
పురపాలికల్లో శాటిలైట్ సర్వే
రాజంపేట:
జిల్లాలోని మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఎంపిక చేసిన పట్టణాల్లో శాటిలైట్ సర్వే చేస్తున్నారు. జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఈ ప్లాన్ అమలు చేసేందుకు ఆదివారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మాస్టర్‌ప్లాన్ అమలుకు ముందుగా పట్టణాల నైసర్గిక స్వరూపం, రోడ్ల పరిస్థితి, ముఖ్యమైన ప్రాంతాలు తదితర వాటిని గుర్తించనున్నారు. బేస్‌మ్యాప్‌లు రూపొందించే పనిలో ప్రత్యేక బృందాలు కసరత్తు చేస్తున్నాయి. ఏరియా టవర్స్ ద్వారా పట్టణ పరిస్థితులను బేస్‌మ్యాప్‌కు ఎక్కించనున్నారు. ఏపీ మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద 76 మున్సిపాలిటీలకు గాను 45 మున్సిపాలిటీలకు సంబంధించి బేస్‌మ్యాప్‌లను రూపొందించే కార్యక్రమాన్ని ముంబయికి చెందిన రోల్టా ఇండియా లిమిటెడ్, హైదరాబాదుకు చెందిన ఆర్వీ అసోసియేషన్‌కు అప్పగించారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేసే పట్టణాల్లో జిల్లాలో పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు ఉన్నాయి వీటి పరిధిలో బేస్ మ్యాప్‌ల రూపకల్పన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఓ సర్వేను కూడా చేపట్టనున్నారు.
బేస్‌మ్యాప్ అంటే..
బేస్‌మ్యాప్ రూపకల్పనలో భాగంగా డీజీపీఎస్ (రికార్డింగ్ శాటిలైట్ కో-ఆర్డినేట్స్) ప్రకారం పట్టణ పరిధిలోని చదరపు కిలోమీటర్ల పరిధిలో పలుచోట్ల డీజీపీఎస్ పాయింట్లు పెట్టి సర్వే చేస్తారు. మ్యాప్ క్రియేషన్ జరిగిన తర్వాత భౌగోళిక సర్వే చేస్తారు. ఈ సర్వేతో పాటు బృందం ఆటోలెవెల్ సర్వే చే స్తుంది. ఈ రెండు సర్వేల ద్వారా బిల్డింగ్ స్వభావాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. ఇది పన్నుల పెంపు ప్రక్రియలో దోహదపడుతుంది. రోడ్లు, కాలువలు, వాటి వెడల్పు, ప్రస్తుత పరిస్థితి (ఆర్‌సీసీ, కచ్చా, మెటల్), ఫుట్‌పాత్‌ల స్వరూపం కూడా తెలుసుకోవచ్చు. వీధిలైట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, హోర్డింగ్స్, సెల్‌టవర్లు, తాగునీటి సౌకర్యాలు డిజిటలైజేషన్ చేస్తారు. ఆటోలెవెల్ సర్వే వల్ల పట్టణంలోని వివిధ ప్రాంతాలు సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నది కూడా తెలుస్తుంది. దీని వల్ల నీళ్లు ఎటువైపు వెళతాయనే(వాటర్‌గ్రావిటీ) విషయం తెలుస్తుంది. ఈ శాటిలైట్ సర్వేతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది.
మాస్టర్‌ప్లాన్ ఇలా..
మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ అమలు చేసేందుకు తొలుత పట్టణంలో అభివృద్ధి, ప్రజలకు సేవలందించే అన్ని అంశాలపై పక్కాగా ప్లాన్ రూపొందిస్తారు. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా పైపులైనుతోపాటు వీధులు, భవనాలు కూడా మాస్టర్‌ప్లాన్‌లోకి వచ్చేస్తాయి. భవిష్యత్తులో పట్టణాలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మాస్టర్‌ప్లాన్ కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేగాకుండా మున్సిపాలిటీల్లో రోడ్లు, ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా అడ్డుకట్టవేసేందుకు దోహదపడుతుంది.