డిగ్రీ @ ఇంగ్లిష్‌ మీడియం | Students and parents in AP are interested degree in English medium | Sakshi
Sakshi News home page

డిగ్రీ @ ఇంగ్లిష్‌ మీడియం

Published Thu, Jun 17 2021 3:28 AM | Last Updated on Thu, Jun 17 2021 3:28 AM

Students and parents in AP are interested degree in English medium - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే పరిజ్ఞానం ఆంగ్లం ద్వారానే సమకూరుతున్నందున రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు భారీగా తగ్గుతుండగా ఆంగ్ల మాధ్యమంలో పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పరిజ్ఞానంతో కూడిన సబ్జెక్టులు ఆంగ్ల మాధ్యమం ద్వారానే అందుబాటులో ఉన్న నేపథ్యంలో డిగ్రీ కోర్సులన్నిటినీ 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలుగు మీడియం కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకోవాలని ఆయా కాలేజీలకు సూచించింది.   

ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థుల మొగ్గు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అత్యుత్తమ ప్రమాణాలు, నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విద్యార్థులకు చాలా కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత చదువుల వైపు తల్లిదండ్రులు, యువత మొగ్గు చూపుతున్నారు. 2020–21లో డిగ్రీ కోర్సుల్లో చేరిన వారిలో 76% విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రవేశాలు పొందడం గమనార్హం. తెలుగు మాధ్యమంలో చేరికలు 24 శాతమే ఉన్నాయి. ఇంటర్‌ తెలుగు మాధ్యమంలో చదివిన వారు సైతం డిగ్రీలో ఇంగ్లిష్‌ మీడియం ఎంచుకుంటున్నారు. మొత్తం విద్యార్థుల చేరికలు 2.62 లక్షల వరకు ఉండగా ఆంగ్ల మాధ్యమంలో 1,96,322 మంది, తెలుగు మాధ్యమంలో 65,981 మంది ప్రవేశాలు పొందారు.

ఆంగ్లం వైపు అణగారిన వర్గాల చూపు
గతేడాది డిగ్రీలో చేరికల గణాంకాలను పరిశీలిస్తే ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారే ఉన్నారు. మొత్తం చేరికల్లో ఓసీలు 23 శాతం ఉండగా, ఈడబ్ల్యూఎస్‌ 1 శాతం, బీసీలు 54 శాతం, ఎస్సీలు 19 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. తెలుగు మాధ్యమంలో చేరిన వారిలో ఓసీలు 11 శాతం, ఎస్సీలు 24 శాతం, ఎస్టీలు 10 శాతం ఉండగా తక్కిన వారంతా బీసీలున్నారు. తెలుగు మాధ్యమంలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల వారే ముఖ్యంగా బాలికలే ఎక్కువగా ఉన్నారు. సమీపంలోని కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటులేక వీరు తెలుగు మాధ్యమంలో చేరుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో పట్టణ ప్రాంతాల వారు 75,578 మంది ఉండగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,91,227 మంది ఉన్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల్లో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను (లాంగ్వేజ్‌లు మినహా) ఇంగ్లిష్‌ మీడియంలోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకు కూడా వారికి సమీప కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

ఉద్యోగాలకు ఇంగ్లిష్‌ ముఖ్యం...
ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌–2019 ప్రకారం నేర్చుకోవడంలో చురుకుదనం, అనుకూలతతో పాటు ఇంగ్లిష్‌లో నైపుణ్యాలున్న వారికి ఆయా సంస్థల యజమానులు నియామకాల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. ఇదే కాకుండా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వెలువరించిన 2016 నివేదిక ‘ఫైండింగ్స్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ ఎట్‌ వర్క్‌: గ్లోబల్‌ ఎనాలిసిస్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ ఇన్‌ వర్క్‌ ప్లేస్‌’లో కూడా భారత దేశంలో 90 శాతం మంది తమ సంస్థల్లో ఉద్యోగాలకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు ముఖ్యమని చెప్పినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిగ్రీ కోర్సులను ఇంగ్లిష్‌ మాధ్యమంలో అందించడం ద్వారా యువతకు ఆంగ్ల  నైపుణ్యాలతో పాటు ఆయా సబ్జెక్టుల్లో పరిజ్ఞానం పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

బీఎస్సీలో అత్యధికం
ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బీఎస్సీ, బీకాంలకు ప్రాధాన్యమివ్వగా తెలుగు మాధ్యమంలో బీఎస్సీ, బీఏలకు సమప్రాధాన్యమిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement