
భారత రాజ్యాంగం... ప్రధాన లక్షణాలు
భారతదేశం, దేశ ప్రజలు, సంస్కృతి, చరిత్ర పురాతనమైనప్పటికీ.. ఆధునిక కాలంలో వాడుకలో ఉన్న ‘రాజ్యం’ అనే భావనకు మాత్రం కొత్త. చాలా సందర్భాల్లో దేశం, జాతి, రాజ్యం అనే భావనలను ఒకే అర్థం వచ్చే విధంగా వాడుతుంటాం. ఈ క్రమంలో ‘దేశం’ భౌగోళిక స్వభావాన్ని స్ఫురింపజేస్తే.. ‘జాతి’ ప్రజల మధ్య భావోద్వేగ ఐక్యతను తెలియజేస్తుంది. ‘రాజ్యం’ ఆ దేశ ప్రజల రాజకీయ స్వాతంత్య్ర స్థితిని తెలుపుతుంది. ఇండియా ఒక దేశంగా ఎప్పట్నుంచో కొనసాగుతోంది.
‘జాతీయ’ భావం బ్రిటిష్ పరిపాలనలో దీర్ఘంగా నాటుకుపోయింది. అదే ఉద్యమంగా పరిణమించి ‘భారత రాజ్య’ అవతరణకు దారి తీసింది. 1947 ఆగస్టు 14 వరకు భారతదేశం, భారత జాతి అనే రెండు భావాలు భారత ఉప ఖండానికి వర్తించగా.. 1947 ఆగస్టు 15 నుంచి భారతావనికి ‘రాజ్యం’ హోదా లభించింది. ప్రస్తుతం మనం భారతదేశానికి చెందిన భారత జాతీయులుగా గుర్తింపు సాధించాం. అంతేకాకుండా ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థ (రాజ్యం)గా కొనసాగుతున్నాం.
రాజ్యాంగం
ఆధునిక రాజ్యాలన్నీ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాయి. రాజ్య లక్ష్యాలను, స్వభావాన్ని తెలియజేసేదే రాజ్యాంగం. వాటికి కార్యరూపం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ (శాసన, కార్యనిర్వాహక, న్యాయ) శాఖల వ్యవస్థీకరణ, అధికారాలను; పౌరులకు, రాజ్యానికున్న సంబంధాన్ని (హక్కులు, విధులు) వివరించే నిబంధనల సంపుటే.. రాజ్యాంగం.
రాజ్యాంగ పరిషత్
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటన్ సుముఖత వ్యక్తం చేసింది. 1941లో రూజ్‌వెల్ట్, చర్చిల్ చేసిన సంయుక్త ప్రకటన (అట్లాంటిక్ చార్టర్) ఈ పరిణామానికి దారి తీసింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముగ్గురు కేబినెట్ మంత్రులను భారత్‌కు పంపింది. మంత్రిత్రయ ప్రతిపాదనలుగా పిలిచే ఈ సిఫార్సుల్ని.. భారతదేశంలో నాటి ప్రధాన రాజకీయ పక్షాలైన భారత జాతీయ కాంగ్రెస్, అఖిల భారత ముస్లిం లీగ్‌ల ముందుంచారు.
ఈ సందర్భంలో.. మత ప్రాతిపదికన భారత ఉపఖండాన్ని విభజించాలని ముస్లింలీగ్ కోరగా.. దానిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇరు పక్షాల సమ్మతి మేరకు రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంపికయ్యారు. 389 మంది సభ్యులతో కూడిన ఈ పరిషత్ ప్రథమ సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది.
అయితే అఖిల భారత ముస్లింలీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో 207 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. (389 మందిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎన్నికైనవారు. ఇతరుల్లో 93 మంది స్వదేశ సంస్థానాలకు, నలుగురు ప్రధాన కమిషనర్లు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించారు.) మౌంట్‌బాటన్ ప్రణాళిక (జూన్ 3, 1947) మేరకు పాకిస్థాన్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. డా॥సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించారు. డిసెంబర్ 11, 1946న డా॥రాజేంద్రప్రసాద్ శాశ్వత అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
రాజ్యాంగ పీఠిక
రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించే ‘లక్ష్యాల తీర్మానాన్ని’ జవహర్‌లాల్ నెహ్రూ డిసెంబర్ 13, 1946న ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానమే ‘రాజ్యాంగ పీఠిక’. డిసెంబర్ 14, 1947 (అర్ధరాత్రి)న సమావేశమైన రాజ్యాంగ పరిషత్ స్వతంత్ర భారతదేశ శాసనసభ బాధ్యతలను కూడా స్వీకరించింది. ఆగస్టు 26, 1947న డా॥అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది. బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారుగా, ఎస్.ఎన్. ముఖర్జీ ప్రధాన లేఖకుని (ఇజిజ్ఛీజ ఛీట్చజ్టటఝ్చ) గా విశేష సేవలందించారు.
రాజ్యాంగం రూపకల్పన
ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించిన రాజ్యాంగ పరిషత్.. 2, 473 సవరణలను పరిశీలించింది. నవంబర్ 16, 1949న ఆమోదించింది. జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 284 మంది సభ్యులు రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేశారు. దీంతో జనవరి 26, 1950న రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్‌గా రూపాంతరం చెందింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులపాటు కొనసాగిన ఈ పార్లమెంట్ మొత్తం 11 సమావేశాలను నిర్వహించింది. మొత్తం 165 రోజుల సమావేశ కాలంలో 114 రోజులు ముసాయిదా రాజ్యాంగ పరిశీలనే జరిగింది. పరిషత్ విధి నిర్వహణలో తోడ్పడిన ప్రధాన కమిటీలకు నెహ్రూ, పటేల్ వంటి ప్రముఖులు అధ్యక్షత వహించారు.
రాజ్యాంగం అమలు
జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం దేశానికంతటికీ అత్యున్నత శాసనం. 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్లతో కూడిన ఈ అత్యున్నత శాసనం గత 60 ఏళ్లలో అనేక మార్పులకు గురైంది. ప్రస్తుతం 440 పైగా ప్రకరణలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ‘ప్రకరణ’ నిబంధనల సంపుటి అయితే.. ‘షెడ్యూల్’ వాటి వివరణ. అయితే అన్ని ప్రకరణలకు షెడ్యూళ్లు లేవు. భారత రాజ్యాంగం పీఠికతో ప్రారంభమవుతుంది. ఇది రాజ్యాంగ సారాంశం. రాజ్యాంగానికి మూలాధారం భారత ప్రజలు.
రాజ్యాంగ ముఖ్య లక్ష్యాలు..
* సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ. భారత పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించడం
* పార్లమెంటరీ ప్రభుత్వం; అర ్ధసమాఖ్య వ్యవస్థ; ధ్రుడ, అధ్రుడ లక్షణాల సమ్మేళనం; స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏకీకృత న్యాయ వ్యవస్థ; ప్రాథమిక హక్కులు; ఆదేశసూత్రాలు.
* సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లౌకిక, సామ్యవాద భావనలను, ప్రజల్లో బాధ్యతాయుత ధోరణిని కలిగించడానికి ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు కొన్ని రక్షణలను కల్పించారు. ఎన్నికల సంఘాలు (కేంద్ర, రాష్ట్రాల), పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (యూనియన్, రాష్ట్ర), ఆర్థిక సంఘాలు (యూనియన్, రాష్ట్ర), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తదితర వ్యవస్థలకు రాజ్యాంగపరమైన హోదా కల్పించారు.
మన రాజ్యాంగానికి ప్రధాన ఆధారాలు
మన రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం. విమర్శకులు భారత రాజ్యాంగాన్ని ‘1935 భారత ప్రభుత్వ చట్ట నకలు’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అర్ధ సమాఖ్య, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, తదితర అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించారు.
గణతంత్ర వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ తదితర అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశసూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి.. అవశేషాంశాలపై పార్లమెంట్ చట్టాలు చేసే అధికారాన్ని కెనడా రాజ్యాంగం నుంచి.. అత్యవసర అధికారాలను వైమార్ రిపబ్లిక్ (జర్మనీ) నుంచి, రాజ్యాంగ సవరణ విధానాన్ని అప్పటి దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి, ప్రాథమిక విధులను సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.