న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్య్రం, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకమైనవని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పోలీస్ వ్యవస్థకు వీటితో ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థలో కింది స్థాయిలో ఉండే బీట్ కానిస్టేబుల్ ప్రజలను రక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని కొనియాడారు. శనివారం బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్‌మెంట్ (బీపీఆర్ అండ్‌డీ) 51వ వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కాబోదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యం అనేది మనకు సహజసిద్ధమైందని వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ నేరుగా శాంతి భద్రతలతో ముడిపడి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment