
‘నువ్వు చెప్పే దానితో నేను ఏకీభవించకపోవచ్చు కానీ చెప్పడానికి నీకున్న ఆ హక్కును నా ప్రాణమిచ్చి అయినా కాపాడుతాను’ అన్న ప్రముఖ ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ మాటలు గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ (Democracy) అనుకుంటున్న మన దేశంలో నీటి మూటలే! దేశంలో పాత్రికేయులకు రచయితలకు గడ్డుకాలం దాపురించింది. అకారణమైన అరెస్టులు, అక్రమ కేసులు వారి చుట్టూ బిగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు.
పత్రికా సంపాదకుల మీద, పాత్రికేయుల మీద నిర్బంధకాండ యథేచ్చగా కొనసాగుతున్నది. ప్రభుత్వాలు తమకు వ్యతి రేకంగా రాసే పత్రికా సంపాదకులనూ, పాత్రికేయులనూ, సోషల్ మీడియా (Social Media) జర్నలిస్టులనూ, యూట్యూబర్లనూ ఒక్కరనేమిటి... ఎవరినీ వదలడం లేదు. కేసులతో వారిని వేధిస్తున్నారు. ఇళ్లపై అర్ధరాత్రి దాడులు నిర్వహించి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. తప్పును తప్పుగా చెప్పడం తప్పుగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు. మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నియంత్రణ రేఖలను అధిగమించినా ప్రభుత్వాలు వారిపై చర్య తీసుకోవడం సబబు, సమర్థనీయం. కానీ తమ పని విధానాన్ని, విధి విధానాలను వ్యతిరేకించినా లేక సమర్థించకపోయినా; ప్రభుత్వ పాలసీలను, పథకాలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపినా ప్రభుత్వాలు అది చాలా క్షమించరాని నేరంగా భావిస్తున్నాయి. పత్రికలు ఏదైనా రాసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్ముతారా? అందులో నిజానిజాలు బేరీజు వేసుకోరనుకోవడం తప్పు. ప్రజలకు ఉన్న వివేచనను, విచక్షణను ప్రభుత్వాలు తక్కువగా అంచనా వేయకూడదు.
పత్రికలు ఈ పోటీ ప్రపంచంలో పాత్రికేయ విలువలూ, సామాజిక బాధ్యతలూ రెండింటినీ రెండు భుజాలపై మోస్తూ ఈ వృత్తికి న్యాయం చేయాలి. ఒక రాజకీయ పార్టీవారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పనిని... వారు అధికారంలోనికి రాగానే ప్రతి పక్షాలు అదే పని చేస్తే సహించే పరిస్థితి నేడు లేదు. అంటే అధికారంతో, హోదాతో విలువలు మారుతాయన్న మాట! రాజ్యాంగం ఎన్నో విలువలతో పకడ్బందీ చట్టాలతో ప్రజల హక్కులను కాపాడుతూ తయారైన ఒక పవిత్ర, ప్రామాణిక గ్రంథం. దేశానికి దిశా నిర్దేశం చేసే గ్రంథం అది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే ఏ రకమైన చర్యలైనా ప్రజలు సహించరు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే తగిన సమయంలో తగు తీర్పునిస్తారు.
పత్రికా సంపాదకులను, పాత్రికేయులను వేధించిన ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ప్రజామోదం ఉండదు. విమర్శను ఆహ్వానించాలి. విచక్షణతో అందులోని సహేతుకతను అర్థం చేసుకొని ఆలోచించాలి. అంతేకానీ విమర్శలోని విషయాలను విషంగా పరిగణిస్తే పరిణామాలు విషమంగానే ఉంటాయి. విధాన నిర్ణయాలపై విమర్శలు వస్తే విశ్లేషించుకుని సవరించుకోవాలి. అందుకు విరుద్ధంగా విమర్శకులపై విచ్చలవిడిగా కేసులు బనాయించి విశృంఖలంగా అరెస్టు చేస్తూ వారికున్న హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తే న్యాయస్థానాలు మౌనంగా ఉండవు.
చదవండి: భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?
మీడియా స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో భారత్ 151 స్థానాన్ని పొందింది. ఇక్కడే భావ ప్రకటన స్వేచ్ఛ (Freedom of Expression) దేశంలో ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మీడియాపై ఎక్కుపెట్టిన ఆంక్షలను, కేసులను ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ, ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలు ఖండించాయి. పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని ఘనంగా చెప్పుకుంటున్నాం. దాని విలువను, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పాలకులదే!
– శ్రీశ్రీ కుమార్
కవి–రచయిత