
మాధవ్ శింగరాజు
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు!
‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతు న్నారట కదా? పొత్తు కుదుర్చుకోవటం కోసమే మీరు అమిత్‌షాను కలిసేందుకు వచ్చారా?’’ – ఆరంభ ప్రశ్న.
‘‘లేదు లేదు, ఢిల్లీలో మా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పని మీద వచ్చాం...’’ అన్నాను.
‘‘సర్! మీ ఢిల్లీ ఆఫీస్‌ని మీరు ఫిబ్రవరి 10 నే వర్చువల్‌గా చెన్నై నుంచి ప్రారంభించారు కదా, మళ్లీ ఇప్పుడేమిటి! అమిత్‌షాతో
గంటన్నరకు పైగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం బీజేపీకి బ్రేకప్ చెప్పాక, తిరిగి ఇన్నాళ్లకు ఇప్పుడే కదా మీరు అమిత్‌షాను కలవటం!
ఇంతసేపూ ఆయనతో ఏం మాట్లాడారు సర్ మీరు?’’ – ఆరాలు తీస్తున్న ప్రశ్న.
‘‘అలా ఏం లేదు. అమిత్‌జీని అనుకోకుండా కలిశాం...’’ అన్నాను.
‘‘కానీ సర్, చెన్నై నుంచి ఉదయాన్నే మీరు ఢిల్లీ వచ్చారు. మధ్యాహ్నానికి మీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేపీ మునుస్వామి, సీనియర్ లీడర్ వేలుమణి మీ వెనుకే ఢిల్లీకి రీచ్ అయ్యారు. సాయంత్రానికి ఢిల్లీలోనే ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ లీడర్లు తంబిదొరై,సీవీ షణ్ముగం మీతో జాయిన్ అయ్యారు.
అంతా కలిసి చీకటి పడ్డాక అమిత్‌షా నివాసానికి వెళ్లారు. అమిత్‌షాను కలవాలని అందరూ అనుకునే కలిశాక, అదెలా సర్ అమిత్‌షాను అనుకోకుండా కలవటం అవుతుంది?’’ – ఆధారాలు సేకరించిన ప్రశ్న!
‘‘మీరనుకుంటున్నట్లు మేమేమీ చీకటి పడ్డాక అమిత్‌జీని కలవలేదు. అమిత్‌జీని కలిసేటప్పటికే చీకటి పడినట్లుంది. వెళ్లి కలిశాం, శాలువా కప్పాం, కాసేపు మాట్లాడాం. వచ్చేశాం...’’ అని నవ్వుతూ చెప్పాను.
‘‘మరి, బీజేపీ వాళ్లు ఇంకోలా చెబుతు న్నారు కదా సర్?’’ – చీకట్లో విసిరిన ప్రశ్న!
‘‘మేము లోపలికి వెళ్లినప్పుడు లోపల ఉన్నది మీరంటున్న బీజేపీ వాళ్లలో అమిత్‌జీ ఒక్కరే. ఆయనే మీకు చెప్పారంటారా,
ఇంకోలా?’’ అని అడిగాను.
‘‘లేదు సర్, ‘కలిసి పోటీ చేద్దాం’ అని మీరు అమిత్‌షాను అడిగినప్పుడు, అందుకాయన ‘మీరు 117 సీట్లలో, మేము 117 సీట్లలో సగం సగం పోటీ చేయటానికి ఒప్పుకుంటేనే మీతో కలుస్తాం...’ అని మీకు కండిషన్ పెట్టారట కదా?! – ఊహించి వేసిన ప్రశ్న.
‘‘ఇంకా?!’’ అన్నాను.
‘‘పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్‌ని, శశికళను, పన్నీర్‌సెల్వంను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కూడా అమిత్‌షా మీకు కండి షన్ పెట్టారట కదా సర్...’’ – ఇదైతే కచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై వేయించిన ప్రశ్న!
పొత్తు కోసం నేను అమిత్‌జీ దగ్గరకు వెళ్లకుండా, అమిత్‌జీనే పొత్తు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే, ముందు ఆ అన్నామలైని మార్చి, వేరెవరినైనా బీజేపీ ఛీప్‌గా పెట్టమని నేనే కండిషన్ పెట్టి ఉండేవాడిని.
‘‘చెప్పండి సర్! బీజేపీతో పొత్తు కోసం కాదా మీరు అమిత్‌షాను కలిసింది?’’ – తిరిగి మళ్లీ అదే ఆరంభ ప్రశ్న.
‘‘తమిళనాడులో డ్యామ్‌ల సమస్య ఉంది. స్కామ్‌ల సమస్య ఉంది. లాంగ్వేజీల సమస్య ఉంది. డీ–లిమిటేషన్ సమస్య ఉంది. డీఎంకే సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము వాటి గురించి మాట్లాడి ఉండొచ్చని మీరెందుకు అనుకోరు?’’ అని అడిగాను.
‘‘బీజేపీతో పొత్తు కోసం మీరిక్కడికి వస్తే, అక్కడ చెన్నైలో అన్నామలై మీరంటే పడని వాళ్లందరితో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికేమంటారు సర్?’’ – ఇంకేదో రాబట్టే ప్రశ్న.
నేనేమీ అనలేదు.
డ్యామ్‌లు, స్కామ్‌లు, లాంగ్వేజీలు, డీ–లిమిటేషన్, డీఎంకే... వీటన్నిటికన్నా తమిళనాడుకు అతి పెద్ద సమస్య అన్నామలై... అని నాతో చెప్పించటానికే ఈ మిణుగురులు ఇక్కడికి చేరినట్లు నాకర్థమైంది!