ఆహ్లాదం... ఆలస్యం
► నత్తనడకన మినీ ట్యాంకుబండ్‌ల అభివృద్ధి
► ఐదు నియోజకవర్గాల్లో రెండేళ్లుగా సాగుతున్న పనులు
► మరో ఐదు సెగ్మెంట్లలో ఆరంభంతోనే సరి
► రెండు నియోజకవర్గాల్లో ఎంపిక జరగని వైనం
నీటి వనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసా, ప్రజలకు ఆహ్లాదం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మినీ ట్యాంకుబండ్‌ల అభివృద్ధిని చేపట్టింది. ప్రజాప్రతినిధుల అలసత్వం,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు చెరువుల ఎంపికే జరగలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
సాక్షి, వరంగల్: మిషన్ కాకతీయలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద చెరువును మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ కార్యక్రమం మొదలైన 2015లోనే మినీ ట్యాంకుబండ్ ప్రక్రియను ఆరంభించింది. నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు ఇచ్చే ప్రతిపాదనల ప్రకారం మినీ ట్యాంకుబండ్ అభివృద్ధి పనులు మొదలవుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చెరువుల వారీగా నిధులు కేటాయిస్తూ సాగునీటి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మిటీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే చెరువునే ఇంకా ఎంపిక చేయలేదు. ములుగు, డోర్నకల్, మహబూబాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి సెగ్మెంట్లలో మినీ ట్యాంక్‌బండ్ పనులు ఇటీవలే మొదలయ్యాయి.
2015లో నిధులు మంజూరైన వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, జనగామ, పరకాల సెగ్మెంట్లలో పనులు ఇంకా సాగుతున్నాయి. మొత్తంగా పది నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి రూ.29.99 కోట్లు సాగునీటి శాఖ మంజూరు చేసింది. ఇప్పటికి రూ.4.62 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం పనులు పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందనేది అంతుచిక్కడం లేదని సాగునీటి శాఖ అధికారులే చెబుతున్నారు.
► భూపాలపల్లి నియోజకవర్గంలో మినీ ట్యాంకుబండ్ అభివృద్ధి పనులు మొదలే కావడంలేదు. నియోజకవర్గంలో పెద్ద చెరువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆరు మండలాలు ఉన్నాయి. అయినా ఏ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలనే విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు సాగునీటి శాఖ చెరువును ఎంపిక చేస్తుంది. ఈ నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి ప్రక్రియ ప్రతిపాదనల దశలోనే ఉంది.
► వర్ధన్నపేట నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులు పక్కనపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ చెరువును ఎంపిక చేయాలనే విషయంలోనే ఇప్పటికీ స్పష్టత రాలేదు. హసన్‌పర్తి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ఇటీవల ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాగునీటి శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి దీనికి ఆమోదం రావాల్సి ఉంది.
► జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ధర్మవాణికుంటను మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1.48 కోట్లు విడుదల చేస్తూ సాగునీటి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 జూన్ 27న ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.1.12 కోట్ల పనులు పూర్తయినట్లు సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు.
► నర్సంపేట నియోజకవర్గంలో మాధన్నపేట కుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెరువు అభివృద్ధి కోసం సాగునీటి శాఖ రూ.7.51 కోట్లు మంజూరు చేసింది. 2015 డిసెంబరు 15న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రూ.1.15 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. పనుల తీరు ఇలాగే ఉంటే మరో రెండేళ్ల వరకు పూర్తయ్యే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.
► ములుగు నియోజకవర్గ కేంద్రంలోని తోపుకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.2.01 కోట్లను విడుదల చేస్తూ సాగునీటి శాఖ 2016 ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి పనులను లాంఛనంగా మొదలుపెట్టారుగానీ ముందుకు సాగడంలేదు.
► డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల కేంద్రంలోని కొండ సముద్రం చెరువును ఎంపిక చేశారు. చెరువును ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.1.89 కోట్లు మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2016 మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. పనులు మొదలయ్యాయి. కానీ ముందుకు కదడంలేదు.
► మహబూబాబాద్ నియోజకవర్గంలో అనంతారం మైసమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని నిర్ణయించారు. రూ.3.10 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు సాగునీటి శాఖ 2016 మే 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది దగ్గరపడుతున్నా ఇక్కడ పనులు ముందుకు సాగడంలేదు.
► పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తొర్రూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.3.60 కోట్లను మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2016 జూన్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. అంచనాల విషయంలో సవరణ కోసం ప్రతిపాదనలు మళ్లీ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ చెరువు పనులకు ఇంకా టెండరు ప్రక్రియ సైతం మొదలుకాలేదు.
► పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల మండలం మేడవరంలోని దామెరు చెరువును మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.3.08 కోట్లను మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2015 జూన్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రూ.51 లక్షల మేరకు పనులు పూర్తయినట్లు సాగునీటి శాఖ నివేదికలు చెబుతున్నాయి.
► స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని పుట్టలమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1.26 కోట్లను విడుదల చేస్తూ సాగునీటి శాఖ 2016 జూలై 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టెండరు ప్రక్రియ ముగిసి పనులు మొదలయ్యాయి.
► వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రంగసముద్రం(ఉర్సు) చెరువును మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ చెరువు అభివృద్ధి కోసం రూ.3.10 కోట్లను మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2015 అక్టోబరు 15న ఉత్తర్వులు జారీ చేసింది. పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.1.37 కోట్ల వరకు పనులు జరిగినట్లు సాగునీటి శాఖ నివేదికలో పేర్కొన్నారు.
► వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బంధం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2.94 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ను అభివృద్ది చేసేందుకు సాగునీటి శాఖ 2015 డిసెంబరు 17న ఉత్తర్వులు జారీ చేసింది. పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.1.58 కోట్ల అంచనాల మేరకు పనులు పూర్తయ్యాయి.