అభిప్రాయం
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.
పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు.
గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది.
జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు.
నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు.
మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’
ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.
వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి.
తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.
జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.
ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
పి. విజయబాబు
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,
రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు
Comments
Please login to add a commentAdd a comment