
మాధవ్ శింగరాజు
పుస్తకాలు చదివితే జ్ఞానం లభిస్తుందా? ఆ జ్ఞానం... ఎవరినైనా, ఏ విధంగానైనా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుందా? లేదంటే, అర్థం చేసుకోవటాన్ని ఆ జ్ఞానం మరింతగా సంక్లిష్ట పరుస్తుందా? ఢిల్లీ నుండి రాహుల్ ఫోన్! ‘‘మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది థరూర్‌జీ...’’ అంటారాయన! అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని గుర్తించ టానికి ఏదైనా పుస్తకం చదవటం వల్ల సంప్రాప్తించిన జ్ఞానం ఆయనకు దోహదపడి ఉంటుందా?
‘‘కొత్తగా ఏం చదువుతున్నారు రాహుల్‌జీ...’’ అని అడిగాను. ‘‘కొత్తగా ఏమీ చదవటం లేదు థరూర్‌జీ. కొత్తగా మీ ట్విట్టర్ అకౌంట్ మాత్రం చూస్తున్నాను. ఎవరిదో కోట్ పెట్టినట్లున్నారు... ‘అజ్ఞానం ఆనందదాయకం అయిన చోట, జ్ఞానవంతులుగా ఉండటం మూర్ఖత్వమని’!ఆ కోట్ చూశాకే మీకు ఫోన్ చేశాను... మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని...’’ అన్నారు రాహుల్!
‘‘రాహుల్‌జీ! మీరు గానీ ఆ కోట్‌లో... అర్థాలనేమైనా వెతుకుతున్నారా?’’ అన్నాను.‘‘అర్థాలను కాదు థరూర్‌జీ. మిమ్మల్ని వెతుకుతున్నాను. మీ ట్వీట్ చదివాక, మీ పాడ్‌కాస్ట్ విన్నాక, పీయూష్ గోయల్‌తో మీ సెల్ఫీ చూశాక నాకనిపిస్తోంది, కాంగ్రెస్‌లో ఉన్న కారణంగా మీరు మీ జ్ఞానాన్ని చాలా మిస్ అవుతున్నారని...’’ అన్నారు రాహుల్! రాహుల్ ఇంత జ్ఞానగర్భితంగా మాట్లాడటం మునుపెన్నడూ నేను వినలేదు.
‘‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వద్దనుకుంటే మీరేం చేస్తారు?’’ అని పాడ్‌కాస్టర్ నన్ను అడిగినప్పుడు – ‘‘నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అని నేను చెప్పాను. వేరే ఆప్షన్స్ అంటే నా ఉద్దేశం పుస్తకాలు, ప్రసంగాలు. ఇక పీయూష్ గోయెల్‌తో నేను సెల్ఫీ దిగటమైతే ఎవరి దృష్టిలోనో పడటానికి చేసింది కాదు. గోయెల్ కామర్స్ మినిస్టర్. బ్రిటన్ కామర్స్ మినిస్టర్ ఆయన పక్కన ఉన్నారు. నాకూ కామర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముగ్గురం కలిసి సెల్ఫీ తీసుకున్నాం.
‘‘నా ట్వీట్‌లో, పాడ్‌కాస్ట్‌లో, సెల్ఫీలో మీరు నన్ను వెతుకుతున్నట్లే, ‘కాంగ్రెస్ పార్టీలో నేనెక్కడ?!’ అని నేనూ నన్ను వెతుక్కుంటు న్నాను రాహుల్‌జీ...’’ అన్నాను.
‘‘థరూర్‌జీ! దేశానికెంతో చేస్తున్నారని మీరు మోదీజీని కీర్తిస్తున్నారు. కేరళకెంతో చేస్తున్నారని కమ్యూనిస్టులను ఆకాశానికెత్తేస్తు న్నారు. అలాంటప్పుడు మేము మిమ్మల్నిగానీ, మిమ్మల్ని మీరు గానీ కాంగ్రెస్‌లో ఎంత వెతికితే మాత్రం ఎలా మీరు కనిపిస్తారు?! ...
..అంతేకాదు థరూర్‌జీ! మీరు స్టెప్ బై స్టెప్ కింది నుంచి పైకి రాలేదు. ఒకేసారి పైనుండి ప్యారాచూట్‌లో కాంగ్రెస్‌లోకి వచ్చి పడ్డారు. ప్యారాచూట్ కిందికి దిగటానికే కానీ, పైకి ఎగరటానికి కాదు...’’ అన్నారు రాహుల్!!
‘ఒక జ్ఞానవంతుడి ఆత్మకథ’ అనే పుస్తకమేదో చదువుతున్నట్లుగా ఉంది నాకు, రాహుల్ అలా మాట్లాడుతుంటే వినటం!
‘‘పార్టీలో నేనేమిటి?’ అని లోక్‌సభలో మీరు నాకు ఎదురుపడి అడిగినప్పుడే మీ మనసులో ఉన్నదేమిటో నాకు అర్థమైంది థరూర్‌జీ. కేరళకు సీఎం అయితేనే మీరేదైనా అయినట్లు కాదు. జ్ఞానం అన్నది ట్వీట్‌లకు, పాడ్‌కాస్ట్‌లకు, సెల్ఫీలకు మాత్రమే పనికొచ్చే ఒక మిత్. ఇదుగోండి, ఖర్గేజీ మీతో మాట్లాడతారట...’’ అని, ఆగారు రాహుల్!
‘‘హ్యాపీ బర్త్‌డే థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గేజీ లైన్లోకి రావటంతోనే!‘‘ఈ ఆదివారం కాదు ఖర్గేజీ... నా బర్త్‌డే. వచ్చే ఆదివారం...’’ అన్నాను నవ్వుతూ. ‘‘మీరు పార్టీలో ఉన్నప్పుడే బర్త్‌డే విషెస్ చెబితే మీకు సౌకర్యంగా ఉంటుంది కదా అని ముందే చెప్పేస్తున్నా థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గే!! నేను మళ్లీ మళ్లీ చదువుతుండే మహాభారతాన్ని మళ్లొకసారి బయటికి తీశాను. భారతం జ్ఞానాన్ని ఇవ్వదు! జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment