సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునే వరకు రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారన్న దానిపై వివరణ కోరాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వేదికగా జరిగిన ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం నార్త్‌బ్లాక్‌లో అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు.
ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు రైళ్లకు నిప్పు పెట్టడానికి, ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడానికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలను వివరిస్తూ ఇంటలిజెన్స్, రైల్వే అధికారుల నుంచి తెప్పించుకున్న నివేదికలపైనా అమిత్ షా చర్చించారు.
రెండ్రోజుల ముందు నుంచే యువకులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా, రాష్ట్ర ఇంటలిజెన్స్ అప్రమత్తం కాకపోవడం, ఆర్‌పీఎఫ్ అధికారులకు సమాచారం ఇవ్వకపోవ డం, అరగంటలోనే స్టేషన్‌కు వేలాదిమంది చేరుకొనేవరకు రాష్ట్ర పోలీసులు స్పందించకపోవడంపై కేంద్ర హోంశాఖ అధికారులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినట్లుగా తెలుస్తోంది.
ఆందోళనలు ఇతరచోట్లకు పాకకుండా రాష్ట్రాలకు ఆదేశం
హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు ప్రబలకుండా అన్ని రైల్వే, మెట్రో స్టేషన్లలో అప్రమత్తం పాటించడం, ఆర్మీ అభ్యర్థుల కదలికలపై నిఘా పెట్టడం వంటి అంశాలపై రాష్ట్ర పోలీసు పెద్దలకు కేంద్రం హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగానూ తెలుస్తోంది. ఇదే సమయంలో అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జిఫైరింగ్, జరిగిన నష్టం, ప్రస్తుత పరిస్థితులపై పోలీసు శాఖ, రైల్వే శాఖ అధికారుల నుంచి సమగ్ర నివేదికలు కోరినట్లుగా అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఇదే భేటీలో బిహార్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధురలో జరిగిన హింసాత్మక ఘటనలపైనా ఈ భేటీలో అమిత్ షా చర్చించారు.
కిషన్‌రెడ్డితోనూ చర్చ..: సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆందో ళన సాగుతున్న సమయంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నార్త్‌బ్లాక్‌లో అమిత్‌షాతో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ ఆందోళనపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని కిషన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment