freedom of Press
-
అక్షరానికి సంకెళ్లు నిలవగలవా?
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు. గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది. జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’ ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి. తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ్ దవే వాదించారు. మమత చేసిన వ్యాఖ్యలేంటి? కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో మమత పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్(సింగ్)రాజ్’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. ‘‘ అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్‌చేశారు. అఖిలేశ్‌యాదవ్ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్‌లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పంకజ్ కుమార్ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్ఐఆర్లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి. ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్ఐఆర్లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల మరో జర్నలిస్ట్‌కూ రక్షణ ఇదే ఉదంతంలో అక్టోబర్ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం తనపై మోపిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకదాంట్లో అభిõÙక్ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం ఇటీవల మరో జర్నలిస్ట్ అభిషేక్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది. -
అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ స్టార్ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్ గోస్వామి తన టీవీ ఛానెల్ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్ తనకు అర్నాబ్ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్‌ను పదే పదే డిమాండ్ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా? సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్‌ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్‌ఫోన్ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్‌ఫోన్‌ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్ నాట్ జెయిల్’ అన్న అర్నాబ్ నినాదంలో నిజం లేకపోలేదు. -
లాక్‌డౌన్‌లోనూ వదల్లేదు!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలోనూ జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతున్నాయి. పాలకులు, అధికారుల అలస్వతాన్ని ఎత్తిచూపిన పాత్రికేయులపై కేసులు, అరెస్ట్‌లు, షోకాజ్ నోటీసులు, భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసంతో వేధింపుల పర్వం సాగింది. లాక్డౌన్ సమయంలో కనీసం 55 మంది జర్నలిస్టులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారు. ఢిల్లీకి చెందిన రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (ఆర్ఆర్ఏజీ) ఈ విషయాలు వెల్లడించింది. మార్చి 25 నుంచి మే 31 వరకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరిగిన వేధింపులపై ఆర్ఆర్ఏజీ తయారు చేసిన నివేదికను ఈ వారం విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. లాక్డౌన్ సమయంలో జర్నలిస్టులపై ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 11 దాడులు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో 6, హిమాచల్ ప్రదేశ్ 5, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్రలలో నాలుగు చొప్పున కేసులు జర్నలిస్టులపై నమోదయ్యాయి. పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళలలో రెండేసి కేసులు వెలుగు చూశాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 22 మంది జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయగా, కనీసం 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఏడుగురు జర్నలిస్టులకు సమన్లు లేదా షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కనీసం 9 మంది విలేకరులు భౌతిక దాడులకు గురయ్యారు. ప్రెస్ కౌన్సిల్ నాలుగు కేసులను సుమోటోగా తీసుకుని పరిశీలించింది. (కరోనా మృతి.. కొత్త సవాలు) తమ ప్రాణాలకు తెగించి కరోనా కట్టడి చర్యల్లో లోపాలు, లోటుపాట్లను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరిగినట్టు గుర్తించామని ఆర్ఆర్ఏజీ డైరెక్టర్ సుహాస్ చక్మా పేర్కొన్నారు. నిర్వహణ లోపాలు, అవినీతి, వలస కార్మికుల / పేదల ఆకలి, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, పీపీఈ కిట్ల కొరత గురించి జర్నలిస్టులు వార్తలు అందించారని తెలిపారు. కాగా, మీడియా స్వేచ్ఛ విషయంలో మన దేశ ర్యాంకు నానాటికీ దిగజారుతోంది. పారిస్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ రూపొందించిన వార్షిక ప్రపంచ ప్రెస్ జాబితా 2020లో భారత్ 142వ స్థానంలో నిలిచింది. పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక.. భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. మీడియా స్వేచ్ఛ విషయంలో 2021లో ర్యాంక్‌ను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలివ్వడానికి ‘ఇండెక్స్ మానిటరింగ్ సెల్’ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ప్రకటించారు. (చిన్నారికి పాలు తెచ్చిన మహిళా పోలీస్) -
‘జీవోలు ఇచ్చింది మర్చిపోయారా చంద్రబాబూ..’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా సీఎం జగన్ ఏదైనా కొత్త చట్టం తెచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. వ్యక్తి, ప్రభుత్వ గౌరవనికి భంగం కలిగేల వాస్తవాలను వక్రీకరించి రాస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా అని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో కూడా నేను మంత్రిగా చేసిన సమయంలో కూడా అసత్య ప్రచారాలు, వక్రభాష్యాలు చెప్పిన పత్రికలపై చర్యలకు నిర్ణయించాం. అభాసుపాలు చేయాలని చూస్తే పరువు నష్టం దావా వేసేవాళ్లం. మీ హయాంలో ఇచ్చిన జీవోలు మర్చిపోయారా చంద్రబాబూ. సాక్షాత్తు మీడియాలోని వ్యక్తులపై కేసులు పెట్టమని జీవోలు ఇవ్వలేదా. ఇష్టానుసారంగా రాసుకోవచ్చని ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా. ఎవరిపైన అయినా ఇష్టమొచ్చినట్టు రాస్తే చూస్తూ కూర్చోవాలా. ఏ మీడియా జర్నలిస్టుని కూడా చంద్రబాబులా మీడియా సమావేశాలకు రావొద్దని మేం ఎవరినైనా నియంత్రించామా. పత్రికల్లో ప్రకటనల అంశంపై మాట్లాడే చంద్రబాబు.. ఆయన హయాంలో కొన్ని పత్రికలకే ఎందుకు ప్రకటనలు ఇచ్చారు. వీటన్నిటికీ చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలి’ అని మంత్రి అన్నారు. -
దొంగచాటు దాడి!
చడీ చప్పుడూ లేకుండా మీడియా పీక నులమడానికి సాగిన కుట్ర భగ్నమైంది. నకిలీ వార్తల్ని అరికట్టే చాటునlపత్రికా స్వేచ్ఛకు ఉరి బిగిద్దామనుకున్నవారు పలాయనం చిత్తగించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం పాత్రికేయులనుద్దేశించి జారీ చేసిన అప్రజాస్వామిక ఉత్తర్వులు కాసేపట్లోనే మాయమయ్యాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను చూస్తున్నప్పుడు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను కల్లోల కేంద్రాలుగా మార్చిన ఘనత స్మృతి ఇరానీది. పురిట్లోనే సంధికొట్టిన ప్రస్తుత ఉత్తర్వుల పుణ్యం కూడా ఆమెదే. వెనువెంటనే పాత్రికేయ సంఘాల నుంచీ, పౌర సమాజం నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో గత్యంతరం లేక వాటిని ఉపసంహరించు కున్నారు. నకిలీ వార్తల్ని ప్రచురించినట్టు లేదా ప్రసారం చేసినట్టు పాత్రికేయులపై ఫిర్యాదులందితే అలాంటివారికిచ్చిన అక్రిడిటేషన్(ప్రభుత్వ గుర్తింపు)ను రద్దు చేస్తామన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. మొదటిసారి ఇలా జరిగితే ఆర్నెల్లపాటు, రెండోసారైతే సంవత్సరంపాటు, మూడోసారి తప్పు జరిగితే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని లెక్కలు కూడా ఇచ్చారు. దారుణమైన విషయమేమంటే పత్రికలకు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు, చానెళ్లకు సంబం ధించి న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ)కు ఫిర్యాదులందిన పదిహేను రోజుల్లో అందులోని నిజానిజాలేమిటో ఆ సంస్థలు నిర్ధారించాలట. అప్పటివరకూ ఆరోపణలొచ్చిన పాత్రికేయుల గుర్తింపును నిలిపి ఉంచుతారట. అంటే ఆరోపణలు రాగానే ముందు గుర్తింపు ఆగిపోతుందన్నమాట! ఏం తెలివి?! ఇది నకిలీ వార్తల మాటున తమకు ఇబ్బందికరమైన వార్తలు వెలుగు చూడకుండా చేసే కుట్రకాక మరేమిటి? నకిలీ వార్తలు లేదా తప్పుడు వార్తల గురించి ప్రభుత్వాలు అనవసర ఆదుర్దా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అందుకోసం అటు పత్రికలకూ, ఇటు చానెళ్లకూ వేర్వేరు నియంత్రణ వ్యవస్థలున్నాయి. అదీగాక పౌరులకు సరైన సమాచారాన్ని, విశ్లేషణల్ని అందించి వారి విశ్వసనీయతను పొందాలని మీడియా ఎప్పుడూ తహతహలాడుతుంది. క్షణక్షణమూ వచ్చిపడే సమాచారాన్నంతటినీ జల్లెడపట్టి ఏది సరైందో, ఏది కాదో నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని పౌరులకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి అందుకు అను గుణమైన కర్తవ్య రచన చేసుకుంటుంది. నిరంతరం తనను తాను సరిదిద్దు కోవడానికి, జనబాహుళ్యంలో విశ్వసనీయత పెంచుకోవడానికి తపిస్తుంది. ఇందుకు మినహాయింపుగా తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టే, వక్రీకరించే మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. అయితే అలాంటి సంస్థలు చాలా త్వరగా విశ్వసనీయతను కోల్పోతాయి. కాలగర్భంలో కలిసిపోతాయి. అన్ని రంగాల్లో మంచి చెడులున్నట్టే మీడియాలోనూ ఈ పోకడలుంటాయి. తప్పదు. ఆ మాదిరి సంస్థలపై వచ్చే ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి పీసీఐ, ఎన్బీఏలున్నాయి. అలాగే వృత్తిపరమైన విలువలను పరిరక్షించడానికి, ఈ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వంటివి పనిచేస్తున్నాయి. వర్తమాన ప్రపంచంలో నకిలీ వార్తల బెడద ఎలా పెరిగిందో, వాటి పర్య వసానాలు ఏవిధంగా ఉంటున్నాయో అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ, బ్రిటన్ ‘బ్రెగ్జిట్’ రిఫరెండం సమయంలోనూ నకిలీ వార్తలు స్వైరవిహారం చేశాయి. తమ ఇష్టాయిష్టాలను వేరెవరో నియంత్రించారని ఆల స్యంగా తెలుసుకుని ఆ దేశాల పౌరులు లబోదిబోమంటున్నారు. అంతెందుకు... ఈమధ్య బయటపడిన కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) వ్యవహారంలో దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలూ ఎన్నికల్లో తమ సేవల్ని ఉపయోగించుకున్నాయని సీఏకు ఇక్కడ భాగస్వామిగా ఉన్న ఒవలెనొ బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) తన వెబ్సైట్లో సగ ర్వంగా ప్రకటించుకుంది. తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకకు చెందిన ‘పోస్టుకార్డ్ న్యూస్’ అనే వెబ్‌సైట్‌ను ఆమధ్య కేంద్రమంత్రి అనంత్‌కుమార్ వెనకేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు 2014 నాటి ఎన్నికల్లో ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేయడంతో పాటు తన పార్టీ డిజిటల్ మీడియా విభాగం ద్వారా నకిలీ వార్తల్ని ప్రచారంలోపెట్టి లబ్ధిపొందారు. ఇలా నకిలీ వార్తలతో, తప్పుడు సమాచారంతో ప్రజల్ని అయోమ యానికి గురిచేసి ఏలికలుగా మారినవారు మీడియాకు సుద్దులు చెప్పడానికి ప్రయత్నిస్తుండటమే వర్తమాన విషాదం. ఈ ఉత్తర్వుల సంగతి ప్రధాని నరేంద్రమోదీకి తెలియదని... అది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వీయ నిర్ణయమని చెబుతున్నారు. ప్రధాని కార్యా లయానికి తెలిసిన వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోమని ఆదేశాలు వెళ్లాయంటున్నారు. మంచిదే. అయితే ఉత్తర్వుల జారీ మొదలుకొని ఉపసంహరణ వరకూ సాగిన ప్రహసనాన్ని గమనిస్తే అంతిమంగా మొత్తం ప్రభుత్వంపైనే అనుమానాలు రేకెత్తుతాయి. అంతకు వారం ముందునుంచీ డజనుమంది కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు నకిలీ వార్తల్ని ఫలానా వెబ్సైట్ బట్టబయలు చేసిందంటూ సామాజిక మాధ్యమాల ద్వారా దాని లింకుల్ని ప్రచారంలో పెట్టడం గమనిస్తే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక్కటే ఈ ఉత్తర్వుల వెనకున్నదని ఎవరికీ అనిపించదు. నచ్చని మీడియా సంస్థల అడ్డు తొలగించుకునేందుకు గత ప్రభుత్వాలు సైతం ప్రయత్నించాయి. ఇందిరాగాంధీ మొదలుకొని మొన్నీమధ్య వసుంధరరాజే వరకూ పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ఎందరో ప్రయత్నిం చారు. మన రాజ్యాంగంలోని 19వ అధికరణ భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడుతోంది. ఆ హక్కుకు తూట్లు పొడిచే ఎలాంటి ప్రయత్నాలనైనా ప్రజలు తిప్పి కొడతారు. పాలకులు ఆ సంగతి గుర్తెరగాలి. మీడియాను నియంత్రించే పనులకు స్వస్తిపలకాలి. -
ఆన్‌లైన్‌పై ఆంక్షలతో స్వేచ్ఛకు సంకెళ్లు
న్యూఢిల్లీ: భారత్‌లో పత్రికా స్వేచ్ఛ నానాటికి తగ్గిపోతోంది. మీడియాపై దాడులు పెరిగి పోతున్నాయి. 2016, జనవరి నుంచి 2017, ఏప్రిల్ నెల వరకు జర్నలిస్టులపై 54 దాడులు జరిగాయని ‘ది హూట్’ మీడియా వాచ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. కనీసం మూడు చానెళ్ల ప్రసారాలను నిషేధించారు. 45 ఇంటర్నెట్లను మూసేశారు. వ్యక్తులు, గ్రూపులు కలుపుకొని 45 దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు ‘ది హూట్’ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ కలిగిన 180 దేశాలతో పోలిస్తే భారత్‌ది 136వ స్థానం. ప్రజల సమాచార హక్కులపై ఆంక్షలు విధించడం, వారికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకుండా చేయడం, ఆన్లైన్ స్వేచ్ఛపై ఆంక్షలు అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛను అరికట్టడం తదితర కారణాల వల్ల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్‌లో భారత్ స్థానం పడిపోతోంది. 2016, జనవరి నుంచి 2017, ఏప్రిల్ నెల వరకు దేశంలో ఏడుగురు జర్నలిస్టులు దాడుల్లో మరణించారని హూట్ తెలిపింది. జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై ఫిర్యాలుకాని దాడులు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది. జర్నలిస్టులపై జరిగిన దాడుల్లో తొమ్మిది దాడులు పోలీసులు చేసినవి కాగా, ఎనిమిది దాడులు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు చేసినవి. ఐదు దాడులు ఇసుక, బొగ్గు మాఫియా చేసినవికాగా, నాలుగు మీడియా కవరేజీ అడ్డుకుంటూ ప్రజా గుంపు చేసిన దాడులు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సాక్షి టీవీ కేబుల్ ప్రసారాలను నెంబర్ వన్ న్యూస్ చానెల్ ప్రసారాలను నిలిపివేశారు. ఎన్డీటీవీ ప్రసారాలను 24 గంటలు నిషేధించారు. ఒక్క 2016 సంవత్సరంలోనే జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై 40 దేశద్రోహం కేసులు పెట్టారు. మరోపక్క ప్రజల సమాచార హక్కును కూడా నీరుకారుస్తూ వస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛలో దిగజారిన భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో పత్రికా స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్) నానాటికి పడిపోతోంది. గతేడాదితో పోలిస్తే దేశంలో పత్రికా స్వేచ్ఛ మూడు ర్యాంకులు దిగజారినట్లు ప్రపంచ మీడియా నిఘా సంస్థ ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (సరిహద్దులులేని రిపోర్టర్లుగా తెలుగులో వ్యవహరిస్తారు)’ బుధవారం విడుదల చేసిన ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక’ స్పష్టం చేస్తోంది. ఇందులో భారత్ 136 స్థానంతో పొరుగునున్న పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లకు సమీపానికి చేరుకోవడం విచారకరమని ఫ్రాంటియర్స్ వ్యాఖ్యానించింది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ తగ్గడానికి కారణం హిందూ జాతీయ వాదులు మీడియాను భయపెట్టడం, ప్రధాన మీడియాలో స్వీయ నియంత్రణ పెరగడం, ప్రభుత్వ విమర్శకులను యావజ్జీవ శిక్షార్హమైన దేశద్రోహం కేసుల్లో ఇరికించడం, జర్నలిస్టులపై భౌతిక దాడులు పెరగడమేనని నిఘా సంస్థ పేర్కొంది. ప్రపంచ మీడియా స్వేచ్ఛా ఇండెక్స్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఫిన్లాండ్ ఈసారి మూడవ ర్యాంకకు పడిపోవడం, టాప్ ర్యాంక్‌ను నార్వే ఆక్రమించడం ఈసారి విశేషం. అలాగే రెండు స్థానాలు దిగజారి అమెరికా 43స్థానానికి, బ్రిటన్ 40వ స్థానానికి చేరుకున్నాయి. హంగరీ నాలుగు ర్యాంకులు దిగజారి 71 స్థానానికి, టాంజానియా రెండు ర్యాంకులు దిగజారి 83 స్థానానికి, టర్కీ నాలుగు ర్యాంకులు దిగజారి 155వ స్థానానికి చేరుకోవడాన్ని కూడా నిఘా సంస్థ విమర్శించింది. అమెరికా, బ్రిటన్లు రెండేసి స్థానాలు దిగజారడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం, మాజీ ప్రధాని కామెరూన్ నిర్వహించిన బ్రెక్సిట్ ఓటింగ్ కారణమయ్యాయని నిఘా సంస్థ పేర్కొంది. 148వ స్థానంలో రష్యా నిలకడగా ఉండగా, ఉత్తర కొరియా ఆఖరిస్థానానికి పడిపోయింది. 2007 నుంచి అది ఆఖరి స్థానంలో రావడం ఇదే మొదటిసారి. మే మూడున వచ్చే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిస్‌లోని ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్’ ప్రతి ఏటా ఈ ర్యాంకులను విడుదల చేస్తోంది. -
ఆ ధోరణీ ఓ గుణపాఠమే!
రెండో మాట ‘ప్రభుత్వాలను విమర్శించే వారి మీద దేశద్రోహం లేదా పరువునష్టం పేరిట కేసులు/దావాలు నడపడం చట్టవిరుద్ధం. ఆధునిక యుగంలో దేశ ద్రోహం/పరువునష్టం దావాలు పౌరుల నోళ్లు మూసే చర్యలుగా పరిగ ణించవచ్చు’- సుప్రీం కోర్టు (సెప్టెంబర్ 6, 2016) కక్షాపూరితంగా వ్యవహరించే రాజకీయ నేతలు, పాలకుల మధ్య జండర్ (ఆడ/మగ) తేడాను పాటించవలసిన అవసరం లేదు. విద్వన్మణి, పాలనా దక్షురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత తన పాలనా కాలంలో పత్రికలపైన ప్రదర్శించిన వివక్ష, కక్ష; విధించిన ఆంక్షలు, పెట్టిన దేశద్రోహం, పరువునష్టం కేసులు బహుశా దేశంలో ఏ కాలంలోనూ అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ నడిపి ఉండవు. నడుస్తున్న చరిత్ర, సామాజిక, ఆర్థిక, రాజకీయ, పాలనా వ్యవస్థలలో చోటు చేసుకునే విపరీత పరిణామాలను పాఠకలోకానికి నివేదించే విలేకరుల మీద, వాటిని విశ్లేషించే సంపాదకీయ వ్యాఖ్యాతలపైన, సంపాదకులపైన, పత్రికలపైన విరుచుకు పడేందుకు పాలకులు సదా సిద్ధంగానే ఉంటారు. ఇందుకు సంబంధించిన వాక్, సభా స్వాతంత్య్రాలకు సాక్షాత్తు రాజ్యాంగమే పూచీ పడినప్పటికీ పాల కుల నుంచి ఈ దాడి తప్పడం లేదు. ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెది ఒక దారి అన్నట్టు ఏవో వేళ్ల మీద లెక్కించదగిన కొన్ని పత్రికలు మినహా; ప్రధాన స్రవంతి వార్తా పత్రికల ప్రచురణ సంగతి వేరు. వాటి సమాచార సేకరణ తీరు వేరు. ఏదిఏమైనా ఫలానా అంశాన్నే లేదా వార్తనే, లేదా నేను చెప్పిందే పత్రికలలో ప్రచురించాలి. లేకుంటే ప్రచురణ మానుకోవాలి అని శాసించే ఏలికలు ఉన్నచోట సాధికార విశ్లేషణ సాధ్యపడదు. కొన్ని చేదు నిజాలు ఇలాంటి పరిస్థితి జయలలిత పాలనా కాలంలో తమిళనాడులో ఏర్పడింది. పత్రికల ఆత్మ స్థయిర్యాన్ని దిగజార్చే యత్నం ఆమె చేశారు. ‘ది హిందు’ వంటి పత్రికలపైన, ప్రతిపక్ష నేతలపైన లెక్కకు మిక్కుటంగా పరువునష్టం, క్రిమినల్, సివిల్ దావాలు జయ నడిపారు. తన ఏలుబడి మీద భిన్నా భిప్రాయాన్నీ, విమర్శనీ సహించలేకే ఈ చర్యకు ఒడిగట్టారు. జయ పాలనా దక్షతను పత్రికలు మెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. అలాగే, పత్రికల వార్తలు ఆమెకు మోదాన్ని ఇచ్చిన క్షణాలు కూడా ఉన్నాయి. 1989లో జయ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న కాలంలో డీఎంకే సభ్యుడు సభలోనే ఆమెపైన దుశ్శాసన పర్వానికి పాల్పడ్డాడు. ఆ అనుచిత చర్యను పత్రికలు చీల్చి చెండా డాయి. ఆ విషయమే జయను ఆనందింపచేసింది. అయితే ఆ పత్రికలే తరు వాత పాలనా వ్యవహారాల మీద ఎలాంటి విమర్శను ప్రచురించినా ఆమె మండిపడేవారు. అందుకుకారణం–ఆమె స్వయంగా అనేక అవినీతి కేసులను ఎదుర్కొంటూ ఉండడమే. ఈ ధోరణికి ప్రధాన కారణాన్ని ‘హిందు’ వ్యాఖ్యాతలు ఎన్. రామకృష్ణన్, ఆర్. బాలాజీ ఇలా విశ్లేషించారు: ‘డీఎంకే, ఏఐఏడీఎంకే– ఏది అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీ విధానాల లొసుగు లను ఎండగట్టేందుకే ఉన్న కాలాన్నంతటినీ వృథాగా వెచ్చించేది. రాష్ట్ర ఆర్థిక వనరులను డీఎంకే అవినీతితో విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఏఐఏడీఎంకే విమర్శనాస్త్రాలు దట్టిస్తే, తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం జయలలిత, ఆమె మంత్రిమండలి సభ్యుల మీద అవినీతి ఆరోపణల ఆధా రంగానే (1996) కేసులు నమోదు చేయించింది. ఇలా పరస్పరం కేసుల పర్వాలు తెరిచారు. 1987లో ఎంజీఆర్ మరణించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య స్పర్థలు, కుమ్ములాటలు ఈ తీరున రాష్ట్రాన్ని కుళ్లబొడిచాయి. ముందు ఒక పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీ రద్దు చేస్తుంది. లేదా అమలులో సాచివేతకు పాల్పడుతుంది.’ ఈ కక్ష సాధింపు ధోరణి ఎక్కడికి దారి తీసింది? జయ హయాంలో మొత్తం 213 కేసులు (ఆగస్ట్ నాటికి) పెట్టారు. అందులో పత్రికల వారి మీద పెట్టిన కేసులు 55. డీఎంకే సహా విపక్ష నేతల మీద పెట్టినవి 85. చిత్రం ఏమిటంటే, 2011లో జయ అధికారం చేపట్టిన సమయంలో మొదటిసారి సచివాలయంలో లాంఛనంగా మీడియా సమావేశం ఒకటి నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె చేసిన ప్రతిపాదన విని జర్నలిస్టులు విస్తుపోయారట. ‘మీరూ, నేనూ ఒక ఒప్పందానికి వద్దాం! మీరు నా వెంటపడుతూ నిరంతరం వేధించకుండా ఉంటే నేను ఎప్పుడూ మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాను’ అని షరతు (బిజినెస్ లైన్ 7–12–‘16)పెట్టారామె. ఇలాంటి షరతుల మధ్య వెలుగు చూసేవి వార్తలు కావు, డిక్టేషన్లే. బ్రిటిష్ పాలకుల బాటనే జయ హయాంలోనే కూడంకుళమ్ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగితే రాజద్రోహ నేరం మోపి, భిన్నాభిప్రాయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించారు. అప్పుడే అశీమ్ త్రివేది అనే వ్యంగ్య చిత్రకారుడిపై సెడిషన్ నేరం మోపారు. సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలకులు భారతీయులపైన, నాయకులపైన ప్రయోగించిన రాజద్రోహ చట్టాన్ని జయ లలిత ప్రభుత్వం స్వేచ్ఛగా వాడుకుంటోందని వివరించాల్సి వచ్చింది. సెడి షన్ లా వినియోగం గురించి 1962లోనే కేదార్ సింగ్ “ బిహార్ స్టేట్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావిం చింది. ఈ గందరగోళం వల్లనే సుప్రీంకోర్టు జస్టిస్ జీవన్‌రెడ్డి ధర్మాసనం ‘నక్కీరన్’ (తమిళ పత్రిక) కేసులో తీర్పు చెబుతూ సమాచార సాంకేతిక వ్యవస్థ శరవేగాన విస్తరిస్తున్న నేటికాలంలో పరువునష్టం దావాలను కేవలం సివిల్ దావాలుగానే పరిగణించి, క్రిమినల్ దావాను రద్దు చేయాలని సూచిం చింది. అయితే ఆ సూచనను మరచి అలాంటి క్రిమినల్ దావాను డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్‌పై (నవంబర్ 6,2015) జయ నడిపారు. ఆ సంద ర్భంగానే సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా/జస్టిస్ యు.యు. లలిత్ ధర్మాసనం ‘దేశద్రోహ నేరాన్ని, పరువునష్టం దావాలను పౌరుల భిన్నా భిప్రాయాల స్వేచ్ఛకూ, విమర్శనా స్వాతంత్య్రాన్ని అణచడానికీ వినియోగిం చరాద’ని తీర్పు చెప్పవలసివచ్చింది. చివరికి కశ్మీర్ సమస్యపైన చర్చా వేదికను నిర్వహింపజూసిన ‘ఎమ్నెస్టీ ఇండియా’ పైన కూడా ‘దేశద్రోహ’ నేరాన్ని మోపజూశారు. ఇలాంటి కేసులు బీజేపీ–ఆరెస్సెస్ పరివార్ మోదీ పరిపాలనలో మరింతగా పెరిగాయని ‘ఎమ్నెస్టీ ఇండియా’ పేర్కొన్నది. 2014లో 47 సెడిషన్ కేసులు నమోదు కాగా, 58 మందిని అరెస్ట్ చేశారు. కానీ కేవలం ఒకే ఒక్క వ్యక్తిని మాత్రమే ప్రభుత్వం జైలుకు పంపించగలిగింది. అలాంటి సెడిషన్ కేసును ఎదుర్కొన్నవారిలో ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ఒకరు. ఇదే సెడిషన్ కేసులో పాలకులు ఇరికించిన వారిలో–మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుడు, డాక్టర్ వినాయక్ సేన్, జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్ఏఆర్ జిలానీ కూడా ఉన్నారు. ఈ అవకతవక కేసులను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రిగా జయలలితను ఉద్దేశించి–తన రాజకీయ ప్రత్యర్థి/ వ్యతిరేకిపైన క్రిమినల్ పరిహార దావా వేయడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమంత్రి తన పలుకుబడిని ఉపయోగించ వచ్చునా? అని జస్టిస్ మిశ్రా ధర్మాసనం ప్రశ్నించవలసివచ్చింది. స్వయంగా జయలలిత మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని శాసించింది కూడా. ఈ సందర్భంగానే ధర్మాసనం, ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అనేవాడు పోస్ట్‌మ్యాన్ కాదు, అతని ఆఫీసు పోస్టాఫీస్ కాజాలదని కూడా వ్యాఖ్యానించింది. తనకు రుచించని, నచ్చని వార్తల్ని ‘హిందూ’ ప్రచురిస్తున్నందుకు మాజీ సంపాద కుడు ఎన్. రామ్‌కు జయలలిత సమన్లు జారీ చేయించారు. గుణపాఠాలు నేర్వాలి పాలకులనుంచి తిట్లు, శాపనార్థాలు, కోపతాపాలు పత్రికలకు మామూలే. అవినీతికి, అసత్యాలకు పాల్పడే పాలకులకూ, కొందరు రాజకీయ నాయ కులకూ ధర్మాధర్మాలు తెలుసు. కానీ అధికార ‘మైకం’, దర్పం, దురహం కారం వారి కళ్ల మీద పొరలు కప్పేస్తుంది. అందుకే ఫ్రెంచి రచయిత బెరాం జర్ (19వ శతాబ్ది) స్వేచ్ఛాకాముకుడిగా ఇలా పాట కట్టాడు: ‘నాకు నచ్చిన పాటలు రాసుకోడానికే నే జీవిస్తా/ఓ నిరంకుశ పాలకా! నా నోరు నొక్క జూస్తే/నేను బతికి బట్ట కట్టడం కోసమే పాటలు రాసి తీరతా!’ ఈ సత్యాన్ని ఉగ్గడిస్తూ కారల్‌మార్క్స్ పత్రికా వ్యవస్థను కేవలం ఒక వ్యాపార సంస్థగా పరిగణించదలిచినా ఆ వ్యాపార నిర్వహణకైనా బుర్ర ఉండాలి, అందుకూ స్వేచ్ఛ కావలసిందే అన్నాడు. ఆ స్వేచ్ఛ కావాలంటే అందుకు అవసరమైన చేతులూ, కాళ్లూ ఉండాల్సిందే. అందుకు తగిన మెదడు ఉండాలి గదా. అలా విముక్తి పొందగలిగిన చేతులూ, కాళ్లూ మాత్రమే మానవతా ప్రమాణాల రీత్యా ప్రయోజనకర శక్తులవుతాయి. ఈ పరిణామానికి మానవుడి మెదడు చోదకశక్తి అవుతుంది. అలాగే పత్రికా ప్రపంచం తన చైతన్యానికి అనుగుణంగా తన చలనాన్నీ, ఉనికినీ మలచుకోక తప్పదు. కనుకనే పత్రికా రంగం తన స్వేచ్ఛను తానే కాపాడుకోకుండా, వర్తక వ్యాపార సరళికి దిగజారి పోకూడదు. పత్రికా రచయిత బతుకుతూ రాయాలి, బతకడానికి రాస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి. ‘ఇక్కడ మనకు కావలసింది వ్యాపార సంస్థల, ముద్రణా సంస్థల, పుస్తక విక్రేతల స్వేచ్ఛ కాదు, కావలసింది పత్రికా స్వేచ్ఛ’ అన్నాడు మార్క్స్. ఈ పత్రికా స్వేచ్ఛనే, పాలకశక్తుల దాష్టీకాలకు లొంగని జర్నలిజాన్నే జార్జి బెర్నార్డ్ షా ‘నిత్య నూతనంగా – నవ నవంగా దర్శనమిచ్చే దినపత్రికా లోకం’ (న్యూస్ పేపర్ ఎవ్విరిడేస్) అని అభివర్ణించాడు. మొత్తంగా పత్రికారంగంలో వచ్చిన పరిణామాలతో ‘కత్తెర’, ‘సంకెళ్ల’ బాధలు కలాలకు ఎక్కువయ్యాయి. ఏది ఏమైనా ప్రజలూ, వారి కష్టసుఖాలూ, వారి సమస్యలకు సంబంధించిన అంశాలనే వార్తలుగా పరిగణించడం పత్రికల బాధ్యత. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in