వాక్‌ స్వాతంత్య్రంపై విచారణా? | Sakshi Guest Column On An inquiry into freedom of speech | Sakshi
Sakshi News home page

వాక్‌ స్వాతంత్య్రంపై విచారణా?

Published Mon, Jun 24 2024 12:23 AM | Last Updated on Mon, Jun 24 2024 12:23 AM

అరుంధతీ రాయ్‌

అరుంధతీ రాయ్‌

కామెంట్‌

కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్‌. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్‌ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?

మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!

1922 మార్చి 18న ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి.   

ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్‌ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. 

భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా  విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్‌. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్‌ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. 

ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్‌ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్‌ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం.  

ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్‌లోని స్కాటిష్‌ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్‌లోని కెటలాన్‌లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?

అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్‌ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?

అరుంధతీ రాయ్‌ని మన అలెగ్జాండర్‌ సోల్జెనిట్సిన్‌ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్‌ యూనియన్‌ ఆయన పట్ల ప్రవర్తించిన  రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్‌ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ విజేత అరుంధతీ రాయ్‌. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. 

నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్‌ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్‌ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను.  

బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్‌పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!


కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement