
మాధవ్ శింగరాజు
ఇందిరా భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కూర్చొని ఉన్నాం అందరం. అంతా ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు, స్టేట్ ఇంఛార్జిలు, కొత్త సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీలోని ఇతర మహామహులు. ‘చెప్పండి’ అన్నట్లు వారి వైపు చూశాను. ఎప్పటిలా, ‘మీరే చెప్పండి ఖర్గేజీ’ అన్నట్లేమీ వారునా వైపు చూడలేదు. ఎవరి వైపు వాళ్లు చూసుకుంటూ ఉన్నారు! బహుశా అది ఆత్మ పరిశీలనావస్థ కావచ్చు.
పార్టీ లీడర్ రాహుల్, జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ నా పక్కనే ఇటొకరు, అటొకరు కూర్చొని ఉన్నారు. ‘‘ఎవరైనా హ్యాట్రిక్ కొట్టి హీరోలు అవుతారు. మనం ‘జీరో’లు కొట్టి హ్యాట్రిక్ సాధించాం!’’ అన్నాను అందర్నీ యాక్టివేషన్ మోడ్‌లోకి తీసుకొస్తూ. వెంటనే రాహుల్ స్పందించారు. ‘‘ఖర్గేజీ, ఐపీఎల్‌లో ఆర్సీబీ ఎంత గొప్పగా ఆడుతుందో మీకూ తెలుసు. కానీ ఒక్కసారైనా ఆ జట్టు గెలిచిందా?’’ అన్నారు మెల్లగా నా చెవిలో.
ఆర్సీబీ జట్టుది కర్ణాటకే, కాంగ్రెస్ అధ్యక్షుడిదీ కర్ణాటకే అనే భావన నాలో కలిగించటం ద్వారా ఆయన నాకు ఊరటనివ్వ దలిచారా!
‘‘గొప్పగా ఆడటం గెలుపౌతుందా రాహుల్ బాబు. గెలిస్తేనే కదా గొప్పగా ఆడినట్లౌతుంది’’ అన్నాను రాహుల్ చెవిలో.
ఇలా చెవుల్లో మాట్లాడుకునే సంప్రదాయం కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ, పటేల్‌ల కాలం నుంచే ఉన్నా, నలుగురి ముందు చెవుల్లో చెవులు పెట్టటం నాకు ఇష్టం ఉండదు. రాహుల్ నా చెవిలో మాట్లాడారు కాబట్టి ఆయన్ని రెస్పెక్ట్ చెయ్యటం కోసం నేనూ ఆయన చెవిలో మాట్లాడానంతే.
‘‘అంకుల్...’’ అని చెయ్యి లేపారు ప్రియాంక. ‘‘చెప్పమ్మా ప్రియాంకా...’’ అన్నాను.
‘‘అంకుల్... మనమూ కొట్టాం కదా హ్యాట్రిక్. షీలా దీక్షిత్ ఆంటీ వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఉండలేదా?’’ అన్నారు.
‘కానీ సీఎంగా హ్యాట్రిక్ కొట్టటం వేరు, వరుసగా ఒక్క సీటైనా గెలవకుండా హ్యాట్రిక్ కొట్టటం వేరు కదా తల్లీ’ అని నేను ప్రియాంకతో అనలేదు. ఈలోపు – జైరాం రమేశ్ యాక్టివేట్ అయ్యారు!
‘‘హ్యాట్రిక్‌గా మనం ఎందుకు ఓడిపోతూ వచ్చామో ఎంతగా అంతర్మథనం చేసుకున్నా అర్థం కావటం లేదు ఖర్గేజీ. ఢిల్లీకి షీలా దీక్షిత్ ఎన్నెన్ని చేశారు! అసలు ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అంతు చిక్కటం లేదు’’ అన్నారు జైరాం రమేశ్, సహనం కోల్పోయిన సాధువులా!
‘‘అంతా బాగున్నా ఎందుకీ ప్రజలు మార్పు కోరుకుంటారో!’’ అన్నారు వేణుగోపాల్, తనూ ఆశ్చర్యపోతూ.
‘‘అంతా బాగుండబట్టే మార్పును కోరుకుంటారు వేణూజీ. అన్ని పార్టీలూ అన్నీ ఇస్తున్నప్పుడు అన్నీ ఇచ్చే అవకాశాన్ని ఎప్పుడూ ఒకే పార్టీకి ఎందుకివ్వాలి అని ప్రజలు అనుకుంటారు. ఢిల్లీ ప్రజలు 26 ఏళ్ల తర్వాత మళ్లీ బీజెపీని ఎన్ను కున్నారు. ఏమో, వచ్చే ఎన్నికల్లో బీజేపీని మార్చి మనల్ని గెలిపించినా గెలిపించవచ్చు’’ అని వెనుక సీట్లోలోంచి ఎవరో అన్నారు!
‘‘ఎవరతను గోపాల్‌జీ... ఆశలు చిగురించేలా మాట్లాడాడు’’ అని అడిగాను... సాయంత్రం కాన్ఫరెన్స్ ముగిశాక వేణుగోపాల్‌తో పాటుగా ఇందిరా భవన్ నుంచి బయటికి నడుస్తూ.
‘‘కుర్రాడు కమిటీలోకి కొత్తగా వచ్చాడు ఖర్గేజీ. గ్రాస్‌రూట్స్ నుంచి తెచ్చాం’’ అన్నారు వేణుగోపాల్.
ఒక్క క్షణం అలా నిలబడి పోయాను.
‘‘ఏంటి ఖర్గేజీ?’’ అని అడిగారు వేణుగోపాల్.
‘‘ఏం లేదు గోపాల్‌జీ. మన లీడర్స్ అందరినీ వెంటనే ఏ ఫ్లయిట్ దొరికితే ఆ ఫ్లైట్‌లో గ్రాస్‌రూట్స్‌కి పంపించండి’’ అని చెప్పి, వచ్చేశాను.
Comments
Please login to add a commentAdd a comment