'అంబేద్కర్ విగ్రహాన్ని అందవికారంగా చేశారు'
గుంటూరు : అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అంద వికారంగా రూపకల్పన చేశారని తెలుగు కవి, దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు అన్నారు. దళితులపై వివక్ష చూపడానికి ఇదే నిదర్శనమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. 40 రోజుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని మార్చకపోతే ముఖ్యమంత్రి, స్పీకర్లపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కత్తి పద్మారావు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన పాదాల వద్ద నిలబడటం దళితుల విజయమని అన్నారు.
కాగా అంబేద్కర్ విగ్రహంపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహం అంబేద్కర్కు పోలిక లేదన్నారు. విగ్రహాన్ని తక్షణమే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.