ఇంగ్లిష్‌ మీడియంపై అక్కసు ఎందుకు? | Sakshi Guest Column On English medium | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మీడియంపై అక్కసు ఎందుకు?

Published Tue, Jan 7 2025 12:16 AM | Last Updated on Tue, Jan 7 2025 12:16 AM

Sakshi Guest Column On English medium

విశ్లేషణ

ఇంగ్లిష్‌ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. ఇంగ్లిష్‌ విద్య ఇప్పటి కచ్చిత అవసరం. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగు వర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ దళిత బహుజనులు ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేయడం న్యాయం కాదు. తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తీర్మానం సామాజిక న్యాయానికి విరుద్ధమైనది, నిజాయితీ లోపించినది.

తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్దాల్లో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు జమీందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశ వాదంగా బ్రాహ్మణవాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో రాజ్యాధి కారాన్ని చేపట్టాయి. అంతకుముందు వీళ్లు తెలుగు భాషకు పట్టం గట్టారు. కానీ తెలుగు విద్య వల్ల తమ పిల్లలకు ఉద్యోగ వసతి రాదనీ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపా దించాలంటే ఇంగ్లిష్‌ విద్య అవసరమనీ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ విద్యను దెబ్బతీశారు. 

ఎవరైతే తమ పిల్లలకు, మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా చేసి వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ దీన్ని తెలుగు మీద ప్రేమ అనలేము. ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతా’రనే భావనతోనే బడుగులకు తెలివిగా ఆంగ్ల మాధ్యమ నిరాకరణ జరుగుతోంది.

నిజానికి మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, అంబేడ్కర్‌ లాంటివాళ్లు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి వారి ఇంగ్లిష్‌ విద్యే కారణం. అంబేడ్కర్‌. భారత రాజ్యాంగంతో పాటు, వేలాది పేజీలు వివిధ అంశాలపై రాయడం ఆయన ఆంగ్ల భాషా అధ్యయనం వల్లే జరిగింది. ఆంగ్ల భాషాధ్యయనం వల్లే రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ సతీసహగమన దురాచారానికి ఎదురు తిరగగలిగారు. 

రవీంద్రనాథ్‌ టాగూర్‌ శాంతినికేతనం స్థాపించి, నోబెల్‌ బహుమతి గ్రహీత కాగలిగారు. దీని వెనుక ఇంగ్లిష్‌ పునరుజ్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. ఇంగ్లిష్‌ విద్య ఇప్పటి కచ్చిత అవసరమనే విషయం అందరూ తెలుసుకోవాలి. దాన్ని అందిపుచ్చుకుంటూ దళిత బహుజనులు కూడా ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. 

నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే, చదువుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని పాఠశాలల్లో ఉంది. తెలుగును ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి నూరు పద్యాలు కంఠతా వస్తేనే ఆ విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్‌ ఇవ్వండి అని ‘దళిత మహాసభ’ సలహా ఇవ్వడం జరిగింది. 

అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టినవాళ్ళే ప్రైవేట్‌ స్కూళ్ళను, కార్పొరేట్‌ స్కూళ్ళను నెలకొల్పారు. అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు పిల్లలకు తెలుగే రాకుండా చేశారు. తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దళిత బహుజన వర్గాలు ఆంగ్ల విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే అర్హతను సంపా దిస్తారేమో అనే భయం వీరిని వెంటాడుతున్నట్టుంది.

ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాల లను రద్దుచేసి ఆ కళాశాలల్లోని తెలుగు పండితుల పొట్ట కొట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. ఆధిపత్య కులాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బ తీసి ఐటీ సెక్టారుకు ఉపయోగపడే బీటెక్, ఎంటెక్‌లకే ప్రాధాన్యం ఇచ్చారు. 

మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. కుటుంబ సంబంధాలన్నీ నాశనం అయినాయి. తమ సామాజిక వ్యవస్థలను గుర్తించ కుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గోలు పెడు తున్నారు. నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపో క్రసీని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. 

ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్ని వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని కాంక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనేవారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలో చనల్లో విస్తృతి, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి; ఆలోచనలు సంకు చితంగానే కనబడతాయి. 

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతికి అందరూ సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీ కరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లిష్‌ విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా? కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభి వృద్ధి అని తెలుసుకోలేక పోతున్నారు. 

మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్నీ లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతోంది. విద్య అనేది జ్ఞానం, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి ఉన్నారు. 

ఆయా వృత్తుల్లో ఆ యా జీవన వ్యవస్థల్లో, ఆ యా దేశ పాలనల్లో వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఆంగ్ల విద్య ఎంతో తోడ్పడిందనేది చారిత్రక సత్యం. అందుకే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, బడుగు వర్గాలకు ఆంగ్ల విద్యను నేర్పడం అవసరం. దీనివల్ల వారిలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంతిమంగా దేశానికే మేలు కలుగుతుంది. జీడీపీ పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ ఎగు మతులు పెరుగుతాయి. 

ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటినీ రద్దు చేయాలనే భావన మంచిది కాదు. పాలకులు మారుతూ
ఉంటారు. కానీ మంచి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. ఇంగ్లిష్‌ మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే పక్షంలో, అన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్ళను ఒకే విధానంలోకి తేగలరా? ఒకసారి సామాజిక న్యాయ కోణంలో, దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లిష్‌ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్‌ బాట. ఆ బాటలో నడుద్దాం.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement