Constitution of India
-
నకలు కాదు... సిసలు రాజ్యాంగం!
భారత స్వాతంత్య్ర సంగ్రామం చివరికి ఉపఖండం భారత్ (India), పాకిస్తాన్‌లుగా విభజితమవ్వడంతో ముగిసింది. బ్రిటిష్ రాణి 1947 జూలైలో ‘భారతీయ స్వాతంత్య్ర చట్టం–1947’ను ఆమోదించారు. ‘3వ జూన్ ప్లాన్’ పేరున ‘మౌంట్ బాటెన్ ప్రణాళిక’కింద రెండు (భారత్–పాక్) డొమినియన్ల సృష్టి జరిగింది. అవి స్వతంత్ర దేశాలని అనుకుంటున్నాం కాని, బ్రిటిష్ రాణి (British Queen) దయవల్లనే వాటికి డొమినియన్ స్థాయిని ఇచ్చారు (ఇది దానం వలె ‘ఇచ్చింది’ అని అర్థం చేసుకోవాలి). స్వాతంత్య్ర చట్టం ఆమోదానికి ముందే మన రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ (1946) ఏర్పడింది. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగ నిర్మాణం సాగి 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అయితే మన రాజ్యాంగం (Indian Constitution) కాపీ కొట్టిన రాజ్యాంగం అనే అపప్రథను మూట కట్టుకుంది. ఇప్పటికీ ఆ విమర్శ ఉంది. బ్రిటిష్ వాళ్లు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం–1935’ను మక్కీకి మక్కీ నకలు చేశారంటారు. అలాగే అనేక ప్రపంచ దేశాల నుంచి నచ్చిన అంశాలను గ్రహించి మన రాజ్యాంగంలో చేర్చారు. మనకు ఉన్న దేశాధ్యక్షుడు (రాష్ట్రపతి), మంత్రి వర్గం, పార్లమెంట్, న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో అనేకానేక ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నవే. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సాధారణ అంశాలు (భాగాలు) కాబట్టి అది నకలు అనడానికి వీల్లేదు. మనం ప్రజాస్వామ్య విధానం పాటిస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన అంశాలను స్వీకరించడం తప్పుకాదు కదా. ఇక ఏ ఏ అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించామనే విషయానికి వస్తే... బ్రిటన్ నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పరి పాలన, రూల్ ఆఫ్ లా, శాసన ప్రక్రియ, క్యాబినెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వ నిర్వహణలో న్యాయరంగంలో ఆజ్ఞల పాత్ర (రిట్ గొప్పతనం) వంటివి ఉన్నాయి.ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి, రాష్ట్రపతి రాజ్యసభలో సభ్యులను ఎంపిక చేసే పద్ధతిని స్వీకరించాము. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినవాటిలో అధికారం నుంచి రాష్ట్రపతిని తొలగించడం (మహా అభిశంసనం), రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అధికారాలను నిర్వహించే విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ పీఠిక ఉన్నాయి. సమాఖ్య తరహా అధికారిక కేంద్రీకరణ... అంటే రాష్ట్రాలతో పోల్చితే బలమైన కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలు కాక మిగిలిన అన్ని అధికారాలను కేంద్రానికి అప్పగించడం, కేంద్రానికి రాష్ట్రాల గవర్నర్ (రాజ్ పాల్) నియామక అధికారం, సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చే అధికారం వంటి వాటిని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఆస్ట్రేలియా నుంచి కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలిగిన అంశాల జాబితా (ఉమ్మడి జాబితా), లోక్‌సభ, రాజ్యసభల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించడంవంటి అంశాలు; సోవియట్ యూనియన్ నుండి ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను పీఠికలో చేర్చడం; ఫ్రాన్స్ నుండి గణతంత్ర లక్షణం, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను పీఠికలో చేర్చడం వంటివాటిని స్వీకరించాం. అలాగే జర్మనీ నుంచి ఎమర్జన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే (సుషుప్తావస్థలో ఉంచే) విధానాన్ని, దక్షిణ ఆఫ్రికా నుంచి రాజ్యసభ ఎన్నికల విధానం, రాజ్యాంగ సవరణవంటివి మనం తీసుకున్నాం. ఈ లక్షణాలన్నీ వివేకంగా ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగ నిర్ణాయక సభలో నిర్ణయించారు. అంతకుముందు బీఎన్ రావ్ ఒక ముసాయిదా రాశారు. అయితే అది పూర్తిగా మారిపోయింది. పోల్చుకోవడం కూడా సాధ్యం కాని విభిన్నమైన ప్రజాస్వామ్యాల నుంచి అనేక అంశాలు, కీలకమైన కొన్ని విధానాలు చేర్చ వలసి ఉందని ఆయనే స్పష్టంగా చెప్పారు.చదవండి: బాలయ్య మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే..అందుకు తగినట్లే అనేక రాజ్యాంగాల నుంచి తగిన విషయాలను స్వీకరించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొందరు పెద్దలు అసలు మొదటి రాజ్యాంగం రాసింది రావ్ గారే తెల్సా అని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మన తాజా దేశభక్తులు కూడా ఇదే వాదన చేస్తుంటారు. విధిలేక అంబేడ్కర్‌ను ఈ భక్తులు మొక్కుతున్నారు గాని రాజ్యాంగ నిర్ణాయక సభ (లేదా రాజ్యాంగ నిర్మాణ పరిషత్)లోని సప్త రుషులవంటి ఏడుగురు రాజనీతిజ్ఞుల అవిరళ కృషి, మార్గదర్శకాలతో తొలి డ్రాఫ్ట్ రూపొందింది. తరువాత ఆ ఏడుగురిలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణం చేశారని అర్థం చేసుకోవాలి. ప్రతి నియమానికి నానా కష్టాలు పడి, చర్చించి, ఒప్పించి, అందరూ ఏకాభిప్రాయం సాధించిన తరువాత ఈ రాజ్యాంగం ఏర్పడిందని గ్రహించాలి.-మాడభూషి శ్రీధర్, మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్‌ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్‌కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాజ్యాంగ అమలులో చిత్తశుద్ధి ఉందా?
దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి చర్చలు తుది రూపంలోకి వస్తున్న తరుణంలోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేశారు. బి.ఆర్. అంబేడ్కర్ ముసాయిదా కమిటి చైర్మన్‌గా, బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ రచనా కమిటీలకు నిష్ణాతులు సేవలందించారు. వీరి కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ సభ ఆమోదించింది. నాటి రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 486 పైగా అధిక రణలు). చివరకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లన్నమాట! ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం పరిపాలనా పరంగా, జనాభా పరంగా, సంస్థాగతంగా, సాంకేతికంగా చాలా ప్రగతిని సాధించిందని చెప్పగలం. కానీ ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో జరగకపోవడం, రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కాకపోవడం బాధాకరం. రాజ్యాంగ ప్రవేశికలో లేని ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేర్చింది. మొత్తం మీద ఇప్పటికి 106 రాజ్యాంగ సవరణలు జరగడం గమనార్హం. ఏ దేశ రాజ్యాంగం అయినా మారుతున్న అవసరా లకు అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆనాడు రాజ్యాంగ సభలో అంబేడ్కరే స్వయంగా ‘ఒకవేళ రాజ్యాంగం విఫలం అయితే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దానిని అమలు చేసే పాలకులదే’ అన్నారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని చేశారు. కానీ దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతగా నీరుగార్చాయో తెలిసిందే కదా! 6–14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ‘విద్యా హక్కు చట్టం’ తెచ్చారు. కానీ అమలును మరచారు. నేటికీ బడి బయట కోట్లాదిమంది పిల్లలు బాలకార్మికులుగా బతుకు తున్నారు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న కులం, మతం భావాలు విద్వేషాన్ని నింపుతున్నాయి. ఈ మధ్యనే ఫ్యూచర్ రీసెర్చ్ సెంటర్ నివేదికలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక హక్కు లదీ దాదాపు అదే స్థితి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఎలా నీరుగారుస్తున్నాయో జైళ్లలో మగ్గుతున్న అనేక మంది హక్కుల కార్యకర్తలూ, ప్రజా ఉద్యమకారులూ, మేధావులను చూస్తే అర్థమవు తుంది. అలాగే అమానవీయమైన అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా ఇప్పటికీ గ్రామాల్లో వివక్ష కొన సాగుతూనే ఉంది. ‘రాజ్యాంగం’ మీద కనీస అవగాహన లేనివారు చట్టసభలలో అడుగుపెట్టడం శోచనీయం. ఇక వారు ఎటువంటి చట్టాలు చేస్తారో చెప్పవలసిన పనేముంది! ఒక అందమైన భవంతిని నిర్మించుకొని దానిని సక్రమంగా వాడుకోకపోతే అది త్వరలోనే శిథిల స్థితికి చేరుతుంది. ఈ సూత్రం ఏ దేశ రాజ్యాంగానికైనా వర్తిస్తుంది. ‘భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛలనూ, అవకాశాల్లో సమానత్వాన్ని సాధించేందుకు, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు శాసనం (రాజ్యాంగం రూపంలో) చేసి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. అంటే ఆనాడు మన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగానే అది రూపొందించబడింది. కానీ దాని అమలులోనే పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది. ఇది గర్హనీయం. డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
విశ్వబంధు భారత్‌కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. విశ్వబంధు భారత్ ‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్‌కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది. స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి. ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్‌ను నిర్వచిస్తున్నాయి. స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు. సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు. -
దేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలూ, లక్ష్యాలనూ మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా... ఒకటేమిటి ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలూ, ప్రజా స్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. దాన్ని రాయడానికి ఎందరు ఎన్ని విధాలుగా త్యాగం చేశారో మాటల్లో చెప్పడం కష్టమే. ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని, మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన రాజ్యాంగం. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ 165 రోజుల పాటు సాగింది. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి చర్చ జరిగింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగితే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకుంది. 7,635 ఆర్టికల్స్ సవరణలను సభ ముందు ఉంచగా 2,473 సవరణలను ఆమోదించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాగాన్ని ఆమోదించింది. మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగాయి. అయితే రాజకీయపార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటమే బాధాకరం. బహుళ జాతులూ, సంస్కృతులూ, మతాలూ, కులాలూ ఉన్న దేశంలో ‘ఒకే దేశం– ఒకే జాతి’ అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, పౌరహక్కులను కాలరాసే చట్టాలు, మైనారిటీ వ్యతిరేక చట్టాల రూప కల్పనకు పాటుపడుతూ రాజ్యాంగ మూల సూత్రా లకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న దన్నది వాస్తవం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇటీవలి ప్రజా స్వామ్యవాదుల ప్రధాన ఆందోళన. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి... స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ‘నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి.అంతేకానీ వెనక్కి మాత్రం లాగవద్దు’ అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడూ బాధ్యత గల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఊపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై... దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. కావున యావత్ భారత ప్రజల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రాథమిక బాధ్య తగా ఉండాలి.– డా‘‘ బోరుగడ్డ సుబ్బయ్య; అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ ‘ 94927 04401(నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం) -
అక్షరానికి సంకెళ్లు నిలవగలవా?
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు. గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది. జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’ ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి. తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
మూలవాసుల అభివృద్ధా? మూలాల విధ్వంసమా?
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశ అభివృద్ధి నమూనా మారడం లేదు. అభివృద్ధి ఫలాలు కొందరి దగ్గరే పోగుబడడం అంతకంతకూ పెరిగిపోతోంది. సాంస్కృతిక హననంతోపాటు మూలవాసుల పేదరికమూ హెచ్చవుతోంది.భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలయెత్తుకొని నిలబడగలిగిన ప్రాకృతిక సంపదను కలిగి ఉంది. దాన్ని పరిరక్షించుకుంటూ, దేశ అభివృద్ధిని నిరంతరం పెంచి పోషించుకునే సూత్రాలు, అధికరణాలు రాజ్యాంగంలో ఎల్లెడలా పరచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మానవ హక్కుల పరిరక్షణలో బలమైన సూత్రాలను మనకు అందించింది. అధికరణం 46లో ‘బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల (ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రజలు) ఆర్థికాభివృద్ధికి, వారిలో విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా వారిని కాపాడాలి. వారికి సామాజికంగా అన్యాయం జరగకుండా చూడాల’ని ఉంది.కానీ, ఇవాళ అర్థికాభివృద్ధి పేరుతో సహజవనరులు, సాంస్కృతిక సంపద హననానికి గురవు తోందనేది వాస్తవం. దక్షిణ భారత దేశం పారిశ్రామికంగా మిగతా ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధి క్రమంలో... వేల ఏళ్ల పాటు తరతరాలు వారసత్వంగా మనకు అందించిన సాంస్కృతిక సంపద ధ్వంసమవుతోంది. దక్షిణ భారతదేశ నవీన రాతియుగ సంస్కృతి మూలాలు అంతరించే పరిస్థితులు వచ్చాయని చరిత్రకారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సమాజ పరిణామక్రమంలో కొంత కాలానికి ప్రభుత్వాలేర్పడ్డాయి. చాలాకాలం వరకు అప్పటి ప్రభుత్వాలు భూమి పైన శిస్తు వసూలుకే పరిమితమయ్యాయి. కాని, భూమిపై హక్కును ఏర్పరచుకొనలేదు. కాలక్రమంలో భారతదేశాన్ని అనేక స్వదేశీ, విదేశీ తెగలు పరిపాలించాయి. మొగలాయీ చక్రవర్తుల కాలంలో భూమిశిస్తు వసూలు బాధ్యత ప్రభుత్వ అధికారుల నుండి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయింది. వారే జమీందారు లయ్యారు. బ్రిటీష్ వారి పాలనలో జమీందారులకు వారి అజమాయిషీలోని ఎస్టేటు లపై 1793లో లార్డ్ కారన్వాలిస్ ఆస్తి హక్కు నిచ్చారు. భూమి కాస్తా అమ్మకపు సరుకైంది. కరవు కాటకాల సమయాల్లో నిర్బంధపు శిస్తులు కట్టలేక భూమిని అమ్ముకున్న రైతులు భూమిలేని పేదలయ్యారు. హెచ్చుగా భూములను కొన్నవారేమో... వడ్డీ వ్యాపా రులు, భూస్వాములయ్యారు. భూమిని పోగొట్టుకున్న వారిలో చాలామంది కౌలు దారులయ్యారు. క్రమంగా భూస్వాముల నిర్బంధపు కౌలు వసూలును కౌలుదార్లు భరించలేని స్థితికి చేరారు. ఆ క్రమంలో వారు భూమిలేని గ్రామీణ పేదలయ్యారు. తిరిగి భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, 1947 తర్వాత స్వతంత్ర భారతంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి.1948లో జమీందారీ వ్యవస్థ రద్దు కాక పూర్వం మామూలు భూస్వాములకు సగటున 100 ఎకరాలుండేది. 1938లో వచ్చిన ప్రకాశం కమిటీ రిపోర్టు ఆధారంగా తయారుచేసిన ‘మద్రాసు ఎస్టేట్ రద్దు – రైత్వారీకి మార్పు బిల్లు’ 1949 ఏప్రిల్ 19న శాసనసభ ఆమోదం పొంది, 1950లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టమైంది. ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ ఎస్టేటు భూములు, అడవులు, గనులు, ఖనిజాలు గల భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. జమీందారులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తూ, వారి సొంత సేద్యానికి సారవంతమైన వేలాది ఎకరాలు వదిలి వేయబడ్డాయి. దీనితో జమీందారులు బడా భూస్వాములయ్యారు.ప్రధానమైన వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళాక... దేశంలో కరవు, అవిద్య, అనారోగ్యం, దురాక్రమణలతో కూడిన పాలనా విధానాలు పెరుగుతున్నాయి. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారత అస్తిత్వాన్ని గురించీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అస్తిత్వాల గురించి అనేక సూత్రాలు మనకు అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలో... స్థానిక భాషలు,సంస్కృతి, చరిత్ర, పురాతత్వ భావనలను పెంపొందించాలన్నారు. అంతేకాని వాటిని ఇతరులకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబించరాదనీ, అందువల్ల భారతదేశం అంతర్గతంగా తాకట్టులోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ చెప్పారు. నిజానికి ప్రస్తుత పాలకవర్గ నిష్క్రియాపర్వాన్ని అలా ఉంచితే... కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ‘ఇండియా’ కూటమి కూడా దేశాన్ని తాకట్టు నుంచి విముక్తి చేసే విధంగా పార్లమెంటులో వాదించలేకపోతోంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే! కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి వెనక కూడా ఉండడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇదే సమయంలో రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విషయంలో పార్లమెంటులోని దళిత బహుజన ఎం.పీలు నోరు మెదపకపోవడం వారి బానిసత్వాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి ఈ దేశం ఇలా కార్పొరేట్ శక్తుల, అగ్రవర్ణ భూస్వామ్య శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం పూనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజక వర్గాల్లో గెలిచిన దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఈ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత హక్కుల కోసం ఎలుగెత్తి మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టమైన అంశం. అలాగే వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో దళిత బహుజనుల భూమి హక్కు మీద, కౌలుదార్ల హక్కుల మీద మాట్లాడటం తగ్గించారు.మరోపక్క సెంటు భూమి కూడా లేని వారు భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బ్యాంకులో అప్పుల్లో ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తి క్రమాన్ని నేర్పటం లేదు. ప్రజల్లో జీవశక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మ గౌరవ స్ఫూర్తినీ, స్వీయ జీవన ప్రమాణాన్నీ పెంచినప్పుడే దేశం ఇతర దేశాలకు అప్పులు ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుతుంది. ఈనాడు దేశీయ భావన, జాతీయ భావన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంచాల్సిన బాధ్యత లౌకికవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఉంది. రాజకీయ పార్టీల కన్నా ... ఎప్పుడూ ప్రజా ఉద్య మాలే దేశాన్ని మేల్కొలుపుతాయి. నిద్రావస్థలో మునిగిన సమాజాన్ని చైతన్యవంతం చేసి, అంబేడ్కర్ మార్గంలో ఈ దేశ సాంస్కృతిక వికాసానికి అందరం పాటుపడుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
చేసిన చట్టానికి... చేజేతులా తూట్లు!
భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజల హక్కులను కాపాడుతూ, ప్రజల కోణంలో పాలన సాగేందుకు దిక్సూచిగా రాజ్యాంగం ఉంది. అయితే ఇవాళ మహోన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయాల్లో కొరవడింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు రాజ్యాంగాన్ని కేంద్ర బిందువుగా మార్చారు. అధికారమే పరమావధిగా ఎవరికి తోచిన విధంగా వారు ‘మీరే రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటే... కాదు మీరే రాజ్యాంగానికి సమాధి కడుతున్నారని’ పరస్పరారోపణలు చేసుకుంటున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేత బూని ఎన్నికల ప్రచారంలో, పార్లమెంటు సమావేశాల్లో చూపుతూ ‘రాజ్యాంగాన్ని కాపాడాలి’ అనే నినాదం ఇచ్చారు. తమ ఎన్నికల మేని ఫెస్టోలో ‘న్యాయపత్ర’లోని 13వ న్యాయ సూత్రంగా ‘ప్రజాప్రతినిధులు గెలిచిన సొంత పార్టీని వీడి మరొక పార్టీలో చేరితే వెనువెంటనే అనర్హత వేటు పడే విధంగా 10వ షెడ్యూలును సవరించి పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తా’మని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతీకార ధోరణితో 39 స్థానాలను గెలుచు కున్న భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులను, శాసన మండలి సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది. తాము ఎన్నికల హామీగా ఏమిచ్చారో దాన్నే వారు స్వయంగా అతిక్రమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజ్యాంగాన్ని చేతబూని ప్రకటనలు ఇస్తుంటే... మరోవైపు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అందుకు పూర్తి భిన్నంగా బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆరుగురిని దఫదఫాలుగా, శాసన మండలి సభ్యులు పదిమందిని ఒకేసారి చేర్చుకుంది. కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో 101, 102 (2), 190, 191 (2) అధికరణాల ద్వారా అమలులోకి తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఈ చర్యతో కాంగ్రెస్ తూట్లు పొడిచినట్లే కదా! బీజేపీ సైతం ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూనే గతంలో దాదాపు ఎనిమిది నుండి పది రాష్ట్రాల ప్రజా ప్రభుత్వాలను పడగొట్టి, మిత్రపక్షాలతో కలిసి అనైతిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సంగతినీ మరువరాదు. 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా తొలుత బలం పెంచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యు లను చేర్చుకున్నపటికీ న్యాయపరంగా చిక్కులు రావొచ్చనే ఆలోచనతో ఆ యా పార్టీల ‘సభా పక్షాలను’ విలీనం చేసుకుంది. అనాడు పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు ఈ విలీనాలను తప్పు పట్టారు.తెలంగాణలో పార్టీలు మారిన ప్రజా ప్రతినిధులు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. పదేండ్లు కారు పార్టీలో అధికారాన్ని అనుభవించి, ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తూ గెలిచిన పార్టీ (కాంగ్రెస్)లోకి చేరడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. వారిని నమ్ముకుని భుజానికెత్తుకొని గెలిపించిన కార్య కర్తలకు అండగా ఉండాల్సిన వీరు ఎన్నికైన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మార డాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల పట్ల రెండు నాలుకల ధోరణితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ప్రజాక్షేత్రంలో ఎదురుదెబ్బ తినక తప్పదు.– పిన్నింటి విజయ్ కుమార్పొలిటికల్ సైన్స్ విద్యార్థి ‘ 90520 39109 -
హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం: రాహుల్ గాంధీ
బనస్‌గావ్: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై అమల్లో ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని హృదయం, ప్రాణం, రక్తంతో కాపాడుతామని ప్రకటించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బనస్‌గావ్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు.కేవలం అంబానీకి, అదానీకి మేలు చేయడానికే ప్రధాని మోదీని భగవంతుడు భూమికిపైకి పంపించాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో సిద్ధాంతాల మధ్య పోరాటం కొనసాగుతోందన్నారు. ఇండియా కూటమి, రాజ్యాంగం ఒకవైపు, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకుంటున్న శక్తులు మరోవైపు ఉన్నాయని చెప్పారు. భారత రాజ్యాంగానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ఉద్ఘాటించారు.దళితులకు రాజ్యాంగం తగిన గౌరవం కలి్పంచిందని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన ఇచ్చిన రాజ్యాంగం జోలికి ఎవరూ రావొద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో 22 మంది బిలియనీర్లను సృష్టించారని, తమకు అధికారం అప్పగిస్తే దేశంలో కోట్లాది మంది లక్షాధికారులను సృష్టిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ తన బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని, ఈ విషయాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. పేదలను లూటీ చేసి, పెద్దలకు కట్టబెట్టారని, ఆ సొమ్మంతా విదేశాలకు తరలిపోయిందని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజలకు చాలా కీలకమని వెల్లడించారు. మన దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్‌లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్‌సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు: ఖర్గే
బెంగళూరు: దేశ రాజ్యాంగాన్ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిని సమైక్యంగా ఉండి, గట్టిగా ఎదుర్కోలేకపోతే దేశంలో నియంతృత్వపాలన తథ్యమని ఆయన హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని మార్చేసేందుకు, పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గట్టిగా, ఐక్యంగా నిలబడకుంటే, దేశంలో నియంతృత్వం రావడం ఖాయం. నియంతృత్వం కావాలనుకుంటున్నారా లేక న్యాయంతో కూడిన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాజ్యాంగం మనుగడ సాధించిన పక్షంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామ్యం ఉంటే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించగలుగుతారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించడం లేదు, రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. అందుకే, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దానికి కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఒక భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని వదులుకుని కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు లేదా ప్రభుత్వాలను ఎందుకు పడగొడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు దేశంలో నియంతృత్వం రావచ్చని అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీయే కనీసం బీజేపీ ప్రభుత్వ గ్యారెంటీయే అని చెప్పకుండా మోదీ తన గ్యారెంటీ అని చెప్పుకోవడం ఏమిటన్నారు. ‘అది నీ గ్యారెంటీ ఎలా అవుతుంది? అది నీది కాదు. ప్రజలు డబ్బుతో అమలు చేసే గ్యారెంటీ’’ అన్నారు. -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది. జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం. నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి. అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు. ‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు. ఇకపోతే అంబేడ్కర్ పార్క్‌ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్‌లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం. కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది. అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది. అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది. అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో... కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ) -
జమిలి అమలుకు అవరోధాలు
ఒక దేశ రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలకు, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు నిర్ణీత తేదీలు ఉండటం సర్వ సాధారణం. అయితే, భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ఎత్తున ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కానీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమిటంటే, రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీ కాలం మధ్యలోనూ, మరికొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవ సరంగా సమయం, ఖర్చు చేయకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అనేది దాని అమలు సాధ్యతపైనే ఆధారపడి ఉంది. ఒక దేశం, ఒకే ఎన్నిక’ విధానం అమలుకు రాజ్యాంగ సవరణలు, ఇతర పరిశీలనల విషయమై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ... దీనికి సంబంధించి ప్రజల సూచనలను కోరింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచనకు ప్రధాన కారణం సమయం, ఖర్చు, ఆదా చేయడం. ఈ రెండు అంశాలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయి. కానీ, సమాఖ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో దాదాపు ఎక్కడా సమాఖ్య స్థాయిలో, ప్రాంతీయ (రాష్ట్ర) స్థాయులలో ఏకకాల ఎన్నికలు జరగడం లేదు. నిజానికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం– న్యాయంపై ఏర్పర్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిన 79వ నివేదిక... ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా, స్వీడన్ దేశాల్లోని రెండు కేసులను మాత్రమే ఉదాహరించింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రతి పాదిస్తున్న దక్షిణాఫ్రికాలో ఎన్నికలు 1994లో మాత్రమే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్... సమాఖ్య, ప్రాంతీయ స్థాయులలో (వెస్ట్రన్ కేప్ మినహా) దేశమంతటా విజయం సాధించడం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి 25 ఏళ్లలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ వచ్చిన భారతదేశ పరి స్థితికి ఇది భిన్నమైనది కాదు. భారతదేశంలో మరింత స్పర్థాత్మక రాజకీయ దృశ్యం కారణంగా, ఆ తర్వాత హంగ్ అసెంబ్లీలు (హంగ్ పార్లమెంటు కూడా), పార్టీని మొత్తంగా ఖాళీ చేసి వేరే పార్టీలోకి గెంతేయడం (ఫ్లోర్ క్రాసింగ్) మొదలైనవి కనిపించడం ప్రారంభమైంది. ఫలితంగా చట్టసభల రద్దు, ఎన్నికలు, వివిధ సమయాల్లో పార్లమెంటుకు, రాష్ట్రాలకు (శాసనసభ లేకుండా) ఆరు నెలల కంటే ఎక్కువ విరామం ఏర్పడుతూ వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థితి ప్రజాస్వా మ్యానికి ఆమోదయోగ్యం కాదు. పైగా భారత రాజ్యాంగం దీనికి అనుమతించదు. స్వీడన్ విషయానికి వస్తే ఆ దేశం మునిసి పాలిటీలు, రీజియన్లలో ఏకీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉంది, కానీ రీజియన్లలో మాత్రం ఫెడరల్ వ్యవస్థలోని ప్రావిన్సుల వలె ఉండదు. పైగా వాటి మధ్యన క్రమానుగత సంబంధం లేదు. ముఖ్యంగా, రెండూ వేర్వేరు రకాల పనులను చేపట్టే స్థానిక ప్రభుత్వ రూపాలు. స్వీడిష్ రాజ్యాంగం ముందస్తు ఎన్నికలను అనుమతిస్తుంది. అయితే ఇవి రద్దు అయిన కాలం నుండి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే పరిమిత మవుతాయి. ఒక దేశంలోని రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలు, సమాఖ్య పార్లమెంట్ల ఎన్నికలకు నిర్ణీత తేదీలు ఉండటం చాలా సాధారణ లక్షణం. పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న కెనడా సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ స్థాయిలోనూ, దాని ప్రావిన్సు లలోనూ రెండు చట్టాలను రూపొందించింది. ఎన్నికల నిర్వహణకు ఒక నిర్ణీత తేదీని ప్రతి పాదిస్తుంది, ఆ తేదీ ప్రావిన్స్ నుండి ప్రావిన్స్‌కు మారుతూ ఉంటుంది. ఫెడరల్ ఎన్నికల షెడ్యూల్ వేరొక దానిని అనుసరిస్తుంది. ఆస్ట్రేలియాలో ఫెడ రల్ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల (వాటిలో చాలా వరకు) కాలావధులు వరుసగా మూడు, నాలుగు సంవత్సరాలు ఉంటాయి. తద్వారా అక్కడ జమిలి ఎన్నికలను మినహాయించారు. ‘నిర్దిష్ట తేదీ, పదవీకాలం’ ఎన్నికల నమూనా తక్షణమే అమెరికాను గుర్తు చేస్తుంది. అక్కడ అధ్యక్ష, గవర్నర్ ఎన్నికలు ప్రతి నాలుగు సంవ త్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. అధ్యక్షుడు లేదా గవర్నర్ పని చేయనట్లయితే వారి స్థానంలోకి రాగల యోగ్యత ఉన్నవారి కోసం ఒక వ్యవస్థ అమలులో ఉంది. ఆ ప్రక్రియ ద్వారా పూర్తి కాలాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది, అయితే ఇది కొన్నిసార్లు ‘ప్రజల స్థాయిలో’ ఎన్ని కల్లో పోటీ చేయకుండానే 1974లో గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా మారడం వంటి క్రమరాహిత్యాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా, ప్రతి రెండు సంవ త్సరాలకు ఒకసారి అమెరికా కాంగ్రెస్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగు తాయి. ప్రైమరీలకు సంబంధించి అమెరికన్ సంప్ర దాయం ప్రకారం, దేశం ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం ఎన్నికల మోడ్‌లో ఉంటుంది. భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ప్రయత్నాలు జరిగినప్పటికీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమి టంటే – రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీకాలం మధ్య లోనూ, మరి కొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్ని కలు జరపాల్సి ఉంటుంది. సమాఖ్య, ప్రాదేశిక ఎన్నికలను వేరు చేయడం వల్ల ఓటర్లు తమ రాష్ట్రం లేదా ప్రావిన్స్‌లో ఉన్న నాయకులు లేదా జాతీయ ఎన్నికల సమస్యల కారణంగా ఇటూ అటూ అవగల సంభావ్యతకు గురికాకుండా ఉంటారని నమ్మకం. పోరులో ఉన్న ప్రాంతీయ పార్టీలకు (లేదా పార్టీలకు) ప్రత్యేక గుర్తింపు లేనప్పుడు అలాగే ఓటర్లు సులభంగా గుర్తించగలిగేలా పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాను సూచించే కారణం లేనప్పుడు ఇది జరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవసరంగా సమయం, డబ్బులు ఖర్చు చేయకూడదనే ఆలోచన ఆమోదయోగ్యమైనదే. జర్మనీలో ఇటీవల నేపాల్ అనుభవాల నుండి, ఎక్కువ రాజకీయ సుస్థిరతను అందించే రాజ్యాంగపరమైన నిబంధనలు సాధ్యమయ్యే అవకాశం కనిపించింది. ఉదాహరణకు, జర్మన్ బేసిక్ లా, 2015 నేపాలీ రాజ్యాంగం అవిశ్వాసంలో సాను కూల ఓట్లను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి తీర్మానంతో పాటు తదుపరి నాయకుడి పేరు కూడా ఉండాలి. బ్రిటన్ లో, కెనడాలో కూడా పార్లమెంటు నిబంధనలను పరిష్కరించే ప్రయత్నాలు... కామన్వెల్త్ సంప్రదాయం ద్వారా సభను రద్దు చేసి, తాజా తీర్పును కోరే హక్కును ప్రధానమంత్రి కలిగి ఉండటం ద్వారా విఫలమయ్యాయి. నేపాల్‌లో అదే సంప్రదాయాన్ని అమలు చేయాలని కోరినప్పుడు, దానిని సుప్రీంకోర్టు 2021లో రెండు సందర్భాల్లో అనుమతించకపోగా, కొత్త నాయకుడిని ఎన్నుకో మని సభను కోరింది. మధ్యంతర ఎన్నికలపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 2017లో ఎన్ని కైన సభ పూర్తి ఐదేళ్ల కాల వ్యవధిలో పాలన సాగించేలా అది దోహదపడింది. మంజీవ్ సింగ్ పురి వ్యాసకర్త భారత మాజీ రాయబారి -
ఇక్కడ ముస్లిమ్ కావడం నేరమా?
భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకికరాజ్యంగా నిర్వచించింది. అందులోని లౌకిక భావానికి తీవ్రమైన సవాలుగా పరిణమిస్తున్న ఘటనలు నేడు దేశంలో అనేకచోట్ల సంభవిస్తున్నాయి. అధిక సంఖ్యాకుల ప్రాధాన్యాలకు కట్టుబడి అల్పసంఖ్యాకులు, ముఖ్యంగా ముస్లింలు జీవించక తప్పదనే వాస్తవాన్ని పాలనాపరమైన నిర్ణయాలు బలపరుస్తున్నాయి. దీనివల్ల ‘అధిక సంఖ్యాకుల దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉండటం అనేది ఎలాంటిది?’ అనే ప్రశ్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ ప్రశ్న అడిగే భారతీయుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటం గురించే మనం ఆందోళన చెందాలి. ఆఖరికి, ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరాకరణకు కూడా ఒక వర్గాన్ని గురి చేయడం సమ్మతం అవుతుందా? వాదనలకిది తావులేని ప్రశ్న కాకున్నా, ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అని మనం ఎక్కువగా అడుగుతుండటాన్ని అత్యంత దురదృష్టకరమైన అభియోగాలలో ఒకటిగా నేడు మనదేశం ఎదుర్కొంటూ ఉంది. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటమన్నది ఎలాంటిది?’’ అనే ఈ ప్రశ్నకు జవాబు – ఒక హిందువు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ లేదా నాస్తికుడిగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానానికి భిన్నంగా ఏమీ ఉండనవసరం లేదు. కానీ ఉంటోంది! అలా ఎందుకు ఉంటున్నదో... జియా ఉస్ సలామ్ తాజా పుస్తకం ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా: ఎ క్రిటికల్ వ్యూ’... కలవర పాటును కలిగించే వివరాలతో విశదీకరిస్తోంది. కాస్త వెనక్కెళ్లి ముందుకొస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. గత దశాబ్ద కాలంలో పరిస్థితి ఇంతని అంతని చెప్పలేనంతగా దిగజారిపోయింది. దేశంలో ముస్లింల జనాభా 15 శాతం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వారి వాటా కేవలం 4.9 శాతం. పారా మిలిటరీ సైనిక దళాల్లో 4.6 శాతం. ఐయ్యేఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్‌లలో 3.2 శాతం. సైన్యంలో బహుశా తక్కువలో తక్కువగా 1 శాతం. 2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం... ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా షెడ్యూల్డు కులాలు, తెగల కంటే కూడా మరీ అధ్వా న్నమైన జీవన స్థితిగతులలో ఉన్నారన్నది మనకు తెలిసిన విషయమే. రాజకీయాలలో సైతం, ఒకప్పుడు వారి స్వరం వినిపించిన చోట ఇప్పుడది క్షీణిస్తూ ఉండటం మాత్రమే కాదు, కొన్ని చోట్ల వెనక్కు మళ్లుతూ కూడా ఉంది. దామాషా ప్రకారం ముస్లింలకు లోక్‌సభలో 74 సీట్లు ఉండాలి. కానీ ఉన్నది 27 మంది. మన 28 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. 15 రాష్ట్రాలలో ముస్లిం ఎంపీలే లేరు. 10 రాష్ట్రాలలో మాత్రమే మైనారిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఒక ముస్లిం ఉన్నారు. అదేమీ విశేషం కాదు కదా! నిజానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతాపార్టీ అంత కరాఖండిగా ముస్లింలకు ముఖం చాటేయలేదు. 2014లో గానీ, 2019లో గానీ బీజేపీ ఒక్క ముస్లింను కూడా లోక్‌సభ ఎంపీగా ఎన్నికలకు ఎంపిక చేసుకోలేదు. నేటికీ ఆ పార్టీ కనీసం రాజ్యసభకు ఎంచుకున్న ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. కర్ణాటకలో 14 శాతం మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ బీజేపీకి ఆ రాష్ట్రా లలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. గుజరాత్లో 1998 నుండి ఏ లోక్‌సభకు, లేదా ఏ విధాన సభకు కూడా ముస్లిం అభ్యర్థిని నిల బెట్టలేదు. అంతెందుకు, గత ఏప్రిల్‌లో కర్ణాటక మాజీ ఉప ముఖ్య మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప బీజేపీకి ముస్లింల ఓట్లే అవసరం లేదన్నారు. పాలకపక్ష నాయకులు, వారి సన్నిహిత మద్దతుదారులు ముస్లింల గురించి ఏదైతే మాట్లాడుతుంటారో ఆ ప్రకారం ముస్లింల పరిస్థితి మన దేశంలో దిగజారిపోతూ ఉంటుంది. వారిని ‘బాబర్ కీ ఔలాద్’ (బాబర్ సంతానం) అంటుంటారు. ‘అబ్బా జాన్’లు అంటూ అవహేళన చేస్తుంటారు. ‘పాకిస్తాన్‌కు వెళ్లిపొండి’ అని పదే పదే చెబుతుంటారు. వారి ఊచకోతకు íపిలుపు అందినప్పుడు – అయితే గియితే, కొన్ని బీజేపీ గొంతులు ఆ పిలుపును ఖండిస్తూ మాట్లాడతాయి. వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే నేర నిర్ధారణ కాకముందే వారి ఇళ్లు నేలమట్టం అవుతాయి. తరచూ వారు లవ్ జిహాద్, పశువుల అక్రమ రవాణా ఆరోపణలతో హత్యకు గురవుతుంటారు. 2019 జూన్‌లో జార్ఖండ్‌లో ఒక ముస్లిం వ్యక్తికి ఏం జరిగిందనే దాని గురించి జియా ఉస్ సలామ్ పుస్తకం నుంచి నేనొక ఉదాహరణ ఇస్తాను. ఏదో ఒక ఉదంతాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ముస్లింలపై కనబరుస్తున్న అసహనాన్ని వేలెత్తి చూపడం కోసమేనని అనిపించవచ్చు కానీ, అటువంటి అనేక ఘటనలకు ఇదొక దృష్టాంతం. ‘‘విధ్వంసకరమైన ఆ హింసాత్మక సమూహం... అతడిని దీపస్తంభానికి కట్టివేసి ఇనుప కడ్డీలు మొదలు... కర్రలు, టైర్లు, బెల్టుల వరకు... చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావబాదింది. ఆ వ్యక్తి తల, చేతులు, ముఖం రక్తం ఓడుతున్నాయి. అతని కాళ్లు వాచిపోయాయి. చాలాచోట్ల ఎముకలు విరిగి పోయాయి. ఆ దెబ్బలకు నిలబడలేక మనిషి కూలి పోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? నేటి కొత్త భారతదేశంలో అతడొక ముస్లిం అవడమేనా?’’ ఇదేమీ నూటికో కోటికో ఒకటిగా జరిగిన ఘటన కాదని పుస్తకంలో జియా పొందుపరిచిన వాస్తవాలు సూచిస్తున్నాయి. ‘‘ముస్లింలపై ఇటు వంటి ద్వేషపూరితమైన నేరాలు 2014–2017 మధ్య కాలంలో 30 శాతం పెరిగాయి. అనంతరం, 2019లో మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మతవిద్వేష నేరాలు రెట్టింపు అయ్యాయి. ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరా కరణకు కూడా ముస్లింలు గురయ్యారు. ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ‘‘ప్రతి భారతీయుడూ హిందువే’’ అని అన్నారు. ఈ మాటను ముస్లింలు మాత్రమే కాదు, సిక్కులు కూడా సమ్మతించరు. అయినప్పటికీ ఆయన మరికాస్త ముందుకు వెళ్లి... ‘‘ఈ రోజున భారత దేశంలో ఉన్నవారంతా హైందవ సంస్కృతికి,హిందూ పూర్వీకులకు, హిందూ భూభాగానికి చెందినవారు. ఇందులో రెండో మాటే లేదు’’ అన్నారు. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఎందుకని మన దేశ సమగ్రతకూ, భవిష్యత్తుకూ ముప్పు కలిగించేలా ఉంటుందో వివరించేందుకు చాలినంతగా చెప్పాననే నేను భావిస్తున్నాను. ఇది చాలా స్పష్టమైన సమాధానమని నేను చెప్పగలను. కానీ ఈ సమాధానం మన ముస్లిం సోదరులకు, సోదరీ మణులకు ఎలా అనిపిస్తుందో ఒక్కక్షణం ఆలోచించండి. తక్కిన మనందరికీ ఇది మనదికాని సమస్యపై ఒక విశ్లేషణ. వారికి మాత్రం వారి జీవన్మరణ సమస్య. సమస్య గురించి మనం ఆశాజనకమైన రీతిలో లోతుగా ఆలోచిస్తాం. కానీ వారు ఆ పరిస్థితిలో జీవిస్తారు. అది మరింత దారుణంగా తయారవదు కదా అని బిక్కుబిక్కుమంటుంటారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సుదీర్ఘ వివాదానికి తెర
జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పుపై సహజంగానే అటు హర్షామోదాలతోపాటు ఇటు అసంతృప్తి, అసమ్మతి కూడా వ్యక్తమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించగా, కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీలు నిరాశ వ్యక్తంచేశాయి. దశాబ్దాలుగా ఈ అధికరణ చుట్టూ సాగుతున్న వివాదానికి తాజా తీర్పు ముగింపు పలికింది. 370వ అధికరణ రద్దు సహా అన్ని విషయాల్లోనూ ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు కలిసి ఒక తీర్పు వెలువరించగా దానితో ఏకీభవిస్తూనే జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజమే. కశ్మీర్ వంటి భావోద్వేగాలతో ముడిపడివుండే అంశంలో వీటి తీవ్రత కాస్త అధికంగానే ఉంటుంది. అందువల్లే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కశ్మీర్లో ఉగ్రవాదం వేళ్లూన డానికీ, భద్రతాబలగాలపై దాడులకూ మూలం 370వ అధికరణలో ఉందన్నది జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచీ బీజేపీ నిశ్చితాభిప్రాయం. దానికితోడు పాకిస్తాన్, చైనా సరిహద్దుల సమీపంలో ఉండటంవల్ల కశ్మీర్ ఘటనలు దేశ పౌరులందరినీ కలవరపరుస్తుంటాయి. అయితే అధికరణ రద్దుపై స్థాని కులు ఏమనుకుంటున్నారన్నది స్పష్టంగా తెలియదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదేళ్లవుతోంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్ ప్రాంతంలోని మూడు స్థానాలనూ నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా, జమ్మూ ప్రాంతంలోని మూడు స్థానాలు బీజేపీకి లభించాయి. 2019 ఆగస్టు 5న రాష్ట్ర పతి నోటిఫికేషన్ జారీకి నాలుగు రోజుల ముందు నుంచీ కశ్మీర్‌కు భద్రతా బలగాల తరలింపు, విద్యా సంస్థలకు సెలవులు, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ, అమర్నాథ్ యాత్ర నిలుపుదల వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందు సైతం కశ్మీర్లో ప్రధాన పార్టీల నేతలంతా తమను గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. ఇదంతా గమనిస్తే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అత్యంత సున్నితమైన సమస్య అని అర్థమవుతుంది. జమ్మూ–కశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని 1947లో భారత్‌లో విలీనం చేసినప్పుడి చ్చిన హామీకి అనుగుణంగా 1949లో రాజ్యాంగ నిర్ణాయక సభ 370వ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చింది. ఆ అధికరణ ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, కమ్యూనికేషన్లు, రక్షణ మినహా ఇతర అంశాలు జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప ఆ రాష్ట్రంలో అమలు కావు. అయితే ఒకసారంటూ దేశంలో విలీనమయ్యాక ఇక ‘అంతర్గత సార్వభౌమత్వం’ అనేదే ఉండదని తాజా తీర్పుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 370వ అధికరణ తాత్కాలిక స్వభావంతో కూడుకున్నదని... తాత్కాలిక, మధ్యంతర అధికరణలున్న రాజ్యాంగంలోని 21వ భాగంలో చేర్చటమే ఇందుకు నిదర్శమని జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం భాష్యం చెప్పగా... నెమ్మదిగా జమ్మూ– కశ్మీర్‌ను కూడా ఇతర రాష్ట్రాలతో సమానం చేయటమే దాని ఉద్దేశమని విడిగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలతోనూ విడిగా తీర్పునిచ్చిన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏకీభవించారు. ఈ అధికరణ స్వభావం ఏమిటన్న అంశాన్ని 2016లో సుప్రీంకోర్టు పరిశీలించింది. అది తాత్కాలికమైనదన్న వాదనను అప్పట్లో తోసి పుచ్చింది. అందుకు అదే అధికరణలోని సబ్ క్లాజ్ 3ని ఉదాహరించింది. రాష్ట్ర రాజ్యాంగసభ సిఫా ర్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే 370 రద్దవుతుందని ఆ క్లాజ్ సారాంశం. 1957 తర్వాత రాజ్యాంగసభ ఉనికిలో లేదు గనుక ఇక దాని రద్దు అసాధ్యమని అప్పట్లో సుప్రీంకోర్టు భావించింది. అయితే రాజ్యాంగసభ రద్దుతో సబ్ క్లాజ్ 3 నిరర్థకమైపోయిందని, ఆ అధికారం రాష్ట్ర అసెంబ్లీకి దఖలు పడిందని తాజా తీర్పుల్లో న్యాయమూర్తులు భావించారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది గనుక గవర్నర్ సిఫార్సు సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో ఎన్నికలు జరిపించాలని పిటిషనర్లు ఎవరూ కోరకపోయినా ఆ విషయాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసు కున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా ఆ ప్రక్రియ పూర్తి కావాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. అంటే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాకే అక్కడ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలో కూలంకషంగా చర్చించిన తర్వాతే వివిధ అధికరణలు రాజ్యాంగంలో చేరాయి. ఆ అధికరణలు చేర్చటంలోని అంతర్గత ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి ఆ చర్చలు దోహదపడతాయి. అయితే దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పులు న్యాయమూర్తుల దృక్పథా లను నిర్దేశిస్తాయి. ఆ అధికరణలకు కొత్త చేర్పులు తీసుకొస్తాయి. వాటి పరిధి విశాలమవుతుంది. లేదా వాటి రద్దు సబబే అనిపించవచ్చు. ఏదేమైనా కేంద్రం ఈ నిర్ణయానికి ముందు అక్కడి ప్రజానీ కాన్ని, మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులను కూడా సంప్రదిస్తే బాగుండేది. వీరంతా భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని దృఢంగా విశ్వసిస్తున్న వారు. వర్తమాన పరిస్థితుల్లో సత్వర నిర్ణయం అవసరమని కేంద్రం భావించివుండొచ్చు. ఇప్పటికైనా ఆ ప్రాంతప్రజల అపోహలు తొలగించే కృషి మొదలుకావాలి. కశ్మీర్ అభివృద్ధి సాకారం కావాలి. -
రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా?
రాజ్యాంగ నిర్మాతలు జాతి లక్ష్యాలనూ వాటిని సాధించేందుకు అవసరమైన వ్యవస్థలనూ, ప్రక్రియలనూ రాజ్యాంగంలో పొందు పర చారు. జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమాజం ఏర్పాటు అనేవి జాతి లక్ష్యాలుగా ఉద్దేశించబడ్డాయి. వీటిని సాధించేందుకు ప్రజాస్వామిక స్ఫూర్తితో రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలను విని యోగించుకుంటూ సామాజిక, ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందని భావించారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటికి అవే పనిచెయ్యవు. ఆ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డ రాజకీయ యంత్రాంగం నడిపించాల్సి ఉంటుంది. ప్రముఖ న్యాయమూర్తి జాన్ మార్షల్ అన్నట్లు ‘రాజ్యాంగం అనేది భావితరాల కోసం రూపొందించ బడుతుంది, కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడూ ఒడుదొడుకులు లేకుండా ఉండదు’. రాజ్యాంగం అంటే ఒక జాతి సామాజిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే దిక్సూచిలాగా భావించాలి. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. వాటిని రాజ్యాంగ సూత్రాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలకూ, చారిత్రక అసమా నతల మీద ఏర్పడ్డ సామాజిక వ్యవస్థకూ భిన్నత్వం ఉంది. ఈ వైరుద్ధ్యాల నడుమనే భారత రాజకీయ వ్యవస్థ రాజ్యానికీ, వ్యక్తుల హక్కు లకూ మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగాలి. వ్యక్తి స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ ప్రధానమైనవిగా భావించాలి. అంబేడ్కర్ చెప్పిన ‘చట్టం ముందర సమానత్వం’ భావన కేవలం సూత్రప్రాయంగా కాక ‘రూల్ ఆఫ్ లా’ ప్రాతిపదికన ముందుకు సాగాలి. వర్తమానంలో రాజ్యాంగానికి ఆవల ఉండే పద్ధతుల్లో ఎన్నో విధ్వంసకర విధానాలు ‘సర్వసమ్మతి’ పేరున జరుగుతున్నాయి. 1990ల్లో వచ్చిన నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనితో ‘సంక్షేమ రాజ్య’ స్థాపన లక్ష్యానికి గండిపడింది. సామాజిక సంక్షేమం సందిగ్ధంలో పడింది. ఫలితంగా సమాజ సంక్షేమం స్థానే మార్కెట్ ప్రయోజనాలే ముందుకొచ్చాయి. వరల్డ్ బ్యాంక్ విధానాలు స్థానిక ప్రభుత్వాలను సైతం దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే నేడు దేశంలో ‘విశ్వాసమే’ ప్రధానం అనే భావనను సర్వసమ్మతి పేరున రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్నీ భిన్న అభిప్రాయాలనూ, నేర పూరిత కుట్రగా చలామణీ చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో నేడు ఏకతా సూత్రాల దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆహార నియమాల పట్ల కూడ ప్రత్యక్ష ఆంక్షలు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం పరిపాలన కంటే విశ్వాసమే చట్టంగా పాటించాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరే కిగా, దేశద్రోహిగా కేసులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదని చెప్పిన తీర్పు స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళే ’విశ్వాసమే’ ప్రధానం అనే భావజాలాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువల సాక్షిగా ప్రజలు తమ హక్కులకు, జీవితాలకు, రాజ్యాంగ రక్షణకు, తామే నిబద్ధులుగా వ్యవహరించాల్సిన, కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భారతదేశంలో ‘చట్టబద్ధ పాలన’ (రూల్ ఆఫ్ లా) సజాపుగా సాగాలంటే దేశ పౌరసమాజం ద్వారా మాత్రమే రూల్ ఆఫ్ లాను పొందగలరు. – డా‘‘ నూతక్కి సతీష్, నాగార్జున విశ్వవిద్యాలయం డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ – రీసెర్చ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ -
రాజ్యాంగ పఠనం మన తక్షణావసరం
1949 నవంబర్ 26వ తేదీన, రాజ్యాంగ సభలో భారత ప్రజలు తమకి తాము రాజ్యాంగాన్ని సమర్పించుకున్నారని చరిత్ర చెపుతుంది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు 284 మంది రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేశారు. ఆ సమయంలో వానజల్లులు పడుతూ ఉండడం శుభ శకునంగా భావించారట. శాస్త్రీయ దృష్టి కోణం, స్వేచ్ఛ, సమానత్వాల ఆకాంక్షలతో రాసుకున్నది రాజ్యాంగం. ఆ ప్రయత్నపు ఆమోద సమయంలో ఇటు వంటి వ్యక్తీకరణ కాస్త వింతగానే ఉంటుంది. కానీ భారత రాజ్యాంగ రచనా ప్రస్థానం మొత్తం చూస్తే పై విలువలు రాజ్యాంగంలో పాదుకొల్పడానికి ఒంటి చేత్తో పోరాటం చేస్తూ, నిప్పులవాగులో నిరంతరం ఎదురీదిన అంబేడ్కర్ గుర్తుకు వస్తే ఆ చిరుజల్లులు కురవాల్సినవే అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా రాజ్యాంగం ఇపుడు తరుచూ మాట్లాడుకునే అవసరం అయింది. ముఖ్యంగా పీడిత వర్గాలు తమ హృదయాలలో వెలిగించు కున్న ఆశాదీపం అయింది. తమ తమ మతగ్రంథాల కన్నా మిన్నగా రాజ్యాంగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. భారత రాజ్యాంగం చుట్టూ దాని ఆచరణలో విరోధాభాస కొంత ఉంది. నిజంగా రాజ్యాంగపు రక్షణ తప్పనిసరిగా కావాల్సిన వర్గాల వారు ఆ స్ఫూర్తిని ప్రకటించడం మొదలు పెట్టగానే ఆధిపత్య వర్గాలు, ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలు పెడతాయి. రాజ్యాంగం శ్రమజీవులను విముక్తి చేయగలదా అన్న ప్రశ్నకి జవాబు అంత సులువు కాదు. రాజ్యాంగం ద్వారా సాధించుకోవలసిన విలువలను గుర్తిస్తూనే ఆచరణలో ఆ విలువలను నిలబెట్టలేని పరిమితులు కూడా రాజ్యాంగంలో ఉన్నాయన్నది గ్రహించాలి. ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన శక్తిమంతమైన ఆయుధం ‘ఓటు’ అనుకుంటాము కదా! తమని తాము పరిపాలించుకోవడానికి తమని తామే ఎన్నుకునే వ్యవస్థ మనది. దాని ప్రకారం మెజారిటీ ప్రజలు తమ సంక్షేమానికి పాటుపడే పార్టీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నుకుంటారు. మరి ఆచరణలో ఇంత సింపుల్‌గా జరుతున్నదా? కొన్నేళ్ళ కిందట ‘న్యూటన్’ అని ఒక సినిమా వచ్చింది. ఎన్నికలు ఎంత ఫార్స్‌గా మారిపోయాయో మనసుకు హత్తుకునేట్లు చెప్పడం కోసం త్రిముఖ నేపథ్యాన్ని తీసుకున్నారు. ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ సాధనాలతో పోరాడే మావోయిస్టులు, ఎన్నికలని నిజాయితీగా జరిపించాలనుకునే పోలింగ్ బూత్ అధికారి, ఓటు అంటే తెలియని అమాయకపు ఆదివాసీలు – ఈ ముప్పేట కథనంతో భారత ప్రజాస్వామ్యపు లొసుగులను కళ్ళకి కట్టినట్లు చూపించారు. రాజ్యాంగంలో తాము ఏమి హక్కులు పొందు పరుచుకున్నారో తెలియని ప్రజలు కోట్లాది మంది. ఓటుని హక్కుగా ప్రజలకి ఇవ్వగలిగిన రాజ్యాంగం, ఇన్నేళ్లలో ఆ ఓటు చుట్టూ ఉన్న దట్టమైన డబ్బు అల్లికని తెంపలేకపోయింది. అనేక మౌలిక హక్కు లను ప్రకటించిన రాజ్యాంగం దొంతర్లుగా పేరుకు పోయిన అంతరాలను తగ్గించలేకపోయింది. అలాగని ఇప్పటికిపుడు దేశవ్యాప్తంగా అందరినీ సమానత్వపు తాటిమీదకి తెచ్చే పూర్తి భరోసాని ఏ రాజ కీయాలూ ఇవ్వలేకపోతున్నాయి. కులం, మతం, వర్గం, జెండర్ తదితర అంశాలలోని ఆధిపత్య శక్తులని అదుపు చేయగలిగే తక్షణ రక్షణ కవచంగా రాజ్యాంగం మాత్రమే కనిపిస్తోంది. సూక్ష్మస్థాయి సంగతి సరే, స్థూలంగానైనా మేళ్ళు జరగాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపా డుకోవడానికి పోరాటం చేయక తప్పదు. రాజ్యాంగాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. గత పదేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలు అపరిమితంగా పెరిగిపోయాయి. తినడానికి ఒక ముద్ద తక్కువైనా ఓర్చుకోగలిగే మనుషులు, తమ విశ్వాసాల పట్ల నిక్క చ్చిగా స్వాభిమానంతో ఉంటారు. భిన్నమతాలకి నిలయమైన ఇండియాలో మైనార్టీలకి హక్కులకి రక్షణ ఉండాలని, మతాల మధ్య చిచ్చు రేగకూడదనే భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది రాజ్యాంగం. దాని ప్రకారం భారత ప్రజలు మతస్వేచ్ఛని కలిగి ఉంటారు. ప్రజలని పరిపాలించే ప్రభుత్వాలు మాత్రం మతాతీతంగా పరిపాలన చేయాలి. కానీ మనుషులు పౌరులుగా కాక ఓటుబాంకులుగా కనపడడం మొదలయ్యాక మత సామ రస్యం కాలం చెల్లిన విలువ అయిపోయింది. ఇక మెజారిటీ మత రాజ్యస్థాపన లక్ష్యంగా కలిగిన పార్టీలు పరిపాల నలోకి రావడం వల్ల రాజ్యాంగస్ఫూర్తి మరింత క్షీణించింది. మన వ్యక్తిగత విశ్వాసాలు, భావోద్వేగాలకి రాజ్యాంగం విలువ ఇచ్చినట్లే, మనమే రాసుకున్న రాజ్యాంగం పట్ల మనందరికీ అవగాహన ఏర్పడడం చాలా అవసరం. పౌరులుగా ఎలా మెలగాలన్న రాజకీయ స్పృహని మౌలి కంగా రాజ్యాంగం ఇస్తుంది. రాజకీయాలంటే అయిదేళ్ళ కోసారి వచ్చే ఎన్నికలు, కుల, మత, వర్గ గోదాల్లో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల బెట్టింగ్ కాదనీ, అది తరతరాలుగా సమాజాన్ని ప్రభావితం చేయగల చైతన్యమనీ తెలుపుతుంది. ఈ రాజకీయ స్పృహ కలిగిననాడు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతల ఆలోచన కూడా మొదలవుతుంది. రాజ్యాంగం ఇపుడు మన తక్షణావసరం అన్నామంటే అది బేషరతు కానక్కర్లేదు. రాజ్యాంగ విలువలని కాపాడు కోవడానికి కృషి చేస్తూనే, ఆధిపత్య వర్గాలకి అనువుగా మారే పరిమితులను కూడా గుర్తించాలి. దృఢ అదృఢ లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగానికి ఎపుడైనా సవరణ జరిగితే పీడిత ప్రజల ఆకాంక్షలు అందులో ప్రతిఫలించేట్లు జాగరూకులమై ఉండాలి. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే malleswari.kn2008@gmail.com (నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం) -
సమాఖ్య వ్యవస్థకు ఎంతటి దుర్గతి!
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా? గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్‌ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది. నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్‌తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు. ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్‌కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది. ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్‌కు హక్కు లేదు. కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి? సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. ‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్‌షిప్‌లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్‌తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. -
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’ – ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023) వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్ యూనియన్‌లో చోటుచేసుకున్న సంఘటన. పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్ స్క్వేర్‌లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట! అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్ గాంధీ ‘జోక్’ కూడా క్రిమినల్ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్‌ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు. ‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్‌గా పనిచేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’! చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్’ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు. (సైమన్ సీబాగ్ మాంటిఫియోర్ ‘ది వరల్డ్: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హుమా నిటీ’). బహుశా కారల్ మార్క్స్ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’! అవును కదా మరి – ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’! abkprasad2006@yahoo.co.in -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పి తాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమనేత ‘ 98497 41695 రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా‘‘ గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు -
మన రాజ్యాంగం ‘పక్కా లోకల్’
ముంబై: ‘‘భారత రాజ్యాంగం అతి గొప్ప స్వదేశీ రూపకల్పన. ఆత్మగౌరవం, స్వతంత్రం, స్వపరిపాలనకు అత్యుత్తమ కరదీపిక’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కొనియాడారు. ‘‘కానీ కొందరు దాని విజయాలను అతిగా కొనియాడుతుంటే మరికొందరు పూర్తిగా పెదవి విరుస్తుంటారు. ఇది నిజంగా బాధాకరం. మన రాజ్యాంగం ఎన్నో గొప్ప ఘనతలు సాధించిందన్నది నిస్సందేహం. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా భారత సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని సమాజం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నప్పుడే ఈ అసమానతలు పోతాయన్నారు. శనివారం నాగపూర్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ తొలి కాన్వకేషన్‌లో సీజేఐ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలకు కట్టుబడితే రాణిస్తారంటూ యువ న్యాయ పట్టభద్రులకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ‘‘నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, పరిహారాలకు అంబేడ్కర్‌కు రుణపడి ఉండాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సామాజిక సంస్కర్తగా ఎదిగారు’’ అంటూ కొనియాడారు. -
అంబేడ్కర్ స్ఫూర్తి ప్రతిఫలించేదెప్పుడు!
సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండా పోతోంది. అతి కొద్దిమందిగా ఉన్న అత్యధిక సంపన్నులను ఒక వైపు, అత్యధికులైన అతి పేదలను మరొక వైపు చూస్తున్నాం. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమానతలూ తొలగాలని అంబేడ్కర్ అన్నారు. అలాగే దేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే రాజ్యాంగ లక్ష్యమని బాబాసాహెబ్ స్పష్టంగా ప్రకటించారు. ఆ మార్గంలో నడవడం మన పాలకుల ధర్మం. భారతదేశాన్ని ఎందరో పరిపాలించారు. వారందరికీ భారతదేశం అర్థం కావాలని ఏమీ లేదు. ఆర్యులకు, యవనులకు, కుషానులకు, అరబ్బులకు, మొఘలు లకు, బ్రిటిష్ వాళ్ళకు కూడా భారతదేశం అర్థం అయ్యిందని చెప్పలేం. వారంతా మూలవాసుల్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారే. సామరస్యమూ, శాంతి, ప్రేమతో కూడిన మూలవాసుల భావన లను ధ్వంసం చేసే క్రమంలో వారంతా భారత చరిత్ర వక్రీకరణకు కారణం అయినవారే. ప్రస్తుత పాలకులు సైతం మన పూర్వ పాల కుల్లా నిజమైన సంస్కృతీ వికాసం మతవాదుల్లో ఉందనే నమ్ము తున్నారు. నిజానికి ఆ వికాసం హేతువాదులు, భౌతికవాదులు, అంబేడ్కర్ వాదులు, లౌకికవాదుల్లో వుంది. అసలు భారతదేశానికి మొదటి దర్శనం చార్వాక దర్శనం, రెండవ దర్శనం జైన దర్శనం, మూడు బౌద్ధ దర్శనం, నాలుగు సాంఖ్య దర్శనం. ఇవన్నీ నిరీశ్వర వాద దర్శనాలే. బౌద్ధ దర్శనం సాంఘిక సమానత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. అది మూలవాసుల నుండి జనించింది. మాన వాళి పట్ల దయార్ధ్ర దృష్టితో మెలగడం కరుణ అనీ, సాటి వారి పట్ల సౌహార్ద్ర దృష్టిని కలిగి ఉండటమే మైత్రి అనీ, ఈ సౌశీల్య విధానాలు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పాటించాలనీ బుద్ధుడు ప్రబోధించాడు. వ్యక్తి నిర్మలత్వానికి కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. బుద్ధుని సిద్ధాంతాలు.. అప్పటి వరకు వైదిక సంస్కృతి ఆచరణలోకి తీసుకు వచ్చిన మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వ్యక్తి స్వార్థాన్ని, దుష్ట ప్రవర్తనను ఖండించి నూత్న సామాజిక దృక్పథాన్ని కలిగించాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండే భారతదేశం బౌద్ధ సంస్కృతిలో నడిచింది. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ ఈ బౌద్ధ సూత్రాలనే పొందు పరిచారు. ఆ ప్రకారం.. ఏ మతానికి చెందిన పాలకులైనా ఆ మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలిగాని, దాన్ని రాజ్యం మీద రుద్దకూడదు. అయితే మతం, మతస్వేచ్ఛ గురించి చర్చించుకునే క్రమంలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే లౌకిక భావంతో వ్యవహ రించాల్సిన ప్రభుత్వాలే మతతత్వాన్ని ప్రేరేపిస్తుండటం! మరోవైపు సుసంపన్నమైన దేశంగా పరిగణన పొందుతున్న మన నేలలో ఆకలి చావులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుల, మత, అసమానతలు నిరంతరం వృద్ధి చెందుతున్నాయనీ; అణచివేతలు, గృహహింస విపరీతంగా పెరిగిపోతున్నాయనీ సామాజిక సర్వేలు చెపుతున్నాయి. ఇదే సమ యంలో కార్పొరేట్ పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని కొన్ని శక్తులు యథేచ్ఛగా విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్ని టినీ ప్రైవేటు వ్యక్తులకు అధీనం చేయడం వల్ల భారతదేశంలో దళిత బహుజన యువకులకు ఉద్యోగ వసతి గగన కుసుమం అయింది. వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతిన్నది. అయితే ఇది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం మూలాన కాదు. వ్యవసాయ ఉత్పత్తి ధరలు విప రీతంగా పడిపోవడం వల్ల. దీంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. రైతులు రుణగ్రస్థులయ్యారు. లక్షలాదిమంది జీవన వ్యవస్థలు కుంటుపడ్డాయి. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. ఈ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడటానికి బదులు పాలకులు వ్యవసాయ రంగం కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య (డబ్ల్యూటీఓ) షరతులు కూడ మన దేశ రైతాంగానికి ప్రతికూలంగా ఉన్నాయి. అధికార పార్టీ తన సంఖ్యాబలంతో పార్ల మెంటరీ కమిటీల పరిశీలనలు, పార్లమెంటరీ ప్రొసీజర్లు లేకుండానే చట్టాలకు దారి ఏర్పచుకుంటోంది. ముఖ్యమైన చట్టాలు ఎలాంటి చర్చ లేకుండా గందరగోళాల మధ్యనే ఆమోదం పొందుతున్నాయి. అందుకే పార్లమెంట్లో అంతర్గత నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ పట్ల తన జవాబుదారీతనం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. నూట పదకొండుమంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పార్లమెంట్లో సామాజిక న్యాయాన్ని సాధించటంలో నిరంతరం విఫలం అవుతున్నారు. మహిళా ఎంపీల హక్కుల పోరాట స్వరాలు నిష్ఫలం అవుతున్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండాపోతోంది. పేదలకు భూమి పంపకం లేదు. గిరిజనుల భూములకు రక్షణ లేదు. ఆదివాసుల జీవన ప్రమా ణాలు, విద్యా వైద్య వసతులు నానాటికీ కుంటుపడుతున్నాయి. రక్తలేమితో బాధపడుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది. గర్భవతులకు, వితంతువులకు సంరక్షణ లేదు. ఆర్థిక సామాజిక, రాజకీయ అంత రాలు ఎక్కువవుతున్నాయి. అతి కొద్ది మందిగా ఉన్న అత్యధిక సంపన్నులు ఒకవైపు, అత్యధికులైన అతి పేదలు మరొక వైపు అన్నట్లుగా ఉంది. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమా నతలూ తొలగాలని చెబుతూ అంబేడ్కర్... శ్రామికవర్గం హక్కులు, ప్రాతినిధ్యం, సాధికారతల గురించి చాలా నిశితమైన వివరణల్ని 1943 సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కొత్త ఢిల్లీలో జరిగిన కార్మిక సమ్మేళనంలో వ్యక్తపరిచారు. అందులోని చాలా అంశాల ఉల్లంఘన నేడు మనకు దృశ్యీకృతం అవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కింద అత్యధికుల అభీష్టం మేరకు శాసన, పాలనా విధానాలు అమల వుతున్నాయి. ఎవరైతే సంఘానికి ఆర్థిక నిర్మాణాన్ని దేశ సామాజికత ఆధారంగా రూపకల్పన చేయదలిచారో... వారు ప్రాథమిక ఆవశ్యకతను విస్మరించకుండా తమ లక్ష్యాన్ని పూర్తిచేయాలని గుర్తుంచుకోవాలి. సంఘ ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగం నిర్దేశించాలన్న ప్రతిపాదన నిర్వివాదాంశం. ఆర్థిక నిర్మాణ విధానం ఎలా ఉండాలన్నదే మిగిలి ఉన్న ప్రశ్న. దానిని ఈ మూడు విధానాల నుండి ఎంపిక చేయాలి. 1. పెట్టుబడిదారీ విధానం, 2. సోషలిజం, 3. కమ్యూనిజం. మరి శ్రామికుల ఎంపిక ఎలా ఉండాలి? శ్రామికులు పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకోలేరు, ఆ విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకుంటే శ్రామికులు వారి స్వేచ్ఛను కోల్పో తారు. అందుకే వారి భవితవ్యానికి ముఖ్యమైన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సంతోషాలు పొందడంలో ప్రజాస్వామ్య దేశాలు అవలంబించవలసిన మార్గాలు ఏంటంటే... ప్రభుత్వ అధికారాన్ని రాజకీయ రంగంలో తక్కువగా జోక్యం చేసుకోనివ్వడం; చాలా శక్తిమంతమైన వ్యక్తుల ఆధిక్యతను అణచటానికి సాధారణ శాసనాధికారాన్ని మేల్కొల్పి, తక్కువ శక్తిమంతమైన ఆర్థికరంగంపై అసంబద్ధమైన ఇబ్బందులను విధించకుండా ఉండడం. ఈ విధమైన అంబేడ్కర్ ఆలోచనలు రాను రాను భారతీయ సమాజాన్ని పున ర్నిర్మించడానికి అత్యవసరం అవుతున్నాయి. ఆయన రాజ్యాంగ రచనకు ముందూ, వెనుకా అన్ని తరగతుల ప్రజల జీవన ప్రమాణాలను దర్శించారు. ‘‘భారతదేశానికి అనేక మతాలు వచ్చాయి, అనేక మతాలు ఇక్కడే ఆవిర్భవించాయి. అయితే ఏ మతా ధిపత్యంలోకీ భారతదేశం వెళ్లకూడదు. భారతదేశం లౌకిక రాజ్యంగానే మనగలగాలి. భారతదేశంలో ప్రతీ పౌరుడు ఒకే సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను రూపొందించిన రాజ్యాంగం అన్ని దిశలా ప్రతిఫలిస్తుంది’’ అని అంబేడ్కర్ భావించారు. రాజ్యాంగ రూపకల్పన కృషిలో అంబేడ్కర్ తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే ఈ రాజ్యాగం లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
‘చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’
సాక్షి, కాకినాడ: అధికారంలో లేనప్పుడే చంద్రబాబుకు రాజ్యాంగం గుర్తుకు వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు స్వప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీరియస్ అయ్యారు. కాగా, కన్నబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దేశానికి బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారు. రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదం. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎవరు వ్యవహరిస్తున్నారో చర్చకు చంద్రబాబు సిద్ధమా?. కళ్లబొల్లి కబుర్లతో ఎంతకాలం ప్రజలను మోసగిస్తారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజ్యాంగ పరిరక్షణా?. వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ను కూలదోయడం రాజ్యాంగ పరిరక్షణా?. రాజ్యాంగ స్ఫూర్తి, పరిరక్షణ గురించి చంద్రాబాబా మాట్లాడేది?’ అంటూ కామెంట్స్ చేశారు. -
Constitution: పౌరులకు పట్టం కట్టిన పత్రం
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ... సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మగ్గిన తర్వాత భారత దేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రదేశంగా మారింది. జాతి ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వాతంత్య్రం, దీర్ఘకాలం కొనసాగిన పోరాట ఫలితమే. తమ ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రమైన నిర్బంధాన్ని చవిచూసిన వేలాదిమంది మన దేశవాసులతో పాటు ఈ పురాతనమైన, ఘనమైన గడ్డమీది సాధారణ పౌరులు కూడా కన్న కలల ఫలితమే ఈ స్వాతంత్య్రం. వలస పాలనకు పూర్వ సహస్రాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందుతూ వచ్చింది. కానీ, స్వాతంత్య్రం పొందిన నాటికి దారిద్య్ర భారతాన్ని వారసత్వంగా పొందాము. దీంతో భారత నవయువ రిపబ్లిక్‌తో దీర్ఘకాల ప్రయోగంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి నిరక్షరాస్యత అలుముకున్న, దారిద్య్రం పేరుకున్న, ఆధునిక ప్రజాతంత్ర వ్యవస్థలు, సంస్థలు లేని మన జాతికి సార్వత్రిక వయోజన హక్కును కల్పించే విషయంలో, ప్రజాస్వామిక ఆదర్శ పాలనను చేపట్టడానికి సంబంధించిన ఆకాంక్షను వ్యక్తపరిచే విషయంలో పలు సందేహాలు అలుముకున్నాయి. అయితే రెండు వేల సంవత్సరాల క్రమంలో ఏర్పడుతూ వచ్చిన మన ప్రజాస్వామిక విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజ్యాంగ నిర్మాతలు... విధ్వంసం తప్పదని జోస్యం చెబుతున్న సంశయ వాదులను చూసి భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. రాజ్యాంగ సభ సభ్యులు, మన గ్రామ గణతంత్రాలలో రూపు దిద్దుకుని ఉన్న సాంప్రదాయిక భాగస్వామ్య పాలనా రూపాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే అన్నిటికంటే మించి మన రాజ్యాంగ రూపకర్తలకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొని తీరాలి. సగటు భారతీయ పౌరుల ప్రజాస్వామిక సున్నితత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఇది లేకుంటే భారత్ తనను తాను ఒక ప్రజాస్వామ్య మాతగా న్యాయబద్ధంగానే ప్రకటించుకోలేకపోయేది. ఆధునిక చరిత్రలో ‘అమృత్ కాల్’లోకి జాతి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా మన మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు మన రాజ్యాంగ పునాదిని రూపొందించిన ఆదర్శాలు, మూల సూత్రాలు నేటికీ బలంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. భారత రాజ్యాంగం మనసా వాచా ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగా లన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తూ వచ్చాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శ కత వైపు అలుపు లేని ప్రయాణం సాగించడానికి వీలుపడింది. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని కల్పించే కృషిని ప్రోత్సహిస్తున్న ఆధునిక సంక్షేమ రాజ్యంగా మారడానికి మన ప్రయాణాన్ని భారత రాజ్యాంగం సులభతరం చేసింది. రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు అత్యంత ప్రధాన అంశం ఏమిటంటే, అది శిలాజం కాదు, ఒక సజీవ పత్రం. దీంట్లో మన జాతి ప్రాథమిక విలువలకు, నాగరికతకు ఆశ్రయమిచ్చే అనుల్లంఘనీయ మైన కేంద్రకం ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా ప్రయోజనాల డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా కేంద్ర కమైన రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న మనం ఒక జాతిగా ఇంత వరకు సాగించిన ప్రయాణం పట్ల, విభిన్న రంగాల్లో మనం సాధించిన విజయాల పట్ల గర్వపడవచ్చు. ‘అమృత్ కాల్’లోకి మనం ప్రవేశిస్తూ, స్వావలంబనతో కూడిన, బలమైన ఐక్యమైన మహా జాతిగా వచ్చే 25 సంవత్సరాల్లో మారాలనే మన స్వప్న సాకారం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాము కాబట్టి మన ప్రజల్లో, మన రాజ్యాం గంలో మన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించుకునే తరుణం ఇదే. ‘అమృత్ కాల్’లో భాగమైన ‘పంచ ప్రాణ్’ అంటే అర్థం, వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గురించి మనం చేసుకున్న తీర్మానం మాత్రమే. వలసవాద ఆలోచనా తీరునుంచి బయట పడటం, మన వారసత్పం పట్ల గర్వపడటం, ఐక్యతను, సంఘీ భావాన్ని బలోపేతం చేసుకోవడం, పౌరుల్లో కర్తవ్య పరాయణత్వాన్ని పోషించడం వంటి లక్ష్యాలు... 1949 నవంబర్ 26న మనం చట్ట రూపంలోకి మార్చుకుని ఆమోదించిన రాజ్యాంగ ఆదర్శాలను గుర్తిం చడంలో నిస్సందేహంగా తోడ్పడతాయి. 1931లోనే మహాత్మా గాంధీ రాశారు: ‘‘నైతిక బానిసత్వం నుంచి, ఆధారపడటం నుంచి భారత్‌ను విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను పరితపిస్తాను. అత్యంత నిరు పేదలు సైతం ఇది నా దేశం అని భావించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అగ్రకులం, తక్కువ కులం అనే తేడా లేని భారత్ కోసం నేను శ్రమిస్తాను. అన్ని సామాజిక బృందాలు సామరస్యంతో కలిసి జీవించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అలాంటి భారతదేశంలో అంటరాని తనం అనే శాపానికి తావు ఉండకూడదు. దోపిడీకి గురికావడం కానీ, దోపిడీ చేయడం కానీ లేని ప్రపంచంలో శాంతియుతంగా ఉండగలం. ఇదే నా స్వప్నాల్లో ఉంటున్న భారతదేశం.’’ సామాన్యుడిని కేంద్రస్థానంలో ఉంచగల రాజకీయ సౌర్వభౌమా ధికారం కలిగిన రాజ్యాంగం కోసం స్వాతంత్య్ర సమరం కాలంలోని రాజకీయ నేతలు ప్రయత్నించారు. సామాన్యుడి సంక్షేమం, ఆత్మ గౌరవానికి రాజ్యాంగంలో కీలక స్థానం ఉంటోంది. ‘పంచ ప్రాణ్’ను తీసుకుని, దాని సాకారం కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలగాలి. అప్పుడే మన ప్రజాస్వామిక నైతిక విలువలు సంపూర్ణ వికసనాన్ని చూస్తాయి. అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నాలను, త్యాగాలను గుర్తిస్తాయి. అప్పుడు మాత్రమే రెండు సహస్రాబ్దాలుగా మనం న్యాయబద్ధంగానే సాధించుకుని ఉన్న అగ్రగామి ప్రపంచ దేశంగా భారతదేశాన్ని తిరిగి నెలకొల్పగలుగుతాము. రాజ్యాంగం ప్రజలకు అధికారం కట్టబెడుతున్నట్లే, ప్రజలు కూడా రాజ్యాంగానికి అధికారం కట్టబెడతారు. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ, సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మకంగా బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. రాజ్యాంగ సభలోని ఒక గొప్ప వ్యక్తి ముందుచూపు, మేధాతత్వం, చాతుర్యం అనేవి రాజ్యాంగానికి రూపురేఖలు దిద్ద డంలో తోడ్పడ్డాయి. తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోద నీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. గత ఏడు దశాబ్దాల మన ప్రయాణంలోని ప్రతి సంక్లిష్టమైన మలుపులోనూ సామాన్య పౌరులే రాజ్యాంగ ఉన్నతాదర్శాల పట్ల తమ విశ్వాసాన్ని, నిబద్ధతను పునరుద్ధరించుకుంటా వస్తున్నారు. ఓం బిర్లా, వ్యాసకర్త, లోక్‌సభ స్పీకర్ (నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) -
ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?
కథ కొత్త మలుపులు తిరిగినట్టే, కేరళ ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య వరుస వివాదాల్లో కొత్త అంకం వచ్చి చేరింది. కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్పై తాను విశ్వాసాన్ని కోల్పోయాననీ, ఆయనపై చర్య తీసుకోవాలనీ ముఖ్యమంత్రిని గవర్నర్ కోరడం దిగ్భ్రాంతికరం. నిన్న గాక మొన్న 11 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లపై కినిసిన మహాప్రభువులకు ఇప్పుడు మంత్రి గారిపై విరక్తి కలిగింది. దానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. దేశ సమైక్యతకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారనీ, పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారనీ, కడకు గవర్నర్‌గా తన విశ్వాసాన్ని మంత్రి కోల్పోయారనీ... ఆరిఫ్ ఆరోపణ. అధికార ఎల్డీఎఫ్ సర్కార్ సారథి పినరయ్ విజయన్ మాత్రం సదరు మంత్రిపై తనకు పూర్తి విశ్వాసం ఉందంటూ, గవర్నర్ డిమాండ్‌ను తోసిపుచ్చాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను తప్పుబడుతూ అధికార, ప్రతిపక్షాలు ఒకే స్వరం వినిపిస్తున్నాయంటే ఆరిఫ్ గీత దాటేశారని అర్థమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకూ, రాజ్‌భవన్‌కూ పెరుగుతున్న దూరంపై అర్థవంతమైన చర్చ అవసరమని గుర్తుచేస్తోంది. కేరళలో తలుచుకుంటే మంత్రులను సైతం ఇంటికి పంపే అధికారం తనకు ఉందని కొద్దివారాల క్రితం రాష్ట్రపెద్ద హూంకరించారు. ఆ వివాదం సద్దుమణగక ముందే సుప్రీమ్ కోర్ట్ ఓ నియామకంలో ఇచ్చిన ఉత్తర్వును సాకుగా తీసుకొని, 11 విశ్వవిద్యాలయాల వీసీల నియామక ప్రక్రియను తప్పు పడుతూ, తప్పుకోవాల్సిందిగా ఆదేశించారు. అదీ అవాంఛనీయంగా ట్విట్టర్లో చెప్పారు. హైకోర్ట్ జోక్యంతో ఆ కథలో కొత్త దృశ్యం నవంబర్ మొదటి వారానికి వాయిదా పడిందో లేదో, ఓ విశ్వ విద్యాలయంలో ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆరిఫ్ కొరడా తీశారు. అన్ని ప్రాంతాల వారినీ కలుపుకొనిపోతూ కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయని మంత్రి గత వారం అన్నారు. విద్యార్థి నేతగా యూపీలోని విశ్వవిద్యాలయంలో చూసిన కాల్పుల ఘటనల్ని ప్రస్తావించారు. అది ఆరిఫ్‌కు సుతరామూ నచ్చినట్టు లేదు. దాంతో పరోక్షంగా పదవీచ్యుతుణ్ణి చేయమనే ప్రతిపాదన తెచ్చారనుకోవాలి. వరస చూస్తే– కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియుక్తులైన గవర్నర్, కేరళలో ప్రజలెన్నుకున్న వామపక్ష ప్రభుత్వంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. అలాగని కొన్నిసార్లు ప్రజాప్రభుత్వాలు గవర్నర్ గౌరవాన్ని మరీ తేలికగా తీసుకున్న ఘటనలూ లేవనీ అనలేం. వీసీల నియామకంలో గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ వివాదాస్పద విద్యాబిల్లు తెచ్చినప్పటి నుంచి కేరళ సర్కార్‌కూ, ఆరిఫ్కూ మధ్య అగాధం ఏర్పడినట్టుంది. నిజానికి వీసీలు సహా వివిధ నియామకాల్లో లాంఛనపూర్వక పాత్ర పోషించాల్సిన గవర్నర్లు లక్ష్మణరేఖ దాటుతున్నా రనే ఆరోపణ తరచూ వింటున్నాం. గవర్నర్ పాత్రను మరింత పరిమితం చేసేందుకు ఆ మధ్య తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు సాగడం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన ఉన్నత నియామక పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కనీసం ఉన్నట్టయినా కనిపించాలి. అలాంటిది... కూర్చున్న కుర్చీని మర్చిపోయి, ఆ పదవికి కారణమైనవారి పట్ల మునుపటి ప్రభుభక్తిని ప్రదర్శించాలనుకుంటేనే సమస్య. గవర్నర్ పదవిలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను మించి వ్యక్తిగత అజెండాకు తగ్గట్టు ప్రవర్తిద్దామనీ, ఆభిజాత్యం ప్రదర్శిద్దామనీ అనుకుంటే పదే పదే అగ్గి రాజుకుంటుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలు సహా ఇప్పుడు కేరళలోనూ జరుగుతోంది అదే. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్య ప్రభుత్వాలున్నప్పుడు పలు రాష్ట్రాల గవర్నర్లు ఇలాగే నాటి ప్రధానమంత్రుల చిత్తానుసారం వ్యవహరించేవారనే విమర్శలున్నాయి. అప్పట్లో వివిధ సందర్భాల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధింపు ఇలాంటి ప్రభుభక్తి పరాయణత పర్యవసానమే. తెలుగునాట ప్రజాబలంతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ పక్కకు తప్పించడం, ప్రజా ఉద్యమంతో ఎన్టీఆర్ తిరిగి పగ్గాలు చేపట్టడం, రామ్‌లాల్ కథ కంచికి చేరడం లాంటివన్నీ చరిత్రలో మర్చిపోలేని పాఠాలు. తమిళనాట గవర్నర్ చెన్నారెడ్డి వర్సెస్ సీఎం జయలలిత లాంటి కథలూ చూశాం. తాజాగా వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు కయ్యానికి కాలు దువ్వుతున్న తీరు అంతకన్నా ఒక మెట్టు పైనే ఉంది. పైకి ఇది సీఎంలకూ, గవర్నర్లకూ మధ్య కయ్యంగా కనిపించినా, అంతకన్నా లోతైన రాజకీయమే ఉంది. కేంద్ర పెద్దల ఆదేశంతో వీరిలా చేస్తున్నారో లేదో కానీ, అండ లేకుండానే ఈ దుస్సాహసాలకు దిగుతారనుకోలేం. రాష్ట్రం చేసే చట్టాలు, నియామకాలపై అభ్యంతరాలుంటే పునఃపరిశీలన కోరే అధికారం రాజ్యాంగం గవర్నర్లకిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంతకు మించి ఆ విచక్షణాధికారాల్ని ఉపయోగించే ప్రయత్నాలతోనే తంటా. అందుకే, కొందరు గవర్నర్ల తీరు మొత్తం ఆ వ్యవస్థకే అప్రతిష్ఠ తెస్తోంది. సమాఖ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలనూ, వాటి నిర్ణయాలనూ పరి హాసం చేస్తున్న గవర్నర్ వ్యవస్థపై చర్చను ప్రేరేపిస్తోంది. ఇటు ప్రజాతీర్పుతో గద్దెనెక్కినవారు, అటు రాజ్యాంగ పదవిలో ఉన్నవారు తమ హక్కులు, బాధ్యతల్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే వ్యవహారం ఇంత దూరం రాదు. మరీ ముఖ్యంగా, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి నుంచి ఆ హుందాతనం మరింతగా ఆశిస్తాం. ఆ సంగతి ఆరిఫ్ లాంటి వారికి పదే పదే గుర్తుచేయాల్సి రావడమే విచారకరం. నిలువునా చీలిన నేటి రాజకీయ వాతావరణంలో ఈ పరిస్థితి మారుతుందా అన్నది అనుమానమే! -
దేశంలో మోదీ రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘‘యశ్వంత్ సిన్హాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఆయనను హైదరాబాద్ రావాలని ఆహ్వానించాము. ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. బీజేపీ నిరంకుశ తీరును మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. దేశంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. బీజేపీ రాజ్యాంగం. దేశంలో మోదీ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోంది. మోదీ అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. గిరిజనులపై నిజంగా బీజేపీకి అభిమానం ఉంటే తెలంగాణలో రిజర్వేషన్లను పెంచాలి. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. మెజార్టీ లేకపోయినా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంబద్ధమైన వ్యవస్థలను చేతిలో పెట్టుకుని బెదిరిస్తున్నారు. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వెంటాడి మరీ వేధిస్తున్నారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తోంది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కేంద్రంపై కచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా. ప్రశ్నించే వారిని ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా మోదీ ఏం ఇచ్చారు?. దేశంలోని దళితుల కోసం కేంద్రం ఏం చేసింది?. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో.. శ్వేతపత్రం విడుదల చేయాలి.ప్రతీ దానికి సమయం వస్తుంది. నరేంద్ర మోదీది దద్దమ్మ గవర్నమెంట్. మోదీ నియంతృత్వ పోకడలపై నోరు విప్పాలి. వారిలో విషం తప్ప విషయం లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్.. రాజ్ థాక్రేతో టచ్‌లో ఏక్నాథ్ షిండే -
కులరహిత సమాజం కోసం...
ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు. ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది. రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్‌ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్) దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్‌గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
అవును... కొనసాగిస్తే ద్రోహమే!
శతాబ్దిన్నర క్రితం నాటి వలస పాలకుల చట్టమది. ఇవాళ అన్ని రకాలుగా కాలం చెల్లిన శాసనమది. అయినా సరే ఏలినవారి చేతిలో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే బలమైన ఆయుధంగా మిగిలింది. నిరసన తెలిపే రైతుల మొదలు విమర్శించే విలేఖరుల దాకా ప్రతి ఒక్కరినీ పాలకుల దృష్టిలో రాజద్రోహుల్ని చేసింది. ప్రభుత్వ సమీక్ష సాగే వరకు ఆ చట్టం అమలును నిలిపి వేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారమిచ్చిన ఆదేశం చరిత్రాత్మకమైనది. వేధింపులకూ, రాజకీయ కక్ష సాధింపులకూ సాధనంగా మారిన భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని ‘సెక్షన్ 124ఎ’ను సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనలపై ప్రజాస్వామ్యవాదులకు ఈ తీపి కబురు వచ్చింది. ఈ ఒక్క మాటతో చట్టాల దుర్వినియోగం సంపూర్ణంగా మారకపోయినా, కనీసం ఒక ముందడుగు. ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వ సమీక్ష ప్రక్రియ కోసం వేచిచూడాలి. ఒక చట్టంగా ఏదీ చెడ్డది కాకపోవచ్చు. కానీ, దుర్వినియోగంతోనే సమస్యంతా! రాజద్రోహ చట్టంలోనూ అదే జరిగింది. ఆ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చి, వారం తిరగకుండానే సరైన వేదికపై చట్టాన్ని సమీక్షిస్తామని మాట మార్చే ఏలికలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థల చొరవే సామాన్యులకు శ్రీరామరక్ష. రాజద్రోహ చట్టం కింద 2014 –19 మధ్య అయిదేళ్ళ కాలంలో దేశంలో మొత్తం 326 కేసులు దాఖలయ్యాయని హోమ్ శాఖే చెబుతోంది. వాటిలో అత్యధికంగా 54 కేసులు అస్సామ్ లోవే. అయితే, నమోదైన ఆ కేసుల్లో సగాని కన్నా తక్కువగా కేవలం 141 కేసుల్లోనే ఛార్జ్షీట్లు ఫైలయ్యాయి. తీరా ఆరుగురంటే ఆరుగురే దోషులుగా తేలారట. దీన్నిబట్టి పెడుతున్న కేసులకూ, దోషులకూ పొంతన లేదన్న మాట. ఇప్పటికీ ఏటా 90 శాతానికి పైగా కేసులు పెండింగ్‌లోనే. చరిత్ర చూస్తే, ఐపీసీ ముసాయిదాను రూపొందిస్తున్నప్పుడే బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే రాజద్రోహ చట్టాన్ని అందులో చేర్చారు. అయితే, 1860లో అమలులోకి వచ్చిన శిక్షాస్మృతిలో పొర పాటున ఈ చట్టాన్ని చేర్చలేదు. తర్వాత 1890లో ప్రత్యేక చట్టం 17 ద్వారా ఐపీసీలో 124ఎ సెక్షన్ కింద నేరంగా రాజద్రోహాన్ని చేర్చారు. అప్పట్లో ద్వీపాంతరవాస శిక్ష విధించేవారు. అటుపైన 1955లో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ అసమ్మతిని సహించలేని బ్రిటిష్ పాలకులు తిలక్, అనీబిసెంట్, మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్య్ర సమరయోధులపై ఈ శాసనాన్నే ప్రయోగించిన తీరు ఓ పెద్ద కథ. స్వాతంత్య్రం వచ్చాక రెండు హైకోర్టులు ఐపీసీ ‘సెక్షన్ 124ఎ’ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. కానీ, 1962 నాటి ప్రసిద్ధ కేదార్నాథ్ కేసులో అయిదుగురు జడ్జీల సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆ హైకోర్టు తీర్పుల్ని కొట్టేసి, ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొంది. హింసకు ప్రేరేపించనంత వరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినా సరే అది రాజద్రోహం కాదంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాతా గత 60 ఏళ్ళలో విచ్చలవిడిగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉండడం సిగ్గుచేటు. ఒక్క 2019లోనే రాజద్రోహం కేసులు 25 శాతం, అరెస్టులు 41 శాతం పెరిగాయి. అలా ఉద్యమ నేతలు హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్, పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవి, బీమా కొరేగావ్ కేసు నిందితుల మొదలు తాజా మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా – ఆమె భర్త దాకా పలువురు ఇప్పుడు రాజద్రోహులు. ప్రత్యర్థుల నోరు నొక్కడానికి కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఈ చట్టాన్ని వాటంగా చేసుకున్నాయని విమర్శలు వస్తున్నది అందుకే. 1950ల నుంచి నేటి దాకా పార్టీలకు అతీతంగా ఈ పాపంలో అందరిదీ భాగం ఉంది. భారత లా కమిషన్, సుప్రీం కోర్ట్ ఈ పరిస్థితిని ఎప్పుడో గుర్తించాయి. చట్టాన్ని రద్దు చేయడమే సబబన్నాయి. దేశ సమైక్యత, సమగ్రతకు పాకిస్తాన్, చైనా సహా అనేక ప్రమాదాలు పొరుగునే పొంచి ఉన్నవేళ, తీవ్రవాదాన్నీ, అసాంఘిక శక్తుల్నీ అణచివేయడానికి కఠిన చట్టాలు అవసరమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనో, మరొకటనో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఆ చట్టాలను దుర్వినియోగం చేయడంతోనే చిక్కు. ప్రాథమిక హక్కులైన వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు మినహాయింపుగా రాజద్రోహాన్ని పెట్టాలనే చర్చ రాజ్యాంగ రచన రోజుల్లోనే వచ్చింది. భారత రాజ్యాంగ షరిషత్లోని పలువురు సభ్యులు దానితో విభేదించి, ఆ మాటను చేర్చనివ్వక స్వేచ్ఛను కాపాడారు. అయితే, ఇవాళ చట్టమంటూ ఉన్నాక అరుదుగానో, తరచుగానో దుర్వినియోగం కాక తప్పని దుఃస్థితిలో పడ్డాం. అందువల్లే రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే వాదనలో బలం ఉంది. సమీక్షిస్తామనడం మంచిదే కానీ, దానికి ఏళ్ళూపూళ్ళూ కాలయాపన చేస్తేనే కష్టం. కొత్త పేరు, కొత్త రూపంలో పాత చట్టం తెస్తే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పటికే లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్ సాక్షిగా రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం విజ్ఞత. ఇంకా చెప్పాలంటే, విమర్శకులను వేధించడానికి సాధనాలవుతున్న ‘ఉపా’ లాంటి అనేక స్వాతంత్య్రానంతర కర్కశ చట్టాలపైనా ఆ ఉదార సమీక్ష నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది. మారిన కాలానికి తగ్గట్టుగా శిక్షాస్మృతిని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త స్మృతిని పార్లమెంట్ ఆమోదంతో తేవాలని నిపుణుల మాట. ఎనిమిదేళ్ళలో 1500కి పైగా పాత చట్టాలను రద్దు చేశామని జబ్బలు చరుస్తున్న పాలకులు ఇంతటి విప్లవానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా? ఎంతసేపటికీ అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయలేదనే కన్నా, ఇప్పుడు తాము చేసిచూపడంలోనే చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే అమృత కాలం గడిచిపోయింది. -
దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!
ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్ ఒక సంఘం, విద్వేష కేంద్రం కాదు అనేది తొలి పాఠం. నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వాన్ని ‘సంఘం’ అని రాజ్యాంగం అంటోంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష విధ్వంస ఉద్వేగ ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి, భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో... రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. ‘నేషనల్’ అన్న పదానికి తెలుగులో మనం ‘జాతీయ’ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశభక్తి భావాలను రక రకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం. మన నాయకుల సంగతి మరీ దారుణం. చంపండి, నరకండి అని తెలుగు సినిమా ఫ్యాక్షన్ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను వేదికల మీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడే వారు దేశద్రోహులు. వాడుకగా పత్రికల్లో, టీవీల్లో మనం ‘కేంద్రం’ అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనే మాటే లేదు. ఆ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తొలి తెలుగుదేశం వ్యవస్థాపకుడు (చంద్రబాబు నాయుడికి ముందు తెలుగుదేశం) ఎన్టీ రామారావు ‘కేంద్రం’ అనే పదం ‘మిథ్య’ అనేవారు. రాష్ట్రాలు లేకపోతే దేశం ఎక్కడ అనేవారు. అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా వాదించేవారు. మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా? రాష్ట్రం గొప్పదా? అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కేంద్రం అని. గొప్పదంటే ఏమిటీ? ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికల ద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సమానమే కదా? సమానమే కానీ కేంద్రం ‘ఎక్కువ సమానం’. ఎందుకంటే... దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు, ఇవన్నీ యూనియన్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్ లిస్ట్ అని ఏడో షెడ్యూల్లో కొన్ని అంశాలపై పాలనాధికారాలనూ, శాసనా ధికారాలనూ ప్రత్యేకించి యూనియన్‌కే పరిమితం చేశారు. యూనియన్ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం. కానీ వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. రాజనీతి పరంగా... రాజ్యాంగ వాడుకలో స్టేట్ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్ అంటే రాజ్యం అనీ, దేశ పాలనా వ్యవస్థ అనీ అర్థం. మార్గ దర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానతను సాధించడానికీ, పేద ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికీ కృషి చేయాలనే సూత్రం ఒకటి ఉంది. స్టేట్‌ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా ‘రాజ్యం’ రాష్ట్రమైంది. ‘రాష్ట్రం’ దేశమైంది. ‘దేశం’ కేంద్రమైంది. రాష్ట్రం కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలకపదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటాం. న్యాయ పరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది. ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగం తొలి అధికరణం సంవిధాన రచన ఆరంభమవుతుంది. ఆర్టికల్ 1 సంఘం (యూనియన్) పేరు ప్రాదేశిక పరిధి: (1) ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సంఘమై ఉంటుంది. (2) రాష్ట్రాలు వాటి ప్రాదేశిక పరిధుల వివరణ తొలి షెడ్యూలులో ఉంది. (3) ఈ ఇండియా పరిధిలో ఉండేవేవంటే... (ఏ) ఆయా రాష్ట్రాల పరిధి, (బీ) తొలి షెడ్యూల్లో పేర్కొన్న కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి, (సీ) భవిష్యత్తులో స్వాధీనం చేసుకోబోయే ప్రాంతాలు ఏవైనా ఉంటే అవీ. (క్లిక్: రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు) తొలి షెడ్యూల్లో ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాల రాష్ట్రాలను, వాటి పరిధులను పేర్కొన్నారు. (ఏ) భాగంలో బ్రిటిష్ ఇండియాలోని తొమ్మిది ప్రొవిన్స్లూ, (బీ)లో స్వతంత్ర రాజ్యాలు, (íసీ)లో కేంద్ర పాలనలో ఉన్న అయిదు రాష్ట్రాలు; అండమాన్ నికోబార్ దీవులు (డీ)లో చేర్చారు. ఏడో రాజ్యాంగ సవరణ (1956) ద్వారా పార్ట్ (ఏ) (బీ)ల మధ్య తేడాను తొలగించారు. తరువాత రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్నిర్మించారు. ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న మాట వెనుక హేతుబద్ధత ఏదీ లేదనే విమర్శలకు గురైన విధానం ఇది. అయిదారు రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. వాటన్నిటినీ కలపడం భావ్యమా? తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటి అనే వాదం కూడా తెలంగాణ ఏర్పాటు కార ణాల్లో ఒకటి. 1950లో లేని అనేక కొత్త రాష్ట్రాలు ఆ తర్వాత వచ్చాయి. తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. కానీ జమ్ము–కశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. (క్లిక్: రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసివుంటే...) ‘భారత్’ అని ఇండియాను పిలవాలంటూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం 2016లో దాఖలైంది. మన రాజ్యాంగంలో మన దేశానికి భారత్ అనీ, ఇండియా అనీ రెండు పేర్లున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్ర వాక్యం ‘భారత్ మాతాకీ జై’. అందులోంచి భారత్ అన్న పేరును స్వీకరించారు. ప్రతి భారతీయుడికీ ఈ రెండు పేర్లలో ఒక పేరును ఎంచుకునే హక్కు ఉందని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అంటూ ఈ పిటిషన్‌ను కొట్టి వేశారు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో నిర్ణయించే నిరంకుశాధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. (క్లిక్: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!
భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది, వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు రాసిన జాతీయ గీతం ‘జనగణ మన అధినాయక జయహే’ ఒక దేశభక్తి గీతం. సందేహం లేదు. ఒక గౌరవ వందన గీతం. ఈ పీఠిక పాట కాదు, ఒక పాఠం. ఒక ప్రతిజ్ఞ. ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం! ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నియంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కానీ రక్షిస్తామన్నవారూ, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారూ, అర్థం చేసు కోవలసిన వారూ అందరూ మరిచిపోయారు!! ఈ పీఠిక చదవడం ప్రభువులకు కోపకారణం అయింది! పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించినందుకూ, పీఠిక చదివి నందుకూ, రాజ్యాంగాన్ని జనానికి చూపినందుకూ చంద్రశేఖర్ ఆజాద్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యూఏపీఏ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది. చివరకు ఢిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకూ, న్యాయాధికారులకూ, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకూ... అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడూ, ఆ రాజ్యాంగం సరైనదైనపుడూ, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గానీ బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనుల మధ్య! ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికా పఠనం మారిపోయింది. తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పనిసరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాల యాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రపతి స్వయంగా పీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని 2020లో అధికారికంగా ఆరంభిం చారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పీఠిక చదివారు. న్యాయ, పర్యావరణ శాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పని సరిగా చదవాలని ఆదేశం జారీ చేశాయి. ఇదీ మన పీఠిక! దీన్ని అవతారిక అనీ అంటారు. ఇంగ్లీషులో ప్రియాంబుల్ అన్నారు. భారత ప్రజలమైన మనం, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను; ఆలోచనా, భావ ప్రకటనా, మత విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోనూ, అవకాశా ల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్నీ, జాతి ఐక్యత– సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనీ; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీ కరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించు కున్నాం. మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. (చదవండి: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) 1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం. రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు. విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలో అంతర్భా గమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమేనోయీ అని తీర్పు చెప్పింది. అంతకు ముందు సుప్రీంకోర్టు వారు పీఠిక అంతర్భాగం కాదన్నారు. విచిత్రమేమంటే పీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియ మాలు కొన్ని మొదటినుంచీ ఉండటం; మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరుతూ ఉండటం గమనించవలసి ఉంది. భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడటానికి మనం దీక్షాబద్ధులం కావాలి. పౌరుడిని చైతన్యవంతమైన, సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కులమతాల చట్రాలలోంచీ, చట్టాల లోంచీ బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కులమతాలకు చెందిన ఓటర్లను ప్రేరేపించడంతోనే మొదలై, ముగుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్య విలువల వంటి వాటిని చూడడం లేదు. తాతల నాటి కట్టడాలు తమ ఘన కార్యక్రమం అన్నట్టు చూపి, సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్నీ, కులాన్నీ నిత్యం వల్లిస్తూ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. మత్తు పుచ్చుకుని ఇచ్చుకుంటున్నాం. (చదవండి: ఒక తీర్పు – అనేక సందేహాలు) - ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
బాబా రాజ్యాంగ సాహెబ్
అంబేడ్కర్ రాజ్యాంగ రచయిత కాదు. అంబేడ్కర్ మన రాజ్యాంగానికి తండ్రీ, కీలక మైన నిర్మాత కూడా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూ షన్! రచయిత కన్నా... తండ్రి, నిర్మాత గొప్పవారు. పార్లమెంటు వేరు. రాజ్యాంగ రచనా సభ వేరు. కేవలం రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కను మరుగయ్యేది రాజ్యాంగ రచనా సభ. 1947, ఆగస్టు 29న అంటే మనకు స్వాతంత్య్రం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ రచనా సభ ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ప్రముఖ పరి పాలనాధికారి, న్యాయవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజ్యాంగ సభ సలహాదారు అయిన బీఎన్ రావ్ (కన్నడ) రూపొందించిన తొలి చిత్తుప్రతిని ఈ రచనా సంఘం పరిశీలించి రాజ్యాంగ సభ ముందు చర్చకు సమర్పించాలని... ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశిం చారు. ‘‘రాజ్యాంగ నిర్మాణం చేసిన ఘనత నాకు ఇచ్చారు, కానీ నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బీఎన్ రావ్‌కు చెందుతుంది. రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారు. ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అని అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చెప్పారు. అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు. అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోశన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించి అధ్య యనం చేసిన వ్యక్తి. కనుక రాజ్యాంగ రచనా ఉప సంఘంలో ఉండాలని రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ సంఘంలో ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్ (వీరు అనారోగ్యంతో రాజీనామాచేస్తే ఎన్ మాధవరావు సభ్యులైనారు), డీపీ ఖైతాన్ (వీరు 1948లో మరణిస్తే టీటీ కృష్ణమాచార్య చేరారు). ఉప సంఘం సభ్యులు 1947 ఆగస్టు చివర తొలి సమా వేశంలో అంబేడ్కర్‌ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యవ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు. సాదుల్లా, మాధవరావులకు డిల్లీ వాతావరణం సరిపడలేదు. పాలన, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పు డున్న ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ను విస్తరిస్తూ రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని న్యాయ, రాజ్యాంగ రంగాలలో నిపుణుడైన బెనెగల్ నర్సింగరావ్ రూపొం దించారు. ఆ తరువాత అందులో సూత్రాలను పునర్ని ర్మించడంలో కీలకమైన కృషి చేశారు. ఆయన కూడా తరువాత విదేశాల్లో ఉండిపోవడం వల్ల అందు బాటులో లేరు. ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరి కొందరి పాత్ర స్వల్పం, మొత్తం భారం అంబేడ్కర్ పైన పడిందని టీటీ కృష్ణమాచారి చెప్పారు. అంబేడ్కర్ ఆ బాధ్యతను నిర్వహించి రాజ్యాంగ పిత అయ్యారు. మరికొన్ని ఉపసంఘాలు కూడా చాలా సహకరిం చాయి. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీకి నేతగా పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఎన్నో ఉప సంఘాలు పనిని పంచు కున్నాయి. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేడ్కర్ ఇచ్చిన వివరమైన పత్రం చాలా కీలకమైంది. సభలో రాజనీతిజ్ఞులైన ప్రముఖులెందరో బాగా ఆలోచించి 7,635 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2,473 సవరణలను చర్చించి ఆమోదించారు. మిగిలినవి చర్చించి తిరస్కరించారు. ప్రతి పదంపైనా, వాక్యం పైనా వివాదాలు వచ్చాయి. అన్నిటికీ అంబేడ్కర్ సమాధానం చెప్పారు. సరైనవనుకున్న వాటిని ఆమో దించారు. బీఎన్ రావ్ 243 ఆర్టికల్స్, 13 షెడ్యూళ్లతో రాజ్యాంగ చిత్తు ప్రతిని రూపొందిస్తే, అంబేడ్కర్ అధ్య క్షతన ఉన్న రచనా కమిటీ అనేక చర్చలు సవరణల తరువాత 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లతో పూర్తి చేసింది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
ఆయన హెచ్చరికలు సజీవ సత్యాలు
ఆధునిక రాజకీయవ్యవస్థ నిర్మాణంలో వ్యక్తి ఆధారిత వికాసమే స్ఫూర్తి కావాలని నినదించిన మహోన్నత రాజ్యాంగం మనది. ప్రజా స్వామ్యం కేవలం రాజ కీయ పాలనా పద్ధతి మాత్రమే కాదు, సంపదలో సమాన పంపిణీ ఆవశ్యక తను చర్చించిన భావనగా రాజ్యాంగ రచనా సంఘం ఆవిష్కరించింది. అందుకు భారతీయ బౌద్ధం నుంచి ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని నిపుణులు వెలికి తీశారు. ఉత్పత్తి కులాల అణచివేతకు కారణాలను ఆనాడే గుర్తించారు. వీటిని అధిగమించాలంటే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థే దివ్యఔషధమనే ప్రతిపాదన ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య మూలాలున్న బౌద్ధం భారతీయుల వారసత్వ సంపదగా ప్రశంసలం దుకుంది. దీనిలో అభిప్రాయాల పరస్పర మార్పిడి, చర్చావిధానం రాజ్యాంగసభను సమ్మో హనపరిచాయని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనా సంఘంలో మాట్లాడుతూ అన్నారు. ప్రజాస్వామ్య మన్నికకు వర్గరహిత సమాజం ఎంతో అవసరమని అంబేడ్కర్ పేర్కొన్నారు. అలాగే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు అవకాశం వుండాలన్నారు. ప్రభుత్వం గరిష్ఠ సామాజిక జీవనం ప్రాతిపదికగా బాధ్యత తీసుకోవాలి. సమాజం ప్రజాస్వామ్య బద్ధంగా లేనప్పుడు, ప్రభుత్వం కూడా అలా ఉండ టానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు ఉద్యోగుల మీద ఆధారపడి పనిచేస్తాయి. ఆ ఉద్యోగులు వచ్చిన సామాజిక నేపథ్యం అప్రజాస్వామిక లక్షణాలు కలిగివుంటే ప్రభుత్వం కూడా అప్రజా స్వామికంగా మారిపోతుంది. ఈ సందర్భంలోనే ‘ప్రభుత్వం’ అనే పదాన్ని అంబేడ్కర్ నిర్వచించారు. ప్రభుత్వం అంటే మంచి చట్టాలు, మంచి పరిపాలన. ముఖ్యమైన విధులు న్యాయవ్యవస్థ చేతికి చేరాలి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు నిర్లక్ష్యానికి గురికాకూడదు. దీనిని విస్మ రించి పాలకులు తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తే, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కుంటువడుతుంది. తోటి మనిషి మీద గౌరవం, సమభావం కలిగి ఉన్నప్పుడే నిజమైన సమాజం ఏర్పడుతుందని, అదే పరిపూర్ణ ప్రజా స్వామ్యానికి పునాది కాగలుతుందనే విషయాన్ని తేటతెల్లం చేశారు. ఆదేశిక సూత్రాల అమలు ద్వారా ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని, దీని కార్యాచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. లేకుంటే భారత సమాజం పాలక వర్గం, పాలిత వర్గంగా విభజన చెంది, వ్యక్తి శ్రేయస్సుకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రధానంగా రెండు విషయాలు మూలస్తంభాలుగా నిలవాలనేది రాజ్యాంగ నిర్దేశం. అవి ఒకటి సమర్ధ మైన పాత్ర పోషించగల ప్రతిపక్షం, రెండు నిజాయితీతో కూడిన ఎన్నికల నిర్వహణ. అప్పుడే అధికారమార్పిడి ప్రక్రియ సులభతరంగా జరుగు తుంది. ఈ వ్యవస్థ ద్వారానే అణగారిన ప్రజానీకం విముక్తి సుసాధ్యమవుతుంది. పరిపూర్ణ ప్రజా స్వామ్య మనుగడకు అడ్డంకిగా ఎన్ని అవరోధాలు ఎదురయినా జనబాహుళ్యం కలిగిన భారత దేశా నికి ప్రజాస్వామ్యమే శరణ్యంగా నిలిచింది. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజలు చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లితేనే దాని ఫలాలు ప్రజల అను భవంలోకి వస్తాయని అంబేడ్కర్ అన్నారు. ప్రజా స్వామ్యం అంతరించిపోతే ప్రజల ఆకాంక్షలు నీరు గారిపోతాయన్న ఆయన హెచ్చరికలు ఎప్పటికీ సజీవసత్యాలుగా నిలుస్తాయి. -డాక్టర్ జి.కె.డి.ప్రసాద్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, విశాఖపట్నం -
రాజ్యాంగ దినోత్సవం.. ఇది ఇంటిటి ‘రాజ్యాంగం’
కుటుంబంలో హక్కులు ఉంటాయి... బాధ్యతలు ఉంటాయి. తప్పు ఉంటుంది... క్షమాపణా ఉంటుంది. పైకి చెప్పే నియమాలు ఉంటాయి. ఎవరూ చెప్పని నిబంధనలు ఉంటాయి. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ప్రతి ఇంటికీ రాజ్యాంగం ఉండాలి. పరస్పర గౌరవం, అవగాహన నుంచి సభ్యుల అవసరం, క్షేమాన్ని బట్టి ఈ రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకుంటూ వెళ్లాలి. ఇంటి రాజ్యాంగం ఎలా ఉండాలి? దేశంలో పౌరులంతా సమానమే అని మన రాజ్యాంగం చెబుతుంది. ఇంట్లో సభ్యులు కూడా సమానమే అని కుటుంబం అర్థం చేసుకోవాలి. పిల్లలకు అర్థం చేయించాలి. అయితే అది ఎలాంటి సమానం? నాన్న ఆఫీసుకు వెళ్లడమూ అమ్మ ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకోవాల్సి రావడమూ సమానమే. నాన్న డబ్బు తేవడమూ అమ్మ ఇంటి అవసరాల రీత్యా ఖర్చు పెట్టడమూ సమానమే. నాన్నకు అమ్మ గౌరవం ఇవ్వడమూ అమ్మ మాటకు నాన్న విలువ ఇవ్వడమూ సమానం. నాన్నకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు అమ్మకు తక్కువ కోపం రావడం సమానం అవుతుంది. అమ్మకు చాలా విసుగ్గా ఉన్నప్పుడు నాన్నకు అమితమైన ఓర్పు రావడం సమానం అవుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం నాన్న నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మకు అది నచ్చకపోతే, పిల్లలకు అది నచ్చకపోతే నాన్నతో వాదించడం సమానం అవుతుంది. అమ్మ ఏదైనా ఆలోచన చేస్తే అహానికి పోకుండా నాన్న అంగీకరించడమూ సమానం అవుతుంది. అమ్మ మూతి ముడిచినప్పుడు నాన్న నవ్వుతూ ఆ కోపాన్ని ఎగరగొట్టడం సమానం. నాన్న గొంతు పెద్దదైనప్పుడు అమ్మ మంద్రస్వరంతో దానిని నిలువరించడం సమానం అవుతుంది. అమ్మా నాన్నా సమానమే. అయితే ఏ కొలతల ప్రకారం సమానమో పిల్లలకు అర్థం చేయించడం, భార్యాభర్తలు అర్థం చేసుకోవడం ఇంటి రాజ్యాంగంలో రాసుకోవాల్సిన తొలి నియమం. స్వేచ్ఛ ఎంత ఉండాలి? కుటుంబంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలి. అయితే ఎంత ఉండాలి? అబ్బాయి మోటరు సైకిల్ అడిగితే కొనివ్వొచ్చుగాని రోడ్లు అలవాటయ్యేంత వరకూ ఒంటరిగా నడిపే స్వేచ్ఛ ఇవ్వకూడదు. నాన్న వెనుక కూచోవాలి. కొడుకుకైనా కూతురికైనా ఫలానా చదువు చదువుతాను అనే ఎంపికలో స్వేచ్ఛ ఇవ్వాలిగాని ఆ చదువును సక్రమంగా పూర్తి చేసే వరకూ కాలం వృధా చేసే స్వేచ్ఛ ఇవ్వకూడదు. అమ్మాయికి స్నేహితుల్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి కాని ఆ స్నేహితులందరితో అమ్మకూ నాన్నకూ పరిచయం ఉన్నప్పుడే ఆ స్వేచ్ఛను పరిగణించాలి. ఫోన్లు వాడే, ఫేస్బుక్లో ఉండే, వాట్సప్ చాట్ చేసే స్వేచ్ఛ ఇవ్వాలిగాని ఆ స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉంటుందని బాధ్యతకు పరిమితి ఉంటుందని తెలియచేయాలి. పిల్లలు పర్సనల్ రూములు అడుగుతారు. కాని తలుపు మూసుకునే స్వేచ్ఛకూ గడియ వేసుకునే స్వేచ్ఛకూ మధ్య ఉన్న అంతరాన్ని సున్నితంగా హెచ్చరించాలి. బాధ్యత కలిగినదే స్వేచ్ఛ అని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి. సర్దుబాటు ఎలా ఉండాలి? అమ్మ ఇంటి పనిలో అలసి పోతే కొడుకు ఆ పనిని సర్దుబాటు చేసేలా ఉండాలి. వంట వీలుగాకపోతే నాన్న స్విగ్గీకి ఆర్డరు చేసే సర్దుబాటు చేయగలగాలి. నాన్నకు పొదుపు తెలియకపోతే అమ్మ చిట్టీ కట్టాలి. అమ్మ దుబారా చేస్తుంటే నాన్న అప్పులున్నాయని చెప్పి పాలసీ కడుతుండాలి. పిల్లలు బ్రాండెడ్ బట్టలు అడిగితే ఫ్యాక్టరీ ఔట్లెట్లో బోలెడంత వెరైటీ ఉంటుందని పట్టుకుపోవాలి. నిస్సాన్ అడిగితే నానోకు కూడా నాలుగు చక్రాలే ఉంటాయని చెప్పగలగాలి. పాకెట్ మనీ పెంచమంటే అబ్దుల్ కలాం పేపర్‌బాయ్‌గా చేశాడని చెప్పి స్వీయ సంపాదన నేర్పించాలి. గోల్డ్ లేకపోయినా ఒన్ గ్రామ్ గోల్డయినా అమ్మకు బాగుంటుందని చెప్పాలి. చిన్న చిన్న సంతోషాలు కావాలంటే చిన్నపాటి సర్దుబాటు చేయాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి. నిరసన ఎప్పుడు చూపాలి? పని మనిషిది ఫలానా కులమని నానమ్మ పనిలో వద్దంటుంది. అప్పుడు నిరసన చూపాలి. మనవడి స్నేహితుణ్ణి చూసిన తాతయ్య అతడు ఫలానా మతం కదా స్నేహం వద్దు అన్నప్పుడు నిరసన చూపాలి. అమ్మాయి ఫలానా ప్రాంతం వారంటే ద్వేషం అన్నప్పుడు నిరసనతో సరిచేయాలి. ఇల్లు ఫలానా వారికి అద్దెకు ఇవ్వం అని మన ఇంట్లోని వాటాకు నియమం పెడితే నిరసన చూపించాలి. మన కుటుంబం మనకు ఎంత ముఖ్యమో ఇంకో కుటుంబం కూడా వారికి అంతే ముఖ్యం. అన్ని కుటుంబాలు దేశానికి ముఖ్యమని అవగాహన కల్పించుకోవాలి. సమాజానికి ఏమి ఇవ్వాలి? కుటుంబం సమాజంలో ఒక భాగం. కుటుంబం ముందు కుదురుకుంటే సమాజం కూడా కుదురుకుంటుంది. మన కుటుంబం కుదురుకున్నాక, మన కుటుంబం సమాజంతో కలిసి జీవిస్తున్నాక సమాజానికి ఏమి ఇవ్వాలో ఆలోచించడం కూడా కుటుంబ బాధ్యతే. అనాథలకు, అభాగ్యులకు వీలైతే సాయం చేయాలి. రైతులో, కార్మికులో కష్టాలలో ఉన్నప్పుడు వారికి సంఘీభావం చూపగలగాలి. ద్వేషం, విభజన కోసం కొందరు ప్రయత్నిస్తున్నప్పుడు సామరస్యం కోసం ఏదో ఒక పని చేయాలి. పాలన వ్యవస్థ తప్పులు చేస్తున్నప్పుడు అవి ఎత్తి చూపించగలగాలి. పాలనలో తప్పు సమాజానికి ప్రమాదం. సమాజంలో తప్పు కుటుంబానికి ప్రమాదం. కుటుంబం అంటే మన కుటుంబం మాత్రమే కాదని సమాజం ఆ తర్వాత దేశం కూడా మన కుటుంబమే అనుకుంటే మన కుటుంబ సభ్యుల పట్ల ఎంత ప్రేమ, బాధ్యతగా ఉంటామో దేశ పౌరులందరి పట్లా అంతే ప్రేమగా బాధ్యతగా ఉంటాము. అలాంటి ప్రేమ, బాధ్యతలలోకి ప్రతి కుటుంబం మేలుకోవాలి. వెలుగు చూడాలి. అందుకు తప్పక పట్టు విడుపుల నియమావళి రాసుకోవాలి. -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్‌తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
అంబేడ్కర్ సవరణకే ‘ఎసరా’?
బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ ఆదినుంచీ ఉద్యోగ సద్యోగాల్లో, విద్యాసంస్థల్లో, స్థానిక సంస్థల్లో సూత్రబద్ధమైన రిజర్వేషన్లు నిర్దేశించాన్నది తెలిసిన విషయమే. ఆ వర్గాల సముద్ధరణ పూర్తి స్థాయిలో జరిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలన్నది ఆయన అభిమతం. అయితే ప్రస్తుత వ్యవస్థలో తనలాంటి దళిత వ్యతిరేకులు ఉన్నంత కాలం.. అంబేడ్కర్ లక్ష్యం నెరవేరదన్న నమ్మకం చంద్రబాబులో బలంగా ఉంది. కనుకనే సుప్రీంలో రిట్ ద్వారా రిజర్వేషన్ల శాతాన్ని 34 నుంచి 24 శాతానికి అంటే 10 శాతానికి తగ్గించేలా కుట్రపన్ని ‘సంతృప్తి’ చెందాడు. కానీ, వైఎస్సార్సీపీ పాలకులు ఆ తగ్గిన 10 శాతం రిజర్వేషన్లను తమ పార్టీ ద్వారానే నింపదలిచి, బీసీలకు అండగా నిలిచారు. భారత రాజ్యాంగంలోని 16(4)వ నిబంధన కుల ప్రాతిపదికపైన వివక్షతో కూడుకు న్నది. అది ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసం స్థలలో వెనుకబడిన వర్గాల ప్రవేశం విష యంలో ప్రమోషన్ల విషయంలో వివక్షతో కూడిన నిబంధన. కాబట్టి ఆ నిబంధన చెల్లనేరదు. కనుక, కులం పేరుతో ఒక వ్యక్తిని వెలివేసే సమాజంలో దళిత బలహీన వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) రిజర్వేషన్ల కల్పన ఆచరణలో అసాధ్యం. కాబట్టి సమాజంలో బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని కాపాడటానికి ప్రభుత్వం సాధ్యమైన చర్యల న్నింటినీ తీసుకోవాలి. ఆదేశిక సూత్రాలలోని 46వ నిబంధనను ప్రభుత్వం తప్పక పాటించాల్సిన విధిగా రాజ్యాంగం నిర్దేశించింది. బడుగు, బలహీనవర్గాలంటే నా ఉద్దేశం.. తమ కాళ్లపై తాము నిలబడ లేని స్థితిలో ఉన్నవారనే, ఈ విషయంలో ఆదేశిక సూత్రాలలోని 46వ నిబంధన లక్ష్యాన్ని నెరవేర్చేదాకా ప్రభుత్వమూ, దేశ పార్లమెంటూ విశ్రమించరాదు, ఇవి తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి తీరాలి. ఈ ఆశయం నెరవేరేదాకా ఆదేశసూత్రాల్లోని 29వ రాజ్యాంగ నిబంధన (క్లాజ్ 2), 16వ రాజ్యాంగ నిబంధన (క్లాజు 4) ప్రకారం బడుగు, బల హీనవర్గాల అభివృద్ధికి ఆటకం కలుగుతూనే ఉంటుంది కాబట్టే ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన (ఓబీసీ) వర్గాలకు అనుకూలంగా 15వ రాజ్యాంగ నిబంధనను సవరించి ప్రత్యేకంగా 5వ క్లాజును భారత రాజ్యాంగంలో చేర్చవలసివచ్చింది. ఈ కొత్త క్లాజు ప్రకారం పార్ల మెంటు, రాష్ట్రాల శాసనవేదికలు తమకు అనుకూలమైన చట్టాలు చేసుకోవచ్చు. – రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్. ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో బడుగు బలహీన వర్గాలకు పూర్తి న్యాయం జరిగే వరకూ ఒక్క పార్లమెంటుకే కాదు. రాష్ట్రాల శాసనవేదికలకు కూడా, తమకు అనుకూలమైన చట్టాలు చేసుకునే హక్కు ఉందని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్.. నిర్దేశించి, శాసించారు. కానీ ఆ రాజ్యాంగపరమైన బాధ్యతలనుంచి తప్పుకుని అష్టావక్ర మార్గాలకు మళ్లి అడుగు ఊడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్ర బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్ని కలలో రిజర్వేషన్ల ప్రాతిపదికపై జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అభ్యు దయకర విధానాన్ని అడ్డుకోజూస్తున్నారు. కానీ కనీస సంక్షేమ పాలనా విధానాలు కూడా అలర్జీగా భావిస్తున్న బాబు, అతని పార్టీ. ఇటీవల రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పొందిన అవమానకరమైన ఓటమి నుంచి కూడా గుణపాఠం నేర్చుకునే దశలో లేరు. శ్రీకృష్ణదేవరాయల పాలన గురించి ఒక ప్రశస్తి ఉంది. రైతాంగ శ్రేయస్సుకు కాడీ, మేడికి అంకితమై ప్రజాసేవలో శ్రమ జీవనాన్ని శ్లాఘించి, నమస్కరించిన రాయలు... పాలకుడైన వాడు చేతలలోనే కాదు, తన గుండెల్లో సహితం ప్రజల అభివృద్ధిని సదా కాంక్షించాలని కోరుకున్నవాడు. కానీ సమాజాభ్యున్నతికి ఏ శ్రమశక్తి దోహదపడు తుందో ఆ వర్గాల (బడుగు, బలహీన వర్గాలే జనాభాలో హెచ్చు మంది) మౌలిక జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదకారి కాగల ఉపాధి, ఉద్యోగ సదుపాయాలను రిజర్వేషన్ల ద్వారా, ప్రమోషన్ల ద్వారా కల్పించేందుకు జరిగే కృషిని అడ్డుకోజూస్తే పరిణామం ఎలా ఉంటుందో జగన్ నిరూపించారు. జనరల్ ఎన్నికల్లో గోళ్లు ఊడి, ముఖాలు కందగడ్డలై చేసేది లేక దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు, అతని పాలనలో లాభించిన కొందరు వందిమాగధులు తప్ప బుద్ధి ఉన్న వాళ్లెవరూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మోకాలడ్డలేరు. రాష్ట్రంలో మూడు రకాల స్థానిక సంస్థలకు (జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు+గ్రామ పంచాయతీలు) ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితం టీడీపీ నాయ కత్వం హీన రాజకీయాలకు తెరలేపి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లకు మోకాలడ్డుతూ రాష్ట్ర హైకో ర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయించింది.. దాన్ని రాష్ట్ర గౌరవ న్యాయ స్థానం కొట్టివేయగా.. తనకు తెలిసిన పాత కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టుకు బాబు వర్గం ఎగబాకింది. ఈ ‘ఎగబాకుడు’ ఇవాల్టి కొత్త ‘విద్య’ కాదు, గత పాలనలో చంద్రబాబు అన్యమార్గాల ద్వారా ఉమ్మడి రాష్ట్ర హెకోర్టును ఉపయోగించుకున్న అలవాటుతోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకూ ఎగబాకారు. దేశ అత్యున్నత న్యాయస్థానంగా మనం భావించి ఆదరించుకునే సుప్రీంకోర్టు ప్రస్తుత అనిశ్చిత పరిణామాల దృష్ట్యా, ఎప్పుడు, ఏ నిర్ణయం ప్రకటిస్తుందో తెలియని అనూహ్యమైన దశలో ఉన్నాం. అలాంటి ఏ కారణం వల్లోకానీ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను సుమారు 60 శాతం వరకు కల్పించాలన్న నిర్ణయానికి అవరోధం ఏర్పడింది. అయితే 2019 ఎన్నికల్లో బలహీనపడిపోయి ‘డీలా’ అయిపో యిన బాబు వర్గం ‘సుప్రీం’ను కదపడంలో ఒక ఆశ ఉండి ఉంటుంది. బడుగు, బలహీన వర్గాలకు ఆదినుంచీ ఉద్యోగ సద్యోగాల్లో, విద్యా సంస్థల్లో, స్థానిక సంస్థల్లో నిర్దేశిస్తున్న సూత్రబద్ధమైన రిజర్వేషన్లను అంబేడ్కర్ కల్పించారు. ఆ వర్గాల సముద్ధరణ పూర్తి స్థాయిలో జరిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలన్న నాటి లక్ష్యం.. ప్రస్తుత వ్యవస్థలో తనలాంటి సమసమాజ వ్యతిరేకులు ఉన్నంత కాలం నెరవేరదన్న నమ్మకం బాబులో బలంగా ఉంది. కనుకనే చంద్రబాబు వర్గం హీన మనస్తత్వంవల్ల సుప్రీంలో రిట్ ద్వారా రిజర్వేషన్ల శాతాన్ని 34 నుంచి 24 శాతానికి అంటే 10 శాతానికి కుదించివేసి మరీ ‘సంతృప్తి’ చెందింది.. కానీ ‘తలదన్నేవాడి తాడిని తన్నేవాళ్లు’ ఎప్పుడూ సిద్ధం గానే ఉంటారన్న ఇంగితం కూడా బాబు వర్గానికి లేకపోయింది. బాబు పన్నాగాన్ని పసికట్టిన వైఎస్సార్సీపీ పాలకులు ఆ తగ్గిన 10 శాతం రిజర్వేషన్లను తమ పార్టీ ద్వారానే నింపడానికి నిర్ణయించి ప్రతి సవాలు విసిరారు. తగ్గిన సీట్లను పార్టీ పరంగా భర్తీ చేసి 34 శాతం జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలపాలని నిర్ణయించారు. మొత్తంమీద చూస్తే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ, కోల్పోయినప్పుడూ చేస్తూ వచ్చిన పని–బీసీ రిజర్వేషన్లు పూర్తి కాకుండా జాగ్రత్తపడుతూ రావడమే. సుప్రీం నిర్ణయాన్ని అడ్డుపెట్టు కున్న బాబు గమనించాల్సిన కీలకమైన అంశాన్ని మాత్రం ఎవరూ మరచిపోరాదు. ఎందుకంటే సుప్రీం నిర్ణయాల్లో కూడా తరచూ మనం చూసే తీర్పులు కొన్ని పరస్పరం విరుద్ధంగా ఉంటున్నాయి. ‘సుప్రీం’ లోనే కాదు, తీర్పులిచ్చే వివిధ ‘బెంచ్’ తీర్పులు కూడా పరస్పరం విరుద్ధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో వైఎస్ మరణా నంతరం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వగా, దాన్ని వేరే డివిజన్ బెంచ్ కొట్టివేసింది. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో అంతర్భాగంగా నమోదైన 46వ నిబంధన.. రిజర్వేషన్లను అమలు జరిపే బాధ్యతను పార్లమెంటుకూ, రాష్ట్ర శాసనసభలకూ అప్పగించింది. బహుశా ఈ నిర్దేశాన్ని ఉల్లంఘిం చడాన్ని దృష్టిలో పెట్టుకునే జేఎన్‌యూ రాజకీయ శాస్త్రాచార్యుడు ప్రొఫెసర్ నరేంద్ర కుమార్ ‘సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు అంబేడ్కర్ ప్రతిపాదించగా సభ ఆమోదించిన తొలి రాజ్యాంగ సవరణ (రిజ ర్వేషన్ల నిబంధన)కే విరుద్ధమని’ శఠించాల్సి వచ్చింది. బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ పౌరుల స్థాయిలో ‘ఒక హక్కు’ కాకపోయినా.. బలహీన వర్గాలకు ఉద్యోగ సద్యోగాలలో, ఎన్నికలలో తగినంత ప్రాతినిధ్యాన్ని నికరం చేయడం ప్రభుత్వ బాధ్యత అనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సానుకూలంగా నిర్ణయించే అధికారం ఉందనీ గతంలోనే తీర్పులున్న విషయం మరవరాదు (అజిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్, సి.ఎ. రాజేంద్రన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం). మనం తరచుగా గాంధీజీ ‘గ్రామ స్వరాజ్యం’ గురించి మాట్లాడు కుంటున్నాం, ఆ గ్రామ స్వరాజ్య సాధన ఆశయంగా మహోన్నతమైనదే. కానీ భూస్వామ్య వ్యవస్థ బంధాలు పూర్తిగా గ్రామసీమల్లో తొలగకుండానే, పెట్టుబడిదారీ వ్యవస్థా బంధాలు బలంగా నెల కొంటున్న మన సమాజంలో.. ‘గ్రామ స్వరాజ్యం’ బలమైన వ్యవస్థగా పాతుకుపోవడం కష్టసాధ్యమని కూడా మరచిపోరాదు. బహుశా ఈ కారణం చేతనే డాక్టర్ అంబేడ్కర్, భూస్వామ్య వ్యవస్థా బంధాలు కూలంకషంగా తొలగకుండా గ్రామ స్వరాజ్యమనే మహత్తర ఆశయం నెరవేరడం కష్టసాధ్యమన్న వేదనను వెలిబుచ్చాల్సి వచ్చింది. ‘ఎవ రైనా ఎస్సీ, ఎస్టీలలో పుట్టాలని కోరుకుంటారా?’ అన్న అహంకారాన్ని చంద్రబాబు ప్రదర్శించడమే ఇందుకు సరైన ఉదాహరణ. మన గ్రామ సేవల్లో ఈనాటికీ, వెలివాడల్లోనూ, మలివాడల్లోనూ ఈ జాడ్యం ఈ క్షణం దాకా తొలగిపోవడం లేదని, ఇందుకు కారణం కుల, మత, వర్గ, లింగ వ్యత్యాస ధోరణులు సమూలంగా తొలగక పోవడమేనని బేష రతుగా మనసుల్లో ఎలాంటి ‘రిజర్వేషన్లు’ లేకుండా ఒప్పేసుకోవడం లోనే విజ్ఞత ఉంటుంది. నేటి పెక్కుమంది పాలకులూ, న్యాయ మూర్తులూ, న్యాయవాదులూ, న్యాయస్థానాలూ ఈ ‘మాలోకాని’కి అతీతులు కారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మోదీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో పంపిన 170 రూపాయల విలువగల వస్తువును మరేదో కాదు.. భారత రాజ్యాంగ పుస్తకం. ఈ రాజ్యాంగ ప్రతిని మోదికి పంపి.. దేశాన్ని విభజించే ముందు రాజ్యాంగాన్ని ఓ సారి చదువుకోండి అని ట్వీట్ చేసింది. గత కొంత కాలంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ, ఎన్పీఏ ఆందోళనలతో దేశం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. మతం ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ కనీస పాఠాన్ని కూడా బీజేపీ నేర్చుకోలేకపోయిందని, కాబట్టే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తోపాటు యావత్ దేశం ఆందోళనలను చేస్తున్నదని ఆ పార్టీ విమర్శించింది. ఈ నేపథ్యంలో ప్రధానికి రాజ్యాంగ ప్రతిని గిఫ్ట్‌గా పంపింది. ‘గౌరవనీయులైన ప్రధాని గారు.. దేశాన్ని విభజించే పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు.. అయితే ఏకొంచెం టైమ్ దొరికినా ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.. ఇది మన భారత రాజ్యాంగం.. మన వ్యవస్థలన్నీ పనిచేసేది దీనిపైనే’ అంటూ ట్విట్ చేసింది. ఫొటోలతోపాటు కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రాజ్యాంగ పీఠిక చదువుతోన్న వీడియోలను కూడా పార్టీ ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. మరి ప్రధాని కార్యాలయం ఈ గిఫ్ట్‌ను స్వీకరించిందా? తిప్పి పంపిందా? అనేది తెలియాల్సిఉంది. Dear PM, The Constitution is reaching you soon. When you get time off from dividing the country, please do read it. Regards, Congress. pic.twitter.com/zSh957wHSj — Congress (@INCIndia) January 26, 2020 -
సీఏఏపై స్టేకి సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం వాదన వినకుండా ఈ చట్టంపై స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. అలాగే, సీఏఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందించేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి నాలుగు వారాల గడువునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లను పరిశీలించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల «రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. అదే సమయంలో.. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరపరాదంటూ అన్ని హైకోర్టులనూ ఆదేశించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లు అందులో కోరారు. ఈ చట్టానికి అనుకూలంగా కూడా కొందరు పిటిషన్లు వేశారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీఏఏ అమలుపై స్టే విధించాలనీ, ఎన్పీఆర్ను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే సీఏఏపైనా, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) అమలుపైనా దాఖలైన అన్ని పిటిషన్లను నాలుగు వారాల అనంతరం విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. అదికూడా కేంద్రం ప్రతిస్పందన అనంతరమేనని తేల్చి చెప్పింది. అస్సాం, త్రిపురలకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ‘సీఏఏ విషయంలో అస్సాం పరిస్థితి భిన్నమైంది. అస్సాంలో గతంలో పౌరసత్వానికి కటాఫ్ మార్చి 24, 1971 అయితే, సీఏఏ తర్వాత ఇది డిసెంబర్ 31, 2014’కి పొడిగించారు’అని ధర్మాసనం పేర్కొంది. సీఏఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లలో 60 కాపీలు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. మిగిలిన అన్ని అభ్యర్థనలపై స్పందించేందుకు సమయం కావాలని ఆయన కోరారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, ఆర్జేడీ నాయకులు మనోజ్ షా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మోయిత్రా, జమైత్ ఉలేమా–ఇ– హింద్, ఏఐఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఒవైసీ సహా అనేక మంది సీఏఏని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. -
370 అధికరణ 1953లోనే రద్దయిందా?
ఇలా కుతూహలాన్ని రేకెత్తించే మరిన్ని ప్రశ్న లు.. వాటికి సమాధానాలకు బుధవారం హైదరాబాద్‌లోని ‘శిల్పకళా వేదిక’సాక్ష్యంగా నిలిచింది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సం దర్భంగా ఏర్పాటు చేసిన ‘మంథన్ సంవాద్’లో దేశంలో ప్రస్తుత పరిస్థితులు.. ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు తమ భావాలు వెల్లడిం చారు. ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలు మందగమనంపై కేంద్ర ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్ తన గళాన్ని వినిపించారు. కశ్మీర్ పరిస్థితిపై చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ తనదైన విశ్లేషణ చేశారు. ఈ కాలానికి గాంధీతత్వం ఎలా అనుసరణీయమో ప్రొఫెసర్ సుదర్శన్ అయ్యంగార్ వివరించారు. భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులేంటి.. వాటిని కాపాడుకునేందుకు అంద రూ గళమెత్తాల్సిన అవసరమేంటన్న దానిపై సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి ఉపన్యసించారు. – సాక్షి, హైదరాబాద్ అందరూ రాజ్యాంగ పరిరక్షకులే ఇంకొకరి స్వాతంత్య్రంపై నిర్బంధాలు విధిస్తే పౌరులు తమకేంటని అనుకుంటే పొరపాటేనని.. భవిష్యత్తులో అది వారి స్వేచ్ఛ ను హరించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి అన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతిసారి న్యాయస్థానాల్లో సవాల్ చేయడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. జమ్మూ, కశ్మీర్లో రెండు నెలలుగా ప్రజలకు వైద్య సేవలు అందట్లేదని, అధికారాన్ని ప్రశ్నించేందుకు, హక్కులను కాపాడుకునేందుకు అందు బాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన హెబియస్ కార్పస్ పిటిషన్లకూ దిక్కులేకుండా పోతోందన్నారు. ఎమర్జెన్సీ సమయం లోనూ ఈ పిటిషన్లపై 24 గంటల్లో విచారణ జరిగేదని గుర్తు చేశారు. – మేనక గురుస్వామి అందుకోదగ్గ లక్ష్యమే 2014–19 మధ్య కాలంలో 7.5 శాతం సగటు వృద్ధితో ముందుకెళ్తున్న భారత్.. ప్రధాని మోదీ ఆశిస్తున్నట్లు ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదని కె.వి.సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చేరాలంటే ఏటా ఎనిమిది శాతం వృద్ధి రేటు, కొన్ని విధానపర మార్పులు అవసరమని తెలిపారు. జీడీపీపై ప్రభుత్వం ఇస్తున్న అంకెలు సరైనవేనని భావిస్తు న్నట్లు చెప్పారు. ఆర్థిక మంద గమనాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడులను ఆకర్షిం చాల్సిన అవసరముందని, ఇది ఉత్పాదకతను పెంచు తుందని.. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు, ఎగుమతులు జరు గుతాయని.. వీటన్నింటి కారణంగా వస్తు, సేవలకు డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తుందని వివరించారు. – కె.వి.సుబ్రమణియన్ 1953లోనే తూట్లు జమ్మూ, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు సాంకేతికంగా 2019లో జరిగినా.. ఆ చట్టం తాలూకు అసలు స్ఫూర్తికి 1953లోనే తూట్లు మొదలయ్యాయని చరిత్రకారుడు, మాజీ సైనికాధికారి శ్రీనాథ్ రాఘవన్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ప్రధానిగా నెహ్రూ స్థానంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఉండి ఉంటే కశ్మీర్ సమస్య వచ్చి ఉండేది కాదనే వారు.. ఆనాటి కేబినెట్ సమావేశాల వివరాలు చదువుకోవాలని, 370 అధికరణ రూపకల్పనలో అప్పటి రక్షణ మంత్రి అయిన వల్లభ్‌భాయ్ పటేల్ ఎంత కీలక పాత్ర పోషించారో.. అప్పటి కేంద్ర మంత్రి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎలా మద్దతిచ్చారో తెలుసుకోవాలని హితవు పలికారు. 1953లో షేక్ అబ్దుల్లాను నెహ్రూ గద్దె దింపడంతోనే 370 అధికరణ స్ఫూర్తికి తూట్లుపడటం మొదలైందని, తర్వాతి కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో భారత రాజ్యాంగం ముప్పావు వంతు అక్కడ అమల్లోకి వచ్చిందని తెలిపారు. – శ్రీనాథ్ రాఘవన్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవసరమా? ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక, ప్రాకృతిక సమస్యలకు మహాత్మాగాంధీ ఎప్పుడో సమాధానం చెప్పారని.. ఈ కాలంలోనూ గాంధీతత్వం అనుసరణీయమన్నారు సుదర్శన్ అయ్యంగార్. మహాత్ముడి సిద్ధాం తాలను పరిపూర్ణంగా ఆచరించడం ఈ కాలపు అవసరమని తెలిపారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై అందరూ మాట్లాడుతున్నారని.. కానీ అది ఎందుకన్న ప్రశ్న మాత్రం ఎవరూ వేయకపోవడం శోచనీయమన్నారు. ఒకరమైన ఆందోళ నకరమైన వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో అధికారంలో ఉన్న వారికి కీలకమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. – సుదర్శన్ అయ్యంగార్ -
...అను నేను!
‘మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఈశ్వర్‌కీ శపథ్ లేతా హూ కీ మై విధిద్వారా స్థాపిత్ భారత్‌కే సంవిధాన్ ప్రతి సచ్చీ శ్రద్ధా, ఔర్ నిష్టా రఖూంగా...’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులూ ప్రమాణం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా.. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ...’ అని ప్రమాణం చేశారు. దేశంలోని రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించే నేతలు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం ఈ తరహాలో ప్రమాణంచేయాలి. ఈ ప్రమాణస్వీకార సమయంలోనే అధికారిక రహస్యాలకు సంబంధించి మరో ప్రమాణం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ఆర్టికల్ 75(4) ప్రకారం ఈ రెండు ప్రమాణస్వీకారాలు చేశాకే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బాధ్యతలు చేపట్టాలి. కేంద్ర మంత్రి ప్రమాణం.. ‘...అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. అదే సమయంలో అధికారిక రహస్యాలకు సంబంధించి, ‘...అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని మరో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కుర్తా–పైజామాదే అధిపత్యం రాష్ట్రపతిభవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా హిందీ ఆధిపత్యం నడిచింది. ప్రధాని మోదీ సహా మెజారిటీ మంత్రులు హిందీలో ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక ఈ వేడుకకు హాజరైన ఎంపీల్లో చాలామంది సంప్రదాయ కుర్తా–పైజామాను ధరించి వచ్చారు. కొంతమంది మాత్రం షర్టులు–ఫ్యాంట్లు వేసుకొచ్చారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాగానే సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. -
'విలక్షణ' రాజ్యాంగం!
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత విశిష్టతల్లో.. రాజ్యాంగం ప్రత్యేకమైనది. బ్రిటన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, ఐర్లాండ్, జర్మనీ, కెనడా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి.. 308 మంది మేధావుల సుదీర్ఘ మేధోమథనం తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో చేతితో రాశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాం గం మనదే. దీంట్లో 444 అధికరణలు, 22 భాగాలు, 12 షెడ్యూళ్లు, 118 సవరణలున్నాయి. ఇంగ్లీషు రాజ్యాంగంలో 1,17,369 పదాలున్నాయి. రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలంటే పార్లమెం టులో మూడొంతుల ఆమోదం తప్పనిసరి. మరికొన్ని సవరణలకు పార్లమెంటులో మెజా రిటీతో పాటు సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు ద్వంద్వ పాలన విధానం మరో ప్రత్యేకత. మొదటిది సమాఖ్య లేదా కేంద్ర ప్రభుత్వం. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు. రాజ్యాంగం ఈ రెండింటికీ అధికారాలు పంచింది. అయితే, రాష్ట్రాలకంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధి కారాలన్నీ రాజ్యాంగం నుంచే దఖలు పడ్డాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఇచ్చింది.భారత దేశం గణతంత్ర రాజ్యం. ప్రజలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు విశేషాధికారాలు ఉంటే దాన్ని ‘గణతంత్రం’ అంటారు. రాజ్యాం గాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటడం మన రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకత. మరే దేశ పౌరులకు ఈ హక్కు లేదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రజలకు పెద్ద ఆస్తి. సమానత్వం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, మత స్వేచ్ఛ, సాంస్కృతిక, విద్యా పరమైన స్వేచ్ఛ మొదలై నవి రాజ్యాంగం మనకిచ్చిన వరాలు. చాలా దేశాల్లో పౌరులకు ఇలాంటి హక్కులు లేవు. రాజ్యాంగ పీఠిక చెబుతున్నదిదే! భారత ప్రజలమైన మేము.. ‘భారతదేశాన్ని సర్వసత్తాక– సామ్యవాద – లౌకిక – ప్రజాస్వామిక – గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు.. పౌరులందరికీ సాంఘిక – ఆర్థిక – రాజకీయ న్యాయాన్ని.. ఆలోచన – భావ ప్రకటన – విశ్వాసం – ధర్మం – ఆరాధనలపై స్వేచ్ఛను.. అంతస్తుల్లో – అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుకునేందుకు.. వారి వ్యక్తిగత గౌరవాన్ని, జాతీయ ఐక్యత, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు..’ రాజ్యాంగ పీఠికలోని పై వాక్కులు భారత రాజ్యాంగ మూలతత్వాన్ని ప్రతిబింబిస్తు న్నా యి. రాజ్యాంగ లక్ష్యాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఈ పీఠికే రాజ్యాంగానికి ఆత్మ. పీఠికలో భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగానే పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో (1976లో) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి.. ‘సామ్యవాద’, ‘లౌకిక’పదాలు చేర్చారు. ‘దేశ ఐక్యత’అనే పదాన్ని, ‘దేశ ఐక్యత, సమగ్రత’గా మార్చారు. సార్వభౌమాధికారానికి పెద్ద పీట వేయడం ద్వారా భారతదేశం సర్వ స్వతంత్రమైనదని పీఠిక పేర్కొంది. తన విధానాల విషయంలో రాజీలేని వైఖరి అవలంభించగలదని స్పష్టీకృతమైంది. ప్రజాస్వామ్యమార్గాల్లో ‘సామ్యవాద’లక్ష్యాలు సాధిం చాలనే ఆలోచనకు దేశం కట్టుబడుతుందని తేల్చింది. ‘లౌకిక’తత్వానికి లోబడడం ద్వారా మత ప్రమేయం లేని రాజ్యంగా ప్రకటించుకుంది. ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పాలనా వ్యవహారాల్లో భాగమయ్యేందుకు కావ లసిన ‘ప్రజాస్వామిక’హక్కులను కట్టబెట్టింది. రాచరికానికి స్థానం లేదని, ప్రజలు మాత్రమే పాలిస్తారని (గణతంత్రం) ప్రకటించింది. -
జయ జయ జయ జయహే
అద్భుతం.. అపూర్వం.. 69 ఏళ్లలో.. వందల సవరణలు జరిగినా మౌలిక స్వరూపం చెక్కుచెదరని రాజ్యాంగం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఎన్నో కులాలు, మతాలు, విభిన్న భాషలు,సంప్రదాయాలున్నప్పటికీ.. అందరినీ కలుపుకుని వెళ్తూ ఘనమైన గణతంత్రంగా కొనసాగడానికి అసలైన కారణం బలమైన మన రాజ్యాంగ పునాదులే. దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవడానికి కారణం కూడా మన రాజ్యాంగం వేసిన బాటలే. రాజ్యాంగంలోని సెక్షన్లు, చాప్టర్లు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అవసరాలను తీరుస్తున్నాయి. కొత్త సమస్యలకూ పరిష్కారాలు చూపిస్తున్నాయి.అందుకే మన రాజ్యాంగం ‘ది గ్రేట్’. ఎన్నో సమస్యలు.. ఒకే పరిష్కారం విభిన్న భాషలు, మతాలు, సంప్రదాయాల సంగమమైన విశాల భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగానికి రూపకల్పన చేయడం ఓ అద్వితీయమైన ప్రక్రియ. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఇలాంటి రాజ్యాంగాన్ని.. నేటి పరిస్థితుల్లో రాయడం కచ్చితంగా అసాధ్యమనే చెప్పాలి. భారత్‌తోపాటు అనేకమైన ఆసియా, ఆఫ్రికా దేశాలు వలసపాలకులనుంచి విముక్తి పొందినా.. ఆయా దేశాలన్నీ ఇప్పటికీ అంతర్గత కల్లోలాలతో సతమతమవుతున్నాయి. పాకిస్తాన్ పరిస్థితిలో ఇన్నేళ్లయినా మార్పు రాకపోవడమే ఇందుకు సరైన ఉదాహరణ. భారత విభజన కూడా చాలా దుర్మార్గంగా జరిగిందనేది సుస్పష్టం. పంజాబ్, బెంగాల్‌లు రెండేసి ముక్కలుగా విడిపోయిన నేపథ్యంలో చెలరేగిన హింస చరిత్రలో చెరగని మరకలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత పలు సంస్థానాలు భారత్‌లో కలిసే సమయంలోనూ ఇబ్బందులు తప్పలేదు. కశ్మీర్‌లోయలో కొంతభాగం పాక్ అధీనంలోకి వెళ్లడం, తదనంతర సమస్యలు నేటికీ ఓ సవాల్‌గా మారాయి. ఇన్ని విచిత్రమైన, విపత్కర సమస్యలున్నప్పటికీ.. భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించారు. తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత జనతా ప్రభుత్వం, 1999 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. ప్రభుత్వాలేవైనా.. రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకున్నాయి. తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు అందరూ రాజ్యాంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య పండగ భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మించడానికి 1950లోనే సుకుమార్ సేన్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. పాశ్చాత్య దేశాల్లో మొదట ఆస్తులున్నవారికి, ఆ తర్వాత చాలా కాలానికి.. కార్మికులు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. భారత్‌లో మాత్రం రాజ్యాంగంలో రాసుకున్న విధంగా భాష, లింగ, కుల, మత వివక్ష లేకుండా 21 ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల కమిషన్ తన మొదటి కర్తవ్యంగా లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందిని తీసుకుని ఓటర్ల జాబితాలు రూపొందించింది. ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రయోగమైన తొలి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు. భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదన్న పాశ్చాత్య దేశాల అంచనాలు తప్పని మన రాజ్యాంగం మరోసారి రుజువుచేసింది. 1952 నుంచి 2014 వరకు 16సార్లు పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ద్వారా కేంద్రంలో, రాష్ట్రాల్లో శాంతియుతంగా అధికార బదిలీ జరుగుతోంది. ఇదంతా అంబేడ్కర్ నేతృత్వంలో రూపొందించుకున్న భారత రాజ్యాంగం పుణ్యమేననడంలో సందేహం లేదు. చెక్కు చెదరని మౌలిక స్వరూపం 69 ఏళ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. వందకు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాలు, నిరంతర నిఘా కారణంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం నేటికీ చెక్కుచెదరలేదు. రాజ్యాంగబద్ధ పాలనతో ప్రజాస్వామ్యం కొత్త కొత్త ప్రాంతాలకు, వర్గాలలోకి చొచ్చుకుపోతోంది. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగంలోని కొన్ని లోటుపాట్లు సుపరిపాలనకు అడ్డంకిగా మారాయని ఏడు దశాబ్దాల మన అనుభవాలు చెబుతున్నాయి. 20 కోట్ల జనాభా దాటిన ఉత్తరప్రదేశ్ మొదలుకుని లక్షల జనాభా ఉన్న సిక్కిం వరకూ ఉన్న 29 రాష్ట్రాలకు ఫెడరల్ వ్యవస్థలో వాటికి ఉండాల్సినన్ని అధికారాలు లేవు. 1980ల్లోనే వామపక్షాలు, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, తెలుగుదేశం, అస్సాం గణపరిషత్ వంటి ప్రాంతీయపక్షాల డిమాండ్ల కారణంగా.. కేంద్రం–రాష్ట్రాల సంబంధాలు సమీక్షించేం దుకు పలు కమిషన్లను ఏర్పాటుచేశారు. లిబ రలైజేషన్, గ్లోబలైజేషన్ ఫలితంగా ఆర్థిక, పారి శ్రామిక రంగాల్లో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ పెరిగిన మాట వాస్తవమేగాని విద్య, వైద్యం వంటి అనేక కీలక రంగాల్లో ఇప్పటికీ రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారం లేదు. ఈ నేపథ్యంలో నిజమైన ఫెడరల్ వ్యవస్థ కోసం జరిగే డిమాండ్ల పరీక్షను భారత రాజ్యాంగం ఎదుర్కోవలసి వస్తుంది. ఫెడరల్ వ్యవస్థ కోసం జరిగే రాజ్యాంగ సవరణ దేశ చరి త్రలో అతి పెద్ద సవరణ అయ్యే ఆస్కారం ఉంది. ఇది రిపబ్లిక్ దేశం భారత్‌కు రాజ్యాంగాన్ని రూపొందించ డమే లక్ష్యంగా భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 జనవరి 9న జరిగింది. మూడేళ్ల తర్వాత 1949 నవంబర్ 26న చర్చోపచర్చల తర్వాత రాజ్యాంగానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. 1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే నిజమైన స్వాతంత్య్రం భారత ప్రజలకు లభించింది. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పౌరులకు అధికారాన్ని రాజ్యాంగం అందించింది. తొలి రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దేశప్రజలకు సందేశమిస్తూ.. ‘జాతి పిత, స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న వర్గ రహిత, సహకార స్వేచ్ఛతో, సంతోషాలతో నిండిన సమాజ స్థాపనకు మనం పునరంకితమౌదాం. ఈ రోజు కేవలం పండుగ చేసుకోవడంపై కన్నా మన లక్ష్యాలకు పునరంకితం కావడానికే శ్రద్ధ చూపాలి. కర్షకులు, శ్రామికులు, కార్మికులు, ఆలోచనపరులు పూర్తి స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేలా చేసే.. గొప్ప లక్ష్యానికి కట్టుబడి ఉందాం’అని పిలుపునిచ్చారు. ప్రయాణం మొదలైందిలా..! రాజధాని ఢిల్లీలోని అర్విన్ స్టేడియం (ప్రస్తుత మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో 1950 జనవరి 26న ఉదయం 10.30 గంటలకు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ మువ్వన్నెల జాతీయ పతాకం ఆవిష్కరించడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 21గన్ సెల్యూట్‌తో ఈ చారిత్రక ఘట్టం మొదలైంది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఇండియాలో బ్రిటిష్ పాలన ముగిసిన 894 రోజులకు ప్రజలే ప్రభువులుగా భారత్ సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రయాణం ప్రారంభించింది. బ్రిటిష్ వలస రాజ్యం ట్యాగ్ నుంచి.. సర్వసత్తాక, లౌకిక, ప్రజాతంత్ర దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవడం చాలా గొప్ప పరిణామం. 1930 నాటి సంపూర్ణ స్వరాజ్యం కావాలనే స్వప్నం.. 1950లో వాస్తవరూపం దాల్చడానికి రెండు దశాబ్దాలు పట్టింది. 1929 లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో భారత గణతంత్ర రాజ్యానికి బీజాలు పడ్డాయి. 1930 జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినంగా పాటించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా..
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?’’ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తననుతాను దళితోద్ధారకుడిగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారాయన. శనివారం అమరావతిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో మాట్లాడిన సీఎం.. ఏపీకి ప్రత్యేక హోదాపైనా మరోసారి మాటమార్చారు. అప్పుడు రాజ్యాంగమే చెడ్డదవుతుంది : గడిచిన నాలుగేళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తోన్న చంద్రబాబు నాయుడు అదే రాజ్యాంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మంచిదే కావచ్చు, కానీ దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లతై అంబేద్కర్ రాజ్యాంగమే చెడ్డదవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లోగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని చేస్తామని, దళితుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. 25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా : ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఇన్నాళ్లూ చేసినవన్నీ డ్రామాలేనని తేలిపోయింది. ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిదిపోయి.. ‘‘వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తా’’ అని వ్యాఖ్యానించడం ద్వారా హోదా విషయంలో బాబు మరో యూటర్న్ తీసుకున్నట్లైంది. 2019ఎన్నికల తర్వాత టీడీపీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని, ఆ విధంగా ఢిల్లీలో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మోదీ తరహాలో బాబు ఒక్కరోజు దీక్ష : విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నందుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన తరహాలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ‘‘పార్లమెంట్ జరగనీయకుండా చేసిన మోదీనే మళ్లీ దీక్ష చేశారు. ఇదెక్కడి విడ్డూరమో నాకు అర్థం కాలేదు. కేంద్రం వైఖరికి నిరసనగా నేనూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తా. ఈ నెల 20న నా పుట్టినరోజునాడే దీక్షకు కూర్చుకుంటా. నా దీక్షకు అందరి సహకారం కావాలి’’ అని సీఎం పేర్కొన్నారు. -
జీవించే హక్కుకు దిక్కెవరు?
దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోక పోవటం బాధాకరం. మరో గణతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఎర్రకోట సాక్షిగా మాటలు కోటలు దాటి జనాన్ని ముంచెత్తుతాయి. అద్భుతాలు జరుగుతాయని అరవయ్యేళ్లుగా ఎదురుచూస్తున్న జనం తమవి పగటి కలలేనని మరోమారు పెదవి విరుస్తారు. ప్రజలు నిర్లిప్తంగా, నిస్తేజంగా జీవించేందుకేనా ఒక మహత్తర రాజ్యాంగం నిర్మితమైంది? రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులతో తమ తలరాతలు మారిపోతాయని ఆశించే ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీ కాదా? మానవ హక్కుల, ప్రాథమిక హక్కుల పరిరక్షణలే ప్రాతిపదికగా మన గణతంత్ర వ్యవస్థలో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు తమ పాత్రను ఏ మేరకు అర్థవంతంగా పోషిస్తున్నాయి? ఓట్లు వేసి ఏలికలనెన్నుకునే ఓటున్న మారాజులు ప్రభుత్వాల పనితీరుని సమీక్షించుకోవలసిన అవసరముంది కదా! 1948 నాటి విశ్వజనీన సమాన హక్కుల పత్రం మనిషి జన్మతః స్వేచ్ఛాప్రియుడనీ, సమభావన, సమానావకాశాలతో ఎదగడానికి వ్యక్తి స్వేచ్ఛను సభ్యదేశాలు కాపు కాయాలనీ పేర్కొనగా, ఇదే పత్రం అనేకానేక పౌర, రాజ కీయ హక్కులను మానవ హక్కులుగా నిర్ధారించింది. భారత రాజ్యాంగం సైతం దాదాపు మానవ హక్కులన్నింటినీ ప్రాథమిక హక్కులనే పేరిట పౌరులకు హామీ ఇచ్చి, వీటి అమలుకు ప్రభుత్వాన్నే జవాబుదారీ చేసింది. జనమంతటికీ కూడూ, గూడూ కల్పించడం జీవించే హక్కుకు పునాది కాగా ఈ హక్కు కల్పనతో సర్కారీ వైఫల్యాలు మనలని నివ్వెరపరుస్తున్నాయి. మానవ హక్కులను కాలరాసి జనం తలరాతలని తారుమారు చేసే ఏలికల గుణగణాలను ఈ సందర్భంగా తర్కించుకోవాలి. శాంతి స్టార్ బిల్డర్స్ కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కూడూ గూడూ ప్రజలకు ఇవ్వలేని ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం విఫలమైనట్టేనని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు తరువాత పదిహేడేళ్ల కాలంలో పరిస్థితి ఎలా ఉంది? దారిద్య్ర రేఖ దిగువ దృశ్యం ప్రపంచంలోని 119 ఆకలి పీడిత దేశాల జాబితాలో భారత్ నూరవ స్థానంలో ఉంది. అన్నపూర్ణ వంటి మన దేశంలో 194 మిలియన్ల ప్రజలు పస్తుల పాలవుతున్నారు. అంతర్జాతీయ పేదరిక సూచీ (2013)లో భారత్ స్థానం ప్రముఖంగానే ఉంది. జనాభాలో 30 శాతం దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. సవరించిన ప్రమాణాల ప్రాతిపదికగానే 2012 నాటికి జనాభాలో 20.6 శాతం దారిద్య్ర రేఖకు కింద ఉన్న వారితో చేరారు. 2011–2012 నాటికి జనాభా పద్దులో 12.4 శాతం దరిద్ర నారాయణులే. 2013 అంతానికి గూడు కరువైన భారతీయులు 78 మిలియన్లు. 11 మిలియన్లు జనం రోడ్లు, ప్లాట్‌ఫారాల మీద బతుకులు వెళ్లదీస్తున్నారు. 10.78 మిలియన్ల నివాస గృహాల కొరత ఉందని కేంద్రమే తేల్చింది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని నిరుద్యోగం 8.3 శాతం (1983) నుంచి 3.46 శాతానికి (2016) తగ్గినట్టు కాకి లెక్కలు వేసినా ఇదంతా వాపేననీ, బలుపు కాదనీ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో మూతపడుతున్న పరిశ్రమలు ఉపాధికి గండికొట్టాయనీ, 2016లో 17.7 మిలియన్లుగా ఉన్న ఉద్యోగ భద్రత లేని చిరుద్యోగులు, వచ్చే రెండేళ్లలో 18 మిలియన్లు దాటిపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ జోస్యం చెప్పింది. ఏతావాతా ప్రైవేటు, పారిశ్రామిక రంగాలలో ఉపాధి పొందుతున్న 475 మిలియన్ల బడుగుజీవులకు గాను 400 మిలియన్లకు ఉద్యోగ భద్రత నాస్తి. ఇదిలా ఉండగా ప్రపంచ ఆహార భద్రతా నివేదిక ప్రకారం (2017) దేశంలో 190.7 మిలియన్ల ప్రజలకు పోషకాహార సరఫరా లేదు. 51.4 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుండగా, 30 శాతం నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఎదిగే బాలలు పౌష్టికాహార లేమి కారణంగా రోజూ 3,000 మంది అసువులు బాస్తున్నారు. 65 మిలియన్ల జనం మురికివాడలలో మగ్గుతుంటే వీరిలో 17 శాతం దాకా పట్టణాలలో జీవిస్తున్నారు. కేటాయించిన సబ్సిడీ ఆహారంలో సగం పైగా అర్హులకు చేరడం లేదు. 410 మిలియన్ల బతుకులు ఒక్కపూట, అరకొర తిండితో గడుస్తున్నాయి. ఆకలిచావులు సాధారణమైపోయాయి. ఇదీ వర్తమాన భారతం. ‘వెలిగిపోతోంద’ని నమ్మబలికిన మన దేశంలో కోట్లాది ఓటర్ల జీవించే హక్కు పట్టపగలు దోపిడీకి గురవుతుండగా మానవ హక్కులను రక్షిస్తున్నామని మనకి మనం కితాబిచ్చుకుంటామా? వేల కోట్లు గుమ్మరించి ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం ఏలికలనెన్నుకోవడం ఎవరి ప్రయోజనం కోసం? కనీస అవసరాలు తీర్చమని ప్రభుత్వాన్ని అడుక్కోవలసిన దుస్థితి ఎందుకు దాపురిస్తోంది? ఆ చురకలు అవమానం కాదా? ప్రభుత్వ పరంగా మానవహక్కుల చట్టం, ఆ చట్టం అమలు కోసం దేశ వ్యాప్తంగా హక్కుల కమిషన్, ఉపా«ధి హామీ కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి అమలులోకి తెచ్చినా, ఈ చట్టాలూ, ఈ పథకాల అమలు తీరుతెన్నుల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా దేశ న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం మీద చురకలు వేయడం, సజావైన ప్రజా పాలన కోసం కోర్టులు సూచనలు ఇవ్వడం ప్రభుత్వానికి తలవంపులు కాదా? బతికే హక్కు అర్థవంతంగా ఉండాలనీ, ‘మృగజీవనం’ కారాదనీ జస్టిస్ భగవతి ఫ్రాన్సిస్ కొరాలీ కేసులో స్పష్టం చేశారు. రాజ్యాంగపు 21వ అధికరణాన్ని విశ్వజనీన మానవహక్కు పత్రంలోని 5వ ఆర్టికల్ తోనూ, అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల అవగాహనలోని 7వ ఆర్టికల్తోనూ అనుసంధానించి జీవించే ప్రాథమిక హక్కును నిర్వచించిన 80వ దశకపు ఫ్రాన్సిస్ కొరాలీ తీర్పు తర్వాతి కాలంలో రాజ్యాంగ ధర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మహిళలూ, బాలల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ విధిగా పేర్కొన్న హుస్సేనీరా ఖాటూన్ తీర్పు తర్వాత కూడా విచారణ ఖైదీల అంశంలో సరైన సంస్కరణలు చేపట్టలేదు. దేశంలోని 1,387 జైళ్లలో 68 శాతం అండర్‌ట్రయల్ ఖైదీలే. వీరిలో 40 శాతం ఆర్నెల్లకు పైబడి బందీలుగా కాలం గడిపేశారు. వీరిలో సగంపైగా జామీనుదార్లను సమర్పించుకోలేని నిస్సహా యులే. వీరందరి జీవించే హక్కును చట్టం సాక్షిగా చట్టుబండలు చేయడం ప్రాథమిక హక్కులకు పాతర వేయడమే కదా! చదువుకోవటం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం అందరికీ విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు 1992లో మోహినీజైన్ కేసులో ప్రకటించింది. ఏళ్లూ పూళ్లూ గడిపి చట్టం తెచ్చినప్పటికీ అమలులో మాత్రం ప్రభుత్వం నీరసిం చింది. 2011 జనాభా లెక్కల రీత్యా 78 లక్షలమంది బాలలు బతుకుతెరువుకోసం బరువులెత్తుతుంటే, 8.4 కోట్లమంది చిన్నారులు స్కూళ్లకు వెళ్లలేని దురదృష్టవంతులు. ఉపాధి కోసం శ్రమించే చిట్టితల్లులు 43 శాతమైతే, బాలురు 57 శాతం. 2016 వార్షిక విద్యా సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో 11–14 ఏళ్ల లోపు 3.5 శాతం, 15–16 ఏళ్లలోపు 13.5 శాతం బాలలున్నారు. వీరిలో 25 శాతం పాఠశాల చదువుకు అర్ధాంతరంగా మంగళం పాడేస్తున్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులను శ్రమకు గురిచేయడం వారి బాల్యాన్ని దోపిడీ చేయడమవుతుందని ఇటు భారత రాజ్యాంగమూ, అటు పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నప్పటికీ, బాలల హక్కులను దోపిడీకి గురిచేయడం, రాజ్యాంగ వ్యవస్థ మన్నుతిన్న పాములా మిన్నకుండిపోవటం తన వైఫల్యం కాదని ప్రభుత్వం దబాయించగలదా? ‘బాండెడ్ లేబర్’అరాచకత్వాన్ని రూపుమాపాలని బంధు ముక్తి మోర్చా కేసు (1983)లో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తాఖీదునిచ్చింది. అయితే 1978–2015 మధ్యకాలంలో కట్టు బానిసల పునరావాసానికై విడుదల చేసిన రూ. 81.826 కోట్లలో సగంపైగా నిధుల్ని రాష్ట్రాలు వాపసు చేసినట్లు మే 2016లో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ నివేదిక వెల్లడించింది. ఇదీ మన అధికార యంత్రాంగపు నిర్వాకం. మరణశయ్య మీద ఆరోగ్యం ఇక ఆరోగ్య హక్కు అనారోగ్యం పాలై మరణశయ్య ఎక్కింది. ఆరోగ్య హామీకి ప్రభుత్వం పూచీకత్తు నివ్వకపోవటం మానవ హక్కులకు గండి కొట్టటమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయం. సుప్రీంకోర్టు సైతం ఈ దిశలో కొన్ని తీర్పులిచ్చింది. విన్సెంట్–పనికుర్లంగార కేసు (1987)లో జస్టిస్ రంగనాథ మిశ్రా ఆరోగ్యం మహా భాగ్యాన్ని ప్రాథమిక హక్కుగా ప్రస్తావిం చగా, మహీందర్ సింగ్ చావ్లా కేసులో (1996) జస్టిస్ రామస్వామి, పట్నాయక్ల ధర్మాసనం, ఈ హక్కును పటిష్టంగా ప్రభుత్వం అమలు చేయాలని వక్కాణించింది. అయితే 2000–01లో జీడీపీలో ఒక్క శాతం కూడా ఆరోగ్య హక్కు కోసం కేటాయింపు చేయలేని కేంద్రం 2009–10కి ఈ పద్దుకింద ఖర్చు అంచనాను 1.45 శాతంగా నిర్ధారించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం 1999–2002 కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రాదేశిక పాలనా సంస్థలూ జీడీపీలో కేవలం 1.3 శాతమే ఆరోగ్యం కోసం వెచ్చించాయని వెల్ల డించింది. పేద దేశాలుగా పేరొందిన ఆఫ్రికా దేశాల్లోనే జీడీపీలో 3 శాతంపైన ఆరోగ్యం ఖాతాలో ఖర్చు రాయడం విశేషం. కేంద్రం ఇటీవల వెలువరించిన 2017 నాటి జాతీయ ఆరోగ్య పాలసీలో జీడీపీలో 2.5 శాతం మొత్తాన్ని ప్రజారోగ్యం పద్దుకు కేటాయించాలని సంకల్పించింది. దీంతో దేశం ఆరోగ్యకరమైన జనాభాతో కిక్కిరిసిపోతుందని మురిసిపోతోంది. దేశంలోని 12,760 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా మంచాలే లేవు. పెరిగే రోగులకు ఆసుపత్రులూ, వైద్యులూ, వైద్య నిపుణులూ, సహాయ సిబ్బంది, పరికరాల లేమీ కొట్టొచ్చినట్లున్న దుస్థితిలో నిధుల లేమి మాయదారి రోగంగా సంతరించుకోవటం ఆరోగ్య దౌర్భాగ్యానికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోకపోవటం బాధాకరం. వెలుగులు విరజిమ్మే భారత్‌ను ఆవిష్కరించడం కోసం రాజ్యాంగ సందేశాల్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలనీ మరోసారి నేతలూ, ప్రజలూ గుర్తు చేసుకోవాలి. (రేపు గణతంత్ర దినోత్సవం) - వేదాంతం సీతారామావధాని వ్యాసకర్త భారత సుప్రీంకోర్టు మాజీ సెక్రటరీ జనరల్ ఈ–మెయిల్ : sitharam.avadhani@gmail.com -
రాజ్యాంగాన్ని కాల‘రాస్తారు!’
రెండో మాట రాజ్యాంగాన్ని బీజేపీ విధానాలకు అనుగుణంగా, తొల్లింటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మార్చే ప్రయత్నం వాజ్‌పేయి కాలంలోనే ఒకసారి జరిగిందన్న సంగతినీ విస్మరించలేం. సోలీ సొరాబ్జీ కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా ఉండగానే రాజ్యాంగంలోని ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలను తొలగించాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పటికి పార్లమెంటులో బీజేపీకి ఇప్పుడున్నంత ‘మూక కొలువు’ లేనందున చొరవ చేయలేదు. కానీ నేడు అదుపు చేసుకోలేనంత మంది బలం (కాంగ్రెస్ తప్పిదాల ఫలితంగా) లోక్‌సభలో ఉంది. ‘రాజ్యాంగాన్ని మార్చడం కోసమే మేము (భారతీయ జనతా పార్టీ) అధికారంలోకి వచ్చాం. ఎందుకంటే, తాము సెక్యులరిస్టులమనీ, అభ్యుదయ వాదులమనీ ప్రగల్భించే వారికి తమ ఉనికినీ, వ్యక్తిత్వాన్నీ చాటుకునేటట్టు చేయగల తల్లిదండ్రులు గానీ, రక్త సంబంధం ఉన్నవాళ్లు గానీ ఉండరు. తల్లీ తండ్రీ ఉన్న రక్త సంబంధీకులకు మాత్రమే ఆత్మ గౌరవం ఉంటుంది!’ – కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే (కర్ణాటకలో 24–12–17న జరిగిన సభలో అన్నమాట) ‘డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్నే చేర్చలేదు.’ – సుబ్రహ్మణ్యంస్వామి (బీజేపీ నాయకుడు) నరేంద్ర మోదీ శ్రీకృష్ణుని అవతారమే. 2019 లోక్‌సభ ఎన్నికలు అవగానే రాబోయే పదేళ్లకు పైగా మోదీయే దేశాన్ని ఏలుతారు. మాకు ఆవులంటే గౌరవం, ప్రేమ.’ – జ్ఞాన్దేవ్ అహూజా (రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే) అశేష త్యాగాలతో భారతీయులు సాధించుకున్న రాజకీయ స్వాతంత్య్రాన్ని న్యూన పరచడం, అనేక అవాంతరాల మధ్య డాక్టర్ అంబేడ్కర్ రూపొం దించిన రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అధికార పగ్గాలు చేపట్టామని సాక్షాత్తు అధికార పార్టీ బాహాటంగా ప్రకటించడం రానున్న గడ్డురోజులకు సంకేతాలే. రహస్యంగా తీసుకునే నిర్ణయాలకు అధికార ముద్ర వేయించుకునేందుకు ముందుగా టుమ్రీలు వదలడం కమలనాథులకు కూసువిద్యే. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని, దాని విస్పష్ట లక్ష్యం ప్రకటన (ప్రియాంబిల్)ను మార్చివేయడమే తమ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు ఉపన్యాసాలలో గతం నుంచి చెబుతున్నారు. ప్రకటనలు ఇస్తున్నారు. ఇది గణతంత్ర వ్యవస్థా సంకల్పానికి పూర్తి విరుద్ధం. మూకబలంతో విజృంభణ ఇప్పుడు లోక్‌సభలో బలాన్ని చూసుకుని మరింత తెగువతో ఆ పార్టీ సభ్యులు నిజరూపాలను ప్రదర్శిస్తున్నారు. ఏ సంశయం పీడిస్తున్నదో తెలియదు గానీ; ఈ ఉన్మాదపూరిత ప్రకటనలను ప్రధాని స్థాయిలో ఉన్న నరేంద్ర మోదీ గానీ, అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గానీ ఖండించకపోవడం మరీ విచిత్రం. మోదీతో సహా, ద్వితీయ తృతీయ స్థానాలలో ఉన్న అరుణ్ జైట్లీ వంటి నేతలు కూడా ఇలాంటి ప్రకటనలను అటు పార్లమెంటులోగానీ, ఇటు మరొక వేదిక మీద గానీ నిరాకరించే ప్రయత్నం చేయలేదు. అందుకే బీజేపీ రహస్య ఎజెండా నిజమేనని ప్రజలు భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. అసలు కాంగ్రెస్ పార్టీయే అంబేడ్కర్‌ను అవమానిస్తున్నదని కొందరు బీజేపీ నేతలు, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న నాయకుడు మోదీయేనని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. మరికొందరైతే, డాక్టర్ అంబేడ్కర్ అంటే తమకు ఎంతో గౌరవమని చెప్పుకుంటూనే అనంత్‌కుమార్ హెగ్డే ప్రకటనను ప్రతిపక్ష నేతలు వక్రీకరించారని అబద్ధం ఆడేశారు కూడా. మహా భారత యుద్ధకాండలో శకుని పాత్ర గురించి తెలిసినదే. ఇప్పుడు అభినవ శకుని పాత్రను నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంస్వామి రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని అంబేడ్కర్ ప్రయోగించలేదని కోతకోశారు. దీనికేమంటారు? కానీ, ఒకసారి విఖ్యాత భారతీయాంగ్ల రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్, డాక్టర్ అంబేడ్కర్ మధ్య జరిగిన చర్చలో (కఫే పరేడ్, కొలాబా బొంబాయి, మే, 1950) రాజ్యాంగం గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడే, ‘రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యునిగా వ్యక్తి స్వేచ్ఛ హక్కు గురించి మీరు పట్టుదలతో వాదించగలరా? పౌరుడి ప్రాథమిక హక్కులను మీ కమిటీ గుర్తించింది, వ్యక్తి స్వేచ్ఛ హక్కును గుర్తించింది. కానీ మీరు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా ఆమోదించారు గదా! ఈ ఆస్తిహక్కు అనేది– సంపదను వారçసత్వంగా అనుభవించే వారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోరా మరి! అలాంటప్పుడు పేదలు, దళితులు, అస్పృశ్యులు నిరంతరం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసిందే కదా!’ అని ముల్క్‌రాజ్ అడిగారు. దీనికి స్పందిస్తూ అంబేడ్కర్, ‘అందుకే కదా, రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్, ప్రజాస్వామ్య వ్యవస్థను ఆదర్శంగా ముందుకు నెట్టవలసి వచ్చింది’ అని అన్నారు. అప్పుడే మరొక అంశాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు– ‘ప్రభుత్వ కాల్దారీ హక్కుల ప్రకారం భూమిని దున్నుకుని బతికే హక్కు ప్రతివారికి దక్కే పక్షంలో సమానత్వం సాధ్యమవుతుంది. అప్పుడు దోపిడీకి అవకాశం ఉండదు. ఇప్పటివరకు అస్పృశ్యులైన దళితులకు, చివరికి హిందువులలోని, ముస్లింలలోని పెక్కు వర్గాలకు కౌలు హక్కులు లేవు. కనుక భూమి లేని రైతులు ఉత్తి చేతులతోనే మిగిలిపోయారు’. ఇందుకు ముల్క్‌రాజ్ ప్రత్యుత్తరం ఇది– ‘అయినప్పుడు పని చేసుకు బతికే హక్కును రాజ్యాం గంలో పౌరుని ప్రాథమిక హక్కుగా గుర్తించి ఉండాల్సింది గదా!’ అంబేడ్కర్ ఈ మాటకు స్పందిస్తూ, ‘ముసాయిదా రచనా సంఘం సభ్యులలో నేను ఒక డిని మాత్రమే గదా!’ అన్నారు. అప్పుడు ముల్క్‌రాజ్, ‘అయితే సింహం ముందు గొర్రెపిల్లయిపోయారా!’ అని ప్రశ్నించారు. దానికి అంబేడ్కర్ ‘అప్పటికీ నేను చేయగలిగినంత చేశాను. రాయితీలు గుంజగలిగాను. నేనిప్పుడు గర్జిస్తున్నాను’ అన్నారు. యువతరాలు పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, అప్పుడు ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారని కూడా ఆయన చెప్పారు. ఆఖరిమాటగా ముల్క్‌రాజ్, ‘కానీ, 1789 విప్లవం లాగా పెను తిరుగుబాటు రాకుండా మీరనుకుంటున్న పరివర్తన సాధ్యపడకపోవచ్చు’ అన్నారు. దీని మీదే అంబేడ్కర్ ఒక చెణుకు విసిరారు, ‘ఆనంద్‌గారూ! ఈ మాట (విప్లవం) మీ నోటి నుంచి వినడం ఆశ్చ ర్యంగా ఉంది! మీ నవలలో గాంధీజీని అస్పృశ్యుల (దళితుల) విమోచన ప్రదాతగా చిత్రించి మీరు అహింసావాదిగా మారిపోయారు కదా!’ అని. కాషాయీకరణ దిశగా.. అంబేడ్కర్, ముల్క్రాజ్ల విషయం అలా ఉంచితే, రాజ్యాంగాన్ని బీజేపీ విధానాలకు అనుగుణంగా, తొల్లింటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మార్చే ప్రయత్నం వాజ్‌పేయి కాలంలోనే ఒకసారి జరిగిందన్న సంగతినీ విస్మరించలేం. సోలీ సొరాబ్జీ కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా ఉండగానే రాజ్యాంగంలోని ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలను తొలగించాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పటికి పార్లమెంటులో బీజేపీకి ఇప్పుడున్నంత ‘మూక కొలువు’ (బ్రూట్ మెజారిటీ) లేనందున చొరవ చేయలేదు. కానీ నేడు అదుపు చేసుకోలేనంత మంది బలం (కాంగ్రెస్ తప్పిదాల ఫలితంగా) లోక్‌సభలో ఉంది. కాబట్టి ‘రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికే బీజేపీ అధికారంలోకి వచ్చింద’ని కొందరు ఎంపీలు, మంత్రులు ప్రకటించగలుగుతున్నారు. వక్రీకరణల రాజ్యం ఈ ప్రకటనలు బాహాటంగా వెలువడకముందే పౌరుల వాక్, సభా స్వాతంత్య్రాలకు, అభిప్రాయ వ్యక్తీకరణకు, న్యాయ వ్యవస్థ భాష్య స్వేచ్ఛకు, సమావేశ స్వేచ్ఛకు, సెమినార్లు, చలనచిత్ర నిర్మాణాలపైన, కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ఎన్నికలు, విద్వద్గోష్టుల స్వేచ్ఛపైన– గత మూడేళ్లుగా పాలక ‘డేగకళ్లు’ పహారా కాస్తూనే ఉన్నాయి. ఆ యజ్ఞంలో ప్రజా విశ్వాసం చూరగొన్న హేతువాద శక్తులను, వారి నాయకులను రహస్యంగా హతమారుస్తూ వారి హత్యాకాండ జరిగిన చోట హంతకుల్ని వెతికి పట్టుకోకుండా మరెక్కడో వెతికి, ‘ఎవరూ దొరక్కపోతే పాత కేడీనే పట్టుకురమ్మన్న’ పోలీసు కేసుల్లాగా విచారణ తంతులు ముగిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలకు, అది రూపొందించిన కొన్ని చట్టాలకు కూడా విరుద్ధంగానూ, ప్రభుత్వమూ, పౌరులూ విధిగా పాటించాలని నిర్దేశిస్తున్న ‘బాధ్యతల అధ్యాయాన్ని’ పాలకులు అటకెక్కించారు. చివరికి ‘శాస్త్రీయ దృక్పథాన్ని పౌరులలో పెంచి’, మూఢ విశ్వాసాల నుంచి దూరం చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న లిఖితపూర్వక ఆదేశాన్ని బీజేపీ పాలకులు మరింతగా చిత్తు కాగితం స్థాయికి దిగజారుస్తున్నారు. కేంద్ర, విద్యా, సాంస్కృతిక, శాస్త్ర, చారి త్రక పరిశోధనా సంస్థలన్నిటిలోనూ ఆధునిక పరిశోధనల స్థానంలో ‘ధాతనామ సంవత్సరం’ నాటి ఆలోచనలతో ‘పరిశోధన’లు జరిపే ప్రక్రియకు అంకురార్పణలు చేస్తున్నారు. నిజానికి వీటన్నిటికీ కాంగ్రెస్ హయాంలోనే తూట్లు పడినాయి. యజ్ఞ, యాగ, యోగాదులన్నింటినీ ‘నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వం’ లాగా, మానసిక, శారీరక, విజ్ఞానశాస్త్ర వ్యాయామ కళలను పెంపొందించకుండా ప్రస్తుత నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆధునిక శస్త్ర చికిత్సలకు ప్రాధాన్యమివ్వవలసిన చోట వినాయకుడికి జరిగిన ‘సర్జరీయే’ నేడు మనం చూస్తున్న తొండం అమరిక అని చెప్పే పాలకులున్న చోట వైజ్ఞానిక దృష్టి వర్ధిల్లదు. చరిత్ర పాఠాలు కూలంకషంగా మార్చి, వాస్తవ ఘటనలను మభ్యపెట్టే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మతాతీత లౌకిక వ్యవస్థకు, సర్వమత, సర్వ ధర్మ సమన్వయ భారతీయ వ్యవస్థకు భిన్నంగా– ముక్కూ ముఖం లేని ‘హిందూత్వ’ నిర్వచనంలో సుందర భారతాన్ని ఇమడ్చడం సంకుచిత రాజకీయం. ఆ వాస్తవాన్ని గుర్తించాలి మనది ‘సింధు’ నాగరికత. రాజ్య విస్తరణ కోసం పర్షియన్లు (పారశీకులు) సింధులోయలో ప్రవేశించినప్పుడు వారికి ‘హ’కారం తప్ప ‘స’కారం పలకదు కాబట్టి, ‘సింధు’ను ‘హిందు’గా మార్చుకున్నారు. ఈ సత్యాన్ని మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ ఎనభై ఏళ్ల క్రితమే చెప్పారు. ఆమాటకొస్తే కంచి కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య ‘జగద్గురు బోధలు’ గ్రంథంలో ‘హిందూ’ పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తూ చెప్పిన మాటలు వినండి: ‘మన మతాన్ని హిందూ మతం అనడం సరికాదు. సింధు నదీతీరంలో ఉన్నవారి మతానికి పాశ్చాత్యులు పెట్టిన పేరు హిందూమతం. అందుచే మన మతానికి చారిత్రకంగా ఒక ప్రవక్తో, మూల గురువో లేడు’ (‘వేదవ్యాసులు; ఆదిశంకరులు; జగద్గురు బోధలు’: పరిశోధకులు శతావధాని వేలూరి శివరామశాస్త్రి: 1967, పే. 101). కాగా, ఇప్పుడు రాజ కీయ లబ్ధి కోసం అయితే ‘సింధుమతం’ అని రావాలిగానీ దాని అపభ్రంశమైన ‘హిందు మతం’గా రాకూడదు. చివరికది ఆరెస్సెస్–బీజేపీ ప్రయోజ నాల కోసం ‘హిందూత్వ’గా మారి భారత ప్రజల సమైక్య ఉమ్మడి వారసత్వ మనుగడకు ప్రమాదకర నినాదంగా మారడం బాధాకరం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాజ్యాంగంపై బీజేపీ దాడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ దాడికి పాల్పడుతోందని, రాజకీయ లబ్ధి కోసం అసత్యాల్ని ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్యాన్ని పరిరక్షించేందుకు పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ 133వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని సవరించాలన్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలు భారతదేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైనవి. చివరికి ఆ రాజ్యాంగంపై కూడా దాడి చేస్తున్నారు. దేశానికి పునాదిగా ఉన్న రాజ్యాంగం, అంబేడ్కర్ మనకిచ్చిన రాజ్యాంగంపై దాడి బాధ కలిగిస్తోంది. వెనుక నుంచి దొంగతనంగా దాడి చేస్తున్నారు. అయితే రాజ్యాంగాన్ని, ప్రతీ వ్యక్తికున్న హక్కులు, అభిప్రాయాల్ని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీదే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత’ అని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం అసత్య ప్రచారం అసత్యాలతో బీజేపీ మోసపూరిత వలను అల్లుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా, ఎన్నికల్లో ఓడినా సరే సత్య మార్గాన్ని వదిలిపెట్టబోదని, దానిని పరిరక్షిస్తూనే ఉంటుందని చెప్పారు. సత్యమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య సిద్ధాంతమని.. దానిని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత విజయాలను ప్రస్తావించిన రాహుల్.. శతాబ్దానికి పైగా కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆయన గురువారం అక్బర్ రోడ్డులోని కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
డెబ్భై ఏళ్ల భారత ప్రజాస్వామ్యం ఎలా సాగింది?
ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఎటుపోతుంది? మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం శతాబ్దాలపాటు పరాయిపాలనలో కొనసాగిన భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొంది 70 ఏళ్లపాటు ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించగలగడం మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం. ఎందుకంటే వలసపాలన నుంచి బయటపడిన ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యాలుగా ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఎక్కువకాలం ప్రజాస్వామ్యాలుగా అవి కొనసాగలేకపోయాయి. అక్కడ రాజ్యాంగాలు రద్దయినాయి. మిలటరీ కుట్రలలో ఎన్నికోబడ్డ ప్రభుత్వాలు పతనమయినాయి. నియంతృత్వ ప్రభుత్వాలు రూపుదాల్చి పాదుకుపోయాయి. ప్రజాస్వామ్యం కన్నా నియంతృత్వమే మెరుగన్న భావన కూడ ఆయాదేశాల ప్రజల మనసుల్లో ఏదోకొంత మేరకు పోదిచేసుకుంది. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ రూపం మరింత బలపడుతూ, పాశ్చాత్య ప్రజాస్వామ్యాల సరసన సమానంగా ప్రపంచంలోనే అతిపెద్ద సుదృఢ ప్రజాస్వామ్యంగా మన్నలనందుకొంటుంది. ఇదంత తేలికగా సాధ్యమవలేదు. గత 70 ఏళ్ల కాలంలో భారతదేశం పలు విషమ పరిస్థితులను ఎదుర్కొంది. అంతర్గత తిరుగుబాటు నేపథ్యంతో 1975లో ఆత్మయిక స్థితిని దేశంలో విధించింది నాటి ప్రభుత్వం. స్వతంత్ర్య సిక్కుదేశం కోసం అకాలీ తీవ్రవాదులు చేసిన ఉద్యమం, పర్యవసానంగా జరిగి హింసాకాండ దేశ సమగ్రతను ప్రశ్నార్ధకం చేశాయి. పంజాబ్ కల్లోలం తరువాత దేశ ప్రధాన మంత్రి ఇంధిరాగాంధీని కాల్చిచంపారు. మండల రిజర్వేషన్ల అంశం, మందిర్ వివాదం దేశాన్ని తీవ్ర సంక్షోభంలో పడవేశాయి. యూరప్‌లో సోషలిస్టు రాజ్యాల పతనానంతరం ప్రపంచ వ్యాప్తంగా ముందుకొచ్చిన స్వేచ్ఛా విపణివాదానికి అనుకూలంగా దేశ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మాణం చేయవలసి వచ్చింది. అయితే ఈ విషమ పరిస్థితుల నుంచి భారతదేశం విజయవంతంగా బయటపడగలిగింది. ఈ విజయాలకు ప్రధాన కారణం ప్రజాస్వామ్య రాజకీయ పరిపాలనా చట్టం. శాంతిభద్రతలు, ప్రజాభిప్రాయం, ప్రజాసంక్షేమం, వ్యక్తి స్వేచ్చలు, ఆర్థిక ప్రగతి తదితర అంశాలు ఏవి ఎంత ప్రాధాన్యమో, ఏ పాళ్లలో ఉండాలో భారత ప్రజలకు నేర్పింది ప్రజాస్వామ్యం. సామాజికంగా వెనుకబడ్డ కులాలవారు విద్య, ఉద్యోగాలు, ప్రాతినిధ్య సంస్థలలో తగుస్థానం పొందేందుకు రిజర్వేషన్ విధానాలు దోహదపడ్డాయి. పెరిగిన విద్యావకాశాలు, భూ సంస్కరణలు, కుల వృత్తులనే కాక నచ్చిన వృత్తిని చేపట్టగలిగిన అవకాశాలు పెరగడం, రాజకీయ వికేంద్రీకరణ మెదలగు అంశాలు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, సామాజిక పరిపుష్టతకూ దారితీశాయి. నేడు దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవుల్లో సామాన్య సామాజిక, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారు ఉండటమనేది భారత ప్రజాస్వామ్య విజయ పథానికి సంకేతం. అలానే కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల ద్యారా అధికారంలోకి రావడం, ప్రభుత్వాలను నిర్వహించడం, పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించడం ప్రపంచంలో ఒక్క భారత దేశంలోనే జరిగింది. నేటికీ ప్రజాస్వామ్య దేశాలలో అతి బలమైన పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో కొనసాగుతున్నాయి. హిందూ సాంస్కృతిక జాతీయవాదం ఆధారంగా పార్టీని బలోపేతం చేసుకొని కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలను ఏర్పరిచిన భారతీయ జనతాపార్టీ తన భావాజాల తీవ్రతను క్రమేపీ తగ్గించుకొంది. అలానే కులం, మతం, ప్రాంతం, వగైరా అస్థిత్వాల ఆధారంగా ఏర్పడి అధికారం చేపట్టిన పార్టీలు తమ భావాజాల తీవ్రతను తగ్గించుకొని ఇతరులను కలుపుకుని పోయే మార్గాన్ని అలవరుకొన్నాయి. ఇవన్నీ భారత ప్రజాస్వామ్య విజయాలే. భారత ప్రజాస్వామ్య ప్రయోగం, విజయం ప్రపంచ దేశాలకు కూడా కొన్ని సహకారాత్మక సందేశాలను అందించింది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రజాస్వామ్యం సాధ్యమా అని రాజనీతి పండితులు తర్జనభర్జనలు చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగర జీవితం ప్రధాన స్రవంతిగా ఉండి, వ్యక్తిగత ఆదాయాలు సంవృద్ధిగా గల దేశాలలో ప్రజాస్వామ్యం సాధ్యమని వారి అభిప్రాయం. కాని ఆ పరిస్థితులు భారత దేశంలో నాడు ఒక్కటీ లేదు. ప్రజాస్వామ్యం, పేదరికం ఒకదానికొకటి పొసగవన్నది దృఢమైన వాదన. అయితే ఈ విధమైన ప్రజాస్వామ్య సిద్ధాంతం సరికాదని భారతదేశం నిరూపించింది. స్వాతంత్య్రానంతరం మూడేళ్ల కాలంలోనే భారత ప్రజలు తమ దేశాన్ని గణతంత్ర ప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. భారత ప్రజాస్వామ్యం పనిచేయడం మొదలయిన కొద్ది కాలానికే మరలా రాజనీతి పండితులు భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందా, పరిఢవిల్లుతుందా అని తర్జనభర్జన చేశారు. భారత సమాజంలోని అంతర్గత వైరుధ్యాల భారాన్ని, ధాటికి భారత ప్రజాస్వామ్యం కూలిపోక తప్పదని జ్యోస్యం చెప్పారు. అయితే ఈ రోజు నీతికోవిదుల సంశయం, జ్యోస్యం తప్పని భారత ప్రజాస్వామ్యం నిరూపించింది. అంతవరకూ ప్రజాస్వామ్య సిద్ధాంతమేమంటే ప్రజాస్వామ్యం సామాజికంగా ఏకీకృతమైన జాతులలోనే, అంటే సజాతీయ సమూహాలతోనే సాధ్యం, దీని ప్రకారం బహుళ అస్థిత్వాలు, పలు భాషలు, ఛిద్రసమూహాలు కలిగిన భారతదేశం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదన్నది ఈ సిద్ధాంతం, కాని ఇవేమీ పెను ఉప్పెనై భారత ప్రజాస్వామ్యాన్ని ముంచివేయలేదు. గత 70 ఏళ్లలో చాలానే సమస్యలొచ్చాయి. హింసాయుత పోరాటాలే జరిగాయి. ఏర్పాటువాద ఉద్యమాలు జరిగాయి. ఈ సమస్యలను బలప్రయోగం - సర్దుబాటు సూత్రం ఆధారంగా భారతదేశం ఈ సమస్యలకు చాలామటుకు పరిష్కరించగలిగింది. ఒక ప్రాంతం ఆందోళనల్లో అట్టడికిపోతున్నా, మిగతాదేశం ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలను నడుపుకు పోవడం భారతీయులకు అలవాటైంది. అయితే భారత ప్రజాస్వామ్యంతా బ్రహ్మండంగా ఉందనలేం. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకొన్నా, 70 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రక్రియ, ప్రభుత్వాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అనుకున్నా, ఒకే విధమైన, ఉత్తమమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్నదని చెప్పడానికి ధైర్యం చాలదు. ఇలీవల కాలంలో పెచ్చుపడిన కొన్ని రాజకీయధోరణులు భారతదేశానికి రాజకీయ పరంగా పెద్ద సవాళ్లుగా మారాయి. వాటిల్లో కొన్ని: రాజకీయ అవినీతి: రాజకీయాన్ని, ప్రభుత్వాధికారాన్ని తాము సంపదను పోగువేసుకొనేందుకు మార్గంగా చూడటం చాలామంది రాజకీయ నాయకులకు పరిపాటి అయిపోయింది. ఒక్కొక్కరు పదో, ఇరవై కోట్లో కాదు, వందల, వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను కూడబెడుతున్నారన్న ఆరోపణలను మనం నిత్యం రాజకీయనాయకుల నుండే వింటున్నాం. ప్రభుత్వ విధానాలను తమ తీబేదారులకనుగుణంగా అన్వయించడం, నిర్ణయాల్లో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వాధినేతలు ఎలా అక్రమ ఆస్థులను కూడబెడుతున్నారో నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ‘‘య ఆశ్వత పెట్టుబడిదారీ వ్యవస్థ’’ అని దీనికొక పేరుకూడా నానుడిలోకి వచ్చింది, చట్ట సభల్లో జరుగుతున్న తీవ్రదూషణ భాషణలు, పార్టీలు మార్చడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఈ విష క్రీడలో ఎంత కూరుకుపోయారో విదితమవుతుంది. రెండవ సమస్య వారసత్వ రాజకీయాలు: రాజకీయ పార్టీలను స్థాపించినవారు వాటిని తమ స్వంత ఎస్టేటుల్లా పరిగణించడం సహజమయింది. రాజకీయ అధికారాన్ని తమ స్వంత ఆస్తిలా తమ పిల్లలకు బదలాయించడం తమ హక్కుగా అధినాయకులు భావిస్తున్నారు. హద్దులలేని అధికారం చెలాయించడం, తమ తాబేదారులకు పనులు చేసిపెట్టడం, తాము ఆస్తులను పోగేసుకోవడమే రాజకీయంగా భావించి ఈ అధికారాలను, హోదాలను తమ పిల్లలకు అందజేయాలని అహరణం రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇదే రకం పక్రియ వ్యాపార రంగంలో చూస్తున్నాం. నటనా కౌశలం ఉన్నా, లేకపోయినా పెద్దల మద్దతుతో, భారీ పెట్టుబడులు, సెట్టింగులు, సాంకేతిక వర్గంతో, మార్కెటింగ్‌లతో బడా హీరోల పిల్లలు ఎలా అయితే హిట్ సినిమాలు కొడుతున్నారో, రాజకీయ రంగంలో కూడా పెద్ద ప్రతిభ ఉన్నా లేకపోయినా పిల్లలకు రాజకీయ ఆరంగేటం చేయిస్తున్నారు. తాము ఎలా అయినా అధికారంలోకి రావాలని పిల్లలూ, కుటుంబ సభ్యులూ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వంశపాలన, వారసత్వ రాజకీయమనేది ప్రజాస్వామ్యపక్రియకు విరుద్ధం, అందుకే బహుశా రాజనీతి శాస్త్ర పరిభాషకు భారత ప్రజాస్వామ్యం ఒక నూతన పదాన్ని జోడించింది. దాని పేరే ‘‘ అనువంశిక ప్రజాస్వామ్యం’’ లేదా ‘‘ వారసత్వ ప్రజాస్వామ్యం’’ . మూడవ సమస్య అధికార కేంద్రీకరణ: కేవలం కేంద్రీకరణే కాదు. పూర్తి అధికారాన్ని ఒకే వ్యక్తిలో నిక్షిప్తం చేయడం, అంటే కేంద్రీకృత అధికారాన్ని ఒక బృందానికో, కమిటీకో కాకుండా వ్యక్తిపరం చేయడం. చాలామటుకు పార్టీలలో, ప్రభుత్వాలలో ఈ రకమైన ఏకవ్యక్తి నిరంకుశ పాలనను చూస్తున్నాం. పార్టీ అధినాయకునికి నమ్మకస్తులే అధికారంలో ఉంటారు. అధినాయకునికి అయిష్టమైన విషయాలను ఎవరూ ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ భిన్నాభిప్రాయాలంటే నోరుమూసుకు కూర్చోవాలి లేదా పార్టీ నుంచి బయటకు పోవాలి. అధినాయకుని విశ్వరూపమే పార్టీ, పార్టీ ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఏకచ్ఛత్రాధిపత్యం నేర్పే అధినాయకులు నడపడం భారత ప్రజాస్వామ్య వైచిత్రి. ఈ ధోరణులు చాల పార్టీలలో, చాలా పార్టీ ప్రభుత్వాలలో, దాదాపు అన్ని స్థాయిలలో మనం చూస్తున్నాం. రాజకీయ అవినీతి, అనువంశిక పాలన, నిరంకుశ అధినాయకత్వం అనే ఈ మూడిటికి అవినాభావ అంతర్గత సంబంధముంది. బహుశా సామాజిక వెనుకబాటుతనం, విద్యాలేమి, విస్త్రత పేదరికం కలగలసి ప్రజాస్వామ్య పక్రియలో ఈ విపరీణ ధోరణులకు దారితీసి ఉండవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించి ఒక విధమైన, అర్థవంతమైన, సారవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పర్చుకోవడం ఎలా అన్నది భారతదేశ ప్రజల ముందున్న పెద్ద సవాలు. గత 70 ఏళ్ల కాలంలో భారత ప్రజాస్వామ్యం ఎన్నో సమస్యలను, సంక్షోభాలను అధిగమించి ముందుకు సాగింది. తనను తాను పరిష్కరించుకోగల్గింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా భారత ప్రజాస్వామ్యం తన ముందున్న సవాళ్లను అధిగమించి మరింత పరిప్రష్టమై ముందుకు సాగుతుందని ఆశిద్దాం. కొండవీటి చిన్నయసూరి హైదరాబాద్ విశ్వవిద్యాలయం -
ప్రవేశిక - తాత్విక పునాదులు
పోటీ పరీక్షల ప్రత్యేకం ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం సాధారణంగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలవుతుంది. ప్రవేశికకు పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం లాంటి పర్యాయపదాలున్నాయి. ప్రవేశికను ఆంగ్లంలో ‘Preambl్ఛ* అంటారు. రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు, మూల తత్వాన్ని ప్రవేశిక సూచనప్రాయంగా తెలియజేస్తుంది. ఏ ఉన్నత ఆశయాలతో రాజ్యాంగాన్ని రచించారు? ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించదలచారు? తదితర అంశాలను ప్రవేశిక స్పష్టం చేస్తుంది. ప్రవేశిక - ఆధారం ప్రపంచంలో ప్రవేశిక కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి గ్రహించారు. అయితే రాజ్యాంగ పరిషత్‌లో 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ‘ఆశయాల’ తీర్మానమే దీనికి ప్రధాన ప్రాతిపదిక. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే అంశాలను గ్రహించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ప్రవేశిక కూడా ఆధారమని చెప్పొచ్చు. ప్రవేశిక - పాఠ్యాంశం భారత ప్రజలమైన మేము భారతదేశానికి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వా తంత్య్రాన్నీ; అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ 1949 నవంబర్ 26న మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ప్రవేశిక - పదజాలం, భావాలు, అర్థ వివరణ ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయాధికారానికి మూలం. ప్రజలే రాజ్యాంగాన్ని రచించుకున్నారని దీని అర్థంగా చెప్పొచ్చు. రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు. సార్వభౌమత్వం (Sovereignty): అంటే సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా ((External Independence and Internal Supremacy)) విదేశీ దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తీ మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు. సామ్యవాదం(Socialist): ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. సామ్యవాదం అంటే సమ సమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (ఔ్చఛీ, ఔ్చఛౌఠట ్చఛీ ఇ్చఞజ్ట్చీ) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేస్తారు. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతోపాటు వాటిని అందిపుచ్చుకోవడానికి తోడ్పాటును అందిస్తారు. ఠి సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీన్నే పరిమాణాత్మక లేదా రాజ్యాంగ సామ్యవాదం అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం గాంధీయిజం+మార్క్సిజంల మేలు కలయిక. కానీ గాంధీతత్వం వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాద తత్వం మసకబారుతోందని చెప్పొచ్చు. లౌకికతత్వం (్ఛఛిఠ్చట): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. లౌకిక దేశాల్లో అధికార మతం, మత వివక్ష ఉండవు. మతం విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికీ ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదా నష్టం వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మతస్వామ్య రాజ్యం (Theocratic State) అంటారు. ఉదా: పాకిస్తాన్, బంగ్లాదేశ్. ప్రజాస్వామ్యం (Democracy)): ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పాటైన ప్రభుత్వం. అంటే ప్రజలే పాలితులు, పాలకులని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షకు తావు లేకుండా కేవలం నిర్ణీత వయసున్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా (Rule of law) జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. సాధారణంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినlహాయింపు ఉండదు. గణతంత్ర (Republic): ‘గణం’ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ర్టపతి, ఇతర ప్రజా పదవుల్లోని వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, లేదా పరోక్షంగా ఎన్నికవుతారు. బ్రిటిష్ రాణి/రాజు తరహాలో వారసత్వ అధికారం ఉండదు. సామాజిక ఆశయాలు (Social Objectives): ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపర్చారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. న్యాయం: న్యాయం అంటే ఒక సర్వోన్నత సమ తా భావన. అసమానత లు, వివక్షలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యాంగంలో మూడు రకాల న్యాయాలను ప్రస్తావించారు. అవి.. 1) రాజకీయ న్యాయం (Political Justice): రాజ్య కార్యకలాపాల్లో పౌరులంతా ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనడమే రాజకీయ న్యాయం. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైన వాటిని రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనొచ్చు. 2) సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులంతా సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదా, గౌరవాన్ని కల్పించడం, అన్ని రకాల సామాజిక వివక్షలను రద్దు చేయడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం. 3) ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం. జీవించేందుకు అనువుగా జీవితాన్ని మార్చడం. ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక, సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా వ్యక్తి పరిపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ ఉండి తీరాలి. ఉదా: మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్యస్థాపనకు పునాది. సమానత్వం : ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య ఆదర్శం సమానత్వం. అంటే అన్ని రకాల అసమానతలు, వివక్షలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలు కల్పించడం. ఠి సౌభ్రాతృత్వం (Fraternity): అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపర్చాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించారు. ఠి ఐక్యత, సమగ్రత (Unity & integrity): దేశ ప్రజలు కలిసి ఉండేందుకు ఐక్యతా భావం తోడ్పడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల్లో జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సమగ్రతను చేర్చాల్సిన ఆవశ్యకత: 1970 తర్వాత దేశంలో చాలా చోట్ల ప్రాంతీయవాద, వేర్పాటువాద సమస్యలు తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రవేశిక సవరణకు అతీతం కాదు ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంట్‌కు ప్రకరణ 368ని అనుసరించి ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం కిందికి వస్తుంది కాబట్టి దాని సారాంశం మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలు చేయొచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఇది ప్రవేశికకు మొట్టమొదటి సవరణ, చిట్టచివరిది కూడా. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా? వివాదాలు సుప్రీంకోర్టు తీర్పులు: రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే, ఇది రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ 1973లో కేశవానంద భారతి వివాదంలో తీర్పునిస్తూ.. దీనికి పూర్తి భిన్నంగా, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ అత్యున్నత ధర్మాసనం ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించింది. ఠి రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినప్పుడు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది. ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత - విమర్శ ఠి ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ఇందులో రాజ్యాంగ తాత్విక పునాదులున్నాయి. ఠి ప్రయోజనాలు: రాజ్యాంగ ఆధారాలను ప్రవేశిక వివరిస్తుంది. రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఠి విమర్శ: ప్రవేశికకు న్యాయ సంరక్షణ (Non-Justiciable) లేదు. ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలుపర్చకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్తావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలు అమలుకు నోచుకోవట్లేదని చెప్పొచ్చు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్ -
భారత రాజ్యాంగం... ప్రధాన లక్షణాలు
భారతదేశం, దేశ ప్రజలు, సంస్కృతి, చరిత్ర పురాతనమైనప్పటికీ.. ఆధునిక కాలంలో వాడుకలో ఉన్న ‘రాజ్యం’ అనే భావనకు మాత్రం కొత్త. చాలా సందర్భాల్లో దేశం, జాతి, రాజ్యం అనే భావనలను ఒకే అర్థం వచ్చే విధంగా వాడుతుంటాం. ఈ క్రమంలో ‘దేశం’ భౌగోళిక స్వభావాన్ని స్ఫురింపజేస్తే.. ‘జాతి’ ప్రజల మధ్య భావోద్వేగ ఐక్యతను తెలియజేస్తుంది. ‘రాజ్యం’ ఆ దేశ ప్రజల రాజకీయ స్వాతంత్య్ర స్థితిని తెలుపుతుంది. ఇండియా ఒక దేశంగా ఎప్పట్నుంచో కొనసాగుతోంది. ‘జాతీయ’ భావం బ్రిటిష్ పరిపాలనలో దీర్ఘంగా నాటుకుపోయింది. అదే ఉద్యమంగా పరిణమించి ‘భారత రాజ్య’ అవతరణకు దారి తీసింది. 1947 ఆగస్టు 14 వరకు భారతదేశం, భారత జాతి అనే రెండు భావాలు భారత ఉప ఖండానికి వర్తించగా.. 1947 ఆగస్టు 15 నుంచి భారతావనికి ‘రాజ్యం’ హోదా లభించింది. ప్రస్తుతం మనం భారతదేశానికి చెందిన భారత జాతీయులుగా గుర్తింపు సాధించాం. అంతేకాకుండా ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థ (రాజ్యం)గా కొనసాగుతున్నాం. రాజ్యాంగం ఆధునిక రాజ్యాలన్నీ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాయి. రాజ్య లక్ష్యాలను, స్వభావాన్ని తెలియజేసేదే రాజ్యాంగం. వాటికి కార్యరూపం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ (శాసన, కార్యనిర్వాహక, న్యాయ) శాఖల వ్యవస్థీకరణ, అధికారాలను; పౌరులకు, రాజ్యానికున్న సంబంధాన్ని (హక్కులు, విధులు) వివరించే నిబంధనల సంపుటే.. రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్ రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటన్ సుముఖత వ్యక్తం చేసింది. 1941లో రూజ్వెల్ట్, చర్చిల్ చేసిన సంయుక్త ప్రకటన (అట్లాంటిక్ చార్టర్) ఈ పరిణామానికి దారి తీసింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముగ్గురు కేబినెట్ మంత్రులను భారత్‌కు పంపింది. మంత్రిత్రయ ప్రతిపాదనలుగా పిలిచే ఈ సిఫార్సుల్ని.. భారతదేశంలో నాటి ప్రధాన రాజకీయ పక్షాలైన భారత జాతీయ కాంగ్రెస్, అఖిల భారత ముస్లిం లీగ్‌ల ముందుంచారు. ఈ సందర్భంలో.. మత ప్రాతిపదికన భారత ఉపఖండాన్ని విభజించాలని ముస్లింలీగ్ కోరగా.. దానిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇరు పక్షాల సమ్మతి మేరకు రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంపికయ్యారు. 389 మంది సభ్యులతో కూడిన ఈ పరిషత్ ప్రథమ సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. అయితే అఖిల భారత ముస్లింలీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో 207 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. (389 మందిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎన్నికైనవారు. ఇతరుల్లో 93 మంది స్వదేశ సంస్థానాలకు, నలుగురు ప్రధాన కమిషనర్లు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించారు.) మౌంట్‌బాటన్ ప్రణాళిక (జూన్ 3, 1947) మేరకు పాకిస్థాన్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. డా॥సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించారు. డిసెంబర్ 11, 1946న డా॥రాజేంద్రప్రసాద్ శాశ్వత అధ్యక్షునిగా ఎంపికయ్యారు. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించే ‘లక్ష్యాల తీర్మానాన్ని’ జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 13, 1946న ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానమే ‘రాజ్యాంగ పీఠిక’. డిసెంబర్ 14, 1947 (అర్ధరాత్రి)న సమావేశమైన రాజ్యాంగ పరిషత్ స్వతంత్ర భారతదేశ శాసనసభ బాధ్యతలను కూడా స్వీకరించింది. ఆగస్టు 26, 1947న డా॥అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది. బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారుగా, ఎస్.ఎన్. ముఖర్జీ ప్రధాన లేఖకుని (ఇజిజ్ఛీజ ఛీట్చజ్టటఝ్చ) గా విశేష సేవలందించారు. రాజ్యాంగం రూపకల్పన ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించిన రాజ్యాంగ పరిషత్.. 2, 473 సవరణలను పరిశీలించింది. నవంబర్ 16, 1949న ఆమోదించింది. జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 284 మంది సభ్యులు రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేశారు. దీంతో జనవరి 26, 1950న రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్‌గా రూపాంతరం చెందింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులపాటు కొనసాగిన ఈ పార్లమెంట్ మొత్తం 11 సమావేశాలను నిర్వహించింది. మొత్తం 165 రోజుల సమావేశ కాలంలో 114 రోజులు ముసాయిదా రాజ్యాంగ పరిశీలనే జరిగింది. పరిషత్ విధి నిర్వహణలో తోడ్పడిన ప్రధాన కమిటీలకు నెహ్రూ, పటేల్ వంటి ప్రముఖులు అధ్యక్షత వహించారు. రాజ్యాంగం అమలు జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం దేశానికంతటికీ అత్యున్నత శాసనం. 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్లతో కూడిన ఈ అత్యున్నత శాసనం గత 60 ఏళ్లలో అనేక మార్పులకు గురైంది. ప్రస్తుతం 440 పైగా ప్రకరణలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ‘ప్రకరణ’ నిబంధనల సంపుటి అయితే.. ‘షెడ్యూల్’ వాటి వివరణ. అయితే అన్ని ప్రకరణలకు షెడ్యూళ్లు లేవు. భారత రాజ్యాంగం పీఠికతో ప్రారంభమవుతుంది. ఇది రాజ్యాంగ సారాంశం. రాజ్యాంగానికి మూలాధారం భారత ప్రజలు. రాజ్యాంగ ముఖ్య లక్ష్యాలు.. * సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ. భారత పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించడం * పార్లమెంటరీ ప్రభుత్వం; అర ్ధసమాఖ్య వ్యవస్థ; ధ్రుడ, అధ్రుడ లక్షణాల సమ్మేళనం; స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏకీకృత న్యాయ వ్యవస్థ; ప్రాథమిక హక్కులు; ఆదేశసూత్రాలు. * సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లౌకిక, సామ్యవాద భావనలను, ప్రజల్లో బాధ్యతాయుత ధోరణిని కలిగించడానికి ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు కొన్ని రక్షణలను కల్పించారు. ఎన్నికల సంఘాలు (కేంద్ర, రాష్ట్రాల), పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (యూనియన్, రాష్ట్ర), ఆర్థిక సంఘాలు (యూనియన్, రాష్ట్ర), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తదితర వ్యవస్థలకు రాజ్యాంగపరమైన హోదా కల్పించారు. మన రాజ్యాంగానికి ప్రధాన ఆధారాలు మన రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం. విమర్శకులు భారత రాజ్యాంగాన్ని ‘1935 భారత ప్రభుత్వ చట్ట నకలు’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అర్ధ సమాఖ్య, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, తదితర అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించారు. గణతంత్ర వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ తదితర అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశసూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి.. అవశేషాంశాలపై పార్లమెంట్ చట్టాలు చేసే అధికారాన్ని కెనడా రాజ్యాంగం నుంచి.. అత్యవసర అధికారాలను వైమార్ రిపబ్లిక్ (జర్మనీ) నుంచి, రాజ్యాంగ సవరణ విధానాన్ని అప్పటి దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి, ప్రాథమిక విధులను సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. -
మద్యపాన నిషేధం అమలును ప్రశ్నించరేం...?
సాక్షి, సిటీబ్యూరో: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 గురించి పదే పదే మాట్లాడే హిందుత్వ వాదులు అదే రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం మద్యపాన నిషేధం అమలు కోసం ఎందుకు నోరువిప్పరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మంగళవారం అర్థరాత్రి తాడ్‌బన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నిజంగా దమ్ముంటే ఆర్టికల్ 47 లోని అంశాల అమలుకు ప్రయత్నించాలన్నారు. మద్యపానం వల్ల వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, రహదారి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. కేంద్రం లోని మోదీ సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వివిధ అంశాలపై రాజకీయం చేస్తూ మోదీ సర్కారు తన పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గుతున్న ఇక్కడ పెట్రోల్ ధరలు మాత్రం దిగిరావడం లేదని ఆరోపించారు. కొందరు హిందుత్వ వాదులకు తన పేరు ఉచ్చరించనిదే నిద్ర పట్టడం లేదని, కేవలం పార్టీల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు తన వాఖ్యలను వక్రీకరిస్తూ అవాకులు, చవాకులు పెల్చుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కలలుకంటున్న హిందూరాజ్యం ఎప్పటికీ సా ద్యం కాదని, హిందూస్థాన్‌గానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో గట్టి ప్రతిపక్షం లేకుండా పోయిందని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హమీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా వత్తిడి తీసుకొస్తామని అసదుద్దీన్ ప్రకటించారు. దళితులతో కలిసి నడుద్దాం.. ముస్లిం-దళితుల ఐక్యత రాజ్యాధికారానికి సూచిక అని అసదుద్దీన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాబోవు తరాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. సభలో పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషాఖాద్రి మోజం ఖాన్, జాఫర్ హుస్సేన్ తదితతరులు ప్రసంగించారు. ఎన్ఐఏ రెండు నాల్కల ధోరణి మాలే గాం బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ యూ టర్న్ తీసుకోవడం పట్ల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండి పడ్డారు. బుధవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలేగాం బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ వ్యవహరిస్తున్న తీరు రెండు నాల్కల ధోరణిగా ఉందన్నారు. కేసులో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులకు క్లిన్ చిట్ ఇచ్చి తిరిగి అనుమానాలు వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ కేసులో హిందూ యువకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ముస్లిం యువకులను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ప్రభుత్వాలు
పట్నంబజారు(గుంటూరు) : భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాలకుల కళ్లు తెరిపించేలా ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేందుకు ప్రభుత్వాలు యోచించడం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు యత్నించడం సబబు కాదన్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి పేదల భూములు లాక్కోవడం, ఎస్సీ, ఎస్టీల నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం అన్యామన్నారు. ఏప్రి ల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లే ళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాం గం ఒక పవిత్ర గ్రంథమని, కుల, మతాల పేరుతో కొందరు విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారిని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. టీడీపీ నేతలు మహనీయుల ఫొటోలకు దండలువేయడం తప్ప, వారి ఆశయాలను అమలులో పెట్టడం లేదన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, జెడ్పిటీసీ రూరల్ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎస్సీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలి
మన్ననూర్ : భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లలో భాగంగా జనాభా ప్రాతి పధికగా ఎస్సీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు జి. చెన్నయ్య డి మాండ్ చేశారు. మంగళవారం అంబేద్కర్ కూడలిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ మాల, మాదిగ ల మధ్య చిచ్చు పెట్టడంతోనే తెలంగాణలో కనుమరు గు అయిందని అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన అమ్రాబాద్ మండలానికి ప్రత్యేక ప్యాకేజీ కల్పించడంతో పాటు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అం దించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చిచ్చు రేపేందుకే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో దూమారం రేపే వ్యాఖ్యలకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ హామీల్లో భాగంగా ఎస్సీలకు రాష్ట్ర వ్యాప్తంగా భూపంపిణీ చేపట్టాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో ఇప్పటికైనా ఇద్దరు మాల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యధర్శి కుంద మల్లికార్జున్, విక్రం, సత్యం, నర్సింహ, వెంకటేష్, అవుల డేవిడ్, గోపాల్, అంజయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగం మన జీవనాడి
* వాడివేడి చర్చతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు షురూ * ‘లౌకికవాదం’ పదం చాలా దుర్వినియోగమవుతోంది: రాజ్‌నాథ్ * లౌకికవాదం అంటే.. ‘ధర్మ నిరపేక్షత’ కాదు.. ‘పంత్ నిరపేక్షత’ * రాజ్యాంగంలోని నియమాలపై దాడి జరుగుతోంది: సోనియా * విమర్శ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం: లోక్‌సభ స్పీకర్ * అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక్‌సభలో చర్చ న్యూఢిల్లీ: ‘భారత రాజ్యాంగానికి నిబద్ధత’ అనే అంశంపై చర్చతో అధికార, విపక్షాల మధ్య పరస్పర విమర్శలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. రాజ్యాంగ పీఠికలోని ‘లౌకికవాదమ’నే పదం చాలా దుర్వినియోగమవుతోందని ప్రభుత్వమంటే, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని విపక్షాలు ‘అసహనం’ అంశాన్ని లేవనెత్తాయి. స్పీకర్ సహా అధికార, విపక్ష సభ్యులందరూ రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కొనియాడారు. తొలి రోజు ప్రారంభంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సామరస్య పూర్వక వాతావరణం కనిపించింది. ప్రధాని మోదీ సభలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, టీఎంసీ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, ఆర్జేడీ నేత జైప్రకాష్ల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ, కరచాలనాలు చేస్తూ అభివాదం చేశారు. ఆ సమయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ సభలో లేరు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై మురళీమనోహర్ జోషి, మరో ఇద్దరు సీనియర్ నేతలతో కలిసి పార్టీ నాయకత్వం మీద ధ్వజమెత్తిన కురువృద్ధుడు అద్వానీకి మోదీ అభివాదం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా, మంత్రి వెంకయ్య, మరి కొందరు బీజేపీ నేతలు ప్రతిపక్షాల స్థానాలకు వెళ్లి అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు. జైట్లీ ప్రతిపక్షాల స్థానం వద్దకు వెళ్లి ఆజాద్, శరద్‌యాదవ్, ఏచూరి, మాయావతి సహా విపక్ష నేతలందరినీ పలుకరించారు. రోజంతా సభలోనే మోదీ: చర్చ సందర్భంగా మోదీ గురువారం రోజంతా సభా కార్యక్రమాలు సాగినంత సేపూ సభలోనే కూర్చోవటం విశేషం. సభ్యులు మాట్లాడుతున్నపుడు వింటూ, నోట్స్ రాసుకున్నారు. ఉదయం 11కు మొదలైన సమావేశం గంట భోజన విరామం తర్వాత రాత్రి 7:15 వరకూ కొనసాగింది. మోదీ రోజంతా సభలో ఉండి రికార్డు సృష్టించారంటూ ఖర్గే వ్యాఖ్యానించి సభ్యులను నవ్వించారు. ‘లౌకికవాదం’ చాలా దుర్వినియోగమవుతోంది ‘‘రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ రెండు పదాలూ రాజ్యంగంలో భాగమైనందున.. వాటిని పీఠికలో చేర్చాల్సిన అవసరముంటుందని బి.ఆర్.అంబేడ్కర్ ఎన్నడూ ఆలోచించలేదు. * సెక్యులరిజం (లౌకికవాదం) అనే పదానికి హిందీలో ‘ధర్మ నిరపేక్షత’ అనే పదాన్ని వినియోగించటం సరికాదు. సెక్యులరిజం పదానికి ‘పంత్ నిరపేక్షత’ (హిందీలో పంత్ అంటే మతం లేదా మతవర్గం) అనేది వాస్తవ అనువాదం. ఇది హిందీ అధికారిక అనువాదమైనందున ఈ పదాన్ని వినియోగించాలి. * ‘లౌకికవాదం’ అనేది దేశంలో అత్యంత అధికంగా దుర్వినియోగం చేసిన పదం. పదాన్ని అతిగా దుర్వినియోగం చేయటం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న ఉదంతాలు ఉన్నాయి. * రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేశారు. కోటా అనేది రాజ్యాంగంలో భాగం. ఈ అంశంపై ఇక చర్చకు ఆస్కారమే లేదు. * సీత విషయమై ఎవరో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తినపుడు ఆమెను ‘అగ్ని పరీక్ష’ ఎదుర్కోమన్న రాముడు గొప్ప ప్రజాస్వామ్యవాది. * అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు, వివక్షకు గురైనా కూడా.. ఈ దేశాన్ని వదిలి వెళ్లాలని ఎన్నడూ ఆలోచించలేదు. (అమీర్‌ఖాన్ అసహనం విషయమై మాట్లాడుతూ తన భార్య దేశం విడిచి వెళదామా అన్నారన్న వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ పరోక్షంగా విమర్శించారు.) ముస్లింలలోని 72 తెగలన్నీ నివసించే దేశం, జోరాస్ట్రియన్, యూదు తెగలు నివసించే దేశం భారతదేశం. * అంబేడ్కర్ తత్వశాస్త్రంతో, రాజ్యాంగంతో మోదీ స్ఫూర్తి పొందారు.. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బఢావో - బేటీ పఢావో వంటి పథకాలను ప్రారంభించారు. చర్చలకు సభా వేదిక కన్నా పెద్దది ఏదీ ఉండదు ‘‘ఈ సమావేశాల్లో ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ చర్చ, ఉత్తమ వినూత్న భావనలు వస్తాయని విశ్వసిస్తున్నా. చర్చలకు సభా వేదిక కన్నా మరొక పెద్ద వేదిక ఏదీ ఉండదు. ’’ అని ప్రధాని మోదీ విలేకరులతో పేర్కొన్నారు. ఆయన గురువారం పార్లమెంటు భవనం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగే విషయమై బుధవారం అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ తాను మాట్లాడినట్లు చెప్పారు. ‘‘రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మా లక్ష్యం. రాజ్యాంగం ఒక ఆశాకిరణం. అది మన మార్గదర్శి’’ అని తెలిపారు. ‘‘ఆశ(హోప్) అంటే సామరస్యం, అవకాశం, ప్రజాభాగస్వామ్యం, సమానత్వం అని’’ ఆయన అన్నారు. రాజ్యాంగం రూపకల్పనపై పార్లమెంటు గ్రంధాలయ భవనంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శనను మోదీ సందర్శించారు. ఆదర్శాలు, విలువలను పాటిద్దాం: ‘‘చరిత్రాత్మకమైన తొలి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మీకు స్ఫూర్తినివ్వాలి. భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వటం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహిళలు, పురుషులు అందరికీ ఈ దినోత్సవం ఒక నివాళి. మనమంతా రాజ్యాంగపు ఆదర్శాలు, విలువలను పాటిద్దాం.. దేశ నిర్మాతలు గర్వించే భారతదేశాన్ని తయారు చేద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన అపూర్వ కృషిని గుర్తు చేసుకోకుండా మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవటం అసంపూర్తిగానే ఉంటుంది. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా’’ అని మోదీ ట్విటర్లో వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనుల్లంఘనీయం ‘‘రాజ్యాంగంలో పరిపాలనా ప్రణాళికకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే మూడు సూత్రాలు కేంద్రంగా ఉండే స్వేచ్ఛాయుత రాజకీయాలు భారతదేశానివి. * వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనేవి ఉమ్మడి మేలు లాగానే అనుల్లంఘనీయం. * ప్రతి వ్యక్తికీ విశ్వాసం, మతం, ఆరాధన హక్కును రాజ్యాంగం హామీ ఇస్తోంది. * ప్రజాస్వామ్య పరిపాలనలో ఏకాభిప్రాయ నిర్మాణం అనేది చాలా కీలకమైన అంశం. అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనటానికి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరస్పరం చర్చిస్తూ, కలిసి పనిచేయాల్సి ఉంటుంది. * రాజ్యాంగంలోని రాజ్య విధానానికి సంబంధించిన ఆదేశక సూత్రాలు.. న్యాయబద్ధమైన సామాజిక క్రమాన్ని నిలబెట్టి, కాపాడాలని చెప్తున్నాయి. * ప్రజాస్వామ్యానికి మౌలిక పునాదులుగా బలమైన సంస్థలను రాజ్యాంగం అందిస్తోంది. రాజ్యపు మూడు అంగాలు - శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు - సామరస్యంగా పనిచేయాలి. * కీర్తిప్రతిష్టలతో విశ్రమించే సమయం కాదిది. అభివృద్ధికి సంబంధించి మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఇన్నేళ్లలో బలమైన సంస్థాగత, ప్రభుత్వ నిర్మాణాలను మనం అభివృద్ధి చేసుకున్నాం. విద్య, అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళల భద్రత వంటి ఎంతో కీలకమైన రంగాల్లో మన లక్ష్యాలను సాధించుకోవటానికి మరింత కష్టపడి పనిచేయాల్సిన సమయమిది.’’ రాజ్యాంగ ఆదర్శాలపై దాడి జరుగుతోంది ‘‘రాజ్యాంగంలోని ఆదర్శాలు, నియమాలు ప్రమాదంలో పడ్డాయి. వాటిపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది. కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న ఉదంతాలు.. రాజ్యాంగ మూలసూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి. * ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ.. దానిని అమలు చేసే వారు చెడ్డవారు అయితే.. తుది ప్రభావం చెడ్డగానే ఉంటుంది’ అని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. * రాజ్యాంగంపై ఎన్నడూ విశ్వాసం లేని వారు, రాజ్యాంగ రచనలో పాలుపంచుకోని వారు.. ఇప్పుడు దానిపై ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు దానికి నిబద్ధతపై చర్చ జరుపుతున్నారు. ఇంతకు మించిన పెద్ద జోక్ ఇంకేదీ ఉండదు. * రాజ్యాంగం సరళమైనదని నిరూపితమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దానికి వందకు పైగా సవరణలు జరిగాయి. * అమెరికా, బ్రిటన్, జర్మనీల్లో రాజకీయ సిద్ధాంతం, ఆర్థికశాస్త్రాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగివచ్చి, షెడ్యూల్డు కులాలు, అణగారిన వర్గాల వారి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న అంబేడ్కర్ అసమాన ప్రతిభను, శక్తిసామర్థ్యాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. * ‘నన్ను చైర్మన్‌గా ఎంపిక చేయటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీలో నా కన్నా విద్యావంతులు, ఉత్తములైన వారు ఉన్నారు’ అని అంబేడ్కర్ అప్పుడు చెప్పారు. * 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించినప్పుడు.. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేడ్కర్ కన్నా ఉత్తమ సారథి మరొకరు ఉండబోరని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కితాబునిచ్చారు. * రాజ్యాంగం చరిత్ర చాలా పురాతనమైనది. 1931 మార్చిలో నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరాచీ సదస్సులో ప్రాధమిక హక్కులు, ఆర్థిక హక్కులపై తీర్మానం చేసింది.’’ సామ్యవాద, లౌకిక పదాలు లేకుండానే... న్యూఢిల్లీ: రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకల సందర్భంగా గురువారం ఆప్ ప్రభుత్వం ఇంగ్లిష్ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో సామ్యవాద, లౌకిక పదాలు ప్రచురితం కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొరపాటుకు ఆప్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించి, 4 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా సమాచార, ప్రచార శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. జరిగిన పొరపాటుకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విచారం వ్యక్తం చేశారు. ‘భారతీయ భాషలకు అధికార హోదా’ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు, తమిళం సహా భారతీయ భాషలన్నింటికీ అధికార భాష హోదా కల్పించాలని లోక్‌సభ ఉపసభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువా రం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషలను అధికార భాషలుగా గుర్తిస్తూరాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకురారు? నేను తమిళంలో పార్లమెంటులో మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి? మా సొంత భాషలో మాట్లాడుకునే హక్కు మాకుంది. అని అన్నారు. భారత ఆత్మకు ప్రతిబింబం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్... రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటోంది. నేడు ప్రపంచం భారత్ వైపు, భారత విలువలవైపు చూస్తోందంటే అందుకు మన రాజ్యాంగమే ప్రధాన కారణం. ఇప్పటి దాకా వందసార్లు సవరణలు జరిగినా.. ప్రాథమిక కూర్పునకు ఎక్కడా భంగం వాటిల్లకపోవటమే మన రాజ్యాంగం ప్రత్యేకత. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం కూర్పు, రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను గమనిస్తే.. * 1930ల నుంచే సొంత రాజ్యాంగం కోసం కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది. * ఎన్నో తర్జన భర్జనలు, గొడవల తర్వాత 1946లో వైస్రాయ్ లార్డ్ వావెల్ ఇందుకు అంగీకరించారు. * రాజ్యాంగ రచనకు 1946 నుంచి 1949 మధ్య రెండు సంవత్సరాల 11నెలల 18 రోజుల సమయం పట్టింది. * రాజ్యాంగ పరిషత్తులో ప్రతీ వర్గానికి ప్రాతినిధ్యం లభించింది. 9 మంది మహిళలు ఇందులో ఉన్నారు. 24 మంది అమెరికన్లు కూడా రాజ్యాంగ చర్చలో ఏడ్రోజుల పాటు పాల్గొన్నారు. * రాజ్యాంగ రచన సమయంలోనే దేశంలో మతఘర్షణలు, కులపోరాటాలు చోటుచేసుకున్నాయి. * దీంతో ప్రాథమిక విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతత్వాలను రాజ్యాంగంలో చేర్చారు. * రాజ్యాంగ నిజప్రతిని ప్రఖ్యాత లేఖకుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ చేత్తో రాశా రు. ఇందుకు ఆయనకు ఆరు నెలలు పట్టింది. ఇందుకు ఒక్క పైసా తీసుకోలేదు. * వివిధ భాషల్లో రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగినా.. రాజ్యాంగాన్ని మాత్రం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాశారు. * ఇప్పటికీ రాజ్యాంగం నిజప్రతులు పార్లమెంటు లైబ్రరీలోని హీలియం చాంబర్స్‌లో భద్రంగా ఉన్నాయి. * ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, రష్యా నుంచి ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు విధులు, కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వ సమాఖ్య, యూకే నుంచి ప్రధాన మంత్రి, కేబినెట్, పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని తీసుకున్నారు. * 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ ఆమోదించింది. * 1950, జనవరి 26 రాజ్యాంగ అమలు ప్రారంభం కావటంతో.. గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించింది. * 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. * దీనికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు రాజ్యాంగ పరిషత్ 166సార్లు సమావేశమైంది. * ఇందులో 144 రోజులు రాజ్యాంగ ముసాయిదాపైనే చర్చ జరిగింది. * చర్చ సందర్భంగా ప్రతిపాదించిన 7,635 సవరణల్లో 2,473 సవరణలను తిరస్కరించారు. * ప్రపంచంలోనే అతిపెద్దదైన మన రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 అధికరణలు, 5 అనుబంధాలున్నాయి. -
రాజకీయ అవగాహన తప్పనిసరి
* గ్రూపు-1, 2లో పాలిటీకి పెద్దపీట * ప్రిపరేషన్ పద్ధతే చాలా ముఖ్యం * మూడంచెల విధానంలో సన్నద్ధమవ్వాలి * టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొ. కృష్ణారెడ్డి * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: ఏ పోటీ పరీక్షలకైనా దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కీలకం. గ్రూప్-1, 2 అధికారులకు ఇది మరీ ముఖ్యం. అన్ని స్థాయిల్లో రాజకీయ పరిస్థితులు తెలిసినప్పుడే వారు సమర్థంగా విధులు నిర్వహించగలరు. అందుకే గ్రూప్-1తో పాటు గ్రూప్-2లోనూ పొలిటికల్ సైన్స్‌కు స్థానం కల్పించారు. ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో 8వ అంశంగా భారత రాజ్యాంగం, రాజనీతి శాస్త్రం పొందుపరిచారు. గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేలో రెండో అంశంగా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అంశాలను చేర్చారు. పేపరు-3లోనూ పొలిటికల్ సైన్స్ అంశాలున్నాయి. గ్రూపు-2లోనూ పేపరు-2లో ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్‌ను ప్రత్యేకంగా చేర్చారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్‌కు (పొలిటికల్ సైన్స్) సంబంధించిన వివిధ అంశాలపై ప్రిపరేషన్లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలపై ఓయూ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... గ్రూపు-1కు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా పాలిటీ పరిధిలోకి వచ్చే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, అంతర్రాష్ట్ర వివాదాలపై దృష్టి పెట్టాలి. పాలనకు సంబంధించి పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని తదితర వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి. పాలిటీలో అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యాంశం 73, 74 రాజ్యాంగ సవరణలు. స్థానిక సుపరిపాలనకు దోహద పడేలా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ పథకాలు, సమకాలీన అంశాలతోపాటు దేశ రాజకీయాలు, రిజర్వేషన్లు, సామాజిక ఉద్యమాలు, పార్టీల వ్యవస్థపై అవగాహన అవసరం. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా జరిగిన ముఖ్య ఘటనలు, జాతీయ స్థాయిలో పలు పార్టీలు,రాజకీయ సమీకరణలపై అవగాహన ఉండాలి. ప్రభుత్వాలు ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన పరిస్థితులూ తెలిసుండాలి. ఉదాహరణకు అన్నా హజారే దీక్ష, లోక్‌పాల్ బిల్లు వంటివి. గ్రూపు-2 (భారత రాజ్యాంగం, రాజకీయాలు-అవలోకనం) పేపరు-2లో మొదటి విభాగంలో ఇండియా, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రెండో విభాగంలో భారత రాజ్యాంగం, పాలిటిక్స్ అవలోకనం ఉంటాయి. వీటిలో ప్రధానంగా రాజ్యాంగంపై సమగ్ర అవగాహన తెచ్చుకోవడంతోపాటు దేశ సాంఘిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు తెలుసుకోవాలి. ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, పార్టీల పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాధికారికి సమాజ స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలన్న లక్ష్యంతో సిలబస్‌ను రూపొందించారు. ఒక పేపర్లోని అంశాలకు, మరో పేపర్లోని అంశాలకు సంబంధం ఉంటుంది. నోట్సు రాసుకునేప్పుడే వీటిని జాగ్రత్తగా విభాగాలుగా చేసి సిద్ధం చేసుకోవాలి. పరీక్షలకు సంసిద్ధతే ప్రధానం తెలంగాణ వచ్చాక ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున ్న తొలి ఉద్యోగ పరీక్షలివి. సీమాంధ్ర ప్రాంతాల్లో విద్యా విధానానికి, తెలంగాణలో విద్యా విధానానికి తేడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల ఆలోచన విధానం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఇన్నాళ్లు ఇక్కడి అభ్యర్థులకే తెలియని తెలంగాణ చరిత్ర, సామాజిక పరిస్థితులు, అసమానతలు, రాజకీయ స్థితిగతులపై ప్రశ్నించేలా సిలబస్ రూపకల్పన జరిగింది. కొత్త రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను అధికారులుగా, ఉద్యోగులుగా తీసుకునేలా తెలంగాణలో పోటీ పరీక్షలుంటాయి. సంసిద్ధతలో ఇవీ ప్రధాన వ్యూహాలు అభ్యర్థులు ప్రధానంగా మూడు రకాల వ్యూహాలు అనుసరించాలి. ఒకటి ఎక్స్టెన్సిన్ స్టడీ, రెండోది ఇంటెన్సివ్ స్టడీ. మూడోది పాయింట్లవారీగా నోట్స్ సిద్ధం చేసుకోవడం. ప్రతి సబ్జెక్టు, అంశానికి సంబంధించి పరీక్షలకు సిద్ధమయేప్పుడు వీటిని కచ్చితంగా అనుసరించాలి. తద్వారా సబ్జెక్టుపై అవగాహన తెచ్చుకోవడంతోపాటు పరీక్షల్లో బాగా రాయడం వీలవుతుంది. 1. పరీక్షకు 4 నెలలుందనగా ప్రిపేరయ్యే పోటీపరీక్షకు సంబంధించిన పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ఇది ఎక్స్టెన్సివ్ స్టడీ. 2. ప్రధానాంశాలపై నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్షకు 2 నెలలుండగా వీటిని మాత్ర మే చదువుకోవాలి. ఇది ఇంటెన్సివ్ స్టడీ. 3. ఇక మూడోది పాయింట్స్. పరీక్షకు 15-20 రోజులుందనగా ఈ మూడో వ్యూహాన్ని అనుసరించాలి. ఇంటెన్సివ్ స్టడీ చేసి నోట్స్ రూపొందించుకున్న అంశాలపై పాయింట్లవారీగా మళ్లీ నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష వరకూ ఈ పాయింట్లను చదువుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో పుస్తకాలను పట్టుకుని కూర్చోవద్దు. సరైన పుస్తకాలనే ఎంచుకోవడం చాలా ముఖ్యం. పక్కవారు చదువుతున్నారని ఏ పుస్తకం పడితే అది చదవొద్దు. సొంత వ్యూహం ముఖ్యం. ఉదాహరణకు జేఎన్‌యూ, సెంట్రల్ వర్సిటీల విద్యార్థులు చదివే తీరుకు, రాష్ట్ర వర్సిటీల విద్యార్థులు చదివే విధానానికి చాలా తే డా ఉంది.రాష్ట్ర విద్యార్థులే ఎక్కువ సమ యం చదువుతారు. కానీ సెంట్రల్ వర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల సక్సెస్ రేటే ఎక్కువ. కారణం... పుస్తకాల ఎంపికే. కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. ఏమేం చదవాలంటే.. సిలబస్ బయటికొచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ఈ స్వల్ప కాలంలోనే తెలంగాణ చరిత్రంతా రాస్తామంటే కుదరు. ఇలాంటప్పుడు తెలంగాణ చరిత్రే కాదు, ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు వచ్చిన పుస్తకాలను గుడ్డిగా అనుసరిస్తే నష్టపోతారు. ఫేక్ పుస్తకాలు వందలకొద్దీ మార్కెట్లోకొచ్చాయి. అవన్నీ కొనేయొద్దు. బిట్స్ బ్యాంకులపైనా ఆధారపడొద్దు. పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. వర్సిటీల్లో లేని విద్యార్థులు అధ్యాపకుల సలహా మేరకు పుస్తకాలను కొనుక్కోవాలి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి వారు రాసినవి కొనవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న వారు రాసిన పుస్తకాలూ చదవొచ్చు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు రూపొందించిన పుస్తకాలనూ చదవొచ్చు. ఇవన్నీ గణాంకాలతో కూడుకుని ఉన్నాయి. గ్రూప్-1 అభ్యర్థులు రొమిల్లా థాపర్, బిపిన్‌చంద్ర పుస్తకాలు చదవొచ్చు. ఓబీ గౌబా రాసిన ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, ఏఆర్ దేశాయ్ రాసిన పొలిటికల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా బాగుంటాయి. ప్రణాళిక విభాగం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్లుక్ చదవాలి. తెలంగాణకు సంబంధించి గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకం బాగుంటుంది. -
కీలకమైన ప్రశ్న
సందేహం రాకుండా పోవాలిగానీ వచ్చిందంటే చాలా యాతనే. అది తీరే దాకా సమస్యే. మూడేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో బాలిక ఐశ్వర్య మహాత్మ గాంధీకి ‘జాతిపిత’ పురస్కారాన్ని ఎవరిచ్చారని సందేహం వ్యక్తంచేసింది. అది ఎవరూ ఇచ్చిందికాదని... వ్యవహారికంలో ఎప్పుడు చేరిందో ఎవరికీ తెలియదని ‘అధికారికం’గా వెల్లడైంది. అప్పటికామెకు పదేళ్ల వయసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఎలా చూడాలన్న సందేహం చర్చలోకి వచ్చింది. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పరిగణించాలా లేక భారత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించవచ్చునా అనేది ఆ సందేహం సారాంశం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ సందేహాన్ని వ్యక్తంచేశారు. చూడటానికి రెండింటిమధ్యా పెద్ద తేడా ఏముందని పిస్తుంది. కానీ ఇది సాధారణమైన సమస్య కాదని తరచి చూస్తే అర్థమవుతుంది. మన రాజ్యాంగంలోని 124వ అధికరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ‘భారత ప్రధాన న్యాయమూర్తి’గా పేర్కొంటున్నది. వివిధ పదవులకు ప్రమాణ స్వీకారం చేసే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ మాత్రం ఆ పదవిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తావించింది. న్యాయమూర్తి ప్రస్తావించేవరకూ ఈ వ్యత్యాసం సంగతే ఎవరి దృష్టికీ రాలేదని విచారణ సందర్భంగా జరిగిన సంభాషణను గమనిస్తే తెలుస్తుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అయినా, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అయినా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేకపోయారు. ఈ సమస్యగురించి ఆలోచించవలసి ఉన్నదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో నియమితులయ్యే వారు ఎలాంటి పదవీ స్వీకార ప్రమాణం చేయాలో విడిగా ఉన్నాయి. 60వ అధికరణ రాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా, 69వ అధికరణ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా సవివరంగా తెలిపాయి. 124వ అధికరణ భారత ప్రధాన న్యాయమూర్తి గురించి ప్రస్తావించినా ప్రమాణస్వీకారం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇతరుల గురించి కూడా ప్రస్తావించే మూడో షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఇన్ని దశాబ్దాల్లో న్యాయవ్యవస్థలో ఎందరో పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన న్యాయకోవిదులున్నారు. అయినా ఇలాంటి సందేహం ఎవరికీ ఇన్నేళ్లుగా కలగలేదంటే ఆశ్చర్యమనిసిస్తుంది. మన రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులు అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. వివిధ పదవులకు సంబంధించిన హోదాలు, అధికారాలు... ఆ పదవుల్లో ఉండేవారి పరిధులు వగైరాలన్నీ నిర్దిష్టంగా ఉన్నాయి. ఆ పదవుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన నియమనిబంధనలను జాగ్రత్తగా పొందుపరిచారు. అయితే, ఎంత చేసినా ఏవో లోటుపాట్లు ఉండకతప్పదు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు కావొచ్చు...తలెత్తే కొత్త సమస్యలు కావొచ్చు... ఉన్న సమస్యలే కొత్త పరిష్కారాలను కోరడంవల్ల కావొచ్చు-అలాంటివాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. ఇప్పుడు జస్టిస్ జోసెఫ్ లేవనెత్తిన సమస్యపై కూడా విస్తృత చర్చ జరిగి, అవసరమైతే రాజ్యాంగంలో ఆ మేరకు మార్పులు చేయక తప్పదు. అయితే, న్యాయమూర్తి వ్యక్తం చేసిన సందేహం ఆసక్తికరమైనదే తప్ప అంత అవసరమైనది కాకపోవచ్చునని సాధారణ పౌరులకు అనిపిస్తుంది. ఆ పదవి గురించిన ప్రస్తావనలో ఉన్న తేడావల్ల ఆచరణలో తలెత్తే ఇబ్బంది ఏముంటుందని పిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సందేహం కీలకమైనది. న్యాయమూర్తుల ఎంపిక కోసం ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న కొలీజియం స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎన్‌జేఏసీ ఏర్పడిన నేపథ్యంలో ఇది ముఖ్యమైనది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్న నిబంధన ఉంది. రాజ్యాంగంలోని 217వ అధికరణ ఆ సంగతిని సవివరంగా ప్రస్తావించింది. అయితే, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తిని సరిగా అమలు చేయడంలేదని, సుప్రీంకోర్టు పాత్ర అందులో ఉండటం లేదని భావించిన జస్టిస్ జేఎస్ వర్మ 1993లో ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుండే కొలీజియం వ్యవస్థ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. 1998లో మరో తీర్పు ద్వారా ఇది అయిదుగురు సభ్యుల కొలీజియంగా మారింది. ఈ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే విధానంగా మారిందని అంటూ ఎన్డీయే సర్కారు ఎన్‌జేఏసీ చట్టం తీసుకొచ్చింది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తులిద్దరూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, మరో ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారని చట్టం చెబుతున్నది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ రీత్యా చూస్తే ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిగిలిన సభ్యులతో సమానమవుతారు. 124వ అధికరణ అయినా, 217వ అధికరణ అయినా రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని న్యాయవ్యవస్థ పెద్దగా, ప్రతినిధిగా చూస్తున్నది. కానీ, ఎన్‌జేఏసీ ఆ పాత్రను కుదిస్తున్నది. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను పరిమితం చేస్తున్నది. కనుక రెండింటిమధ్యా ఉన్న వ్యత్యాసాన్ని, అందువల్ల ఏర్పడిన అయోమయాన్ని పోగొట్టాలన్నది జస్టిస్ జోసెఫ్ సంధించిన ప్రశ్నలోని అంతరార్ధం కావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా పారదర్శకంగా పనిచేసినప్పుడే అర్ధవంతంగా ఉంటుంది. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అందరూ కోరుకునేది అందుకే. అది జరగడానికి ముందు రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాముఖ్యత, పాత్ర ఏమిటన్నది కూడా తేలడం కూడా అవసరమే. -
జనహితం.. ఐక్యతాబంధం
కొత్త కోణం అంబేద్కర్ లేకుండానే రాజ్యాంగ రచన సాగే పరిస్థితి ఒక దశలో ఏర్పడిందనేది నమ్మలేని నిజం. రాజ్యాంగ సభ చైర్మన్, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆ సమయంలో కీలక పాత్ర పోషించారు. ‘‘సభలో, సభా కమిటీలలో అంబేద్కర్ ప్రదర్శించిన విజ్ఞానాన్ని, వివేచనను, ఆయన కృషిని చూశాక అటువంటి వ్యక్తిని సభలోకి తీసుకోకపోతే, జాతి నష్టపోతుందనే నిర్ణయానికి వస్తున్నాను... రాజ్యాంగ సభలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన తప్పక సభకు ఎన్నిక కావాలి’’ అని రాజేంద్రప్రసాద్ కరాఖండిగా చెప్పారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి సరిగ్గా ఆరున్నర శతాబ్దాలు. జనవరి 26, 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం సర్వసత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా అవతరించింది. రిపబ్లిక్ డే అంటేనే వెంటనే స్ఫురించేది భారత రాజ్యాంగం. దానికి కర్తగా అద్భుత ప్రతిభాప్రపత్తులను ప్రదర్శించిన దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. నిజానికి రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ నిర్ణాయక సభలో ఆయనకు సభ్యత్వమే లేని పరిస్థితి ఏర్పడిందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అలాంటి పరిస్థితే ఏర్పడింది, అయినా అంబేద్కర్ మన రాజ్యాంగ రచనకు నిర్దేశకుడైన వైనం ఆసక్తికరం. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం సొంత రాజ్యాం గాన్ని రూపొందించుకునే ప్రయత్నాలు మొదలైన తదుపరి పరిణామాలు అప్పట్లో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘానికి అంబేద్కర్ చైర్మన్ కావడం మరింత విస్మయకర అంశమైంది. లోతైన పరిశోధన తరువాత కొన్ని ముఖ్యాంశాలు బయటపడ్డాయి. ప్రత్యే కించి ఆనాటి రాజ్యాంగ సభ చైర్మన్, ప్రప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంలో నిర్వహించిన కీలక పాత్ర నాటి చరిత్రను కొత్త కోణంలో చూపుతోంది. అంబేద్కర్ లేని రాజ్యాంగ సభా? స్వాతంత్య్రానంతరం 1946 జూలైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బొంబాయి నుంచి షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసిన అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కమ్యూనిస్టులు కూడా వారికి తోడైనట్టు అంబేద్కర్ స్వయంగా తెలిపారు. అయితే అప్పటి తూర్పు బెంగాల్ నుంచి ఎన్నికైన జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా చేసి ఆయనను జైసూర్ కుల్నా నుంచి రాజ్యాంగ సభకు పంపారు. ఇండిపెండెంట్ షెడ్యూల్డ్ కులాల సభ్యులు ముగ్గురు, ఆంగ్లో ఇండియన్, ముస్లిం లీగ్ సభ్యులు ఒక్కొక్కరు ఓటు వేసి అంబేద్కర్‌ను గెలిపించారు. అయితే దేశ విభజన వల్ల తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో భాగమైంది. అంబేద్కర్ ఆ దేశ రాజ్యాంగ సభ సభ్యుడయ్యారు. అందులో కొనసాగడం ఇష్టం లేక ఆయన రాజీనామా చేశారు. భారత రాజ్యాంగ రచనా సంఘంలో అంబేద్కర్‌కు స్థానం ఉండని స్థితిలో కథ మలుపు తిరిగింది. అంబేద్కర్‌ను రాజ్యాంగ సభలోకి తీసుకో వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అది బాబూ రాజేంద్రప్రసాద్ చూపిన చొరవతోనే జరిగిందని ఆయన రాసిన ఒక ఉత్తరం వెల్లడిస్తోంది. 1947, జూన్ 30న నాటి బొంబాయి ప్రధాన మంత్రి బి.జి. ఖేర్‌కు ఆయన ఇలా రాశారు: ‘‘డాక్టర్ అంబేద్కర్ విషయంలో ఎన్ని అభిప్రాయాలున్నప్పటికీ ఆయనను తిరిగి రాజ్యాంగ సభలోకి తీసుకోవాలి. రాజ్యాంగ సభలో, వివిధ సభా కమిటీలలో ఆయన ప్రదర్శించిన విజ్ఞానం, వివేచన, చేసిన కృషిని చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వస్తున్నాను. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ సభలోకి తీసుకోక పోతే, జాతి నష్టపోతుంది... జూలై 14న ప్రారంభమయ్యే రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ ఉండాలని కోరుకుంటున్నాను. అందువలన ఆయన తప్పనిసరిగా సభకు ఎన్నిక కావాలి.’’ రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఆవశ్యకతను రాజేంద్రప్రసాద్ ఆ విధంగా కరాఖండిగా చెప్పారు. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌ల అంగీకారం లేకుండా ఆయన తన నిర్ణయాన్ని అమలు చేయగలిగేవారు కారు. బొంబాయి నుంచి అప్పటి వరకు సభలో ప్రతినిధిగా ఉన్న న్యాయ నిపుణులు జయకర్ రాజీనామా చేయడం వలన ఒక స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి అంబేద్కర్ ఎన్నిక జరగా లని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం నుంచి సభకు ఎంపిక కావడం కోసం ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మౌలాంకర్ను ఎంపిక చేసింది. ఆయనను ఒప్పించే బాధ్యతను సర్దార్ పటేల్‌కు అప్పజెప్పింది. 1947 జూలై 3న మౌలాంకర్‌కు రాసిన ఉత్తరంలో పటేల్ ‘‘ఇప్పుడు మీకు తొందరేం లేదు. రాజ్యాంగ సభకు ఎన్నికవడానికి కాంగ్రెస్ మరొకసారి అవకాశం కల్పిస్తుంది. ఈసారి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉండాలని అందరం భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రణాళికా రచన కాదు... రాజ్యాంగ సృజన నెహ్రూ, జూలై చివరి వారంలో భారత తొలి మంత్రివర్గంలో చేరి, న్యాయ శాఖామంత్రిగా పనిచేయాలని అంబేద్కర్‌ను కోరారు. ప్రణాళికా మంత్రిగా ఉంటే ప్రణాళికల రూపకల్పన దశలోనే ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతామని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ముందుగా న్యాయశాఖ బాధ్యతలు తీసుకోవాలని, ఆ తరువాత ప్రణాళికా శాఖను సైతం అప్పగిస్తామని నెహ్రూ అంబేద్కర్‌కి హామీ ఇచ్చారు. అయితే 1947 ఆగస్టు 29న ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ప్రకటించారు. అంబేద్కర్‌ను దానికి చైర్మన్‌గా నియమించారు. ఆ రోజు నుంచి అంబేద్కర్ రాజ్యాంగ రచన అనే బృహత్ కార్యానికి తన సర్వశక్తులు వెచ్చించారు. ఆయన కృషిని, దాని ఫలితాన్ని దేశం ఆనాడే గుర్తించింది. రాజ్యాంగ రచనా బాధ్యతలను అంబేద్కర్‌కి అప్పగించడం ఎంత సరైన నిర్ణయమని ఆనాడే భావించారో కమిటీ సభ్యుల అభిప్రాయాలను బట్టే తెలుస్తుంది. ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన చివరి రోజున కమిటీ సభ్యులలో ఒకరైన టి.టి. కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నప్పటికీ, అంబేద్కర్ మాత్రమే పూర్తి కాలం పనిచేసిన ఏకైక వ్యక్తి. ఇందులో ఒకరు రాజీనామా చేశారు. మరొక సభ్యుడు మరణించారు. వారి స్థానాల్లో ఎవరినీ తీసుకోలేదు. మరొక సభ్యుడు ప్రభుత్వ పనులలో తీరికలేకుండా ఉన్నారు. ఇంకొక ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణాల వలన ఢిల్లీకి దూరంగా ఉన్నారు. దీనితో రాజ్యాంగ రచనా సంఘం బాధ్యత ఒక్క అంబేద్కరే తన భుజాన వేసుకోవాల్సి వచ్చింది. అంతే దీక్షతో ఆయన ఆ పనిని పరిపూర్తి చేశారు కూడా. ఆయన చేసిన ఈ కృషి ప్రశంసనీయమైనది’’ అన్నారు. అంబేద్కర్ పేరును ప్రతిపాదించిన రాజ్యాంగ సభ చైర్మన్ బాబూ రాజేంద్రప్రసాద్ కూడా తన చివరి ప్రసంగంలో ఆయన కృషిని కొనియాడారు. ‘‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా ఎన్నుకోవడం ఎంత సరైనదో అందరికన్నా ఎక్కువగా నేను గుర్తించగలిగాను. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనా కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించారు. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేయడం మాత్రమే కాదు. ఎంతో తపనతో నిర్వహించారు. దీనికి మనమంతా ఆయనను అభినందించాలి.’’ ఆయన చేసిన అనితర సాధ్యమైన కృషి మీద విపులమైన అధ్యయనాలు ఎన్నో వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని ఓ శక్తివంతమైన ఆయుధంగా మలచి అంబేద్కర్ కోట్లాది ప్రజలకు అందించారు. జనహితానికి విభేదాలు కావు అడ్డంకి రాజ్యాంగంలో ఉన్న అన్ని ప్రకరణలతో పాటు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఈ రోజుకే కాదు, ఏనాటికైనా దేశ పురోగమనానికి మార్గదర్శ కాలుగా ఉంటాయి. వాటి రూపకల్పనలో కూడా కీలక భూమికను పోషించినది అంబేద్కర్ కావడం విశేషం. ఈ సందర్భంగా మరొక విషయాన్ని మనం ఇక్కడ సంక్షిప్తంగానైనా ప్రస్తావించుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యునిగా గానీ, రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా గానీ ఉంటారని ఆయనతో సహా అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అందువల్లనే 1947 మార్చిలో ఆయన రాజ్యాంగ సభకు తన ప్రతిపాదనగా పంపడానికి ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న నివేదికను రూపొందించారు. ఆ తరువాత దానిని రాజ్యాంగ సభకు అందజేశారు. అంబేద్కర్ రాజకీయంగా గాంధీజీ అభిప్రాయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల తన వ్యతిరేకతను 1930 నుంచి నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. 1942లో ఏకంగా గాంధీజీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాత్మకమైన ఒక పెద్ద గ్రంథాన్ని రచించారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో గాంధీజీతో పెద్ద వివాదం జరిగింది. ఇది తీవ్రమైన సైద్ధాంతిక ఘర్షణకు కూడా దారితీసింది. చివరకు గాంధీజీ నిరాహారదీక్ష దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిర్మాణం అయిన రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఉంటారని ఊహించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే తూర్పు బెంగాల్ నుంచి మొదట రాజ్యాంగ సభలో సభ్యునిగా ప్రవేశించిన అంబేద్కర్ చేసిన ప్రసంగాలు, అనుసరించిన వైఖరి కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేసింది. రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్‌గా అంబేద్కర్ నియామకానికి మార్గం సుగమం చేసినది అదే. అలాగే కాంగ్రెస్‌తో అంబేద్కర్‌కి రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ పట్టుదలకి పోకుండా... దేశ ప్రజల, ఎస్సీ, ఎస్టీల రక్షణ, భద్రత, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా తనను తాను తగ్గించుకొని రాజ్యాంగ రచనా సంఘానికి నేతృత్వం వహించడం, ఒంటరిగా ఆ బృహత్తరమైన బరువు బాధ్యతలను దక్షతతో నిర్వహించడం అంబేద్కర్ రాజకీయ విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. రెండు విరుద్ధమైన శిబిరాలు దేశ ప్రయోజనాల కోసం ఒకటిగా మారడం వల్లనే భారత ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలను అందించే అతి అరుదైన రాజ్యాంగాన్ని రచించుకోవడం సాధ్యమైంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213) -
రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
భారత రాజ్యాంగంలోని అయిదో భాగంలో 79 నుంచి 123 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, విధులు, అధికారాలు తదితర అంశాల గురించి వివరిస్తాయి. కేంద్రంలో ద్విసభ విధానాన్ని 1919 చట్టం ద్వారా మనదేశంలో ప్రవేశపెట్టారు. అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. దీని ప్రకారం రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో అంతర్భాగమే. ఆయన ప్రమేయం లేకుండా ఏ బిల్లూ శాసనం కాదు. పార్లమెంట్ నిర్మాణం పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. అవి: 1. లోక్‌సభ, 2. రాజ్యసభ. లోక్‌సభ లోక్‌సభను ‘దిగువ సభ’, ‘ప్రజా ప్రాతినిధ్య సభ’ అని కూడా పేర్కొంటారు. దీని నిర్మాణం గురించి అధికరణం 81 తెలియజేస్తుంది. ఇందులో గరిష్ట సభ్యుల సంఖ్య 552. వీరిలో 550 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఇద్దరిని నిబంధన 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి రాష్ట్రపతి నియమిస్తారు. ఈ 550 మందిలో రాష్ట్రాల నుంచి 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మందికి మించకూడదు. లోక్‌సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. వీరిలో 543 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఎన్నికవుతున్నారు. ప్రారంభంలో లోక్‌సభ సభ్యుల సంఖ్య 525 మంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. 2026 వరకూ ఈ సంఖ్యను పెంచకూడదని 2001లో 84వ సవరణ ద్వారా నిర్ణయించారు. లోక్‌సభకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా (80 మంది) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ట్ర - 48, పశ్చిమ బెంగాల్ - 42, బీహార్ - 40, తమిళనాడు - 39, మధ్యప్రదేశ్ - 29, కర్ణాటక - 28 ఉన్నాయి. అతి తక్కువగా సిక్కిం-1, మిజోరాం-1, నాగాలాండ్-1, గోవా-2, అరుణాచల్ ప్రదేశ్-2, మణిపూర్-2, మేఘాలయ-2, త్రిపుర-2 రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అత్యధికంగా ఢిల్లీ నుంచి ఏడుగురు మిగిలిన వాటి నుంచి ఒక్కొక్కరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికరణం 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక సీట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎస్సీలకు 84, ఎస్టీలకు 47 స్థానాలను కేటాయించారు. ఈ రిజర్వేషన్లు పదేళ్ల వరకూ కొనసాగుతాయి. ఇప్పటివరకూ వీటిని ఆరు పర్యాయాలు పొడిగించారు. 1. 1960లో 8వ రాజ్యాంగ సవరణ ద్వారా 1970 వరకు. 2. 1969లో 23వ రాజ్యాంగ సవరణ ద్వారా 1980 వరకు 3. 1980లో 45వ రాజ్యాంగ సవరణ ద్వారా 1990 వరకు 4. 1989లో 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 వరకు 5. 1999లో 79వ రాజ్యాంగ సవరణ ద్వారా 2010 వరకు 6. 2009లో 95వ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు. ఎస్సీ స్థానాలు అధికంగా ఉత్తరప్రదేశ్‌లో 17, ఎస్టీ స్థానాలు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 6 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ-2014 చట్టం ద్వారా అంతకుముందున్న 42 స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు 25, తెలంగాణకు 17గా విభజించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1; తెలంగాణాలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 ప్రత్యేక స్థానాలను కేటాయించారు. లోక్‌సభకు ఇప్పటివరకూ పదహారు సార్లు (1952, 1957, 1962, 1967, 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఆరుసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1971లో మొదటిసారి మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. 1971లో ఏర్పడిన అయిదో లోక్‌సభ అధిక కాలం కొనసాగింది. 1998లో ఏర్పడిన 12వ లోక్‌సభ తక్కువ కాలం కొనసాగింది. మొదటి లోక్‌సభకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య 22 మంది. ప్రస్తుత 16వ సభలో 65 మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు కాగా, 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 81.45 కోట్లు. కాలపరిమితి: నిబంధన 83 ప్రకారం లోక్‌సభ సాధారణ కాల పరిమితి ఐదేళ్లు. అత్యవసర సమయంలో ఏడాదిపాటు పొడిగించుకోవచ్చు. నిబంధన 85 ప్రకారం రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ముందుగానే దీన్ని రద్దు చేయవచ్చు. 1976లో 42వ సవరణ ద్వారా ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించి, 1978లో 44వ సవరణ ద్వారా ఆరేళ్ల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించారు. రాజ్యసభ రాజ్యసభను ‘ఎగువ సభ’, ‘రాష్ట్రాల ప్రాతినిధ్య సభ’ అని పేర్కొంటారు. ఇది శాశ్వత సభ. ఇది 1952లో ఏర్పడింది. దీని నిర్మాణం గురించి నిబంధన 80 తెలియజేస్తుంది. గరిష్ట సభ్యుల సంఖ్య 250 మంది. వీరిలో 238 మంది.. ఎమ్మెల్యేలతో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నికవుతారు. నిబంధన 80(3) ప్రకారం.. సాహిత్యం, కళలు, క్రీడలు, సాంఘిక సేవలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర రంగాల నుంచి 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి నియమిస్తారు. రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 245 మంది. వీరిలో 233 మంది ఎన్నికవుతున్నారు. మిగిలిన 12 మంది రాష్ట్రపతితో నియామకమవుతున్నారు. ఈ 233 మందిలో రాష్ట్రాల నుంచి 229 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నలుగురు (ఢిల్లీ-3, పాండిచ్చేరి-1) ఎన్నికవుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 31 మంది ఎన్నికవుతుండగా.. మహారాష్ర్ట- 19, తమిళనాడు- 18, పశ్చిమ బెంగాల్-16, బీహార్-16 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అతితక్కువగా సిక్కిం, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ల నుంచి (ఒక్కొక్కరు) ఎన్నికవుతున్నారు. రాజ్యసభ మొత్తం సభ్యుల్లో ప్రతి రెండేళ్లకు 1/3వ వంతు మంది పదవీ విరమణ చేయగా.. మరో 1/3వ వంతు మందిని ఎన్నుకుంటారు. అంటే సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. పదవీ రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షులుగా కొనసాగుతారు. సభ్యుల నుంచి ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మొదటి ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి. ప్రస్తుతం పి.జె. కురియన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు నిబంధన 85 ప్రకారం పార్లమెంట్ ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. ప్రస్తుతం ఆనవాయితీగా సంవత్సరానికి మూడుసార్లు సమావేశాలను నిర్వహిస్తున్నారు. గరిష్ట సమావేశాలపై పరిమితి లేదు. అవసరాన్ని బట్టి ఎన్ని రోజులైనా నిర్వహించుకోవచ్చు. కనీసం వంద రోజులు నిర్వహించాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొదటి సమావేశం 1952 మే 13న జి.వి. మౌళాంకర్ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్ - కోరం: కోరం అంటే సభ సమావేశాల నిర్వహణకు హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. నిబంధన 100 ప్రకారం పార్లమెంట్ కోరం 1/10వ వంతు మంది (అధ్యక్షులతో కలిపి)గా నిర్ణయించారు. ఎంపీ పదవికి కావాల్సిన అర్హతలు: నిబంధన 84 పార్లమెంట్ సభ్యుడిగా నిలిచే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి వివరిస్తోంది. అవి: 1. భారతీయ పౌరుడై ఉండాలి. 2. లోక్‌సభకు 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్లు నిండి ఉండాలి. 3. ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండరాదు. 4. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. 5. ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి. పోటీ చేసే అభ్యర్థి రూ.25,000 నామినేషన్ ఫీజుగా చెల్లించాలి. ఓడిపోయిన అభ్యర్థికి ఈ డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై, చెల్లిన ఓట్లలో 1/6వ వంతు రావాలి. స్పీకర్ ప్రకరణ 93 ప్రకారం లోక్‌సభకు స్పీకర్ ఉంటాడు. ఇతడే లోక్‌సభ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. లోక్‌సభ సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌తో పదవీ స్వీకార ప్రమాణం చేయించేది రాష్ర్టపతి లేదా ఆయన నియమించే ప్రొటెమ్ స్పీకర్. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. స్పీకర్ కాలపరిమితి ఐదేళ్లు. లోక్‌సభ ముందుగానే రద్దయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. నూతన లోక్‌సభ ఏర్పడేంత వరకూ పదవిలో కొనసాగుతాడు. తిరిగి ఎన్నిసార్లయినా పదవి చేపట్టవచ్చు. ఎక్కువకాలం బలరాం జక్కర్, తక్కువ కాలం బలీరాం భగత్ స్పీకర్ పదవిలో కొనసాగారు. స్పీకర్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. దీన్ని సంఘటితనిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుతం స్పీకర్‌కు రూ. 1,25,000; డిప్యూటీ స్పీకర్‌కు రూ. 90,000 చెల్లిస్తున్నారు. స్పీకర్‌ను తొలగించే విధానం: స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే నిబంధన 94 ప్రకారం లోక్‌సభ అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు 50 మంది సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేయాలి. అనంతరం చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. దీంట్లో సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే స్పీకర్ పదవి కోల్పోతాడు. ఈ తీర్మానం చర్చకు వచ్చినప్పుడు సభాధ్యక్షుడిగా డిప్యూటీ స్పీకర్ కొనసాగుతాడు. మొదటి స్పీకర్ జి.వి. మౌళాంకర్, తొలి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్. ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదొరై. స్పీకర్ విధులు, అధికారాలు: లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను నిర్వహిస్తాడు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే సభ్యులపై చర్య తీసుకుంటాడు. సభ్యుల హాజరు పట్టికను పరిశీలించి ఎవరైనా సభ్యుడు 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు.పార్లమెంట్, రాష్ట్రపతి, మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా పనిచేస్తాడు. ఏదైనా బిల్లును స్వభావం ఆధారంగా ఆర్థికమైందా, సాధారణమైందా అని నిర్ణయిస్తాడు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సభలో బిల్లులు, తీర్మానాలపై ఓటింగ్ నిర్వహిస్తాడు. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకుంటాడు. కొన్ని పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షుడిగా కొనసాగుతాడు. కామన్వెల్త్ స్పీకర్స ఫోరమ్‌లో సభ్యుడిగా కొనసాగుతాడు. 1. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు? 1) కె. రహమాన్‌ఖాన్ 2) కరియా ముండా 3) షంషేర్ కె. షరీఫ్ 4) పి.జె. కురియన్ 2. కిందివాటిలో దేన్ని ‘పార్లమెంట్ల మాతృక’గా పేర్కొంటారు? 1) భారత పార్లమెంట్ 2) బ్రిటన్ పార్లమెంట్ 3) యూఎస్ కాంగ్రెస్ 4) స్విస్ ఫెడరల్ అసెంబ్లీ 3. భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణలో వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని ప్రస్తావించారు? 1) 116 2) 265 3) 112 4) 266 4. రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? 1) ఉపరాష్ట్ట్రపతి 2) లోక్‌సభ స్పీకర్ 3) రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి 4) మెజార్టీ పార్టీ నాయకుడు 5. భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల సంఖ్య ఎంతకు మించకూడదు? 1) 10 2) 25 3) 15 4) 20 సమాధానాలు: 1) 4 2) 2 3) 3 4) 1 5) 4 -
నేడు ‘రాజ్యాంగం’పై సెమినార్
సిర్పూర్(టి) : ప్రపంచంలోనే అతి పెద్ద దృఢ, అధృడ రాజ్యాంగం.. భారత రాజ్యాంగం. దీనికి బుధవారంతో 65 ఏళ్లు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌కు అందజేసిన భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించిన మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రచించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దర్శనీయకత నేటికి సజీవంగా ఉంది. తొలి నాళ్లలో 395 నిబంధనలు 8 షెడ్యుళ్లు ఉన్న రాజ్యాంగం తదనంతర కాలంలో 450 నిబంధనలు 12 షెడ్యుళ్లుగా మారింది. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని నేటి విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో జనవరి 26 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ స్ఫూర్తి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రఇంటలెక్చువల్ ఫోరం, దళిత సాహిత్య అకాడమీ, బిడారు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఐనాల సైదులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో డాక్టర్ వీఆర్.అంబేద్కర్ - భారత రాజ్యాంగం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ సుదర్శన్, ప్రముఖ ఇంజినీర్ భయ్యాజి రాంటెంకి (చంద్రాపూర్), ఎస్.హరినాథ్ (హైదరాబాద్) తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. -
అభివృద్ధి చేసేవారికే ఓటు
అభివృద్ధి చేసేవారికే ఓటు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటయ్యేవే ప్రభుత్వాలు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ చట్ట.. కార్యనిర్వాహక రంగాలను గాడిలో పెట్టేవారే పాలకులు. ఇలాంటి వారిని గద్దెనెక్కించేవారు ఓటర్లే. అందుకే ప్రభుత్వ నిర్మాణంలో ఓటు కీలకం.. అత్యంత శక్తివంతం. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారే మంత్రులుగా కొలువుదీరగలరు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలిఓటు పొంది.. మొదటి సారిగా అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు జిల్లాలో వేలాదిమంది యువత ఎదురుచూస్తోంది. మున్సిపల్, ఎంపీటీసీ, జె డ్పీటీసీతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా వరుసగా జరగనుండటంతో యువత నిర్ణయం కీలకం కానుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించ గల పార్టీకే తమ ఓటు అని మెజార్టీ నూతన ఓటర్లు స్పష్టం చేశారు. తొలి ఓటు వేయనున్నవారి మనోగతం మీకందిస్తున్నాం. అమ్మఒడి పథకం అద్భుతం: నబీ రసూల్: బీటెక్ (ఈసీఈ): థర్డ్ ఇయర్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపిన తల్లికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామనడం చాలా సంతోషం. ఇద్దరు పిల్లలుంటే ఒక్కొక్కరికి ఎల్కేజీ నుంచి 10 వరకు నెలకు *500.. 10 నుంచి 12వ తరగతి వరకు నెలకు *700.. డిగ్రీ, పీజీ పిల్లలకు 1000 రూపాయలను తల్లి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించడం గర్వించదగ్గ విషయం. దీనివల్ల అక్షరాస్యత పెంచవచ్చు. జగన్ తండ్రికి తగిన తనయుడని చెప్పవచ్చు. విశ్వసనీయతున్నవారికే ప్రాధాన్యం గోపు బ్రహ్మారెడ్డి: డి గ్రీ ఫైనలియర్ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకునికే తొలి ఓటు వేస్తా. ఎన్నికల్లో గెలుపొందడానికి ఉచిత హామీలు ఇస్తూ, మద్యం, డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాంటివారిని దరిచేర నీయకుండా విశ్వసనీయత ఉన్న నేతకే ఓటేస్తా. తెలుగు రాష్ట్రాన్ని చీల్చిన..దానికి సహకరించిన పార్టీలకు బుద్ధి చెబుతాం. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగల నాయకుడెవరో అందరికీ తెలుసు. ఉచిత విద్య భేష్: ఆస్మా: ఇంజినీరింగ్ (ఈసీఈ) ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో ప్రకటించడం ఆనందం. అక్షరాస్యతలో మనం వెనుకబడి ఉన్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు మంచి చదువు అందించవచ్చు. వారి తల్లిదండ్రులు అప్పులు పాలవ్వకుండా ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొనే వారికే ఓటు వేస్తాం. సీమాంధ్రను అభివృద్ధి చేయాలి: జీ అశ్విని: బీటెక్ రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో.. మేము తొలి ఓటు వేస్తున్నాం. కాంగ్రెస్, టీడీపీల వల్లే రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్‌ను ఇప్పటివరకు అందరూ కలిసి అభివృద్ధి చేశారు. కానీ అంతా వృథా అయింది.సీమాంధ్ర కొత్త రాజధానిని సింగపూర్‌లా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అభివృద్ధి చేసే పార్టీకే ఓటువేస్తాం. సీమాంధ్ర ఉద్యమంలో సమైక్యాంధ్రకు పాటుపడిన పార్టీకే తొలి ఓటు వేస్తాం. వ్యవసాయ రంగం కీలకం జీ సోనియా: బీటెక్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రతి నాయకుడూ రైతే దేశానికి వెన్నెముక అంటూ గొప్పలు చెప్పడమే కానీ ఆచరణలో చూపడంలేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రత్యేక ఆర్థిక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వారి సంక్షేమం కోసం పాటు పడేవారికే మా ఓటు. ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత అభ్యర్థులకు కేటాయించే గుర్తులే వారి గెలుపు, ఓటములను నిర్దేశిస్తాయి. జాతీయ పార్టీలకు చెందిన గుర్తులు, రిజిస్టర్ పార్టీల గుర్తులే కాకుండా స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం మరో 82 రకాల గుర్తులను కేటాయించింది. వీటిని ఇలా కేటాయిస్తారు... = ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో గుర్తుల ప్రాధాన్యత క్రమ సంఖ్య సూచించాల్సి ఉంటుంది. జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా గుర్తుల వివరాలు తెలియజేయాలి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మాత్రమే గుర్తులు కేటాయిస్తారు తొలుత జాతీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ పార్టీ అభ్యర్థి బీ-ఫాం సమర్పించాలి. ఆ తర్వాత గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది స్వతంత్ర అభ్యర్థుల విషయంలో తెలుగు అక్షర మాల ప్రకారం వరుస క్రమం కేటాయిస్తారు. ఒక వార్డుకు, డివిజన్‌కు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు తొలి ప్రాధాన్యత గుర్తు కింద ఒకే రకమైన గుర్తును (బీరువా) ప్రతిపాదిస్తే , ఆ గుర్తును ఎవరికి కేటాయించాలో ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి సమయంలో నామినేషన్ పత్రాల్లో నమోదు చేసిన ప్రకారం తెలుగు అక్షరమాల ఆధారంగా గుర్తులను కేటాయిస్తారు. ఒక సారి కేటాయించిన గుర్తును తిరిగి మార్చుకునే అవకాశం ఉండదు. ఖైదీలూ ఓటు వేయవచ్చు ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రీవెంట్యూడిటెన్షన్ కింద వివిధ నేరాల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీలు సైతం ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. జైలులో ఉండే ఖైదీలు తాము ఓటర్లమని, తమకు ఫలనా నియోజకవర్గంలోని డివిజన్ పరిధిలో ఓటు హక్కు ఉందని, దానిని ఉపయోగించుకోవాలని రాతపూర్వకంగా జైలర్‌కు అర్జీ పెట్టుకోవాలి. జైలర్ ఆయా నియోజకవర్గం, లేదా వార్డుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తారు. ఇలా జైలు నుంచే ఖైదీ తన ఓటు హక్కు ఉపయోగించుకొనే అవకాశం ఉంది. -
ఘనతంత్రం
వివరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే). ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం (ఇండిపెండెన్స్ డే). ఏమిటి తేడా ఈ రెండు రోజులకు? ఇండిపెండెన్స్ డే అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజున గతాన్ని తలుచుకుంటూ, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటాం. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్య్రం వచ్చాక మనకంటూ ప్రత్యేకంగా ఓ రాజ్యాంగాన్ని (కాన్స్టిట్యూషన్) అమల్లోకి తెచ్చుకున్న రోజు. వర్తమానంలో మనం ఏమిటి? భవిష్యతుల్లో మనం ఏమిటి? అనే విషయాలను ఆ రోజు బేరీజు వేసుకుంటూ రాజ్యాంగ నిర్మాతల్ని గౌరవించుకుంటాం. ఇవాళ రిపబ్లిక్ డే. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. భారత రాజ్యాంగం అసలు ప్రతులను ఇంగ్లిషు, హిందీ భాషలలో అందమైన చేతిరాతతో రాశారు. ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో భద్రపరిచి పార్లమెంటు గ్రంథాలయంలో ఉంచారు. ఈ చేతరాత ప్రతులపై 1950 జనవరి 24న రాజ్యంగసభ (రాజ్యాంగ రూపకర్తలతో ఏర్పడిన సభ) లోని మొత్తం 284 మంది సభ్యులు (15 మంది మహిళా సభ్యులు సహా) సంతకాలు చేశారు. రాజ్యాంగం తయారవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. (2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు) ప్రపంచంలోకెల్లా అతి పెద్దది భారత రాజ్యాంగమే! అతి చిన్నది అమెరికా రాజ్యాంగం. అతి పురాతనమైన రాజ్యాంగం మాత్రం ఇరాక్ వారిది. క్రీ.పూ.2300 లోనే వారొక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగంగా (జనహిత రాజ్యాంగం అనే అర్థంలో) భారత రాజ్యాంగానికి మంచి పేరుంది. ఒక్కో దేశం నుంచి ఒక్కో అంశాన్ని తీసుకుని మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఉదా: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ఫ్రాన్సు రాజ్యాంగం నుంచి, పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, ఆదేశ సూత్రాలను ఐర్లండ్ నుంచి, సుప్రీం కోర్టు విధి విధానాలను జపాన్ నుంచి అరువు తెచ్చుకున్నాం. భారత రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్‌లోని సారనాధ్‌లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోకస్తంభం నుంచి స్వీకరించారు. దానిపై ఉండే నాలుగు సింహాలు, గుర్రం, ఎద్దులతో పాటు, అశోక చక్రం, సత్యమేవ జయతే అనే అక్షరాలను కలిపి 1950 జనవరి 26 న మన జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేసుకున్నాం. ‘అబైడ్ విత్ మి’ (A-bide with me) అనే బైబిల్ కీర్తనను రిపబ్లిక్ ఆవిర్భావం రోజు ఆలపించారు. గాంధీ మహాత్మునికి ఇష్టమైన బైబిల్ కీర్తన అంది. సంతకాలు పెడుతున్న సమయంలో పార్లమెంటు భవనం బయట బోరున వర్షం కురవడం మొదలైంది! అది చూసి కొంతమంది సభ్యులు ‘మంచి శకునం’ అని వ్యాఖ్యానించారు. తొలి రిపబ్లిక్ డే ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. 1950 జనవరి 29న ముగిశాయి. బ్రిటన్ సైనిక దళాలు నిష్ర్కమణకు సూచికగా ‘బీటింగ్ ది రిట్రీట్’ వాద్యాలు ప్రతిధ్వనించాయి.