శత్రు దేశాల గూఢచారి మిత్రులు | Sakshi Guest Column On India Pakistan Intelligence Agencies | Sakshi
Sakshi News home page

శత్రు దేశాల గూఢచారి మిత్రులు

Published Mon, Jun 3 2024 5:27 AM | Last Updated on Mon, Jun 3 2024 5:29 AM

Sakshi Guest Column On India Pakistan Intelligence Agencies

కామెంట్‌

ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్‌. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్‌ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్‌: ద సైకాలజీ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితుల అన్వేషణ అది. అంతేకాదు, భారత్‌–పాక్‌ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానం కూడా పుస్తకంలో కనిపిస్తుంది.

బహుశా జాన్‌ లి కరే(గూఢచర్య కథాంశాల బ్రిటన్‌ రచయిత) కూడా దీనినొక ఏమాత్రం నమ్మదగని అసంభవంగా భావించి ఉండేవారు. సి.ఐ.ఎ.(అమెరికా నిఘా సంస్థ), కె.జి.బి.(రష్యా నిఘా సంస్థ)ల అధినేతలు కలిసి పని చేసేందుకు ఒక అంగీకారానికి రావటమే ఇది. కానీ నమ్మేందుకు కష్టంగా ఉన్నా, దక్షిణాసియాలో ఇటువంటిదే ఒకటి ఇంకా ఎవరూ గుర్తించకుండా, ఎవరి గమనింపునకూ రాకుండా సంభవించింది. భారత్‌–పాకిస్తాన్‌ల గూఢచారి సంస్థలైన ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిస్‌ వింగ్‌), ఐ.ఎస్‌.ఐ. (ఇంటర్‌–సర్వీసెస్‌ ఇంటిలిజెన్స్‌)ల మాజీ అధిపతులు స్నేహితులుగా మారి తాము ఉమ్మడిగా కలిసి రాసిన పుస్తకాలకు పరస్పరం సహకరించుకున్నారు. అమర్‌జీత్‌ సింగ్‌ దులత్, జనరల్‌ అసద్‌ దుర్రానీ తమ తాజా పుస్తకం ‘కోవర్ట్‌: ద సైకాలజీ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ను ఈ నెలలో ఆవిష్కరించారు (నీల్‌ క్రిషణ్‌ అగర్వాల్‌ మరో సహ రచయిత). వారి మొదటి పుస్తకానికి ‘ద స్పై క్రానికల్స్‌’ అని సముచితమైన పేరే పెట్టారు.  

ఈ అనుబంధం ఎలా మొదలైంది? చూస్తుంటే బ్యాంకాక్‌లోని ఛావ్‌ ప్రాయా నదిపై ఒక చిన్న నౌకలో మొదలైనట్లుంది. ఉగ్రవాదంపై ఒక అనధికార చర్చా కార్యక్రమానికి వాళ్లిద్దరూ ఆ నౌకలోని ఆహ్వానితులు. దులత్‌ని మాట్లాడమని ఆహ్వానించారు. ఇలాంటి చర్చా కార్యక్రమాలకు ఆయన కొత్త కనుక సంకోచంగా, అనాసక్తిగా ఉండిపోయారు. దుర్రానీ ఆ సంగతి గమనించి దులత్‌కు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం గురించి దులత్‌... తమ మధ్య ‘కెమిస్ట్రీ’ కుదిరిందని అంటారు. ఆ తర్వాత అనతికాలంలోనే వారిద్దరూ స్నేహితులైపోయారు. 

‘కోవర్ట్‌’ పుస్తకం ఆ ఇద్దరి మధ్య సారూప్యాలను, వైరుధ్యాలను వెల్లడిస్తుంది. చిన్నతనంలో దుర్రానీ ‘‘ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు’’. పెద్దయ్యాక కూడా ‘‘సమూహంలో భాగం కావాలని కోరుకోలేదు’’. చిన్నవాడిగా ఉన్నప్పుడు దులత్‌కు కొద్ది మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ‘‘ఎక్కువగా పనివాళ్ల పిల్లలు’’. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘‘తనకై తను ఉండగలగటం, తనను తను కాపాడుకోవటం నేర్చుకున్నారు’’. 

ఇక భవిష్యత్తు ఐఎస్‌ఐ చీఫ్‌... స్కూల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేవాడు. ‘‘నేను ఎల్లప్పుడూ దాదాపు ప్రతి సబ్జెక్టులో మొదటి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరిగా ఉండేవాడిని’’ అంటారాయన. దులత్‌ అందుకు విరుద్ధం. ఆయన ‘‘చాలా సగటు విద్యార్థి’’. కానీ ఈ భవిష్యత్తు ‘రా’ అధిపతి క్రీడల్లో తన తఢాకా చూపించారు. స్కూల్లో ఆయన ‘‘ప్రతి ఆటా ఆడాడు’’. 

ఒంటరి దుర్రానీకి ‘‘సైక్లింగ్‌ అంటే చాలా ఇష్టం’’. కానీ ‘‘లాహోర్‌ వంటి నగరంలో సైకిల్‌ తొక్కేందుకు దూరపు స్థలం ఉండేది కాదు’’.   
 
వ్యక్తిగతంగా దుర్రానీ ఎలా ఉండేవారో, అలాంటి వ్యక్తిగానే ఆయన ఎదగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘‘నేను భిన్నం, నేను నాలా ఉండే స్వభావం నాది’’, ‘‘నా గుణం ఎప్పుడూ కూడా కాస్త తిరుగుబాటు ధోరణితో ఉంటుంది’’ అంటారు దుర్రానీ. దులత్‌ ప్రధానంగా తల్లిదండ్రుల మాట వినటానికీ, విద్యాబుద్ధులు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం నడచుకోటానికీ సిద్ధంగా ఉంటారు. ‘‘తగిన పనులు, తగని పనులు అని ఉంటాయి’’ అనే నమ్మకంతో ఆయన పెరిగాడు. ఇది ఆయనకు స్పష్టమైన నైతిక దిశా నిర్దేశం చేసిందని నేను అనుకుంటాను.  

దుర్రానీ సైన్యంలో చేరారు. ‘‘ఆ కారణంగా నేనెప్పుడైనా పశ్చాత్తాపం చెందానని నేను అనుకోను’’ అంటారు. దులత్‌ పోలీస్‌ అయ్యారు. ఎందుకంటే, ‘‘అంతకన్నా మెరుగైన సర్వీసులలోకి వెళ్లలేకపోయాను’’ అని ఆయన అంగీకరిస్తారు. అయితే యాదృచ్ఛికమో లేదా అనుకోని అదృష్టమో ఇద్దరూ కూడా ఇంటిలిజెన్స్‌ సంస్థల వైపు మళ్లారు. 


‘‘అనుకోకుండా నేను అక్కడికి చేరాను’’, ‘‘ఆ విషయాన్ని ఒప్పుకుంటాను’’ అంటారు దుర్రానీ నవ్వుతూ. ‘‘ఇంటిలిజెన్స్‌ అంటే ఏంటో తెలియకుండానే’’ దులత్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరోలో చేరారు. అయినప్పటికీ ఇద్దరూ అత్యున్నత స్థాయికి చేరుకుని, తమ తమ దేశ ప్రజల చేత ఐఎస్‌ఐ, ‘రా’ సంస్థల  అత్యుత్తమ మాజీ అధిపతులుగా గుర్తింపు పొందారు. కనుక వారు విధిని నమ్ముతారని నేను అనుకోవచ్చా? జేమ్స్‌ బాండే ఇలాంటి మూఢ నమ్మకాలను ఎప్పుడూ ఎకాఎకిన కొట్టిపడేయలేదు. వీళ్లు మాత్రం అలా ఎందుకు చేస్తారు?

‘‘కుండబద్దలు కొట్టటం’’ అని దులత్‌ ఎప్పుడూ అంటుండే దుర్రానీలోని ‘‘నిర్మొహమాటాన్ని’’ దులత్‌ ఇష్టపడతారు. దుర్రానీ ఉన్నదున్నట్లు బహిరంగంగా మాట్లాడతారు. పాకిస్తాన్‌ ఆర్మీని విమర్శించటానికి కూడా సంకోచించరు. అలాగే ఆయన భారతీయ సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది మరింత కష్టమైన పని. ఆయన అనిన ఒక మాటను మీకు వదిలేసి, నా ముగింపు సరైనదేనా పరిశీలించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ‘‘భారతదేశంలో ప్రజలు ప్రతిభ ద్వారా పైకి ఎదిగి ఐ.బి. (ఇంటిలిజెన్స్‌ బ్యూరో) ని, ‘రా’ను చేజిక్కించుకుంటారు. కానీ మా దగ్గర దేశాధ్యక్షుడు, లేదా సైన్యాధ్యక్షుడికి నచ్చిన వ్యక్తి అటువంటి పదవులను చేపట్టవచ్చు. కనుక ఒక మంచి ఐఎస్‌ఐ చీఫ్‌ ఎవరు అవగలరు అనే దానికి ఎల్లవేళలా మేము అనుసరించే ఒక ప్రమాణం ఉండదు.’’ 

రహస్యాలను అలా ఉంచండి – ‘కోవర్ట్‌’ పుస్తకంలో వీరు ‘రా’, ‘ఐఎస్‌ఐ’ అంతర్గత కార్యకలాపాల పనితీరును బహిర్గతం చేయలేదు. ‘ద స్పై క్రానికల్స్‌’ లోనూ వాటి గురించి లేదు. బదులుగా ఈ తాజా పుస్తకం, ‘‘గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితులను అన్వేషిస్తుంది’’. రెండు సూత్రాల మీద ఇది దృష్టి సారించింది. వారు ఎలాంటి మనుషులు? వారు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అనేవి ఆ రెండూ. అంతేకాదు, భారత్‌–పాక్‌ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానాన్ని కూడా వివరించింది. వారి అభిప్రాయాలు కూడా తరచూ ఒకేలా ఉన్న విషయం కూడా. చూస్తుంటే, గూఢచారులు చాలా అరుదుగా విభేదిస్తారని అనిపిస్తోంది. 


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement