ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు
నిర్మల్/బాల్కొండ/ఇందల్వాయి/సాక్షి, హైదరాబాద్: మాస్టర్‌ప్లాన్ వ్యవహారంతో నిర్మల్ ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో బీజేపీ ఆదివారం రెండోరోజూ ఆందోళనకు దిగింది.
నిర్మల్ బైల్‌బజార్ చౌరస్తా వద్ద పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. దీనితో మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి.
మరోవైపు ఏలేటి దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మంత్రి ఇంటి ముట్టడికి ప్రతిగా తాము సోమవారం బీజేపీ నేత ఏలేటి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీగా బలగాలను మోహరించారు.
ఆమరణ దీక్షలోనే ఏలేటి..
నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దయ్యేవరకూ పోరాటం చేస్తానంటూ మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చినా నిరాకరించారు. దీక్షకు సంఘీభావంగా వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్–నిర్మల్ జిల్లాల సరిహద్దు వద్దే పోలీసులు నిలిపివేశారు.
నిర్మల్ జిల్లా సోన్ వద్ద నిజామాబాద్ జిల్లా మెండోరా, నిర్మల్ పోలీసులు సంయుక్తంగా అరుణను అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అరుణ సోన్‌లో, అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏలేటిని పరామర్శించడానికి వెళ్తున్న తనను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
అమిత్‌షా, కిషన్‌రెడ్డి ఆరా..
మహేశ్వర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష, పోలీసులు లాఠీచార్జి చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో ఆరా తీశారని తెలిపారు. కాగా సోమవారం కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు నిర్మల్ రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.
మరోపక్క మాస్టర్‌ప్లాన్ రద్దు చేసేదాకా రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదంటూ బాధిత రైతులు భీషి్మంచుకుని కూర్చున్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో ఉన్నవారిని ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment