
శశి థరూర్‌కీ, కాంగ్రెస్ నాయకత్వానికీ మధ్య తలెత్తినట్లుగా కనిపిస్తున్న విభేదాలను ఆసక్తికరంగా మారుస్తున్నది ఏమిటంటే,ఇరు వర్గాల గురించి ఆ విభేదాలు బయటికి ఏం వెల్లడిస్తున్నాయన్నదే. విభేదాలున్నా యన్న సంగతిని వారు ఒప్పుకొని, అంగీకరించకున్నా... ఒకటైతే వాస్తవం. వారు ఒకరి కొకరు పూర్తిగా భిన్నమైనవారు. బహుశా సమస్యకు మూలం, ప్రధానంగా అదే అయి వుండాలి.
శశి థరూర్ ఫక్తు రాజకీయ నాయకుడు కారు. ముఠాలను, రహస్య మంతనాలను ఆయన నడపరు. బదులుగా, ఆయన తన సొంత ప్రతిభ, నైపుణ్యాల మీద ఆధారపడినవారు. దీనర్థం – ఆయనకు దాపరికాలేం ఉండవని. రాజకీయంగా పైకి రావాలన్న ఆకాంక్ష, గుర్తింపు కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని. అంతేకాదు, తన వైపునకు దృష్టిని మళ్లించుకోవాలని కూడా ఆయన కోరుకుంటారని అర్థమౌతోంది. ముందుకు సాగేందుకు ఆయన విధానం అది. అందులో విజయం సాధించారు కూడా. ట్విట్టర్‌లో ఆయన్ని అనుస రించే అసంఖ్యాక అభిమానులు, ఆయనకు గల ‘గుర్తింపు యోగ్యత’ ... ఇందుకు సాక్ష్యం.
కాంగ్రెస్ నాయకత్వం, కనీసం ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారా వర్ధిల్లుతూనే వచ్చింది. వారంతా గాంధీల అనుచరులు. వారి నాయకులు గాంధీలు. వారు తమ రాజకీయ జీవితాన్నంతా గాంధీల సేవకే అంకితం చేసినవారు. రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్పకూడదనీ నేర్చుకున్నవారు.
ఇక ఇప్పుడైతే ప్రియాంకా గాంధీకి పల్లకి మోయటానికి తయారవు తున్నవారు. అంతేనా, ఈ తరహా కుటుంబ ఆరాధనను నియమ బద్ధం చేయటానికి... గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని తమను తాము నమ్మించుకుంటున్నవారు ఈ అనుచరులు.
చిన్నపాటి పోలికలు శశి, రాహుల్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తాయి. శశి తన ప్రతిభ, తెలివితేటలతో కష్టపడి పైకొచ్చినవారు. రాహుల్ బలం ఆయన ఇంటిపేరు. రాహుల్ స్వయంగా సాధించిన రాజకీయ విజయాలు పరిమితమైనవి. లేదా, ఏమంతగా గుర్తింపులో లేనివి. తగని సమయాలలో విహార యాత్రలకు వెళ్లిపోవటం ఆయన అభిరుచి. శశి బలం... దీర్ఘమైన ఆయన ఆంగ్ల పదాడంబరత, ఆహ్లాద కరమైన ఆయన నడవడిక. రాహుల్ స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తారు.
రాహుల్‌కు తనేం చెప్పాలనుకుంటున్నారో దానిని వ్యక్తపరిచే విషయంలో సమస్యలు ఉన్నాయని చాలామంది నమ్ము తారు. శశి రచయిత. ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు. ఆకాంక్షలు గల యువతను ఆయన ఆకర్షిస్తారు. రాహుల్ ఎప్పుడూ కూడా పేదలను, ఆర్థికంగా లేదా సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. మొత్తానికి, వీళ్లిద్దరూ భిన్న ప్రపంచాలలో ప్రకాశిస్తున్నవారు.
మాజీ దౌత్యవేత్తగా శశి తీరు వివేకవంతంగా, వినయపూర్వకంగా, తన ప్రత్యర్థులు సాధించిన విజయాలను సైతం అంగీకరించే విధంగా ఉంటుంది. అందుకే మోదీ అమెరికా పర్యటనను, లేదా కేరళలో సీపీఎం స్టార్టప్‌లను అభివృద్ధి పరచటాన్ని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్ శైలి ఇందుకు విరుద్ధంగా కఠినంగా, గాయపరిచేలా ఉంటుంది. మాటల బాక్సర్ అతడు. కమిలిపోయేలా గట్టి దెబ్బ కొడతారు.
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని, సర్వదా ఆమోదంపొందిన ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం. అది వెలుగులను విరజిమ్మేదేమీ కాదు. ఆయన కొంతకాలం విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2014 తర్వాత రెండు పార్లమెంటరీ సెలక్ట్ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నారు. అంతకుమించి, కాంగ్రెస్‌లో అగ్రశ్రేణి నాయ కుడిగా ఎప్పుడూ లేరు. ఆయన తన గతం వల్ల లేదా తన సహాయక రాజకీయేతర క్రీయాశీలతల వల్ల మాత్రమే ప్రసిద్ధులు. ఆయన్ని తన భవిష్యత్ నేతగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేకపోతోంది.
ఇవన్నీ కూడా నాలో మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి శశి థరూర్‌కు, ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను. మొదటిది, గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ, రాహుల్‌కు ప్రత్యర్థులు కావచ్చునని పరిగణన పొందుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలియటం లేదన్న విషయాన్ని ఈ విభేదాలు సూచిస్తున్నాయా?
బయటి ప్రపంచానికి రాహుల్, శశి ఎలా కనిపిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి. రాహుల్‌ను వారసత్వపు అర్హత గల రాజపుత్రుడిగా చూస్తారు. శశిని ప్రతిభకు, పనితీరుకు ప్రతీకగా చూస్తారు. కాంగ్రెస్ తన అధ్యక్ష వంశానికి విధేయతతో... ప్రతిభకు, పని తీరుకు మిగిల్చి ఉంచిన ఆ కాస్త చోటును కూడా పరిమితం చేసేసిందా?
రెండవది... పార్లమెంటు లోపల గానీ, పార్లమెంటు బయట గానీ, పార్టీలో శశి థరూర్ పోషించవలసిన పాత్ర చాలా స్వల్ప మైనదిగా మాత్రమే ఉంది. ఆయన నేర్పును, నైపుణ్యాలను ఉపయో గించుకునే విషయంలో – అలాంటి అలవాటు లేకపోవటం కారణంగా – కాంగ్రెస్ జాగ్రత్త పడుతూ రావటమే కారణమా? ఒకప్పుడు విశాల గుడారమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెరవేర్చదగిన ఆకాంక్షలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయిందా?
మూడవది, తానెప్పటికీ గెలవలేనని తెలుసు; తన ఆశయం, కనీసం తన ఉద్దేశం ఏమిటని ఆలోచించేవారిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని తెలిసినా శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడి తప్పు చేశారా? ఆ ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధం చేయటానికే ఆయన పోటీలో నిలబడ్డారని నాకు తెలుసు. సాధారణంగానైతే ఆ చొరవను మెచ్చుకోవాలి. కానీ పోటీ లేకుండా అభ్యర్థిని గెలవనిచ్చే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగినట్లయిందా?
నాల్గవ ప్రశ్న కూడా ఉంది. సాధారణమైన ప్రశ్న. శశి థరూర్ కనుక కాంగ్రెస్ నుండి విడిపోతే అది ఆ పార్టీకి ఏపాటి ఎదురు దెబ్బ అవుతుంది? ఆయన విషయానికొస్తే కేరళలో ఆయన ఆశలు విఫలం కావచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన కాంగ్రెస్‌ను వీడతారో లేదో గానీ, బీజేపీలో చేరతారంటే మాత్రం నేను నమ్మలేను.
» కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారానే వర్ధిల్లుతూ వచ్చింది. వారంతా రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్ప కూడదనీ నేర్చుకున్నవారు.
» రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం.
- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
- కరణ్ థాపర్
Comments
Please login to add a commentAdd a comment