ఆధ్యాత్మిక శోభ...పర్యాటక ప్రభ | Master Plan of Yadadri Temple | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక శోభ...పర్యాటక ప్రభ

Published Thu, Jul 2 2015 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఆధ్యాత్మిక శోభ...పర్యాటక ప్రభ - Sakshi

ఆధ్యాత్మిక శోభ...పర్యాటక ప్రభ

యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
 ఆలయంతోపాటు  ఆరు ఊళ్లకు మాస్టర్‌ప్లాన్
కేంద్ర పథకం ‘ప్రసాద్’ మలిజాబితాలో చోటుకు ప్రతిపాదన
కొలనుపాక, భువనగిరి కోట, పెంబర్తి హస్తకళలతో సర్క్యూట్

 
 సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కనీసం రెండు రోజుల పాటు అక్కడ ఉండేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బృహత్‌ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇంతకాలం కేవలం యాదగిరి లక్ష్మీనరసింహుడి ని దర్శించి వెంటనే భక్తులు తిరుగుపయనమవుతున్నారు. అలా కాకుండా యాదాద్రి దర్శన అనంతరం సమీపంలోని ఇతర పురాతన దేవాల యాలు, చారిత్య్రక,పురావస్తు ప్రాధాన్యమున్న స్థలాలు, ప్రాంతాలను సందర్శించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటితోపాటు పర్యాటకులకు పరిపూర్ణ వినోదం అందించే రిక్రియేషన్ కేంద్రాలను అభివృద్ధి చేయబోతోంది. దీనికి కేంద్రప్రభుత్వం నుంచి కూడా సాయం పొందాలని నిర్ణయించింది.
 
 ఆలయంతోపాటు ఆరు ఊళ్లు...
 ప్రస్తుతం యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం యాదగిరి దేవాలయం, గ్రామం కాకుండా మరో ఆరు ఊళ్లను అందులో చేర్చింది. దేవాలయాన్ని వాస్తు, ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయటంతోపాటు, యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న ఆరు ఊళ్లను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయటం దీని ఉద్దేశం. యాదగిరి పల్లి, సైదాపూర్, రాయగిరి, మల్లాపూర్, దాతర్‌పల్లి, గుండ్లపల్లి గ్రామాలను ఇందుకు ఎంపిక చేసిన ప్రభుత్వం వాటి సమగ్రాభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తోంది. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరగనున్న దృష్ట్యా  ఆ ప్రాంతం గజిబిజిగా కాకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధ పురోగతి అవసరమని ప్రభుత్వం గుర్తించింది.
 
 ఇందుకోసం చుట్టూ ఉన్న ఆరు గ్రామాలను జోన్లవారీగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టనుంది. నివాస స్థలం, పారిశ్రామిక వాడ, వినోద ప్రాంతం, సాగు భూములు... ఇలా అన్నీ నిర్ధారిత జోన్ల పరిధిలో ఉంటాయి. ఏ జోన్ పరిధిలో సంబంధిత పనులే జరగాల్సి ఉంటుంది. నగరానికి చేరువగా ఉండటంతో ఈ గ్రామాల పరిధిలో విపరీతంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. చాలావరకు అనుమతి లేని లేఅవుట్లు రూపొందించి ప్లాట్లు అమ్మేస్తున్నారు. వాటిల్లో నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆ ప్రాంతమంతా గజిబిజిగా ప్రణాళికలేకుండా మారుతుంది. దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

 ‘ప్రసాద్’లో చోటుకు కేంద్రానికి ప్రతిపాదన...
 కేంద్రప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రీజువెనేషన్, స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి దశగా దీనికింద అమృత్‌సర్, అజ్మీర్, అమరావతి, ద్వారక, గయ, కాంచీపురం, కేదార్‌నాథ్, కామాఖ్య, మథుర, పూరి, వారణాసి, వెల్లంకని ప్రాంతాలను ఎంపిక చేసింది. వీటి అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేయనుంది. మలిదఫాలో ఈ పథకం కింద యాదాద్రిని టెంపుల్ టౌన్ రూపంలో ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు సమీపంలోని పురాతన దేవాలయాలను ఒక సర్క్యూట్ రూపంలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ మరో ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. భువనగిరి కోట, కొలనుపాక జైన దేవాలయం, పురాతన శివాలయం, పెంబర్తి క్రాఫ్ట్ విలేజ్‌ను చేర్చబోతున్నారు. యాదాద్రి చుట్టూ అభయారణ్యం, సాహసక్రీడలు, చిన్నారులకు వినోదం అందించే రిక్రియేషన్ ప్రాంతాలు సహా మొత్తం యాదాద్రి చుట్టూ రెండు వేల ఎకరాలను ఆధ్యాత్మిక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. వెరసి భక్తులు ఒక యాదాద్రి దర్శనంతోనే పర్యటనను సరిపుచ్చకుండా రెండుమూడు రోజులు ఆ ప్రాంతంలో ఉండి అన్నిం టినీ చూసి వెళ్లేలా చేయాలనేది ప్రణాళిక.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement