katti padhmarao
-
అంబేడ్కర్ దారిలో అలుపెరుగక..
‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు. మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...) -
ఏది వాస్తవ చరిత్ర?
జూన్ 27న ‘వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత’ అని డా. కత్తి పద్మారావుగారు రాసిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి అభ్యంతరం లేదు. కాని వాస్తవ చరిత్ర ఏదన్నదే అసలైన చిక్కు. నాలుగు దశాబ్దాల నాడు వచ్చిన ఒక తెలుగు సినిమాలో రావుగోపాలరావు పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ అనే దాన్ని ఆయన తన వ్యాసం ద్వారా మరోమారు చెప్పారు. డీ.డీ. కోశాంబి, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్రలు చెప్పిందే చరిత్రగా అంగీకరించి తీరాలా! అంతకన్నా భిన్నమైన చరిత్ర ఉందని కొత్త పరిశోధన ద్వారా బయటకు తీసుకురాకూడదా?ఒక సబ్జెక్టులో ఒకరి కన్నా ఎక్కువ మంది రాసిన పుస్తకాలు ఉంటాయి. వాటిలో దేనినైనా చదువుకోవచ్చు. కాని చరిత్రలో మాత్రం నియంతృత్వ పోకడగా రొమిల్లా, బిపిన్ చంద్రల పుస్తకాలు దాటి చదవటానికి వీలు లేదనడం సబబేనా? ఈ రచయితలు భారతీయ చరిత్రకు ఒక రంగు పులిమారు. ఆ రంగును పలుచన చెయ్యటాన్ని అంగీకరించం అంటారు వారి శిష్యులు. వివాదాస్పద కట్టడం కూల్చివేత చిన్న విషయం కాదన్నారాయన. ఆ కూల్చివేత వెనుక హిందూ రాజ్య నిర్మాణ భావన ఉందని తీర్మానించారు. అయితే జమ్మూ–కశ్మీర్, కాశీ, మధురల్లో దేవాలయాలు ధ్వంసమవ్వడం చారిత్రక వాస్తవమే కదా! ఆ ధ్వంసం వెనుకనున్న భావన ఏమిటో కూడా పిల్లలకు తెలియాలి కదా!ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి చరిత్ర పుస్తకాలలో మత ఘర్షణల గురించి చెప్పిన అధ్యాయంలో ఏమి రాశారో ఆయన చదివారా? అందులో గుజరాత్లో జరిగినవి, అయోధ్య నేపథ్యంలో జరిగినవి మాత్రమే ఉన్నాయి. నవీన భారత చరిత్రలో ఆ రెండు సందర్భాలలో తప్పించి మరెన్నడూ మత కల్లోలాలు జరగలేదన్నది యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ వంటి రచయితలు భావిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం ఏదీ ఉండదు.కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల ఊచకోత గురించి కూడా వీరు ప్రస్తావించి ఉంటే అది వాస్తవ చరిత్ర అయి ఉండేది. కొన్నింటిని కప్పిపుచ్చి, మరికొన్నింటిని కొందరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివరంగా రాస్తామంటే అది వాస్తవ చరిత్ర కానేకాదు. రైతు ఉద్యమాల గురించి రాసినప్పుడు, 2018లో నాసిక్ నుండి ముంబైకి, ఆ తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి జరిగిన రైతాంగ ఊరేగింపుల గురించే రాస్తామంటే ఎలా!ఆంధ్రాలో జరిగిన ఎన్జీ రంగా ఆధ్వర్యంలో పలాస నుండి చెన్నపట్నంకి జరిగిన రైతు యాత్ర గురించి రాయం అంటే ఎలా! ‘దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరగనున్నాయి’ అనడాన్ని అంతా స్వాగతించాల్సినదే. అయితే భారతీయులందరికీ వర్తించే లౌకిక చట్టాలు లేకుండా లౌకికవాదం ఎలా పెరుగుతుంది? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అమలు చెయ్యకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఎలా వస్తుంది?ఏ వర్గానికి చెందినవైనా చరిత్రలోని మంచి చెడులు చెబితేనే అది వాస్తవ చరిత్ర. ముఖ్యమైనవి, విద్యార్థులకు అంతగా అవసరం లేని అంశాలు పుస్తకాల నుండి తొలగించటం అన్ని సబ్జెక్టులలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లోనూ జరిగింది. విద్యార్థులకు మేలు చేసిన అంశం మీద అనవసరపు రాద్ధాంతం ఎందుకు? – డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, 9440421695 -
సామాజిక బందీల విముక్తి ప్రదాత!
ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే.. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంబేడ్కర్ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్లో మనకు కనిపిస్తుంది. అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు. ‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’ ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. అంబేడ్కర్‌లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు. ఇకపోతే అంబేడ్కర్ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు. అంబేడ్కర్‌కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట! రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్ రివల్యూషన్‌గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం. అంబేడ్కర్‌వాదులు, మార్క్స్వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్‌ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు (ఈ వ్యాసం Dec 06, 2022 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
నిజమైన ప్రత్యామ్నాయం కావాలంటే!
అత్యధిక బీజేపీయేతర పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడటం మంచి ప్రయత్నమే. భిన్న స్వభావాలు, భిన్న అభిప్రాయాలున్న రాజకీయ పార్టీలు ఒక సమన్వయానికి ప్రయత్నించడమూ గొప్ప విషయమే. అయితే, ప్రత్యామ్నాయ రాజకీయ ప్రణాళిక రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటున్నామని ఈ పార్టీలు చెప్పడం లేదు. భారతదేశంలో ఈనాటికీ అస్పృశ్యత, నిరక్షరాస్యత ఉన్నాయి. కులం వేళ్లను పెకిలించకుండా నూతన భారతదేశ ఆవిష్కరణ జరగడం అసంభవం. అందుకే అంబేడ్కర్ చూపిన మార్గంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవలసిన చారిత్రక బాధ్యత ఈ పార్టీలపై ఉంది. అప్పుడే అది నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవుతుంది. భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా) పేరుతో ప్రతిపక్షాలు సెప్టెంబర్ 1, 2023న ముంబైలో సమావేశమవటం భారత రాజకీయా లలో చారిత్రక ఘటనగా చెప్పుకోవచ్చు. 28 బీజేపీయేతర పార్టీలు హాజరై వచ్చే ఎన్నికల నాటికి చేయవలసిన ఉమ్మడి పోరు సన్నద్ధతపై చర్చించటం ముదావహం. 14 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీని వేయడం కూడా ముందడుగే. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగ స్వామ్య ఏర్పాటుకు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళదామనేది కూడా మంచి ప్రయత్నమే. దీనికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గేను అభినందించాలి. అంబేడ్కర్ ఆదర్శమని చెప్పరా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే– బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌కు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పన ఇక్కడ మృగ్యమైంది. ముంబైలో జరిగిన కూటమి మూడవ సమావేశం కేవలం రాజకీయ సమన్వయంగానే సాగింది. భిన్న ప్రణాళికలు, భిన్న స్వభావాలు, భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ లన్నీ ఒక చోట కూర్చుని సమన్వయానికి ప్రయత్నించడం గొప్ప విషయమే కానీ, ప్రత్యామ్నాయ రాజకీయ ప్రణాళిక రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటున్నా మని అవి చెప్పలేదు. దీంతో దీన్ని ఉదార హిందూవాద సమన్వయ కమిటీగానే భావించాల్సి ఉంటుంది. మతోన్మాద హిందూ భావజాల పక్షాల కంటే ఈ కూటమి మెరుగైనది అయినప్పటికీ, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అంబేడ్కర్ ఆశయాల్లో తాము నడుస్తామని వీరు అనలేకపోతున్నారు. కారణం ఇందులో అంబేడ్కరైట్లు ఎవరూ లేరు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ పొత్తు నుంచి బయటికి వచ్చిన నితీష్ కుమార్, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్, అంబేడ్కర్‌ను ఇప్పటివరకు తమ ఎజెండాలోకి తీసుకోని సీపీఎం, సీపీఐ నాయకులు ఈ కూడికలో ఉన్నారు. ఓబీసీ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తేజస్వి యాదవ్, బిహార్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివాళ్ళు కూడా అంబేడ్కర్‌ను తమ ఎజెండాలోకి ఇంతవరకూ తీసుకోలేదు. అదే ప్రత్యామ్నాయ ఎజెండా అలాగే రాహుల్ గాంధీ నోట అంబేడ్కర్ పేరు రాకపోవడం కూడా ఆశ్చర్యం. ఎందుకంటే అధికార పక్షానికి ఆయన ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. భారతదేశంలో ఈనాటికీ అస్పృశ్యత, నిరక్షరాస్యత ఉన్నాయి. కులం వేళ్లను పెకిలించకుండా భారతదేశం నూతన భారతదేశంగా ఆవిష్కరించబడటం కష్టమని శశి థరూర్ లాంటివాళ్లు రాశారు. చిదంబరం, శశి థరూర్ లాంటి కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ గురించి రాసినవాటిని అయినా రాహుల్ గాంధీ చూసి ఉండవచ్చు. కానీ ఆయనలో ఉన్న ఉదార బ్రాహ్మణుడు కుల నిర్మూలనను తమ ఎజెండాలో ప్రకటించడానికి అడ్డు పడుతున్నాడని అనక తప్పదు. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి భారతదేశం వెళ్లిందని వామపక్ష పార్టీలు గగ్గోలు పెడతాయి కానీ కులం ఊబిలో దేశం కూరుకుపోయిందని చెప్పవు. అంబేడ్కర్ ఎజెండా లేకుండా ఇండియా కూటమి విజయం అసాధ్యమని మనకి అర్థమవుతుంది. అంబేడ్కర్ చెప్పిన కుల నిర్మూ లనా వాదమే భారత దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా. అంబేడ్కర్ అస్పృశ్యతా నివారణ మీద స్పష్టమైన ఆలోచనలు పొందుపర్చారు. అస్పృశ్యత వల్ల భారతదేశ నాగరికత, సంస్కృతి, శాస్త్రజ్ఞానం కుంటు పడ్డాయి. అస్పృశ్యులుగా చెప్పబడుతున్న ఉత్పత్తి శక్తులు, శ్రమ జీవులు, మాతృస్వామ్య భావం కలవారిని నిర్లక్ష్యం చేయడమే భారత దేశ దారిద్య్రానికి మూలం. ఈ రోజున మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన మీటింగులు జరుగుతున్నాయి. కానీ నోరు తెరచి ఒక్కళ్ళు కూడా ఆయన మనకు ప్రధానమంత్రి కావాలని అనడం లేదు. ఎందుకు? వారందరి మనసులో కులం ఉంది. శుభసూచనే కానీ... ప్రతి ఒక్కరికీ మతం మారే హక్కు ఉండాలన్నారు అంబేడ్కర్. ప్రజలు మతం నుండి బయట పడకుండా తమ బానిసత్వం నుండి విముక్తి కాలేరని చెప్పారు. ‘మీ బానిసత్వాన్ని మీరే రద్దు చేసుకోవాలి. దేవుడో, మరొక సూపర్మానో వచ్చి చేస్తాడని వారిపై ఆధారపడకండి. పవిత్ర గ్రంథాలను పూజించడం వల్ల మీరు బానిసత్వం నుంచి, దరిద్రం నుంచి విముక్తం కాలేరు. తరతరాలుగా మీ తాతముత్తాతలు అదే చేస్తూ వస్తున్నారు. అయినా మీ దుర్భర జీవితంలో లేశమాత్ర మైనా మార్పు రాలేదు. మీ తాత ముత్తాతల్లానే మీరూ పీలికలు ధరిస్తు న్నారు. వారిలాగ విసిరేసిన ఎంగిలి మెతుకులపై ఆధారపడుతు న్నారు. వారిలాగే మీరు మురికివాడల్లోనూ, గుడిసెల్లోనూ జీవిస్తు న్నారు. వారిలాగే తేలికగా రోగాల బారిన పడుతున్నారు. మీ మతపర మైన ఉపవాసాలు, ఆచారాలు, దీక్షలు మిమ్మల్ని ఆకలి నుంచి కాపాడ లేకపోయాయి. మీకు కూడు, గుడ్డ, గూడు, విద్య, మందులు, జీవికకు అవసరమైన ఉపాధిని కల్పించడం శాసనసభ బాధ్యత. మీ అంగీ కారం, సహాయం, ఇష్టంతో శాసనాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం జరగాలి. క్లుప్తంగా చెప్పాలంటే భౌతిక ఆనందాల న్నింటికీ చట్టమే ఆధారం. చట్టాలు చేసే అధికారాన్ని గెలుచుకోండి. కనుక మీ దృష్టిని ఉపవాసాలు, ఆరాధనలు, దీక్షల నుంచి మళ్ళించి, శాసనాలు చేసే అధికారాన్ని దక్కించుకోవడంపై పెట్టండి. ఈ మార్గంలోనే మీ ముక్తి ఉంది. ఈ మార్గమే మీ ఆకలి సమస్యకు పరిష్కార మిస్తుంది. మీ జనాభా మెజారిటీలో ఉండడం సరిపోదని గ్రహించండి. ఎప్పుడూ అప్రమత్తంగా, బలంగా, విద్యావంతులై, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే విజయాన్ని సాధించి, దాన్ని నిలబెట్టుకోగలరు’ అన్నది అంబేడ్కర్ బోధనల సారాంశం. కులాధిపత్యాన్ని, మతోన్మా దాన్ని ఖండించి నూతన భారతదేశాన్ని ఆవిష్కరించడానికి తగిన పునాదులు వేశారు అంబేడ్కర్. ఆయనను పరిగణనలోనికి తీసుకో కుండా ఒక రాజకీయ కూటమిని నిర్మించడం అంటే కళ్ళకు గంతలు కట్టుకుని గుంతల్లో నడవడమే. రాజ్యాంగంలోని 21వ అధికరణ భారతదేశ ప్రజలకు ఊపిరి లాంటిది. ఒక వ్యక్తి జీవించి ఉంటేనేకదా ప్రాథమిక హక్కులను అనుభవించేది. రాజ్యాంగం ప్రసాదించిన ఈ ప్రాథమిక హక్కును హరించివేస్తున్నది కూడా ప్రభుత్వం, పోలీసులు, రక్షణ బలగాలే. రాజ్య హింసకు దర్పణం ఈ అధికరణ. రాజ్య హింస రెండు రకాలు. ప్రత్యక్ష హింస, పరోక్ష హింస. బూటకపు ఎన్కౌంటర్లు, లాకప్ హత్యల లాంటివి ప్రత్యక్ష హత్యలు. రైతుల ఆత్మహత్యలు, అర్ధాకలి మరణాలు, పోషకాహారం లేక శిశువులు, పిల్లల మరణాలు, సరైన వైద్య సదుపాయం లేక గాలిలో కలిసిపోతున్న బడుగు జీవుల ప్రాణాలు, వివిధ రకాల కాలుష్యాల ప్రభావంతో మరణాలు మొదలైనవన్ని పరోక్ష హత్యలు. వీటన్నింటికీ బాధ్యత ప్రభుత్వానిదే కనుక. అందుకే ఇండియా కూటమి జీవించే హక్కుకు భరోసా ఇవ్వాలి. భారతీయుడైన ప్రతివాడు ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు అంబేడ్కర్. ప్రతి మనిషికి నిర్భ యంతో కూడిన స్వేచ్ఛను అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగద్రొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ఆయన ఆలోచనలను వందకు వంద శాతం ముందుకు తీసుకుని వెళ్లాలి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దించాలని ప్రజాస్వామ్య వాదులు, లౌకికవాదులు అందరూ అనుకుంటున్నారు. ఇది ఇండియా కూటమికి శుభసూచన. కానీ వీళ్ళు అంబేడ్కర్ మార్గంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవలసిన చారి త్రక బాధ్యతను కలిగి ఉన్నారు. అప్పుడే అది నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవుతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
దళిత ఉద్యమ సారథి కత్తి పద్మారావు
డాక్టర్ కత్తి పద్మారావు ప్రపంచ మెరిగిన హేతువాది. జగమెరిగిన దళిత ఉద్యమ నాయకుడు. ఆయనది భౌతిక తాత్విక వాద ప్రాపంచిక దృక్పథం. పైగా కల్తీలేని మానవతావాది. నిజాయితీ గల బోధకుడు. మనిషి తాను సృష్టించుకున్న దైవభావనకు తానే బానిసై, మతం స్వార్థపరుల చేతిలో చిక్కి, అధిక సంఖ్యాకులను మభ్యపెట్టడానికి, అణచిపెట్టడానికి సాధనంగా మారడంపై ఆయన యుద్ధం ప్రకటించారు.. హేతువాది, మానవతావాది అయిన కత్తి పద్మారావు బౌద్ధంవైపు మొగ్గారు. దళిత బహుజనుల రాజ్యాధికార సాధనకు ఆయన బౌద్ధాన్ని, అంబేడ్కర్ వాదాన్ని ఆధారం చేసుకున్నారు. బౌద్ధ ధర్మాన్ని, అంబేడ్కరిజాన్ని తన తాత్విక నేపథ్యంగా స్వీకరించారు. భారతదేశంలో మార్క్సిజం అగ్రకుల నాయకత్వంలో ఉండటం పట్ల ఆయనకు అభ్యంతరాలున్నాయి. మార్క్సిస్టు ఉద్యమ ధోరణుల పట్ల విమర్శనాత్మక దృష్టి కలిగి ఉన్నారు. అలా అని ఆయన మార్క్సిజానికి వ్యతిరేకి కారు. చుండూరు సంఘటన జరిగి దశాబ్దాలు గడిచిన సందర్భంగా దాని పరిణామాలను స్మరించుకుంటూ ‘సైనిక గీతం’ రాశారు. మొదటి నుంచీ ఆయనది ఉద్యమ జీవితం. మొదట హేతువాద ఉద్యమం. ఆ తర్వాత దళిత ఉద్యమం. మధ్యలో మార్క్సిజం అధ్యయనం. సైద్ధాంతిక గ్రంథ రచన, సాహిత్య విమర్శ, కవిత్వ రచన – ఆయన రచనా జీవితానికి మూడు ముఖాలు. కారంచేడు, చుండూరు సంఘటనలతో ఆయన కుల నిర్మూలనా ఉద్యమానికి నాయకత్వం వహించారు. కుల వ్యవస్థ విశ్లేషణకు, దాని నిర్మూలనకు, కుల రహిత సమాజ నిర్మాణానికి అవసరమైన జ్ఞానాన్ని అందివ్వడానికి సామాజికాంశాల మీద విస్తృతంగా గ్రంథ రచన చేశారు. ఆయన ప్రచురించిన ముళ్ళ కిరీటం (2002), భూమి భాష (2004), కట్టెల మోపు (2007), ఆత్మగౌరవ స్వరం (2010), ఈ యుగం మాది (2014) కవిత్వ సంపుటాలు చదివితే గత దశాబ్దాన్ని ఆయన కవిగా తనది చేసుకున్నారా అనిపిస్తుంది. తన అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ తన కవిత్వ గురువులని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా కవిత్వ గురువులుగా పూర్వకవులను చెప్పుకుంటాం. పద్మారావు తన తల్లులనే చెప్పుకున్నారు. ఈ ముగ్గురు దళిత మహిళలు. శ్రామిక మహిళలు. వాళ్ళు జీవితాన్ని గడిపేసిన వాళ్ళుకారు. జీవితాన్ని జీవించిన వాళ్ళు, జీవిత సారాన్ని పాదం ముట్టినవాళ్ళు. జీవితం సజీవయానం అన్నది ప్రజా భావన. ఈ ‘యానం’లో సంఘర్షణ, శ్రమ, అనుభవం ఇమిడి ఉంటాయి. కవిని వాళ్ళమ్మ ఎలా పెంచిందో ‘ముళ్ళకీరిటం’ కవిత చదివితే అర్థమౌతుంది. నేల మీద బతికినప్పుడే జీవితయానమవుతుంది. అది పద్మారావుకి తెలుసు. అందుకే జీవితాన్ని సజీవయానం అన్నారు. సజీవయానమంటే శ్రమతో కూడిన బతుకు అని అర్థం. జీవితం ఒక పరివేదన అని చెబుతారు పద్మారావు. పరివేదన అంటే ఏడుపు కాదు. ఇది కలిగిన వాళ్ళ లక్షణం. పరివేదన అంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు పారిపోకుండా నిలవటం. ‘‘చీకటిని తొలగించటమే కాదు’’ అనే కవితను ‘చీకటిని జయించాలి’ అంటూ ముగించారు కవి (పైది; పు:44). దానికి అవసరమైన కొరముట్టు పరివేదన. జీవితం ఒక గీతం (భూమిభాష; పు:48). గ్రామీణ భారత జీవితాన్ని కాచి వడబోసిన జానపదులు మాత్రమే జీవితాన్ని ఇలా నిర్వహించగలరు. ‘జీవితం ఒక పరివేదన’ అన్న కవి ‘జీవితం ఒక గీతం’ అన్నారు. జీవితం ఒక సముద్రమని, దానిని ఈదడం సాధ్యం కాదని వేదాంతులు మనల్ని భయపెడితే, శ్రామికతత్వాన్ని జీర్ణించుకున్న కవి జీవితాన్ని గీతంగా నిర్వచించారు. ‘‘జీవితానికి సాహసమే ఊపిరి’’ (పైది; పు:379) అన్నా ‘‘జీవించటం ఒక యుద్ధ ప్రక్రియ’’ అన్నా (భూమి భాష; పు:152) కవి తన జాతిని తట్టి లేపడమే. పద్మారావు కవిత్వం ఒక చైతన్య గీతిక. ఒక పొలికేక. ఒక ఆత్మ గౌరవస్వరం. ఆత్మవిశ్వాసపతాక. ఆత్మస్థైర్య గొంతుక. పీడనకు వివక్షకు అణచి వేతకు గురౌతున్న సామాజిక వర్గాల ప్రజలకు పద్మారావుగారి కవిత్వంలోని జీవిత నిర్వచనాలు ధైర్యం చెబుతాయి. ఈ యుగ దళిత గళం ఆయన. కవితా నిర్మాణ శిల్పి, దళిత ఉద్యమ నిర్మాత. మార్క్స్‌ను, అంబేడ్కర్‌ను లోతుగా అధ్యయనం చేసి దళిత ఉద్యమానికి కుల నిర్మూలనా రధసారధి అయ్యాడు. తెలుగువారి చరిత్రలో, భారతదేశ చరిత్రలో అనేక మలుపులకు ఆయన కారకుడు. చరిత్ర నిర్మాత, సిద్ధాంతకర్త, తెలుగు జాతి వైతాళికుడిగా ముందుకు నడుస్తున్న డా‘‘కత్తి పద్మారావు 67వ జన్మదినం తెలుగుజాతి చరిత్రలో మలుపు తిప్పిన ఒక గుర్తింపదగిన రోజు. (నేడు డా‘‘ కత్తి పద్మారావు 67వ జన్మదినం నేపథ్యంలో లుంబినీవనం, పొన్నూరులో జరుగుతున్న సదస్సులో ఆయన రాసిన 70, 71వ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా) రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు మొబైల్ : 94402 22117 -
'అంబేద్కర్ విగ్రహాన్ని అందవికారంగా చేశారు'
గుంటూరు : అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అంద వికారంగా రూపకల్పన చేశారని తెలుగు కవి, దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు అన్నారు. దళితులపై వివక్ష చూపడానికి ఇదే నిదర్శనమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. 40 రోజుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని మార్చకపోతే ముఖ్యమంత్రి, స్పీకర్లపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కత్తి పద్మారావు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన పాదాల వద్ద నిలబడటం దళితుల విజయమని అన్నారు. కాగా అంబేద్కర్ విగ్రహంపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహం అంబేద్కర్‌కు పోలిక లేదన్నారు. విగ్రహాన్ని తక్షణమే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.