హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం వరంగల్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధి కోసం రచించిన ప్రణాళికలు అంతే వేగంగా అమలు కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 10.90 లక్షలకు చేరింది. ఉమ్మడి వరంగల్ అనేక మందికి నివాసయోగ్య నగరంగా మారింది. ఇక్కడి ప్రజల ఎజెండాను అమలు చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్
అల్లంతదూరాన ‘మాస్టర్‌ప్లాన్’...
వరంగల్ మాస్టర్‌ప్లాన్–2042 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 42 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి ఫైల్ కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద సిటీగా.. 10.90 లక్షలకు మించిన జనాభా ఉన్న గ్రేటర్ వరంగల్‌లో 50 ఏళ్ల నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. వెంటనే మాస్టర్‌ప్లాన్ – 2042ను అమల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
పెండింగ్‌లో ‘ఇన్నర్ రింగ్‌రోడ్డు’....
1972లో ‘కుడా’ఆవిర్భావంలో ఏర్పడిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు పొందుపర్చారు. భూ సేకరణకు 2013లో రూ.13 కోట్లు ఆర్‌డీఓ పేరిట జమ చేశారు. తదుపరి మరో రూ.50 కోట్ల నిధులు రెవెన్యూ శాఖకు అప్పగించారు. కానీ ఇంత వరకు భూ సేకరణ పూర్తి కాలేదు. పనులు పూర్తి కాలేదు.
కలగా రోప్ వే...
ఏపీలోని విశాఖ నగరంలో కైలాసగిరి పైకి ఎలాగైతే రోప్‌వే (వేలాడే పెట్టె) ఉందో అలాంటిదే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భ«ద్రకాళి గుడికి వచ్చిన వారు భద్రకాళి చెరువు అందాలను వీక్షిస్తూ హనుమకొండ పద్మాక్ష్మి గుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి హంటర్ రోడ్డు జూపార్కు ఎదురుగా ఉన్న రీజినల్ సైన్స్ కేంద్రం గుట్టపై వరకు రోప్‌వే డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు 2007లో టెండర్లు పిలిచారు. వైజాగ్ రోప్‌వే ప్రాజెక్టు చేసిన కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత పనులు ముందుకెళ్లలేదు.
మామునూరు ఎయిర్‌పోర్టు... నియో రైలు..
వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్నది ఎన్నో ఏళ్ల కల. ఒకప్పుడు ఇక్కడ విమానాలు ఎగిరాయి. ఇప్పటికీ రన్‌వే, విమానాశ్రయం ఉన్నాయి. మట్టి నమూనా పరీక్షలను కూడా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు ఏడాదిన్నర క్రితం చేపట్టారు. ఇక మిగిలిన స్థలసేకరణ బాధ్యత రాష్ట్రానిది. ఈ ప్రక్రియపై వేగం పెరిగి పూర్తయితే రెండు, మూడేళ్లలో ఈ ప్రాంత ప్రజలకు విమానయానయోగం సులువవుతుంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు వరంగల్‌లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు ఇంకా కాగితాలపైనే ఉన్నాయి.
‘ఔటర్ రింగ్‌రోడ్డు’అలాగే...
ఔటర్ రింగు రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. మొత్తంగా నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇంకా 40 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది.
ముసురు మొదలయ్యిందంటే ‘ముంపు’భయం..
గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు. నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. సుమారు 1,500 పైగా కాలనీలుంటాయి. ఇందులో 40 శాతం కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. భూ కబ్జాలు, ఆక్రమణలతో 40కి పైగా లోతట్టు కాలనీలు ప్రమాదపు అంచులో ఉంటున్నాయి. కాస్త వర్షం కురిస్తేనే కాలనీలు ఏరులై వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment