జూన్ 27న ‘వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత’ అని డా. కత్తి పద్మారావుగారు రాసిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి అభ్యంతరం లేదు. కాని వాస్తవ చరిత్ర ఏదన్నదే అసలైన చిక్కు. నాలుగు దశాబ్దాల నాడు వచ్చిన ఒక తెలుగు సినిమాలో రావుగోపాలరావు పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ అనే దాన్ని ఆయన తన వ్యాసం ద్వారా మరోమారు చెప్పారు. డీ.డీ. కోశాంబి, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్రలు చెప్పిందే చరిత్రగా అంగీకరించి తీరాలా! అంతకన్నా భిన్నమైన చరిత్ర ఉందని కొత్త పరిశోధన ద్వారా బయటకు తీసుకురాకూడదా?
ఒక సబ్జెక్టులో ఒకరి కన్నా ఎక్కువ మంది రాసిన పుస్తకాలు ఉంటాయి. వాటిలో దేనినైనా చదువుకోవచ్చు. కాని చరిత్రలో మాత్రం నియంతృత్వ పోకడగా రొమిల్లా, బిపిన్ చంద్రల పుస్తకాలు దాటి చదవటానికి వీలు లేదనడం సబబేనా? ఈ రచయితలు భారతీయ చరిత్రకు ఒక రంగు పులిమారు. ఆ రంగును పలుచన చెయ్యటాన్ని అంగీకరించం అంటారు వారి శిష్యులు. వివాదాస్పద కట్టడం కూల్చివేత చిన్న విషయం కాదన్నారాయన. ఆ కూల్చివేత వెనుక హిందూ రాజ్య నిర్మాణ భావన ఉందని తీర్మానించారు. అయితే జమ్మూ–కశ్మీర్, కాశీ, మధురల్లో దేవాలయాలు ధ్వంసమవ్వడం చారిత్రక వాస్తవమే కదా! ఆ ధ్వంసం వెనుకనున్న భావన ఏమిటో కూడా పిల్లలకు తెలియాలి కదా!
ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి చరిత్ర పుస్తకాలలో మత ఘర్షణల గురించి చెప్పిన అధ్యాయంలో ఏమి రాశారో ఆయన చదివారా? అందులో గుజరాత్‌లో జరిగినవి, అయోధ్య నేపథ్యంలో జరిగినవి మాత్రమే ఉన్నాయి. నవీన భారత చరిత్రలో ఆ రెండు సందర్భాలలో తప్పించి మరెన్నడూ మత కల్లోలాలు జరగలేదన్నది యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ వంటి రచయితలు భావిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం ఏదీ ఉండదు.
కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల ఊచకోత గురించి కూడా వీరు ప్రస్తావించి ఉంటే అది వాస్తవ చరిత్ర అయి ఉండేది. కొన్నింటిని కప్పిపుచ్చి, మరికొన్నింటిని కొందరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివరంగా రాస్తామంటే అది వాస్తవ చరిత్ర కానేకాదు. రైతు ఉద్యమాల గురించి రాసినప్పుడు, 2018లో నాసిక్ నుండి ముంబైకి, ఆ తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి జరిగిన రైతాంగ ఊరేగింపుల గురించే రాస్తామంటే ఎలా!
ఆంధ్రాలో జరిగిన ఎన్జీ రంగా ఆధ్వర్యంలో పలాస నుండి చెన్నపట్నంకి జరిగిన రైతు యాత్ర గురించి రాయం అంటే ఎలా! ‘దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరగనున్నాయి’ అనడాన్ని అంతా స్వాగతించాల్సినదే. అయితే భారతీయులందరికీ వర్తించే లౌకిక చట్టాలు లేకుండా లౌకికవాదం ఎలా పెరుగుతుంది? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అమలు చెయ్యకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఎలా వస్తుంది?
ఏ వర్గానికి చెందినవైనా చరిత్రలోని మంచి చెడులు చెబితేనే అది వాస్తవ చరిత్ర. ముఖ్యమైనవి, విద్యార్థులకు అంతగా అవసరం లేని అంశాలు పుస్తకాల నుండి తొలగించటం అన్ని సబ్జెక్టులలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లోనూ జరిగింది. విద్యార్థులకు మేలు చేసిన అంశం మీద అనవసరపు రాద్ధాంతం ఎందుకు? – డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, 9440421695
Comments
Please login to add a commentAdd a comment