్యాకింగుల చిట్టాలో వాటి పరిస్థితి చెప్పనక్కర లేదు. విభిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు తగ్గట్టు చదువు చెప్పేలా అధ్యాపకులందరికీ ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తున్నారా? ఇప్పుడీ కొత్త రెండు డిగ్రీల చదువంటే, దానికి తగ్గట్టు కోర్సులు తయారు చేయాలి. బోధన పద్ధతుల్ని తీర్చిదిద్దుకోవాలి. భౌతిక శాస్త్రంలోనో, అర్థశాస్త్రంలోనో ఒక డిగ్రీ చేస్తున్న విద్యార్థి వచ్చి, చరిత్ర, సాహిత్యం తరగతి గదిలో రెండో డిగ్రీ చదువుకు కూర్చుంటారు. వాళ్ళకు ప్రధాన పరిజ్ఞానానికి తగ్గట్టుగా రెండో చదువు నేర్పేందుకు కొత్త బోధనా శైలి అవసరం. మారిపోతున్న ఈ తరగతి గది స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఆచార్యులకు బోధనలో యూజీసీ శిక్షణనివ్వాలి. కానీ, అది నేటి వరకు పెడుతున్న శిక్షణ తరగతుల సరుకు, సారం జగద్విదితం. ఇదే మూసలో వెళితే ఈ నూతన విద్యావిధాన ప్రయోగం నిష్ఫలమయ్యే ప్రమాదం ఉంది. నేటికీ మన యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యాప్రమాణాలు అంతటా ఒకేలా లేవు. వసతులు, బోధన సహా వివిధ అంశాల్లో హస్తిమశకాంతరం. దేశమంతటా ఒకేలా ఉండేలా ప్రమాణాలను పెంచకపోతే కష్టం. కాలేజీలో చదువు బాగా చెప్పకపోతే, ఇప్పుడు విద్యార్థి ఒక డిగ్రీ చేసినా, రానున్న రోజుల్లో రెండు డిగ్రీలతో బయటకొచ్చినా ఒరిగేది జ్ఞానశూన్యమే. తస్మాత్ జాగ్రత్త! -
ఇక ఎంసీఏ రెండేళ్లే...కొత్త డిగ్రీ కోర్సులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రోగ్రామ్‌ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.in లో పొందుపరిచింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం.. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో తొమ్మిది కొత్త కోర్సులను యూజీసీ ప్రకటించింది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణుల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ అర్బన్ డిజైన్ (వ్యవధి: నాలుగేళ్లు), బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ (వ్యవధి: మూడేళ్లు) కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ మేనేజ్మెంట్, అర్బన్ డిజైన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా ప్రకటించింది. ఈ కోర్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలనేదాన్ని యూనివర్సిటీల ఇష్టానికి వదిలేసింది. కొత్త మార్పులు ఇలా.. యూజీసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ) కోర్సు వ్యవధిని నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. 12వ తరగతి ఉత్తీర్ణులై వైద్య రంగంలోకి రావాలనుకునే విద్యార్థుల కోసం కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ సోవా రిగ్పా మెడిసిన్ అండ్ సర్జరీ (బీఎస్‌ఆర్‌ఎంఎస్) కోర్సును యూజీసీ ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు కాలవ్యవధి.. ఐదున్నరేళ్లు. మెడిసిన్, సర్జరీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, హెల్త్ అనుబంధ సైన్సెస్, ఫార్మసీ, పారామెడికల్, నర్సింగ్ తదితర విభాగాల్లో ఈ బీఎస్‌ఆర్‌ఎంఎస్ కోర్సును అందిస్తారు. (చదవండి: ఏపీ పథకాలు బాగున్నాయ్..) -
ఉపాధి కల్పించేలా సంప్రదాయ కోర్సులు!
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కోర్సుల ప్రామాణికతను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టింది. సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలామంది పేదరికం నేపథ్యము న్నవారే. ఈ కోర్సుల తర్వాత ఉపాధి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ నైపుణ్యంతో పోటీపడే స్కిల్స్ లేవని, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యావిధానం మెరుగుపడలేదని ఉన్నత విద్యామండలి గుర్తించింది. బీసీలే ఎక్కువ ఈ సంవత్సరం బీఏలో 36,888 మంది చేరితే వారిలో 18,240 మంది బీసీలే. వీరిలో 80 శాతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ కోర్సులను ఎంచుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 10 శాతం పీహెచ్డీ స్థాయి, మరో 10 శాతం పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునేవారు ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. కొంతమేరైనా డిగ్రీ తర్వాత ఉపాధి కల్పించే కోర్సుల్లో బీకాంను చెప్పుకుంటారు. కానీ ఈ కోర్సులో ఎస్సీలు 15,518కి పరిమితమైతే, ఎస్టీలు 6,620 మంది ఉన్నారు. ఓసీలు 25,072 మంది ఉన్నారు. సరికొత్త ప్రయోగాలు ఉద్యోగం అవసరం ఉన్న పేద వర్గాలు ఇష్టపడే సంప్రదాయ కోర్సులను తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యూకేకు చెందిన రెండు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అక్కడ బోధన ప్రణాళికను మేళవింపు చేస్తూ రాష్ట్రంలోని సంప్రదాయ కోర్సుల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ విద్యావ్యవస్థను ఆకళింపు చేసుకోవాలని యోచిస్తోంది. అయితే, ఆ స్థాయి ప్రమాణాలు అర్థం చేసుకోవడానికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్, బీకాం ఆనర్స్ కోర్సుల్లో ఈ తరహా విద్యాబోధన అందిస్తున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం అవసరమని భావించినప్పటికీ, ఈ ప్రక్రియ ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. సంప్రదాయ కోర్సులకు ఊతం పేద, గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా చేరే సంప్రదాయ డిగ్రీ కోర్సు లను ఉపాధికి ఊతమిచ్చే స్థాయిలో తీర్చిదిద్దాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇతర దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. దీనిపై కసరత్తు మొదలు పెట్టాయి. –ప్రొ. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ మూస విధానం పోవాలి సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూప స్వభావం మారాలి. ప్రధానంగా మూస బోధన విధానం మారాలి. మన విద్యార్థులకు కష్టపడే తత్వం ఉంది. అర్థం చేసుకునే మేధస్సు ఉంది. కాకపోతే విద్యావిధానంలో మార్పులు అవసరం. –ప్రొ. డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
అన్ని వర్సిటీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు
సాక్షి, అమరావతి: సెంట్రల్ యూనివర్సిటీలు సహా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో డిగ్రీ కోర్సులు అమలులోకి రానున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం కేంద్రం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)తోను, యూనివర్సిటీలతోను కేంద్ర విద్యాశాఖ చర్చించింది. దీనిపై తదుపరి ఏర్పాట్లకు యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దేశంలోని 45 సెంట్రల్ వర్సిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న మూడేళ్ల కోర్సులతో పాటే ఈ కొత్త కోర్సులు కూడా అమల్లో ఉంటాయని యూజీసీ పేర్కొంది. 2013లో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినా వాటిలో కొంతవరకు మాత్రమే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు మరిన్ని మార్పులుచేసి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులకు వర్సిటీలు రూపకల్పన చేయనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా ఈ కోర్సుల్లోకి బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. అలాగే రెండేళ్ల పీజీ కోర్సులను ఇక నుంచి ఏడాది కాలపరిమితితో కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ కోర్సులను ఎలా రూపొందించుకోవాలన్న దానిపై ఆయా వర్సిటీలే సొంతంగా నిర్ణయించుకుంటాయి. మన రాష్ట్రంలో ముందే చేపట్టిన విద్యాసంస్కరణలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు మన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిలోనే ఏర్పాట్లు చేయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు రూపకల్పన చేశారు. విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు అలవడేందుకు నాలుగేళ్లలో ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. దీనికి యూజీసీ అనుమతికి ప్రతిపాదించినా ముందు సానుకూలత రాలేదు. తరువాత అదే విధానాన్ని కేంద్రం నూతన జాతీయ విద్యావిధానంలో పొందుపరిచింది. కేంద్రం నిర్ణయానికి ముందే రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇదేకాకుండా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను కూడా మన రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. తరువాత కేంద్ర నూతన విద్యావిధానంలోనూ వీటినే పేర్కొనడం విశేషం. -
సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్వేర్ జాబ్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్లకే అన్నది ఇప్పటివరకు ఉన్నమాట. ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీ.. వంటి సంప్రదాయ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి అవకాశం రానుంది. ఇందుకోసం సంప్రదాయ డిగ్రీల్లోనే ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బహుళ జాతి కంపెనీలు డిగ్రీ కాలేజీల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశామని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను సమాయత్తం చేస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. మరోవైపు ఉస్మానియా సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని మార్చడంపై దృష్టి సారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సులు (బీఏ, బీఎస్సీ, బీకాం) పూర్తిచేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది కూడా తగిన జీతాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల మంది వరకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాలు ఉన్నా.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఎంపిక చేయడం లేదని కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల డిగ్రీ ఏదైనా, కోర్సు ఏదైనా సరే.. కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉందని ఒక కంపెనీ ప్లేస్మెంట్ నిర్వాహకుడు తెలిపారు. ఇందుకోసం కొత్త కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిగ్రీలో ఏం చేయబోతున్నారు? సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు యూనివర్సిటీలు దీనిపై అధ్యయనం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉదాహరణకు బీకాంలో బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో డేటా సైన్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. సిలబస్ రూపకల్పన నుంచే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం తీసుకున్నారు. దాదాపు 120 కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు టీసీఎస్ శిక్షణ ఇస్తోంది. కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రత్యేకంగా పరీక్ష కూడా నిర్వహించి, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొందేలా చేయనుంది. ఇదే తరహాలో బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కొత్త కోర్సులను తీసుకురానున్నారు. ఇందులో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పలురకాల కోర్సులనూ జత చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి పొందేలా డిగ్రీ కోర్సులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల నాణ్యత పెంచాలన్నదే మా తపన. ఈ దిశగా కొత్త కోర్సులపై కసరత్తు జరుగుతోంది. మరో ఏడాదిలో వాటి స్వరూపం మారబోతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటికే టీసీఎస్ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. –ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మంచి ప్రయత్నం సంప్రదాయ డిగ్రీ కోర్సులను మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అభినందనీయం. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని తెలిసింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకు పూర్వ వైభవం వస్తుంది. – గౌరీ సతీశ్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్ -
ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే
దేశంలో కామర్స్ కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ సీఈసీ ఉత్తీర్ణులయ్యాక.. డిగ్రీ స్థాయిలో బీకామ్‌తోపాటు సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతుంటారు. వాస్తవానికి సీఈసీ విద్యార్థులు కామర్స్ సంబంధ కోర్సులు మాత్రమే కాకుండా.. బీబీఏ, బీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్ సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. డిగ్రీ స్థాయి కోర్సులు బీకామ్: సీఈసీ ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులు ఎక్కువ మంది చేరే కోర్సు.. బీకామ్. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీన్ని పూర్తిచేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్ కంపెనీలు, ప్రైవేట్ బిజినెస్/సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. బిజినెస్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, బిజినెస్ రిస్క్ అడ్వైజర్, ఆపరేషన్స్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్, ఎకనామిస్ట్, మార్కె ట్ అనలిస్ట్, బిజినెస్ ఎకనామిక్ రైటర్, బడ్జెట్ అనలిస్ట్‌గా ఉద్యోగాలు పొందొచ్చు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు బీకామ్ కంప్యూటర్స్: ఇటీవల కాలంలో ఇంటర్ సీఈసీ ఉత్తీర్ణులు ఎక్కువగా చేరుతున్న కోర్సు.. బీకామ్ కంప్యూటర్స్. కార్పొరేట్ రంగంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఉపయోగించేందుకు వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఈకోర్సు విద్యార్థులు కామర్స్తోపాటే కంప్యూటర్ నైపుణ్యం కూడా సొంతం చేసుకుంటారు. బీకామ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణులు వివిధ విభాగాల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్, యాప్ డెవలపర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థాయిలో ఎంకామ్ కంప్యూటర్స్‌లో చేరొచ్చు. బీకామ్(హానర్స్): ఇటీవల విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న కోర్సు.. బీకామ్ హానర్స్. ఇది పలు ప్రభుత్వ/ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులో ఉంది. ఇందులో చేరాలంటే..సీఈసీ ఇంటర్మీడియెట్ కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. బీకామ్ హానర్స్‌లో.. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్/ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్/ఎకనామిక్స్/బ్యాంకిం గ్ అండ్ ఇన్సూరెన్స్/టాక్సేషన్/మార్కెటింగ్ /హెచ్ఆర్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నా యి. బీకామ్ హానర్స్ పూర్తి చేసినవారికి మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, కామ ర్స్, బ్యాంకింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, రీసెర్చ్ అసోసియేట్స్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బీఏ ఎకనామిక్స్: ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్న కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు ఇది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్) సబ్జెక్టులు చదివినవారు మూడేళ్ల బీఏ ఎకనామిక్స్‌లో చేరితే ఉజ్వలంగా రాణించొచ్చు. వీరు బీఏ ఎకనామిక్స్ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ ఫైనాన్స్/ఎంఏ ఎకనామిక్స్‌లో చేరి.. అద్భుత అవకాశాలు అందుకునే వీలుంది. వీరికి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగం, ప్రభుత్వ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ): బిజినెస్, మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునేవారికి బీబీఏ కోర్సు ఉపయుక్తంగా ఉంటుం ది. ముఖ్యంగా పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో..ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీబీఏ ఎంచుకోవడం మంచిది. మేనేజ్మెంట్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్ కోసం ఎంబీఏ చేయవచ్చు. బీబీఏ ఉత్తీర్ణులయ్యాక కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్, హెచ్ఆర్ మొదలైన విభిన్న విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ కన్సల్టెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజర్, ఆర్ అండ్ డీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేయవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ): చార్టర్డ్ అకౌంటెన్సీ నిపుణులకు జాబ్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులో ప్రధానంగా అకౌంటింగ్, ట్యాక్సేషన్‌పై దృష్టిసారిస్తారు. కామర్స్, అకౌంటెన్సీ, ట్యాక్సేషన్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఇంటర్మీడియట్ తర్వాత సీఏ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఈ కోర్సును అందిస్తోంది. సీఏ కోర్సు ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్.. ఇలా మూడు స్థాయిల్లో ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. సీఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ ట్యాక్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, వర్క్స్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ మొదలైన కార్పొరేట్, ఆర్థిక విభాగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేయవచ్చు. సీనియర్ సీఏల వద్ద పనిచేయడం ద్వారా అనుభవం పొందొచ్చు. కంపెనీ సెక్రటరీ: కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వల కెరీర్ కోరుకునే కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి కార్పొరేట్ రంగం అవకాశాలను అందిస్తుంది. కంపెనీ సెక్రటరీలో.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్.. ఇలా మూడు స్థాయిలు ఉంటాయి. సరైన ప్రణాళికతో ముందుకెళితే ఇంటర్మీడియెట్ సీఈసీ తర్వాత మూడేళ్లలోనే సీఎస్ కోర్సును పూర్తిచేసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక సీఈఓలు, ఎండీలకు సలహాలిచ్చే కంపెనీ సెక్రటరీగా అవకాశాలు దక్కించుకోవచ్చు. దాంతోపాటు అనుభవం, నైపుణ్యాల ఆధారంగా లీగల్ అడ్వైజర్, కార్పొరేట్ పాలసీ మేకర్, కార్పొరేట్ ప్లానర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ లా: కామర్స్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల కాలపరిమితి గల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలోని ప్రముఖ లా స్కూల్స్ బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ఇంటర్మీయెట్ తర్వాత క్లాట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. న్యాయ విద్యలో.. కార్పొరేట్ లా, ట్యాక్స్ లా/సివిల్, క్రిమినల్ లా/బిజినెస్ అండ్ లేబర్ లా వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. -
డిగ్రీ @ ఇంగ్లిష్ మీడియం
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే పరిజ్ఞానం ఆంగ్లం ద్వారానే సమకూరుతున్నందున రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు భారీగా తగ్గుతుండగా ఆంగ్ల మాధ్యమంలో పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పరిజ్ఞానంతో కూడిన సబ్జెక్టులు ఆంగ్ల మాధ్యమం ద్వారానే అందుబాటులో ఉన్న నేపథ్యంలో డిగ్రీ కోర్సులన్నిటినీ 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలుగు మీడియం కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకోవాలని ఆయా కాలేజీలకు సూచించింది. ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థుల మొగ్గు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అత్యుత్తమ ప్రమాణాలు, నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థులకు చాలా కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత చదువుల వైపు తల్లిదండ్రులు, యువత మొగ్గు చూపుతున్నారు. 2020–21లో డిగ్రీ కోర్సుల్లో చేరిన వారిలో 76% విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రవేశాలు పొందడం గమనార్హం. తెలుగు మాధ్యమంలో చేరికలు 24 శాతమే ఉన్నాయి. ఇంటర్ తెలుగు మాధ్యమంలో చదివిన వారు సైతం డిగ్రీలో ఇంగ్లిష్ మీడియం ఎంచుకుంటున్నారు. మొత్తం విద్యార్థుల చేరికలు 2.62 లక్షల వరకు ఉండగా ఆంగ్ల మాధ్యమంలో 1,96,322 మంది, తెలుగు మాధ్యమంలో 65,981 మంది ప్రవేశాలు పొందారు. ఆంగ్లం వైపు అణగారిన వర్గాల చూపు గతేడాది డిగ్రీలో చేరికల గణాంకాలను పరిశీలిస్తే ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారే ఉన్నారు. మొత్తం చేరికల్లో ఓసీలు 23 శాతం ఉండగా, ఈడబ్ల్యూఎస్ 1 శాతం, బీసీలు 54 శాతం, ఎస్సీలు 19 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. తెలుగు మాధ్యమంలో చేరిన వారిలో ఓసీలు 11 శాతం, ఎస్సీలు 24 శాతం, ఎస్టీలు 10 శాతం ఉండగా తక్కిన వారంతా బీసీలున్నారు. తెలుగు మాధ్యమంలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల వారే ముఖ్యంగా బాలికలే ఎక్కువగా ఉన్నారు. సమీపంలోని కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటులేక వీరు తెలుగు మాధ్యమంలో చేరుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో పట్టణ ప్రాంతాల వారు 75,578 మంది ఉండగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,91,227 మంది ఉన్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల్లో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను (లాంగ్వేజ్‌లు మినహా) ఇంగ్లిష్ మీడియంలోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకు కూడా వారికి సమీప కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగాలకు ఇంగ్లిష్ ముఖ్యం... ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2019 ప్రకారం నేర్చుకోవడంలో చురుకుదనం, అనుకూలతతో పాటు ఇంగ్లిష్‌లో నైపుణ్యాలున్న వారికి ఆయా సంస్థల యజమానులు నియామకాల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. ఇదే కాకుండా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వెలువరించిన 2016 నివేదిక ‘ఫైండింగ్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఎట్ వర్క్: గ్లోబల్ ఎనాలిసిస్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ వర్క్ ప్లేస్’లో కూడా భారత దేశంలో 90 శాతం మంది తమ సంస్థల్లో ఉద్యోగాలకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు ముఖ్యమని చెప్పినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిగ్రీ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో అందించడం ద్వారా యువతకు ఆంగ్ల నైపుణ్యాలతో పాటు ఆయా సబ్జెక్టుల్లో పరిజ్ఞానం పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్సీలో అత్యధికం ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బీఎస్సీ, బీకాంలకు ప్రాధాన్యమివ్వగా తెలుగు మాధ్యమంలో బీఎస్సీ, బీఏలకు సమప్రాధాన్యమిచ్చారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో ఇక పై ఇంగ్లీష్ మీడియం లోనే డిగ్రీ కోర్సులు
-
డిగ్రీ కోర్సులన్నీ ‘ఇంగ్లిష్’లోనే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2021 – 22)నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులన్నిటిలో ఆంగ్ల మాధ్యమమే అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో ఉన్నత విద్యామండలి ఇందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. ఇంజనీరింగ్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన నిర్వహిస్తుండగా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మాత్రం పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమం అమలులో లేదు. ఇంగ్లీషు మాధ్యమంలో డిగ్రీ పూర్తిచేసిన వారితో పోలిస్తే తెలుగు మాధ్యమంలో చదివిన వారు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఫలితంగా డిగ్రీ చదివినా నిరుద్యోగులుగా లేదంటే చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది. పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు. టెన్త్, ఇంటర్ తెలుగు మీడియంలో చదివిన వారు సైతం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా ఆన్లైన్లో చేపట్టిన డిగ్రీ ప్రవేశాల్లో ఈ అంశం తేటతెల్లమైంది. 80 శాతానికి పైగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీలో చేరారు. గతంతో పోలిస్తే ఆంగ్ల మాధ్యమంలో చేరికలు 20 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4,24,937 సీట్లు ఉండగా ఈ ఏడాది 2,62,805 మంది విద్యార్థులు చేరారు. వీరిలో తెలుగు మీడియం వారు 65,989 మంది ఉండగా ఇంగ్లీషు మీడియంలో చేరిన విద్యార్థులు 1,96,816 మంది ఉన్నారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలు: ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అనే మూడు అంశాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఉంటుందని చెప్పారు. డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూనే ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా డిగ్రీ కోర్సులలో ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తేనున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ఒకే పాఠ్యాంశం ఒకవైపు ఆంగ్లంలో, రెండోవైపు తెలుగులో ఉండేలా ఈ పాఠ్యపుస్తకాలు ఉంటాయన్నారు. దీనివల్ల పాఠ్యాంశాలను ఆంగ్లంలో చాలా త్వరగా నేర్చుకోగలుగుతారని వివరించారు. ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేనున్నందున డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్‌లో కూడా మార్పులు చేర్పులు చేయనున్నట్లు చెప్పారు. -
మూడేళ్ల డిగ్రీలోనే ఇంటర్న్‌షిప్
సాక్షి, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో ఇప్పుడున్న మూడేళ్ల కాల వ్యవధిలోనే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. కోర్సు సమయంలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. డిగ్రీ కోర్సులు అభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాలు పెంచేందుకు, చదువులు పూర్తికాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా వారిని తీర్చిదిద్దడానికి ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై ఉన్నత విద్యామండలి సిలబస్ రివిజన్ కమిటీ ద్వారా కసరత్తు చేపట్టింది. మంగళవారం ఈ కమిటీ మరోసారి సమావేశమైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, సిలబస్ రివిజన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫసర్ రాజారామిరెడ్డి, అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ బీఎస్ సెలీనా, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సిలబస్, ఇంటర్న్‌షిప్.. ఏయే వ్యవధుల్లో వీటిని నిర్వహించాలన్న దానిపై చర్చించారు. - చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానంలో సిలబస్‌లో చేయాల్సిన మార్పులపైనా ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. - మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. - మొదటి రెండేళ్లలో 10 నెలల పాటు ఆయా కోర్సుల సిలబస్ బోధన, అనంతరం 2 నెలల వేసవి సెలవుల్లో (రెండేళ్లకు కలిపి 4 నెలలు) ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. - మూడో ఏడాదిలో 6 నెలలపాటు కోర్సుల సిలబస్ బోధన, మిగతా 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనలపై చర్చించారు. - యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల డీన్లతో బుధవారం, అన్ని యూనివర్సిటీల ఉపకులపతులతో గురువారం సమావేశాలు నిర్వహించి ఉన్నత విద్యామండలి తుది నిర్ణయం తీసుకోనుంది. - కొత్తగా రూపొందించిన 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులను రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, అటానమస్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు. - ఈ కోర్సులను అమలు చేసేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మంగళవారం జీఓ నం.34 విడుదల చేశారు. -
పూర్తయితే డిగ్రీ.. మానేస్తే డిప్లొమా!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఎప్పుడంటే అప్పుడు ఆగిపోవచ్చు. మధ్యలో మరేదైనా కోర్సు చేసి వచ్చి మళ్లీ పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదో, రెండేళ్లో చదివి పాసైన సబ్జెక్టుల క్రెడిట్లను దాచుకోవచ్చు. ఇలా మధ్యలో చదువు ఆపేసినా చదివిన చదువుకు సర్టిఫికెట్లు ఇచ్చేలా నూతన విద్యా విధా నం (ఎన్ఈపీ) కీలక సిఫార్సు చేసింది. డిగ్రీ విద్యా విధానంలో సమూల మార్పులకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మలి్టపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానాన్ని తీసుకురావాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫైనల్ డ్రాఫ్ట్‌లో కస్తూరి రంగన్ కమిటీ పేర్కొంది. డిగ్రీ చదివే విద్యార్థులు ఆ కోర్సును పూర్తి చేస్తే డిగ్రీ పట్టా, ఏడాది తర్వాత మానేస్తే డిప్లొమా, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక మానేస్తే అడ్వాన్స్డ్ డిప్లొమా సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. కేంద్రం అంగీకరిస్తే డిగ్రీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పోటీని ఎదుర్కునే సత్తా పెంపొందించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా నూతన విద్యా విధానంలో పలు కీలక అంశాలను పొందుపరిచారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ విద్యా విధానాన్ని సమగ్రంగా పరిశీలించిన పాలసీ కమిటీ అన్ని స్థాయిల్లో హ్యుమానిటీస్, ఆర్ట్స్ జొప్పించడంతోపాటు అభ్యసన సామర్థ్యాల పెంపు, క్రియేటివిటీ, ఇన్నొవేషన్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాలి్వంగ్ ఎబిలిటీ, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంపొందించే విద్యా విధానం తీసుకురావాలని, స్థానిక పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్íÙప్ విధానం అమలు చేయాలని పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థుల్లో పరిశోధన, విద్యా సామర్థ్యాలు పెరిగి స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపింది. ఐఐటీల తరహాలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ను ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థులు తమకు నచ్చిన, ఉపాధి అవకాశాలు పొందేందుకు కావాల్సిన కోర్సులు, సబ్జెక్టులను మాత్రమే చదువుకునే విధానాన్ని అందుబాటులోకి (ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్) తేవాలని పేర్కొంది. ఎప్పుడంటే అప్పుడు.. విద్యార్థులు ప్రస్తుతం డిగ్రీలో చేరిన రెండేళ్ల తర్వాత మరో కోర్సు చేయాలంటే ఈ రెండేళ్ల చదువును వదులుకోవాల్సిందే. కానీ ఇకపై అలాంటి విధానాన్ని తొలగించాలని, ఆ రెండేళ్లను చదువును కూడా పరిగణనలోకి తీసుకునేలా, అవసరమైతే తర్వాత ఎప్పుడంటే అప్పుడు కొనసాగించే అవకాశాలను తీసుకురావాలని వెల్లడించింది. చదుకున్న చదువుకు తగిన సరి్టఫికెట్లు ఇవ్వాలని పేర్కొంది. ఇందులో భాగంగా మలి్టపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానం తేవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు మూడేళ్లు, ఇంజనీరింగ్ వంటి డిగ్రీలు నాలుగేళ్లు ఉన్నాయి. డిగ్రీ మూడేళ్లు, నాలుగేళ్లు ఉన్నా.. వాటిని చదువుతూ మధ్యలో ఆపినవారికి తగిన సరి్టఫికెట్లు ఇవ్వాల్సిందేనని పేర్కొంది. డిగ్రీలో చేరిన విద్యారి్థకి మొదటి ఏడాది పూర్తయితే డిప్లొమా సరి్టఫికెట్, రెండేళ్లు పూర్తయితే అడ్వాన్స్డ్ డిప్లొమా సరి్టఫికెట్, మూడేళ్లు పూర్తయితే డిగ్రీ సరి్టఫికెట్ ఇవ్వాలని పేర్కొంది. అదే నాలుగేళ్ల డిగ్రీ చేస్తే పరిశోధన డిగ్రీగా పరిగణించాలని పేర్కొంది. రెగ్యులర్ కోర్సులతోపాటు వొకేషనల్, ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ దీనిని అమలు చేయాలని తెలిపింది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకునే విద్యా విధానం డిగ్రీలో ఉండాలని పేర్కొంది. ఇందుకోసం అకడమిక్ బ్యాంక్ క్రెడిట్స్‌ను (ఏబీసీ) ఏర్పాటు చేయాలని వెల్లడించింది. తద్వారా విద్యార్థి ఒక రాష్ట్రంలో లేదా ఒక యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసి, మరో రాష్ట్రంలో లేదా మరో యూనివర్సిటీలో చదువుకునేలా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అయితే ముందుగా చదివిన క్రెడిట్లు నష్టపోకుండా, వాటిని పరిగణనలోకి తీసుకొని డిప్లొమా లేదా డిగ్రీ సరి్టఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఏబీసీని ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ఇదీ రెగ్యులర్ విద్యార్థులకే కాకుండా ఫెయిలైన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇందులో విద్యార్థి తను పాసైన సబ్జెక్టుల క్రెడిట్లను దాచుకోవచ్చు. మిగతా సబ్జెక్టులను అక్కడే చదివినా, ఇతర యూనివర్సిటీల్లో చదివినా వాటికి క్రెడిట్లు ఇవ్వాలి. ఇలా ఒక డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, డిగ్రీకి అవసరమైన నిరీ్ణత క్రెడిట్లను ఆ విద్యార్థి సాధించగానే అతనికి సంబంధిత సరి్టఫికెట్‌ను అందించే విధానం తేవాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు నచి్చన సబ్జెక్టులను ఇష్టపూర్వకంగా చదువుకోవడంతోపాటు అందులో నిష్ణాతులు అవుతారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించింది. పీజీ రెండో ఏడాదంతా పరిశోధనే.. మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో (పీజీ) మొదటి ఏడాది చదువుకుంటే రెండో ఏడాదంతా పరిశోధనపైనే ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అదే నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ చేసిన వారు ఒక్క ఏడాదే పీజీ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. వారు పరిశోధన డిగ్రీని నాలుగేళ్లు చదివినందున, ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని వెల్లడించింది. ఇక పీహెచ్‌డీలో ప్రవేశాలకు మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్లు పీజీ చేసిన వారు, నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎంఫిల్ కోర్సును రద్దు చేయాలని పేర్కొంది. -
‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్టపర్చి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆయా కోర్సుల్లోని పాఠ్యాంశాలకు మరింత పదునుపెడుతోంది. అన్ని రంగాల్లో మార్పులు శరవేగంగా జరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా యువతనూ సిద్ధం చేసేలా పలు డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలకు కొత్త రూపునిచ్చింది. నిపుణుల కమిటీ సూచనలతో కొత్త అంశాలను ప్రకటించింది. ఆయా కోర్సుల్లో చదివే వారికి భవిష్యత్తులో ఏయే నైపుణ్యాలు అలవడాలి, కోర్సుల లక్ష్యం ఏమిటన్న వాటిని ముందుగానే నిర్దేశించుకుని ఆ ఫలితాలు వచ్చేలా పాఠ్యాంశాలను కూర్చి.. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్యప్రణాళిక’లు విడుదల చేసింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే కొత్త పాఠ్యాంశాలు అమల్లోకి తెస్తోంది. మహత్తర లక్ష్యం విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంచి వారు చదువులు ముగించి విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను తీర్చిదిద్దింది. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత సమాజాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా కోర్సుల సిలబస్‌లలో మార్పులు చేసింది. గత ఏడాది జూలై 26 నుంచి మూడు రోజుల పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో ఉన్నత విద్యాకోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై యూజీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహించింది. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను డిగ్రీ స్థాయిలో అమలు చేయించాలని ఈ సదస్సులో తీర్మానించారు. పాఠ్య ప్రణాళికలను, మెరుగైన విధానాలను ప్రవేశపెట్టేలా సబ్జెక్టుల వారీగా నిపుణులతో కమిటీలను నియమించి కసరత్తు చేయించింది. ఈ కమిటీలు జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చా గోషు్టలు నిర్వహించి, పలు వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను యూజీసీకి నివేదించాయి. వెబ్సైట్లో పాఠ్య ప్రణాళికలు నిపుణుల కమిటీలిచ్చిన నివేదికల ఆధారంగా యూజీసీ పలు డిగ్రీకోర్సుల్లో అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలు విడుదల చేసింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మేథమేటిక్స్, బోటనీ, ఆంథ్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్ కోర్సులకు సంబంధించిన కొత్త పాఠ్య ప్రణాళికలను యూజీసీ ప్రకటించింది. తాజాగా ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ అంశాలపై పాఠ్యప్రణాళికలను తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిని‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో యూనివర్సిటీలు సందర్శించవచ్చని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ ఒక వెబ్ నోట్ విడుదల చేశారు. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను అనుసరించి ఆయా వర్సిటీలు తమ పాఠ్యాంశాలను సవరించుకోవాలని యూనివర్సిటీల ఉప కులపతులకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను ‘ఎల్ఓసీఎఫ్యూజీసీఎట్దరేటాఫ్జీమెయిల్.కామ్’కు లేదా ‘నీతుతులసీ.యూజీసీ.జీఓవీ.ఐఎన్’కు మెయిల్ చేయాలని సూచించింది. వర్సిటీలలో సబ్జెక్టుల వారీగా సమీక్షలు యూజీసీ ప్రకటించిన ‘లెర్నింగ్ అవుట్ కమ్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్’ను అనుసరించి రాష్ట్రంలోని ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలపై సమీక్ష జరిగేలా చర్యలు చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో పలు సంస్కరణల దిశగా ఉన్నత విద్యామండలి ద్వారా ముందుకు వెళ్తున్నాం. వీటిపై నిపుణుల కమిటీని నియమించాం. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నాం. విద్యార్థులు తమకు నచి్చన కోర్సులు చేస్తూనే.. మరికొన్ని కోర్సులను ఇతర విద్యాసంస్థల ద్వారా అభ్యసించేలా కొత్త విధానాలకు శ్రీకారం చుట్టనున్నాం. – ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
ఏకకాలంలో రెండు డిగ్రీలు
న్యూఢిల్లీ: త్వరలో విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసే అవకాశం కలగనుంది. దీనిపై సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు గతనెలలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. విద్యావేత్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని యూజీసీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఆలోచన అమలైతే ఒకే వర్సిటీ నుంచిగానీ, వేర్వేరు వర్సిటీల నుంచిగానీ దూరవిద్య, ఆన్లైన్, పార్ట్‌టైమ్ కోర్సుల ద్వారా ఏకకాలంలో రెండు డిగ్రీలను పూర్తిచేసే అవకాశముంటుంది. -
ఒకే దేశం.. ఒకే డిగ్రీ!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల సిలబస్‌లో వచ్చే ఏడాది సమూల మార్పులు జరగనున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో ఒకే తరహా సిలబస్‌ను అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఇందులో మెజార్టీ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు దేశ వ్యాప్తంగా ఒకే తరహా డిగ్రీ సిలబస్ ఉండేలా మార్పులు తీసుకువచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీంతో యూజీసీ ఈ నెలాఖరులో మోడల్ సిలబస్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది. అనంతరం ఆయా రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలు రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా 20 శాతం నుంచి 30 శాతం వరకు సిలబస్‌ను మార్పు చేసుకునే వీలు కల్పించనుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు మోడల్ సిలబస్ రాగానే స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో మార్పులకు చర్యలు చేపట్టేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిగతా 70 శాతం నుంచి 80 శాతం సిలబస్ జాతీయ స్థాయిలో ఒకే తరహాలో ఉండేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డిగ్రీ సిలబస్ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు మార్కుల విధానం అమలు అమలు అవుతోంది. ఎక్కడా సమానత్వం ఉండటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో 75 శాతానికి మార్కులు మించకపోతే మరికొన్ని రాష్ట్రాల్లో 95 శాతం వరకు మార్కులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకేలా రకమైన బోధన, పాఠ్యాంశాల రూపకల్పన, మార్కుల విధానం తీసుకువచ్చే చర్యలను కేంద్రం చేపట్టింది. మరోవైపు భాషలు, చరిత్ర వంటి పుస్తకాల్లో అవసరంలేని అంతర్జాతీయ స్థాయి సిలబస్ ఉంది. దేశంలోని ప్రముఖులకు సంబంధించిన పాఠ్యాంశాలకు చోటు లేకుండా పోయింది. ప్రస్తుతం వాటన్నింటిని పరిశీలించి దేశీయ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసి మోడల్ సిలబస్‌ను ప్రకటించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక 2016లో కేంద్రం ప్రవేశపెట్టిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంకు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చినా, జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా మరిన్ని మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనూ మార్పు చేసిన పాఠ్య పుస్తకాలను 2016–17 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల ఫైనల్ ఇయర్ ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను రూపొందించి అమల్లోకి తీసుకురానుంది. గతేడాది రాష్ట్రంలో డిగ్రీ ఇంగ్లిషులో మార్పులు తేవాలని భావించినా కోర్సు మధ్యలో అలా చేయడం కుదరదని, విద్యార్థులు గందరగోళానికి గురవుతారని వర్సిటీలు వ్యతిరేకించాయి. దీంతో ఉన్నత విద్యా మండలి మిన్నకుండిపోయింది. గతంలో మార్పు చేసిన సిలబస్‌లో చేరిన వారి ఫైనల్ ఇయర్ ఇప్పుడు పూర్తి అవుతున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది.