రాజ్యాంగ సభ సమావేశం
సందర్భం
దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి చర్చలు తుది రూపంలోకి వస్తున్న తరుణంలోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేశారు. బి.ఆర్. అంబేడ్కర్ ముసాయిదా కమిటి చైర్మన్‌గా, బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ రచనా కమిటీలకు నిష్ణాతులు సేవలందించారు. వీరి కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ సభ ఆమోదించింది. నాటి రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 486 పైగా అధిక రణలు). చివరకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లన్నమాట!
ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం పరిపాలనా పరంగా, జనాభా పరంగా, సంస్థాగతంగా, సాంకేతికంగా చాలా ప్రగతిని సాధించిందని చెప్పగలం. కానీ ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో జరగకపోవడం, రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కాకపోవడం బాధాకరం. రాజ్యాంగ ప్రవేశికలో లేని ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేర్చింది. మొత్తం మీద ఇప్పటికి 106 రాజ్యాంగ సవరణలు జరగడం గమనార్హం.
ఏ దేశ రాజ్యాంగం అయినా మారుతున్న అవసరా లకు అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆనాడు రాజ్యాంగ సభలో అంబేడ్కరే స్వయంగా ‘ఒకవేళ రాజ్యాంగం విఫలం అయితే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దానిని అమలు చేసే పాలకులదే’ అన్నారు.
1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని చేశారు. కానీ దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతగా నీరుగార్చాయో తెలిసిందే కదా! 6–14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ‘విద్యా హక్కు చట్టం’ తెచ్చారు. కానీ అమలును మరచారు. నేటికీ బడి బయట కోట్లాదిమంది పిల్లలు బాలకార్మికులుగా బతుకు తున్నారు.
దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న కులం, మతం భావాలు విద్వేషాన్ని నింపుతున్నాయి. ఈ మధ్యనే ఫ్యూచర్ రీసెర్చ్ సెంటర్ నివేదికలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.
రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక హక్కు లదీ దాదాపు అదే స్థితి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఎలా నీరుగారుస్తున్నాయో జైళ్లలో మగ్గుతున్న అనేక మంది హక్కుల కార్యకర్తలూ, ప్రజా ఉద్యమకారులూ, మేధావులను చూస్తే అర్థమవు తుంది. అలాగే అమానవీయమైన అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా ఇప్పటికీ గ్రామాల్లో వివక్ష కొన సాగుతూనే ఉంది.
‘రాజ్యాంగం’ మీద కనీస అవగాహన లేనివారు చట్టసభలలో అడుగుపెట్టడం శోచనీయం. ఇక వారు ఎటువంటి చట్టాలు చేస్తారో చెప్పవలసిన పనేముంది! ఒక అందమైన భవంతిని నిర్మించుకొని దానిని సక్రమంగా వాడుకోకపోతే అది త్వరలోనే శిథిల స్థితికి చేరుతుంది. ఈ సూత్రం ఏ దేశ రాజ్యాంగానికైనా వర్తిస్తుంది.
‘భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛలనూ, అవకాశాల్లో సమానత్వాన్ని సాధించేందుకు, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు శాసనం (రాజ్యాంగం రూపంలో) చేసి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. అంటే ఆనాడు మన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగానే అది రూపొందించబడింది. కానీ దాని అమలులోనే పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది. ఇది గర్హనీయం.
డా‘‘ మహ్మద్ హసన్
వ్యాసకర్త పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment