భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజల హక్కులను కాపాడుతూ, ప్రజల కోణంలో పాలన సాగేందుకు దిక్సూచిగా రాజ్యాంగం ఉంది. అయితే ఇవాళ మహోన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయాల్లో కొరవడింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు రాజ్యాంగాన్ని కేంద్ర బిందువుగా మార్చారు. అధికారమే పరమావధిగా ఎవరికి తోచిన విధంగా వారు ‘మీరే రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటే... కాదు మీరే రాజ్యాంగానికి సమాధి కడుతున్నారని’ పరస్పరారోపణలు చేసుకుంటున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూనే ఉన్నాయి.
రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేత బూని ఎన్నికల ప్రచారంలో, పార్లమెంటు సమావేశాల్లో చూపుతూ ‘రాజ్యాంగాన్ని కాపాడాలి’ అనే నినాదం ఇచ్చారు. తమ ఎన్నికల మేని ఫెస్టోలో ‘న్యాయపత్ర’లోని 13వ న్యాయ సూత్రంగా ‘ప్రజాప్రతినిధులు గెలిచిన సొంత పార్టీని వీడి మరొక పార్టీలో చేరితే వెనువెంటనే అనర్హత వేటు పడే విధంగా 10వ షెడ్యూలును సవరించి పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తా’మని హామీ ఇచ్చారు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతీకార ధోరణితో 39 స్థానాలను గెలుచు కున్న భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులను, శాసన మండలి సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది. తాము ఎన్నికల హామీగా ఏమిచ్చారో దాన్నే వారు స్వయంగా అతిక్రమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజ్యాంగాన్ని చేతబూని ప్రకటనలు ఇస్తుంటే... మరోవైపు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అందుకు పూర్తి భిన్నంగా బీఆర్‌ఎస్ శాసన సభ్యులు ఆరుగురిని దఫదఫాలుగా, శాసన మండలి సభ్యులు పదిమందిని ఒకేసారి చేర్చుకుంది. కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్‌లో 101, 102 (2), 190, 191 (2) అధికరణాల ద్వారా అమలులోకి తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఈ చర్యతో కాంగ్రెస్ తూట్లు పొడిచినట్లే కదా!
బీజేపీ సైతం ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూనే గతంలో దాదాపు ఎనిమిది నుండి పది రాష్ట్రాల ప్రజా ప్రభుత్వాలను పడగొట్టి, మిత్రపక్షాలతో కలిసి అనైతిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సంగతినీ మరువరాదు.
2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా తొలుత బలం పెంచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యు లను చేర్చుకున్నపటికీ న్యాయపరంగా చిక్కులు రావొచ్చనే ఆలోచనతో ఆ యా పార్టీల ‘సభా పక్షాలను’ విలీనం చేసుకుంది. అనాడు పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు ఈ విలీనాలను తప్పు పట్టారు.
తెలంగాణలో పార్టీలు మారిన ప్రజా ప్రతినిధులు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. పదేండ్లు కారు పార్టీలో అధికారాన్ని అనుభవించి, ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తూ గెలిచిన పార్టీ (కాంగ్రెస్)లోకి చేరడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. వారిని నమ్ముకుని భుజానికెత్తుకొని గెలిపించిన కార్య కర్తలకు అండగా ఉండాల్సిన వీరు ఎన్నికైన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మార డాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల పట్ల రెండు నాలుకల ధోరణితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ప్రజాక్షేత్రంలో ఎదురుదెబ్బ తినక తప్పదు.
– పిన్నింటి విజయ్ కుమార్
పొలిటికల్ సైన్స్ విద్యార్థి ‘ 90520 39109
చేసిన చట్టానికి... చేజేతులా తూట్లు!
Published Wed, Jul 17 2024 12:58 AM | Last Updated on Wed, Jul 17 2024 12:58 AM
Comments
Please login to add a commentAdd a comment