masterplan
-
మాస్టర్‌ప్లాన్.. అమలు చేస్తేనే మేలు
హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం వరంగల్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధి కోసం రచించిన ప్రణాళికలు అంతే వేగంగా అమలు కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 10.90 లక్షలకు చేరింది. ఉమ్మడి వరంగల్ అనేక మందికి నివాసయోగ్య నగరంగా మారింది. ఇక్కడి ప్రజల ఎజెండాను అమలు చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్ అల్లంతదూరాన ‘మాస్టర్‌ప్లాన్’... వరంగల్ మాస్టర్‌ప్లాన్–2042 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 42 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి ఫైల్ కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద సిటీగా.. 10.90 లక్షలకు మించిన జనాభా ఉన్న గ్రేటర్ వరంగల్‌లో 50 ఏళ్ల నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. వెంటనే మాస్టర్‌ప్లాన్ – 2042ను అమల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్‌లో ‘ఇన్నర్ రింగ్‌రోడ్డు’.... 1972లో ‘కుడా’ఆవిర్భావంలో ఏర్పడిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు పొందుపర్చారు. భూ సేకరణకు 2013లో రూ.13 కోట్లు ఆర్డీఓ పేరిట జమ చేశారు. తదుపరి మరో రూ.50 కోట్ల నిధులు రెవెన్యూ శాఖకు అప్పగించారు. కానీ ఇంత వరకు భూ సేకరణ పూర్తి కాలేదు. పనులు పూర్తి కాలేదు. కలగా రోప్ వే... ఏపీలోని విశాఖ నగరంలో కైలాసగిరి పైకి ఎలాగైతే రోప్‌వే (వేలాడే పెట్టె) ఉందో అలాంటిదే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భ«ద్రకాళి గుడికి వచ్చిన వారు భద్రకాళి చెరువు అందాలను వీక్షిస్తూ హనుమకొండ పద్మాక్ష్మి గుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి హంటర్ రోడ్డు జూపార్కు ఎదురుగా ఉన్న రీజినల్ సైన్స్ కేంద్రం గుట్టపై వరకు రోప్‌వే డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు 2007లో టెండర్లు పిలిచారు. వైజాగ్ రోప్‌వే ప్రాజెక్టు చేసిన కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత పనులు ముందుకెళ్లలేదు. మామునూరు ఎయిర్‌పోర్టు... నియో రైలు.. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్నది ఎన్నో ఏళ్ల కల. ఒకప్పుడు ఇక్కడ విమానాలు ఎగిరాయి. ఇప్పటికీ రన్‌వే, విమానాశ్రయం ఉన్నాయి. మట్టి నమూనా పరీక్షలను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు ఏడాదిన్నర క్రితం చేపట్టారు. ఇక మిగిలిన స్థలసేకరణ బాధ్యత రాష్ట్రానిది. ఈ ప్రక్రియపై వేగం పెరిగి పూర్తయితే రెండు, మూడేళ్లలో ఈ ప్రాంత ప్రజలకు విమానయానయోగం సులువవుతుంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు ఇంకా కాగితాలపైనే ఉన్నాయి. ‘ఔటర్ రింగ్‌రోడ్డు’అలాగే... ఔటర్ రింగు రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. మొత్తంగా నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇంకా 40 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ముసురు మొదలయ్యిందంటే ‘ముంపు’భయం.. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు. నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. సుమారు 1,500 పైగా కాలనీలుంటాయి. ఇందులో 40 శాతం కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. భూ కబ్జాలు, ఆక్రమణలతో 40కి పైగా లోతట్టు కాలనీలు ప్రమాదపు అంచులో ఉంటున్నాయి. కాస్త వర్షం కురిస్తేనే కాలనీలు ఏరులై వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. -
నిర్మల్‌లో ‘మాస్టర్’ ఫైట్
నిర్మల్/బాల్కొండ/ఇందల్వాయి/సాక్షి, హైదరాబాద్: మాస్టర్‌ప్లాన్ వ్యవహారంతో నిర్మల్ ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో బీజేపీ ఆదివారం రెండోరోజూ ఆందోళనకు దిగింది. నిర్మల్ బైల్‌బజార్ చౌరస్తా వద్ద పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. దీనితో మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు ఏలేటి దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మంత్రి ఇంటి ముట్టడికి ప్రతిగా తాము సోమవారం బీజేపీ నేత ఏలేటి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీగా బలగాలను మోహరించారు. ఆమరణ దీక్షలోనే ఏలేటి.. నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దయ్యేవరకూ పోరాటం చేస్తానంటూ మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చినా నిరాకరించారు. దీక్షకు సంఘీభావంగా వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్–నిర్మల్ జిల్లాల సరిహద్దు వద్దే పోలీసులు నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్ వద్ద నిజామాబాద్ జిల్లా మెండోరా, నిర్మల్ పోలీసులు సంయుక్తంగా అరుణను అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అరుణ సోన్‌లో, అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏలేటిని పరామర్శించడానికి వెళ్తున్న తనను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అమిత్‌షా, కిషన్‌రెడ్డి ఆరా.. మహేశ్వర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష, పోలీసులు లాఠీచార్జి చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్లో ఆరా తీశారని తెలిపారు. కాగా సోమవారం కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు నిర్మల్ రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మరోపక్క మాస్టర్‌ప్లాన్ రద్దు చేసేదాకా రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదంటూ బాధిత రైతులు భీషి్మంచుకుని కూర్చున్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో ఉన్నవారిని ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, తమపై విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వేడుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా? అని రైతులు ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తన చాంబర్లో ఉండి కూడా, రాత్రి 8 గంటలైనా తమ గోడును పట్టించుకోలేదని, అలాగే ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్ఐలు లాఠీచార్జి చేసి రైతులను విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో తన్ని హింసించారన్నాని పేర్కొన్నారు. -
పారిశ్రామిక నగరాల సరసన.. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు
సాక్షి, నెల్లూరు: ఎందరో నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, కళాకారుల జన్మస్థలమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా.. భవిష్యత్‌లో పెద్ద పారిశ్రామిక నగరాల సరసన చేరేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతోపాటు స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న జిల్లా గతంలోనే ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉండేది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నాయుడుపేట, గూడూరు, తడ తదితరాలతోపాటు రామాయపట్నం పోర్టు జిల్లాకు అందివచ్చిన అవకాశంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మార్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తాజాగా క్రిస్ సిటీకి గ్రీన్‌సిగ్నల్ రావడంతో మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో.. చెన్నై– విశాఖ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు మండలాల్లోని తీర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిబ్బిక్), రాష్ట్ర పభుత్వ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇక్కడ సకల సదుపాయాలు సమకూర్చి పరిశ్రమలకు కేటాయిస్తారు. రానున్న మూడేళ్లలో సరికొత్త పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ అందుబాటులోకి రానుంది. అందులో రూ.37,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో ఇప్పటికే 2,500 ఎకరాలకు గానూ 2,091 ఎకరాల భూసేకరణ చేశారు. 36 నెలల కాలవ్యవధిలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 50 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అందుకోసం 2022 మే 10వ తేదీన పర్యావరణ అనుమతులు లభించాయి. కండలేరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అనుమతులు సైతం పూర్తయ్యాయి. ►కొడవలూరు మండలం బొడ్డువారిపాళెంలో నాల్కో–మిథానీ సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో అల్యూ మినియం పరిశ్రమ 110 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. అందుకు రూ.6 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇప్పటికే భూ సేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇది ఏర్పాటైతే 2 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి ఉంటుంది. ►సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం క్రిబ్కో ఎరువుల కర్మాగారాన్ని 290 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.2 వేల కోట్లతో నెలకొల్పి రెండువేల మందికి ఉపాధి కల్పించనున్నారు. శరవేగంగా రామాయపట్నం పోర్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం జెట్స్పీడ్తో సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరు పంచాయతీ పరిధిలోని మొండివారిపాళెం, ఆవులవారిపాళెం, సాలిపేట పంచాయతీ పరిధిలోని కర్లపాళెం గ్రామాల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతం వద్ద పోర్టు నిర్మాణానికి 850 ఎకరాల భూములను సేకరించి కేటాయించారు. రూ.3,736 కోట్ల ఖర్చుతో చేపట్టిన మొదటిదశలో నాలుగు బెర్తుల నిర్మిస్తారు. ప్రస్తుతం నార్త్, సౌత్ బ్రేక్‌వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులతోపాటు, బెర్తు నిర్మాణ ప్రాంతంలో సముద్ర లోతును పెంచే డ్రెజ్జింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తులు నిర్మించి 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదటిదశ పనులు చేపట్టారు. అనంతర క్రమంలో దీన్ని పది బెర్తులకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. మొదటి దశ పనులు పూర్తయితే 3 నుంచి 4 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెట్టు వద్ద రైల్వేస్టేషన్ ఉండడంతోపాటు, చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పోర్టు సమీపం నుంచే వెళ్తుంది. పోర్టుకు అనుబంధంగా తెట్టు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. దీనికి గానూ జాతీయ రహదారిపై ఉన్న తెట్టు జంక్షన్ నుంచి గుడ్లూరు వైపు వెళ్లే మార్గంలో తెట్టు–శాంతినగర్ మధ్యలో 2,024 ఎకరాల భూములను పరిశీలిస్తున్నారు. మరోవైపు గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పనున్నారు. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మరింతగా ప్రోత్సాహం అందించారు. పరిశ్రమల శాఖామంత్రిగా దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో గత మూడేళ్లలోనే 13 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. రూ.1,806.72 కోట్లతో ఏర్పాటైన వీటిలో సుమారు 1,780 మంది ఉపాధి పొందుతున్నారు. ఇంకా 2,568 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు రూ.1,785.54 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై 18,031 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలో అపార అవకాశాలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎందరో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గత మూడేళ్లలోనే మెగా, భారీ ప్రాజెక్టు లు ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిథానీ, క్రిబ్కో వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పోర్టుల పరిధిలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాం. – జి.ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం, నెల్లూరు వైఎస్సార్ హయాంలోనే శ్రీకారం ఆసియాలోని అతి పెద్దదైన కృష్ణపట్నం ఓడరేవును 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు. 14 బెర్తులతో ఏర్పాటైన ఈ పోర్టు 2014–15లోనే రూ.1,800 కోట్ల వార్షికాదాయం ఆర్జించింది. ఆ పోర్టుకు అనుబంధంగా ఏడు పామాయిల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. బొగ్గు దిగుమతి అవకాశాలు మెరుగవడంతో ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లను రెండు దశలుగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అవకాశం రావటంతో తడ మండలం మాంబట్టు, ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య శ్రీసిటీ, నాయుడుపేట వద్ద మేనకూరు సెజ్‌లను అప్పట్లోనే ఏర్పాటు చేశారు. శ్రీసిటీలో 300 పరిశ్రమలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సుమారు లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో లక్షమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మాంబట్టు సెజ్‌లో 20 పరిశ్రమల వరకు ఏర్పాటు చేయగా పదివేల మంది ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా, మేనకూరు సెజ్‌లో 29 పరిశ్రమలు ఏర్పాటుకాగా దాదాపు 15 వేల మంది ప్రత్యక్షంగా, 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. -
కామారెడ్డి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై తీవ్ర నిరసన: భూమిని మింగే ప్లానొద్దు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముసాయిదాకు వ్యతిరేకంగా నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు గురువారం తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘రైతు కుటుంబ సమేత ర్యాలీ’చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. రైతులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అయితే పోలీసులను దాటుకుని రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఐదుగురు రైతులు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం తమతో దురుసుగా మాట్లాడారంటూ రైతులు మండిపడ్డారు. కొందరు రైతులు, మహిళా రైతులు.. పోలీసులపైకి చెప్పులు విసిరారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ధర్నా కార్యక్రమం కొనసాగింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు వచ్చి తమ గోడు వినాలని, వెంటనే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఆయన తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ వచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. దీంతో కలెక్టరేట్‌లోకి రాకపోకలు నిలిచిపోయాయి. చీకటి పడుతుండగా టెంట్లు, కార్పెట్లు వేసుకుని.. ఎంత రాత్రైనా కలెక్టర్ వచ్చే వరకు కదలబోమంటూ బైఠాయించారు. రైతులకు బీజేపీ నేతలు వెంకటరమణారెడ్డి, రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు సుభాష్‌రెడ్డి, జమునా రాథోడ్, టీజేఎస్ నేత నిజ్జన రమేష్ తదితరులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఐదుగురు లేదా పది మంది రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని చెప్పారు. అయినా రైతులు వినలేదు. కలెక్టర్ వచ్చి స్వయంగా తమకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు రాకపోవడంతో ఆయన దిష్టి»ొమ్మకు వినతిపత్రం సమరి్పంచారు. మహిళలు కలెక్టర్ దిష్టి»ొమ్మపై ఏడు దోసిళ్ల మట్టిని విసిరారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గం బంద్‌కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. సర్పంచ్ భర్తపై దాడి రైతులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఇందిరాచౌక్ వద్ద అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ జానకి భర్త పైడి జనార్దన్ వారికి కన్పించారు. దీంతో కొందరు మహిళా రైతులు ఆయనపై దాడి చేశారు. ప్లకార్డులు, కర్రలతో చితకబాదారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకుని పరుగులు పెట్టిన జనార్దన్ పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని శాంతింపజేశారు. కేటీఆర్ స్పందించాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఇండ్రస్టియల్ జోన్లోకి మారుతున్న 2,500 ఎకరాల రైతుల భూములను వదిలేయాలని డిమాండ్ చేశారు. పుష్కలంగా పంటలు పండే భూములను ఇండ్రస్టియల్ జోన్‌గా మార్చుతారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. వేలాది మంది రైతులు కలెక్టరేట్‌కు వస్తే వినతిపత్రం స్వీకరించకపోగా, రైతు ఉద్యమాన్ని హేళన చేసిన కలెక్టర్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి కామారెడ్డికి వస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరి్వంద్‌ను పోలీసులు 44 నంబర్ జాతీయ రహదారిపై పట్టణ శివారులో అడ్డుకున్నారు. గుంట భూమి పోయినా పోటీ చేయను: ఎమ్మెల్యే సురేందర్ మాస్టర్‌ప్లాన్‌లో రైతులకు సంబంధించి గుంట భూమి పోయినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఎవరి భూమీ పోకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. కొందరు నాయకులు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. -
రోడ్డెందుకు సన్నబడింది!
ఇది ఓ లింకు రోడ్డు కథ. తలాతోక లేకుండా అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి కథ. అధికారుల అవినీతికి, తలతిక్క వ్యవహారాలకు పరాకాష్ట. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. 100 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మించడానికి 2015లో హెచ్ఎండీఏ భూసేకరణ చేసింది. ఇదే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని ఓ అవినీతి అనకొండ అన్నీ తెలిసి... రోడ్డు కోసం సేకరించిన భూమిలో ఏకంగా ఓ అపార్ట్మెంట్ కట్టడానికి 2017లో అనుమతులిచ్చేశాడు. నిర్మాణం జరిగిపోయింది. జనం నివాసముంటున్నారు కూడా. ఇవేవీ పట్టించుకోకుండానే గత ఏడాది ఆరు కోట్ల రూపాయలతో గుడ్డిగా రోడ్డు నిర్మాణం మొదలుపెట్టేశారు. 2.5 కిలోమీటర్లు రోడ్డు వేసేశాక... రహదారికి అడ్డంగా అపార్ట్మెంట్ కనపడటంతో నోరెళ్లబెట్టారు. పనులు నిలిపివేశారు. సరైన కనెక్టివిటీ లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికి తేలాలి ఇది? రహదారికి ఎవరైనా ఏదైనా అడ్డంగా పెడితే... ‘తేరా బాప్ కా జాగీర్ హై క్యా?‘అని నిలదీస్తాం. అలాంటిది ఏకంగా రోడ్డునే ఆక్రమించేసి బిల్డింగ్ కడితే? ఎవడబ్బ సొత్తనుకున్నట్లు? అపార్ట్మెంట్ కట్టినోడిదా? అనుమతులిచ్చినోడిదా? -వాంకే శ్రీనివాస్ / ఆలేటి రాజేందర్‌రెడ్డి కంచె చేను మేసింది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన అధికారులే దానికి తూట్లు పొడిచారు. అందినకాడికి దండుకొని ప్రతిపాదిత రోడ్డు స్థలంలోనే బహుళ అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చేశారు. ఈ భవనం సంగతి పట్టని యంత్రాంగం అద్భుతమైన రోడ్డేసేందుకు ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లో.. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును ఆరుకోట్ల రూపాయలతో గత ఏడాది చేపట్టింది. చకచకా రోడ్డు వేసుకొని వెళుతున్న క్రమంలో మధ్యలో భవనం ఉన్న సంగతి తెలిసి నిర్మాణ సంస్థ నోరెళ్లబెట్టింది. ఏం చేయాలో తెలియక రోడ్డు పనులు నిలిపివేసింది. అర కిలోమీటర్ మేర ఆగిపోయిన ఈ పనులతో రేడియల్ రోడ్డు 4 నుంచి 5కు ‘లింక్’కుదరలేదు. దీంతో స్థానికులు అర కిలోమీటరు దూరంలోని గమ్యాన్ని చేరడానికి 3 కి.మీ మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఇదిలావుంటే.. ఇదే అలైన్మెంట్లో మరోవైపు ఆర్మీ స్థలం ఉండటంతో అటువైపు కూడా ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన ఈ రోడ్డును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం కొసమెరుపు. అసలేం జరిగింది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర ప్రణాళికను తయారు చేసిన హెచ్ఎండీఏ... 2031 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. దీంట్లో భూ అవసరాలను పేర్కొంటూ జోన్లను పొందుపరిచింది. దీనికి అనుగుణంగా నివాస, పారిశ్రామిక, కన్జర్వేషన్ తదితర జోన్లను ప్రకటించింది. ఇవేగాకుండా భవిష్యత్తులో రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్లను కూడా ప్రతిపాదించింది. ప్రతి భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతిలోనూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను దిక్సూచిగా ప్రణాళిక విభాగం పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే ఈ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో కీలకభూమిక పోషించిన అధికారే దాన్ని తుంగలో తొక్కాడు. అధికార యంత్రాంగం అవినీతి పుణ్యామాని ఆ మార్గంలో ఆకాశహార్మ్యం వెలిసింది. ఆ తర్వాత తాపీగా రోడ్డేసుకుంటూ వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అక్కడ వెలిసిన బహుళ అంతస్తు భవనాన్ని చూసి నివ్వెరపోయింది. చేసేదిలేక పనులు పక్కనపెట్టేసింది. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడలోని రేడియల్ రోడ్డు నం.5 (షేక్‌పేట నుంచి కోకాపేట ఔటర్‌కు వెళ్లే దారి)ను కలిపేలా ఏడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ లింకు రోడ్డు పనులను గతేడాది మొదలుపెట్టారు. పక్కా ప్రణాళికతో.. అల్కాపురి టౌన్షిప్లో 2017లో బహుళ అంతస్తుల భవనానికి హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే క్రమంలో మాస్టర్‌ప్లాన్‌ను నిశితంగా పరిశీలించాల్సిన ప్లానింగ్ విభాగం.. ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముట్టజెప్పడంతో మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత రహదారి మార్గంలోనే అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అసలు విషయమేమింటే 2015లోనే ఇదే హెచ్ఎండీఏ రోడ్డు కోసం భూసేకరణ కూడా చేసింది. రూ. 22.66 కోట్లు పరిహారంగా చెల్లించింది. ఈ విషయాలను మరుగున పెట్టిన ప్లానింగ్ విభాగం.. అపార్ట్మెంటుకు అనుమతులిచ్చేసింది. దీంతో పుప్పాలగూడ ప్రాంతంలో నడిరోడ్డుపై బహుళ అంతస్తుల భవనం పుట్టుకొచ్చింది. ఈ అవినీతి బాగోతంలో గతంలో సస్పెండయిన ప్లానింగ్ విభాగాధిపతి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. లింకు కుదరక.. దిక్కుతోచక ఏదేనీ రోడ్డు నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్ అధికారులు సదరు రోడ్డు అలైన్‌మెంట్‌ను నిశితంగా పరిశీలించాల్సి వుంటుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం ద్వారా ఏయే ప్రాంతంలో ఎలా నిర్మించాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ రోడ్డు విషయానికి వస్తే కనీసం రోడ్డు విస్తీర్ణమెంత? మార్గమధ్యంలో వంతెనలు ఏమైనా నిర్మించాలా? కట్టడాలేవైనా ఎదురొస్తున్నాయా? అనేది గమనించకుండానే గుడ్డిగా పనులు మొదలుపెట్టారు. అలైన్‌మెంట్‌ను చూడకుండా నిర్మాణవ్యయం కూడా ఎలా ప్రతిపాదించారనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనం అడ్డు వస్తుండగా... మరోవైపు రక్షణ స్థలం ఉండటంతో పనులు నిలిచిపోయాయి. అటు అర కి.మీ... ఇటు అర కి.మీ వదిలి పూర్తి చేసిన 2.5 కి.మీ రోడ్డు కూడా నిరుపయోగంగా మారింది. 100 ఫీట్ల ఈ లింకు రోడ్డుకు అడ్డంకులను ఎలా అధిగమిస్తారనే దానిపై హెచ్ఆర్డీసీఎల్ ఉన్నతాధికారి జియావుద్దీన్‌ను ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. ఏ ప్రాంతవాసులకు ఉపయోగమంటే ఈ లింకు రోడ్డు పూర్తయితే మణికొండ, అల్కపూర్, పుప్పాలగూడ, నార్సింగి, సెక్రటరీ కాలనీ, నెక్నాంపూర్‌తో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారికి... ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగం కానుంది. ఈ రోడ్డు మైహోం అవతార్ దగ్గర ఉన్న ఓఆర్ఆర్ సర్వీసురోడ్డుకు కూడా అనుసంధానం అవుతుండటంతో వాహనచోదకుల సాఫీ ప్రయాణానికి వీలవుతుంది. హెచ్ఆర్డీసీఎల్ వారే లింక్ రోడ్డు వేస్తున్నారు హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) రేడియల్ రోడ్డు నంబర్ –4 (నార్సింగి) నుంచి రేడియల్ రోడ్డు నంబర్ 5(పుప్పలగూడ)ని అనుసంధానించే... 3.5 కిలోమీటర్ల 100 ఫీట్ల లింక్ రోడ్డును నిర్మిస్తోంది. మేం 2015లోనే రూ.22.66 కోట్లు పరిహారం చెల్లించి భారీ రహదారి కోసం భూమి సేకరించాం. అయితే గతేడాది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం హెచ్ఆర్డీసీఎల్ వారే టెండర్లు పిలిచి కరోనా సమయంలో కాంట్రాక్టర్‌తో రోడ్డు నిర్మించారు.అయితే నార్సింగ్ వైపున 500 మీటర్ల మేర ఆర్మీ స్థలం ఉండటంతో వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పరిష్కరిస్తాం. – బీఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాధిపతి లింక్ రోడ్డు లేక నరకం రేడియల్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు పనులు పూర్తి కాకపోవటంతో మణికొండ, నార్సింగి, నెక్నాంపూర్, పుప్పాలగూడ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీ సంస్థలకు వెళ్లేందుకు ఇరుకు రోడ్ల వెంట ట్రాఫిక్‌లో దుమ్ము,ధూళితో ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. – శ్రీనివాస్, ఐటీ ఉద్యోగి, అల్కాపురి టౌన్షిప్ ఏమర్జెన్సీ వస్తే... అంతే సంగతులు! మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తో పాటు చుట్టు పక్కల ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఇక అంతే సంగతులు. రోడ్ల కనెక్టివిటీ సరిగా లేకపోవటం, ఉన్న రోడ్లు సైతం మిలట్రీ అధికారులు ఓ వైపు, భవన నిర్మాణంతో మరోవైపు మూసి వేయటంతో అంబులెన్స్ రావాలన్నా బాగా సమయం పడుతోంది. – అనురాగ్, అల్కాపురి టౌన్షిప్ -
ఏది మాస్టర్‌ప్లాన్ : హైకోర్ట్
సాక్షి, హైదరాబాద్: అమలులో ఉన్న మాస్టర్‌ప్లాన్ ఏదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఐదు మాస్టర్ప్లాన్లున్నాయని, అందులో ఒక్కటే హెచ్ఎండీఏ రూపొందించిందని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. అయితే, తొలి మాస్టర్‌ప్లాన్‌లోని విషయాలు చివరి మాస్టర్‌ప్లాన్‌లోనూ ఉంటాయా అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేయగా ఉంటాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సమాధానమిచ్చారు. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యా జ్యాలపై వాదప్రతివాదనలు ముగిశాయి. దీంతో తీర్పు ను తర్వాత వెలువరిస్తామని బు ధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ష మీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. -
మాస్టర్‌ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి
పనులు త్వరితగతిన ప్రారంభం కావాలి అన్నవరం దేవస్థానం అధికారులకు కన్సల్టెంట్ సూచన అన్నవరం : మాస్టర్‌ప్లాన్ ప్రకారం త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని అన్నవరం దేవస్థానం మాస్టర్‌ప్లాన్ రూపకర్త, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ డిజైన్స్ నిర్వాహకుడు రాఘవప్రసాద్ అధికారులను కోరారు. శనివారం రత్నగిరికి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈవో కె.నాగేశ్వరరావుతో కలసి సత్యగిరి, రత్నగిరులను పరిశీలించారు. మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన వివిధ నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. సత్యగిరిపై రూ.2.80 కోట్లతో నిర్మించతలపెట్టిన స్మార్త, ఆగమ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని, రూ.9 కోట్లతో నిర్మించతలపెట్టిన అన్నదాన భవనం స్థలాన్ని పరిశీలించారు. అన్నదాన భవన స్ధలంలో ప్రస్తుతం ఉన్న పాత సెంటినరీ కాటేజీని త్వరలో కూల్చివేయడానికి టెండర్లు పిలుస్తున్నట్లు ఈఓ ఆయనకు తెలిపారు. మాస్టర్‌ప్లాన్ వివరాలను చైర్మన్‌కు రాఘవ ప్రసాద్ వివరించారు. వారి వెంట దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
గిరిజన ప్రగతికి మాస్టర్‌ప్లాన్
పాడేరు: గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణపై భృహత్తర ప్రణాళికను రూపొందించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. పాడేరు సమగ్ర గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ఆదివారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు గిరిజనుల సమస్యలు, అవసరాలు, చేపట్టవలసిన పథకాలపై ప్రజా ప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని తెలిపారు. ఏటా మంజూర య్యే నిధులతో అభివద్ధి ప్రణాళికలను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించేందుకు సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. మన్యంలో 36 మంది వైద్యుల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని, ఏజñ న్సీలో స్థాయి పెరిగిన ఏరియా ఆస్పత్రులకు వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు కాలేదని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు. ఏజెన్సీలోని ఈ ఆస్పత్రులకు ఐటీడీఏ పీఓను చైర్మన్‌గా నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. మలేరియా నిర్మూలనకు పైలెట్ ప్రాజెక్టుమలేరియా పూర్తి నిర్మూలన కోసం 20 గ్రామాలను ఎంపిక చేసి ఒక పైలెట్ ప్రాజెక్టు అమలు చేయబోతున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లోనే ప్రజలందరికీ రక్తపరీక్షలు చేసి రాడికల్ ట్రీట్మెంట్ నిర్వహిస్తామన్నారు. ఒడిశా రాయగడలో మలేరియా కారక క్రిములను శాశ్వత నిర్మూలనకు ఈ విధానం విజయవంతమైందని తెలిపారు. మండల కేంద్రాల్లో పని చేసే అధికారులకు వసతి కోసం డార్మెటరీ నిర్మించనున్నట్లు చెప్పారు. కేజీబీవీల్లో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఎస్ఎస్ఏ పీడీని ఆదేశించారు. ఆయా పోస్టుల్లో తాజాగా నియమితులైన వారిని నియమించాలన్నారు. పాఠశాలల పునరుద్ధరణకు చర్యలుఏజెన్సీలో మూతపడిన పాఠశాలలన్నింటినీ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం లేకపోవడం సమస్య కాదని, నిర్లక్ష్యం వహిస్తే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోగస్ సర్టిఫికెట్లతో సీఆర్టీ ఉద్యోగాల్లో చేరిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీలో తాగునీటి సౌకర్యం లేని 424 ఆవాసాలు ఉన్నాయని, గత రెండేళ్లలో ట్రైబల్ సబ్ ప్లాన్ కింద ఏజెన్సీలో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు కాలేదని వెల్లడించారు. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని, ఎమ్మెల్యేలు ఇందుకు కషి చేయాలని కోరారు. పూర్తయిన తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడంలో విద్యుత్‌శాఖ అధికారుల జాప్యంపై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. 3వ విడత అటవీ హక్కు పత్రాల పంపిణీ మార్చిలోగా నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ హరినారాయణన్, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జెడ్పీ వైస్ చైర్మన్ అప్పారావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల, వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఏజెన్సీ మండల ప్రాంత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు!
మాస్టర్ ప్లాన్ పనుల్లో ఇష్టారాజ్యం నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్ నాసిరకంగా భూగర్భ డ్రెయినేజి, తాగునీటి పైపులైన్ పనులు ఎక్కడా అడ్డుకోలేని అధికారులు బదిలీలకు ముందు రోజు హడావుడిగా రూ.4.07 కోట్లు మంజూరు సూపర్ చెక్ లేకుండానే బిల్లుల చెల్లింపు మాస్టర్ ప్లాన్.. పేరుకు తగినట్లే పనుల్లోనూ అవినీతి పద్ధతిగా సాగుతోంది. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినా.. గడువులోపు పనులు పూర్తి చేయకపోయినా.. చర్యలు తీసుకోవాల్సింది పోయి బిల్లులు చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా.. ఏ స్థాయిలోనూ ఈ కాంట్రాక్టు సంస్థను ఇదేమని ప్రశ్నించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. నాలుగు రోజుల వ్యవధి.. రూ.4.07 కోట్ల బిల్లు.. ఒకే రోజు ఏఈలు, డీఈ, ఈఈ, ఈఓ సంతకాలు.. అదే రోజు ఆడిట్ కార్యాలయంలోనూ ఆమోద ముద్ర పడటం చూస్తే.. ఈ సంస్థ ఎంత చాకచక్యంగా పనులు చక్కబెడుతుందో తెలుస్తోంది. దేవుని సన్నిధిలో పనులు చేయడమంటే.. అంతో ఇంతో భయం సహజం. శ్రీశైల క్షేత్రంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.137 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి విడత పనులను పరిశీలిస్తే కాంట్రాక్టర్‌కు ఆ భయమనేది లేదనే విషయం ఇట్టే అర్థమవుతుంది. తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజి, పిలిగ్రిమ్ షెడ్లు, పుష్కరిణి తదితర పనుల్లో నాణ్యత మచ్చుకైనా కనిపించదు. అభివృద్ధి మాటున జరుగుతున్న దోపిడీకి ఇక్కడి అధికారులు కూడా వంత పాడుతుండటం గమనార్హం. కొన్ని చోట్ల పనులు పూర్తి కాకుండానే లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక మంచినీటి సరఫరా పైపు లైన్ పనులు అవినీతికి పరాకాష్టగా చెప్పవచ్చు. వాస్తవానికి పైపులైన్ ఏర్పాటుకు తవ్వకం పూర్తయ్యాక ఆ మార్గంలో ఎక్కడా ఎగుడుదిగుడు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కాంక్రీట్‌తో సమాంతరంగా 18 అంగుళాల వెడల్పుతో బెడ్డింగ్ వేయాలి. అనంతరం పైపులను అమర్చి ఇరువైపులా మెత్తటి గ్రావెల్ నింపాలి. శ్రీశైలంలో చేపడుతున్న పనుల్లో ఈ ప్రక్రియకు నీళ్లొదిలారు. పైపులైన్ కింద భూమిని చదును చేయకపోగా.. కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కూడా విస్మరించారు. పైపులను రాళ్లు ఆధారంగా ముందుకు తీసుకెళ్లడం.. వీటి కింద ఫ్లైయాష్(కంకర పొడి) చల్లి చేతులు దులుపుకున్నారు. సూపర్ చెక్ ఎక్కడ? వాస్తవానికి ఈ పనులన్నింటినీ ఇంజినీరింగ్ అధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలి. అలాంటిది పనులను పర్యవేక్షిస్తున్న ఏఈలు కూడా ఎక్కడా అభ్యంతరం చెప్పకపోవడంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కనీసం బిల్లుల చెల్లింపు సమయానికి ముందు పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. ఇంజినీరింగ్ ఉన్నతాధికారి స్వయంగా ఈ పనులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి సూపర్ చెక్ చేయాలి. మ్యాన్ హోల్స్‌లో నీరు పోసి పక్కనే ఉన్న మ్యాన్‌హోల్స్ వరకు సాఫీగా ప్రవాహం ఉందా అన్నది పరిశీలించాలి. కానీ, భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పైపులైను పనుల్లో కళ్లు మూసుకుని బిల్లులు చేయడం గమనార్హం. హడావుడిగా రూ.కోట్ల చెల్లింపులు నాణ్యత లేని పనులకు ఆలయ అధికారులు హడావుడిగా ఎందుకు బిల్లులు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. శివాజీ రాజా గోపురం పనుల్లోనూ చేయని పనులకు ముందస్తుగా సుమారు రూ.60 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలోనూ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో దేవస్థానానికి చెందిన 26 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ జాబితాలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారి, అధికారుల పేర్లు ఉండటంతో.. కాంట్రాక్టర్ తెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అధికారులు కుమ్మక్కవడంతో ఏకంగా నాలుగు రోజుల వ్యవధిలో రూ.4.07 కోట్లకు సంబంధించిన బిల్లు పాసవడం చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. -
ఇదే యాదాద్రి..
-
ఇదే యాదాద్రి..
డిజైన్లు, నమూనాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర దసరా నుంచి పనులు ప్రారంభించండి పాత దాతల పేర్లతోనే కొత్త భవనాలు చుట్టూ ఉన్న గుట్టల వద్ద మౌలిక సదుపాయాల కల్పన అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయం, శివాలయం, గుట్టపై ఇతర నిర్మాణాలు, చుట్టూ ఇతర గుట్టల అభివృద్ధి కోసం రూపొందించిన లేఅవుట్లను బుధవారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించి ఆమోదించారు. లేఅవుట్లు, డిజైన్లు సిద్ధమైనందున దసరా నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే దసరా నాటికి ఓ రూపం తీసుకురావాలని సూచించారు. దీంతోపాటు ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) ఉపాధ్యక్షుడు కిషన్‌రావు నేతృత్వంలో పనులు జరగాలని... ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. అనుమతులు తదితర విషయాలన్నీ వైటీడీఏ చూసుకుంటుందన్నారు. ప్రధాన గుట్ట యాదాద్రితో పాటు చుట్టూ ఉన్న గుట్టలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు రూ.200 కోట్లు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. పాత భవనాలు, కాటేజీలు కూల్చివేసే సందర్భంలో పాత దాతల పేర్లతోనే కొత్త డిజైన్ల ప్రకారం సత్రాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కిషన్‌రావుతో పాటు నిర్మాణ నిపుణులు రాజు ఎక్స్ పిడిత్, పి.జగన్మోహన్, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద సాయి, స్తపతి సౌందర్ రాజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఆమోదించిన డిజైన్ల ప్రకారం గుట్టపైన గర్భగుడి యథావిధిగా ఉంటుంది. గుట్టపైకి వెళ్లేందుకు, కిందికి వచ్చేందుకు వేర్వే రు దారులు ఉంటాయి. ప్రస్తుతమున్న దారిని వెళ్లేందుకు ఉపయోగించి.. కిందికి వచ్చేందుకు కొత్త మార్గాన్ని నిర్మిస్తారు. గుట్టపైన 1.9 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ ఉంటుంది. బస్సులు అక్కడే భక్తులను దింపి.. కిందికి వెళ్లే భక్తులను ఎక్కించుకుంటాయి. వీఐపీలకు ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 2.3 ఎకరాలు ఉంటుంది. శివాలయానికి కూడా మాడ వీధులు నిర్మిస్తారు. ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణ అభిముఖంగా 108 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. గుట్టపైనే అన్నదానం కాంప్లెక్స్ నిర్మిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిపేందుకు గుట్టపైనే తూర్పు భాగంలో ప్ర త్యేక స్థలం ఉంటుంది. అర్చకులు సేద తీరేం దుకు, వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్స్‌గా మారుస్తారు. దైవ సంబంధ వస్తువులకు గుట్టపైనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. గుట్టపై ఉన్న ప్రస్తుత భవనాలన్నీ తొలగిస్తారు. కొత్త లే అవుట్ ప్రకారమే నిర్మాణాలు ఉంటాయి. ధర్మ గుండాన్ని యథావిధిగా ఉంచి విస్తీర్ణం పెంచుతారు. -
ఇక లాక్కోవటమే
-
పక్కా‘ప్లాన్’
- అక్రమాలకు చెక్ - భూ వినియోగ మార్పిడికి ఇక స్వస్తి - త్రిసభ్య కమిటీ నియామకం - రంగంలోకి దిగిన హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి బాటలు వేస్తూ గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ (బృహత్ ప్రణాళిక)ను పక్కాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని 35 మండలాలను కలుపుతూ రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్ పరిధి మొత్తం 5965చ.కి.మీ. ఉంది. ప్రధానంగా బృహత్ ప్రణాళికలో భూ వినియోగ మార్పిడికి వెసులుబాటు కల్పించడం వల్లే కొందరు అక్రమార్కులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని... ఫలితంగా ప్రణాళిక అసలు ఉద్దేశం నెరవేరట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ‘మాస్టర్‌ప్లాన్’ పక్కాగా లేకపోవడం వల్లే హెచ్ఎండీఏ అక్రమాల పుట్టగా మారింది. ప్రణాళికలో మార్పులు చేయకుండా హెచ్ఎండీఏలో ఆటోమిషన్ (ఆన్లైన్ అప్రూవల్స్) విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. మొదట మాస్టర్‌ప్లాన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దితే.. ఇలాంటి అక్రమాలకు తావుండదు. అందుకే దాని పై ప్రత్యేక దృష్టి పెట్టండి’ అంటూ ఇటీవల జరిగిన హెచ్ఎండీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. అవసరమైతే హెచ్ఎండీఏ యాక్ట్ (చట్టాన్ని)ను కూడా సవరించాలని సూచించారు. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు మాస్టర్ప్లాన్లను పరిశీలించాక మన మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదికివ్వాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రాలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బృహత్ ప్రణాళికలో భూ వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించారు. అయితే... అందులో భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పిస్తూ విధి విధానాలు పొందుపర్చడం వల్ల ప్రణాళిక రూపమే మారిపోతోంది. కన్జర్వేషన్ జోన్ కాస్త రెసిడెన్షియల్ జోన్... లేదంటే ఇండస్ట్రియల్ జోన్, మల్టీపుల్ జోన్‌గా మారుతోంది. దీనివల్ల భవిష్యత్ నగరం అస్తవ్యస్తంగా నిర్మితమయ్యే ప్రమాదం ఉందని సీఎం అంచనా వేస్తున్నారు. కన్జర్వేషన్ జోన్ అంటే... భూ వినియోగం వ్యవసాయానికే ఉండాలి. అలాగే ఫారెస్ట్ జోన్ అంటే... అడవులే ఉండాలి. వీటిని మార్పు చేయకూడదు. ఇకపై భూ వినియోగ మార్పిడికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలి. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఎం చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వం అవసరమని భావిస్తే తప్ప భూ వినియోగ మార్పిడికి అవకాశం లేని విధంగా మాస్టర్‌ప్లాన్‌ను సరిదిద్దే బాధ్యతను ఆయన హెచ్ఎండీఏ భుజస్కంధాలపై పెట్టారు. నిపుణులతో వర్క్‌షాప్ మాస్టర్‌ప్లాన్‌ను దేశంలోనే గొప్ప ప్రణాళికగా తీర్చిదిద్దేందుకు నిపుణుల ఆధ్వర్యంలో రెండురోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా నిర్ణయించారు. ఈ వర్క్‌షాప్‌కు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ (ఆస్కీ), ఇతర టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని క్రమపద్ధతిగా అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు ప్రజారవాణా, సరుకు రవాణాకు తగిన విధంగా రోడ్ నెట్వర్క్, రైల్వే లైన్ల విస్తరణ, విద్యుత్, తాగునీటి సరఫరా, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, బస్టాండ్లు తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చే ర్పులకు గల అవకాశాలపై ఈ వర్క్‌షాపులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా నిపుణులిచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని త్రిసభ్య కమిటీ ఓ నివేదికను రూపొందించి దాన్ని ముఖ్యమంత్రికి అందజేస్తారు. ఆతర్వాత సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మాస్టర్‌ప్లాన్‌ను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు. -
ఆధ్యాత్మిక శోభ...పర్యాటక ప్రభ
►యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఆలయంతోపాటు ఆరు ఊళ్లకు మాస్టర్‌ప్లాన్ ► కేంద్ర పథకం ‘ప్రసాద్’ మలిజాబితాలో చోటుకు ప్రతిపాదన ► కొలనుపాక, భువనగిరి కోట, పెంబర్తి హస్తకళలతో సర్క్యూట్ సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కనీసం రెండు రోజుల పాటు అక్కడ ఉండేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బృహత్ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇంతకాలం కేవలం యాదగిరి లక్ష్మీనరసింహుడి ని దర్శించి వెంటనే భక్తులు తిరుగుపయనమవుతున్నారు. అలా కాకుండా యాదాద్రి దర్శన అనంతరం సమీపంలోని ఇతర పురాతన దేవాల యాలు, చారిత్య్రక,పురావస్తు ప్రాధాన్యమున్న స్థలాలు, ప్రాంతాలను సందర్శించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటితోపాటు పర్యాటకులకు పరిపూర్ణ వినోదం అందించే రిక్రియేషన్ కేంద్రాలను అభివృద్ధి చేయబోతోంది. దీనికి కేంద్రప్రభుత్వం నుంచి కూడా సాయం పొందాలని నిర్ణయించింది. ఆలయంతోపాటు ఆరు ఊళ్లు... ప్రస్తుతం యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం యాదగిరి దేవాలయం, గ్రామం కాకుండా మరో ఆరు ఊళ్లను అందులో చేర్చింది. దేవాలయాన్ని వాస్తు, ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయటంతోపాటు, యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న ఆరు ఊళ్లను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయటం దీని ఉద్దేశం. యాదగిరి పల్లి, సైదాపూర్, రాయగిరి, మల్లాపూర్, దాతర్పల్లి, గుండ్లపల్లి గ్రామాలను ఇందుకు ఎంపిక చేసిన ప్రభుత్వం వాటి సమగ్రాభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తోంది. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరగనున్న దృష్ట్యా ఆ ప్రాంతం గజిబిజిగా కాకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధ పురోగతి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం చుట్టూ ఉన్న ఆరు గ్రామాలను జోన్లవారీగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టనుంది. నివాస స్థలం, పారిశ్రామిక వాడ, వినోద ప్రాంతం, సాగు భూములు... ఇలా అన్నీ నిర్ధారిత జోన్ల పరిధిలో ఉంటాయి. ఏ జోన్ పరిధిలో సంబంధిత పనులే జరగాల్సి ఉంటుంది. నగరానికి చేరువగా ఉండటంతో ఈ గ్రామాల పరిధిలో విపరీతంగా రియల్ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. చాలావరకు అనుమతి లేని లేఅవుట్లు రూపొందించి ప్లాట్లు అమ్మేస్తున్నారు. వాటిల్లో నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆ ప్రాంతమంతా గజిబిజిగా ప్రణాళికలేకుండా మారుతుంది. దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ‘ప్రసాద్’లో చోటుకు కేంద్రానికి ప్రతిపాదన... కేంద్రప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రీజువెనేషన్, స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి దశగా దీనికింద అమృత్సర్, అజ్మీర్, అమరావతి, ద్వారక, గయ, కాంచీపురం, కేదార్నాథ్, కామాఖ్య, మథుర, పూరి, వారణాసి, వెల్లంకని ప్రాంతాలను ఎంపిక చేసింది. వీటి అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేయనుంది. మలిదఫాలో ఈ పథకం కింద యాదాద్రిని టెంపుల్ టౌన్ రూపంలో ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు సమీపంలోని పురాతన దేవాలయాలను ఒక సర్క్యూట్ రూపంలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ మరో ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. భువనగిరి కోట, కొలనుపాక జైన దేవాలయం, పురాతన శివాలయం, పెంబర్తి క్రాఫ్ట్ విలేజ్‌ను చేర్చబోతున్నారు. యాదాద్రి చుట్టూ అభయారణ్యం, సాహసక్రీడలు, చిన్నారులకు వినోదం అందించే రిక్రియేషన్ ప్రాంతాలు సహా మొత్తం యాదాద్రి చుట్టూ రెండు వేల ఎకరాలను ఆధ్యాత్మిక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. వెరసి భక్తులు ఒక యాదాద్రి దర్శనంతోనే పర్యటనను సరిపుచ్చకుండా రెండుమూడు రోజులు ఆ ప్రాంతంలో ఉండి అన్నిం టినీ చూసి వెళ్లేలా చేయాలనేది ప్రణాళిక. -
తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టుపెట్టారు
-
సింగపూర్‌లో హోటల్ కోసమే..మాస్టర్‌ప్లాన్
-
తిరుమల స్థానికుల్ని నమ్మించి మోసం చేశారు
- టీటీడీపై నారాయణ ధ్వజం పాత అన్నదానం - కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ సాక్షి, తిరుమల: ‘తిరుమల స్థానికులు శ్రీవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యులు. పెరిగిన భక్తుల సౌకర్యాల కోసం మాస్టర్‌ప్లాన్‌కు సంపూర్ణంగా సహకరించారు. అలాంటి స్థానికులనే టీటీడీ నమ్మించి మోసం చేసింది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తిరుమలలోని దుకాణాలు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ బాటలో నడిచే సీపీఐ కూడా భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆనాడు టీటీడీకి మద్దతు తెలిపిందన్నారు. అందువల్ల స్థానికులకు పునరావాసం కింద బాలాజీనగర్ కట్టిం చి కేటాయించారన్నారు. అయితే, మరమ్మతు చేయిస్తామని ఖాళీ చేసిన బాలాజీనగర్ ఇళ్లను తిరిగి కేటాయించ కుండా టీటీడీ అధికారులు మోసం చేయడం దారుణమన్నారు. బాలాజీనగర్‌లో ఇళ్ల ల్లో ఉన్నవారందరూ స్థానికులేనని ఆయ న స్పష్టం చేశారు. 1985 ఏప్రిల్ 6వ తేది అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభించిన అన్నదాన భవనాన్ని నిరుపయోగంగా వదిలివేయడం తగదన్నారు. సెక్యూరిటీ పేరుతో ఆ భవనాన్ని ఖాళీగా ఉంచడం వల్ల భక్తులు రాకపోవడంతో ఆ ప్రాంతంలో దుకాణదారుల వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయన్నారు. తిరుమల స్థానికుల సమస్యలపై త్వరలోనే సీఎం, ఎండోమెంట్ మంత్రి, టీటీడీ ఈవోకు లేఖలు రాస్తానని, అవసరమైతే నేరుగా కలసి విన్నవిస్తామన్నా రు. పరిష్కారం చూపకపోతే సీపీఐ పోరాటం చేస్తుందని నారాయణ హెచ్చరించారు. ఆలయం వద్ద భక్తులతో, శ్రీ వారి సేవకులతో ముచ్చటించారు. సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకయ్య, పట్టణ కార్యదర్శి ఏ.బాలరంగయ్య, ఏ.శ్రీనివాసులు, రామచంద్ర, రామకృష్ణ, గంగాధరం ఉన్నారు. -
అక్రమాలకు చెక్
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో అంతులేని అవినీతి పటిష్ట ఎన్ఫోర్స్మెంట్తో అడ్డుకట్ట వేస్తాం ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ సిటీబ్యూరో: ‘ఇప్పుడున్న హైదరాబాద్ ఎటు పడితే అటు పెరిగింది. దాన్ని సరిచేస్తాం. శాస్త్రీయంగా ఆలోచించి మాస్టర్‌ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీయే, జీహెచ్ఎంసీల్లో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. ఇకపై అలా జరగకుండా అక్రమాలకు ముకుతాడు వేయాల్సిందేనన్నారు. ఇకపై పటిష్టమైన ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందన్నారు. మాస్టర్‌ప్లాన్ కనుగుణంగా పద్ధతి ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్రమార్కులకు కళ్లెం వేసి సిటీని అందంగా తీర్చిదిద్దుదామన్నారు. రియోడిజెనీరో నగరాన్ని రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తారని, మనం కూడా స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్మించుకుందామన్నారు. బలహీనవర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలనే తలంపుతోనే డబుల్బెడ్రూమ్ ఆలోచన చేశానన్నారు. ఐడీహెచ్‌కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల అక్కడకు వెళ్లాను.ఒక్కో ఇంటికి ఐదారు లక్షలు ఖర్చు చేస్తున్నాం. కానీ.. అక్కడి ప్రజల కళ్లలో కోటి మెరుపులు చూశానన్నారు. ఒకసారి ఇల్లు నిర్మిస్తే రెండు మూడు తరాల వారి వరకు ఇళ్ల అవసరం తీరాలని చెప్పారు. నగరంలోని రెండు లక్షల మందికి దశలవారీగా మూడు నాలుగేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. స్లమ్ఫ్రీని అమలు చేస్తామన్నారు. కొన్ని రహదారులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ అమలు విధానం తదితర అంశాల గురించి కేసీఆర్ ఇలా వివరించారు... 300 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్నగర ప్రత్యేకతను నిలబెట్టాలి. స్వచ్ఛ హైదరాబాద్ లో సైనికాధికారులు, సైనికులు, పోలీసు అధికారులు, పోలీసులు పాల్గొంటారు. నగరంలోని ప్రతి ఇంటికి రెండు చెత్తడబ్బాలను ప్రభుత్వమే అందజేస్తుంది. తడి, పొడి చెత్తలకు వాటిని వేర్వేరుగా వినియోగించాలి. బస్తీవాసులు, టీమ్ సభ్యులకు టీషర్టులు, టోపీల పంపిణీ త్వరలోనే పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులతో సమావేశమై విస్తృత ప్రచారం చేయాల్సిందిగా కోరతాం. కార్యక్రమంలో భాగస్వాములైన ఆరువేల మంది ఛేంజ్ ఏజెంట్స్ నెంబర్లు సేకరించి ఎప్పటికప్పుడు సమాచార పంపిణీ. స్వచ్ఛ హైదరాబాద్‌కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించారు. ఫేస్బుక్, వాట్సప్‌లోనూ సమాచార పంపిణీ బృందాలు బస్తీలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ సహాయం అవసరమైన విద్యార్థులు, క్రీడాకారులు, రోగగ్రస్తులను గుర్తించాలి. పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అందని అర్హులుంటే గుర్తించాలి. వారి వివరాలు సేకరించాలి. ఇళ్లులేని పేదలను గుర్తించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచాలి. బస్తీల్లోని సంపన్నులను ప్రోత్సహించి వారి ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. చెరువుల్లో మురుగునీరు కలిసే ప్రాంతాలు గుర్తించాలి. ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న అందరితో స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొనే బృందాలు.. వాటి పనితీరు తదితర అంశాలపై జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ప్రజలు కూడా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములయ్యేందుకు ముందుకురావడంతో బృందాలు 425కు పెరిగాయన్నారు. సమరమర్థ నీటి వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక టాయ్లెట్లు తదితర అంశాలపై అస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరు ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మొత్తం మంత్రివర్గం, శాసనమండలి స్పీకర్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి రాజీవ్‌శర్మలతో సహ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరైంది. పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ ఏఐఎస్‌లు, హెచ్ఓడీలతో సహ వెయ్యిమందికి పైగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అమలుకు సంబంధించి జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ 25 స్లైడ్స్‌తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని ఆసక్తిగా తిల కించిన కేసీఆర్ మధ్యలో కల్పించుకుంటూ సభికులకు మరింత వివరణ ఇచ్చారు. దేశంలోనే ప్రథమం: రాజీవ్‌శర్మ నగరంలో ప్రారంభిస్తున్న స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ లాంటి కార్యక్రమం దేశంలోనే ఏ రాష్ట్రంలో, ఏనగరంలో ఇంతవరకు చేపట్టలేదని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ అన్నారు. ఉద్యమరూపంలో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, మంత్రులు , ఏఐఎస్ అధికారులు ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను స్వీకరించి నూరు శాతం పరిశుభ్రతకు కృషి చేయడం గతంలో ఎక్కడా జరగలేదన్నారు. 40 వేల మంది అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు. అస్కి డెరైక్టర్ జనరల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ వేస్ట్మేనేజ్మెంట్పై మాస్టర్‌ప్లాన్ రూపొందించాలన్నారు. -
9 గుట్టలు... 9 ఇతివృత్తాలు
అనుసంధానంగా రోప్ వే చుట్టూ అడవి... అందులో జింకల సందడి మధ్యలో దివ్యక్షేత్రంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంతోపాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి యాదాద్రి నిర్మాణంలో ఆలోచనలెన్నో నెలరోజుల్లో మాస్టర్‌ప్లాన్ సిద్ధం హైదరాబాద్: అందమైన ప్రకృతి.. అడవిని తలపించే వాతావరణం.. అందులో లేళ్లు, జింకల గెంతులు... చుట్టూ కనువిందుచేసే గుట్టలు.. ఒక్కో ఇతివృత్తంతో పర్యాటకులను ఆకట్టుకునేలా గుట్టల అభివృద్ధి... మధ్యలో లక్ష్మీ నరసింహుడు కొలువు దీరిన ఆధ్యాత్మిక కేంద్రం... దేశంలోనే ప్రధాన పుణ్యక్షేత్రంతో కూడిన పర్యాటక కేంద్రంగా యాదాద్రి రూపొందబోతోంది. దీనికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ మే నెలాఖరుకల్లా సిద్ధం కానుంది. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకులను ఆకట్టుకునే హంగులతో యాదాద్రిని ‘టెంపుల్ టూరిజం’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రధాన ఆలయం మినహా మిగతా ప్రాంతాలను సమూలంగా మార్చబోతున్నారు. గుట్ట దిగువన భారీ రాజగోపురం, పైకి వెళ్లేందుకు, కిందకు వచ్చేందుకు విడివిడిగా రహదారులు, పైన అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం, ఎత్తయిన మరో రాజగోపురం, కల్యాణ మండపాలు, యాగశాలలు, భక్తుల క్యూ మార్గం, ప్రసాద వితరణ కేంద్రం, కల్యాణ కట్ట, దుకాణ సముదాయం.. ఇలా అన్నీ సరికొత్త రూపు సంతరించుకుంటాయి. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండనుంది. దీనికి అనుబంధంగా మరో 8 గుట్టలను అభివృద్ధి చేయనున్నారు. వాటిల్లో ఒక్కో గుట్టను ఒక్కో ఇతివృత్తంతో తీర్చిదిద్దబోతున్నారు. ఇది పర్యాటకంతో కూడుకున్న ప్రాజెక్టు. ఇతివృత్తాలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... వాటిపై కన్సెల్టెంట్లు రకరకాల ఆలోచనలపై కసరత్తు చేస్తున్నా రు. అన్ని గుట్టలను కలుపుతూ రోప్‌వే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. గుట్టపైకి వీఐపీ వాహనాలే... గుట్టపైన వంద వాహనాలు సరిపోయేలా పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీఐపీలు వచ్చినప్పుడు వారి వాహనాలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు. మిగతారోజుల్లో సాధారణ వాహనాలకు ప్రవేశం నిషిద్ధం. దిగువన ఐదొందల ఎకరాల్లో అడవిని అభివృద్ధి చేసి అందులో జింకల పార్కును ఏర్పాటు చేస్తారు. వీటికి సంబంధించి మరో నెలరోజుల్లో స్పష్టత రానుంది. రైలు... బ్యాటరీ వాహనాలు... లిఫ్టులు.. యాదాద్రిని పర్యావరణ అనుకూలంగా మలిచేందుకు కొన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గుట్టపైకి సాధారణ వాహనాలను అనుమతించొద్దని నిర్ణయించారు. భక్తుల వాహనాలు గుట్ట దిగువనే నిలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐదు వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్ టవర్‌ను నిర్మిస్తారు. గుట్టపైకి భక్తులను చేర్చేందుకు మూడు అంశాలను పరిశీలిస్తున్నారు. మినీ ఎలక్ట్రిక్ రైలును ఏర్పాటు చేసి ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులను తరలించడమా లేదా.. బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి తేవడమా లేక.. భారీ లిఫ్టుల ద్వారా భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడమా అనే ప్రతిపాదనలున్నాయి. -
కృష్ణాకు ఇరువైపులా బీచ్‌రోడ్లు, రిసార్టులు
ప్రకాశం రిజర్వాయర్‌లో వాటర్బోట్లు, స్పీడ్బోట్లు భవానీ ద్వీపంతో పాటు మరో 4 ద్వీపాల్లోనూ థీమ్‌పార్కులు మాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ జోన్ ఏర్పాటు ఆవశ్యకత బ్లూ ప్రింట్ వచ్చాక టూరిజం కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్ సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రకాశం బ్యారేజీకి ఎగువన, కృష్ణానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్లు, రిసార్టులను నిర్మించి భారీసంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిసార్టులు, థీమ్‌పార్కులు, బోటింగ్ యూనిట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్ వచ్చాక క్యాపిటల్ ఏరియాలో టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి సమగ్ర వివరాలతో కూడిన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు టూరిజం శాఖ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేసిన మాస్టర్‌ప్లాన్‌లో కృష్ణానదికి ఇరువైపులా రిక్రియేషన్ జోన్ అభివృద్ధి చేయాల్సి ఉంది. దీన్లో భాగంగా రెండు వైపులా ఐదు కిలోమీటర్ల మేర విశాలమైన బీచ్‌రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. నదీ ముఖ రాజధాని నగర నిర్మాణంపై ప్రభుత్వం మొదటి నుంచి ఆసక్తి చూపుతోంది. మాస్టర్‌ప్లాన్ తయారు చేసే సంస్థలకు సైతం ముందే ఈ విషయాన్ని వివరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మాస్టర్‌ప్లాన్ తయారీ సంస్థలు ప్రకాశం బ్యారేజీకి ఎగువన నదికి రెండు వైపులా పర్యాటకుల కోసం విహార, వినోద ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం 60 అడుగుల వెడల్పులో బీచ్‌రోడ్లను నిర్మించడంతో పాటు దేశ, విదేశాలనుంచి వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా విలాసవంతమైన రిసార్టులు నిర్మించనుంది. రిజర్వాయర్‌లో పూడికమట్టిని తొలగించి 20 కిలోమీటర్ల మేర ఎగువకు న దికి మధ్య భాగాన ప్రత్యేక కాలువ నిర్మించాలని ఆలోచిస్తోంది. నదికి మధ్యలో ఉన్న భవానీ ద్వీపం చుట్టూ పర్యాటకులు విహరించేందుకు వీలుగా వాటర్బోట్లు, వాటర్‌స్పోర్ట్స్‌కు అనుకూలంగా స్పీడ్బోట్లు, జెట్‌స్కీలను ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే వీలుందని పర్యాటక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం విజయవాడలోని బరంపార్కు నుంచి భవానీ ద్వీపం ప్రాంతాలకు రాకపోకలు సాగించే పర్యాటకుల కోసం 150 సీట్ల సామర్థ్యమున్న 10 ఏసీ డబుల్ డెకర్ బోట్లు, అప్పర్ డెకర్ బోట్లు (బోధిసిరి), 50 సీట్ల కెపాసిటీవి మూడు, 30 మంది ప్రయాణించేందుకు వీలుగా రెండు ఫంటూన్లు, రెండు స్పీడ్బోట్లు ఉన్నాయి. భవానీ ఐల్యాండ్‌లో 34, బరంపార్కు దగ్గర 20 రిసార్టులున్నాయి. రాజధాని ప్రాంతం అభివృద్ధి జరిగి కొత్త నగరం ఏర్పాటు జరిగితే ఇక్కడికొచ్చే పర్యాటకులు 50 శాతం పెరిగే వీలుందని, ఈ నేపథ్యంలో వీరికి అనుగుణంగా రిసార్టుల సంఖ్య పెంచాలని యోచిస్తోంది. భవానీ ద్వీపంతో పాటు పక్కనే ఉన్న నాలుగు ద్వీపాల్లో థీమ్‌పార్కులు, రెస్టారెంట్లు, లైటింగ్ హౌస్‌లు నిర్మించాలని, ఇక్కడి ద్వీపాలను సింగపూర్‌లోని ‘సెంటోసా ద్వీపం’ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.150 కోట్లకు పైగా వెచ్చించేందుకు అంచనాలు తయారు చేస్తోందని టూరిజం శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. లే అవుట్ అభివృద్ధి తరువాతే.. రాజధాని ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ రాజధాని మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ సిద్ధమై, లే అవుట్ అభివృద్ధి జరిగాకనే చేపడతామని ఏపీటీడీసీ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఈడీ అమరేందర్‌కుమార్ చెప్పారు. భవానీ ద్వీపాన్ని ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో సెంటోసా ద్వీపం మాదిరిగా అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంటును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించాక ప్రతిపాదనల ప్రకారం పనులు చేపడతామని చెప్పారు. -
ఉపాధి ఉత్తి మాటేనా?
తాడికొండ: రాజధాని ప్రాంతంలోని రైతుకూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తరతరాల నుంచి రైతును నమ్ముకొని ఆయా భూముల్లో వ్యవసాయ కూలి చేసుకుంటూ రోజుకు సగటున రూ.400 ఆదాయంతో కుటుంబాన్ని దిద్దుకుంటున్న కూలీలకు మరో నెల రోజుల్లో వ్యవసాయ పనులు కనుమరుగుకానున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ 30 లోగా భూములు ఖాళీ చేస్తే చదును చేసి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో వ్యవసాయ కూలీల్లో ఆందోళన, భయం ఏర్పడ్డాయి. కూలి పనులు తప్ప మరో పని తెలియని తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఏ విషయమైనా రైతులకు సంబంధించే మాట్లాడుతున్నారు కానీ రైతు కూలీలు, ఇతర వృత్తులవారి గురించిన ప్రస్తావనే రావటం లేదు. దీంతో తమ బతుకులు ఎలా సాగుతాయోనని బెంబేలెత్తుతున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో మొత్తం 45 వేల మంది వ్యవసాయ కూలీలు, ఇతర వృత్తులవారు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే జనవరిలో ప్రభుత్వం సర్వేచేసి మొత్తం 12 వేలమందిని మాత్రమే కూలీల జాబితాలో చేర్చింది. వీరికి నెలకు రూ.2,500 పింఛను కల్పించి, నైపుణ్యం ప్రకారం ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రణాళిక ప్రారంభం కాలేదు. ఈ విషయమై కూలీల పక్షాన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు బహిర్గతం కాలేదు. భూములు చదును చేస్తే వలసబాట పట్టే పరిస్థితి ఏర్పడుతుందని, కూలి పని తప్ప మరి ఏ ఇతర వృత్తి నైపుణ్యం తెలియని అధికసంఖ్యలో కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తరతరాలుగా సొంత గ్రామాల్లో ఉంటూ వలసబాట పట్టాల్సివస్తుందా! అని కంటిపై కునుకులేకుండా భయాందోళన చెందుతున్నారు. కూలీల బతుకులపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కూలీల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయకూలీల భవితకు భరోసా ఇచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించి వారి ఉపాధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ఎయిర్‌పోర్టుకు మహర్దశ
మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు పూర్తి మూడు దశల్లో అభివృద్ధికి ప్రణాళికలు ఫైల్‌ను ఢిల్లీకి పంపిన అధికారులు రన్‌వే విస్తరణ, టెర్మినల్ భవనాలే కీలకం ప్రహరీ నిర్మాణానికి భూసార పరీక్షలు సాక్షి, విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు నూతన మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదనలను అధికారులు ఢిల్లీకి పంపారు. కేంద్రం అనుమతి రాగానే ఆరు నెలల వ్యవధిలో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎయిర్పోర్ట్ డెరైక్టర్‌గా రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి రివైజ్డ్ ప్లాన్ తయారుచేశారు. ప్రస్తుతం ఈ ప్లాన్ అమలులో ఉంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం విమాన సర్వీసుల రద్దీ పెరిగింది. గన్నవరం నుంచి రోజూ 10 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 80 శాతంపైనే ఆక్యుపెన్సీ ఉంటోంది. రాష్ట్ర విభజన తర్వాత పెరిగిన ప్రాధాన్యత రాష్ట్ర విభజన నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రాధాన్యత పెరిగింది. దీనికి అనుగుణంగా ఇక్కడి అధికారులు తరచూ పలు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం ఉన్న రన్ వే, టెర్మినల్ భవనం దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరిపోవని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మూడు నెలల క్రితం ఎయిర్పోర్ట్ అథారిటీ ముఖ్య అధికారులు గన్నవరంలో పర్యటించి అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా ఇటీవల గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారు. మూడు దశల్లో అభివృద్ధి ప్రధానంగా మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో పేర్కొన్న అంశాలను మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. టెర్మినల్ బిల్డింగ్స్, ఆపరేషన్స్, సిటీ సెక్టార్లుగా విభజించి మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 7,500 అడుగుల రన్‌వే ఉంది. టెర్మినల్ బిల్డింగ్‌లో సీటింగ్ కెపాసిటీ 250 మాత్రమే. ఈక్రమంలో మొదటి దశలో టెర్మినల్ భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు 1,500 సీటింగ్ సామర్థ్యంతో టెర్మినల్ భవనం నిర్మించాలని మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. వివిధ ఎయిర్‌లైన్ కంపెనీలకు గదులు కేటాయించడానికి వీలుగా టెర్మినల్ భవనంలో ప్రత్యేకంగా కొంతభాగం ఉండాలని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర అవసరాల కోసం కూడా కొంత స్థలం కేటాయించాలని నిర్ణయించారు. రెండో దశలో ఆపరేషన్స్‌లో కీలకమైన రన్ వేను విస్తరిస్తారు. రన్ వేను 12వేల నుంచి 15వేల అడుగులకు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. విమానాల పార్కింగ్ కోసం కొంత ప్రదేశం కేటాయించాలని నిర్ణయించారు. సిటీ సెక్టార్లో భాగంగా మూడో దశలో నగరానికి ఎయిర్‌పోర్టు ఎంత దూరంలో ఉందనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న ఇన్ గేట్, అవుట్ గేట్లను మార్చడం, జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉండేలా చూడటం వంటి అంశాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రహరీ కోసం పరీక్షలు మాస్టర్‌ప్లాన్ పనులతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రహరీ స్థానంలో నూతనంగా భారీ రక్షణ గోడ నిర్మించటానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు గత వారంలో భూసార పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడిన వెంటనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఎయిర్పోర్ట్ డెరైక్టర్ రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. దీనికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పారు. -
రూ.వందకోట్లతో మాస్టర్‌ప్లాన్
వేములవాడ అర్బన్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని రూ.వంద కోట్లతో మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను శనివారం ఉదయం మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రూ.21 కోట్లతో స్వామి వారి విమానగోపురానికి బంగారు తాపడం చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 17న రాజన్న సన్నిధిలో జరుపుకునే మహాశివరాత్రి జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు భద్రాచలం మాదిరిగా జీవో జారీ చేస్తామన్నారు. గోదావరిఖని పుష్కరాలను రూ.500 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వైభవం తీసుకొస్తానని అన్నారు. తెలంగాణ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జోన్లుగా విభజించి పుణ్యక్షేత్రాలన్నింటినీ మోగా టూరిస్ట్ సర్క్యూట్ ద్వారా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజన్న సన్నధిలో మంత్రి పూజలు ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ కలశంతో స్వాగతం పలికారు. మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షిణలు చేశారు. శ్రీలక్ష్మిగణపతి పూజ, నందీశ్వరుడికి పూలదండ సమర్పించుకుని, స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అద్దాల మంటపంలో ఈవో దూస రాజేశ్వర్ స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందించి సత్కరించారు. -
ఆనం మాస్టర్‌ప్లాన్
సాక్షి: ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరానికి సంబంధించి తాజా మాస్టర్‌ప్లాన్‌పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభ్యంతరాలతో అందులోని లొసుగులు వెలుగుచూస్తున్నాయి. మొన్నటి వరకు నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దశాబ్దానికి పైగా రాజకీయం చేసిన ఆనం కుటుంబం ఈ వ్యవహరం వెనుక కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. మాస్టర్‌ప్లాన్‌లోని లొసుగులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బయటపెట్టడంతో ఆనం వర్గీయులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో ఎవరి ప్రమేయం ఉండదంటూ తాజా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గళం విప్పడం ఇందుకు నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా తమ హయాంలో నగరంలో ఎక్కడా రోడ్ల విస్తరణ జరగలేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2008లో ప్రారంభమైన తాజా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కసరత్తు 2011కు పూర్తయింది. ఆ ఏడాదిలోనే అప్పటి మేయర్ భానుశ్రీ అధ్యక్షతన కౌన్సిల్ ఆమోదం పొందింది. 2013లో ఈ మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోద ముద్ర వేసింది. ఇదంతా ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగానూ, ఆయన సోదరుడు రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖ మంత్రిగానూ వ్యవహరించినప్పుడు జరిగింది. అప్పట్లో ప్రైవేటు ఏజెన్సీ మాస్టర్‌ప్లాన్ పూర్తి చేసి కౌన్సిల్‌కు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందడం వంటి కీలక పరిణామాలు కింగ్మేకర్లగా వ్యవహరించిన ఆనం సోదరులకు తెలియవనుకుంటే పొరబాటే. ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయాల్సి వస్తే వ్యాపారులకు, పలు ప్రార్థనా మందిరాలకు నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గొంతు చించుకుంటున్నారు. అప్పట్లో ఆయన దీనిపై ఎందుకు స్పందించలేదనేది ఆయనకే తెలియాలి. వారి హయాంలోనే స్టౌన్‌హౌస్‌పేట, వాకర్స్‌రోడ్డు, జీఎన్టీ రోడ్డు, రైల్వేఫీడర్స్‌రోడ్డు వంటి ప్రధాన రోడ్ల విస్తరణ జరిగింది. ఈ పరిస్థితుల్లో తాజా మాస్టర్‌ప్లాన్ అమలునుద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొండాయపాళెం రోడ్డు వెడల్పు తగ్గడంలో మతలబు 1978 తరువాత 2011 సంవత్సరంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని చోట్ల రోడ్ల విస్తీర్ణం తగ్గడంలో ఆనం ప్రమేయం ఉన్నట్లు బహిరంగంగానే విమర్శలున్నాయి. కొండాయపాళెం మార్గంలో 60 అడుగుల రోడ్డును తాజా మాస్టర్‌ప్లాన్‌లో 40 అడుగులకు తగ్గించడం వెనుక సొంత మనుషులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ ప్రాంతంలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత భూములున్నాయి. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో రోడ్ల విస్తీర్ణాన్ని పెంచడానికి బదులు తగ్గించాడని చెబుతున్నారు. మాగుంట లేఅవుట్ సమీపంలో రైల్వే లైన్‌కు పడమర వైపు మాజీ మేయర్‌కు సంబంధించిన బినామీల ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా జాతీయ రహదారి నుంచి అయ్యప్పగుడి వరకు 200 అడుగులు, అక్కడి నుంచి శబరిక్షేత్రం వరకు 150 అడుగులు, అక్కడి నుంచి ఆత్మకూరు బస్టాండు వరకు 100 అడుగులు విస్తరించాలన్న నిర్ణయం కూడా అప్పట్లోనే జరిగింది. తమ కనుసన్నల్లో జరిగిన మాస్టర్‌ప్లాన్‌ను ఆనం ఇప్పుడు వ్యతిరేకించడం హాస్యాస్పదమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.