mini tank bund
-
ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్’.. మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్!
రాయదుర్గం: నగర శివారులోని ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చేరువలో ఆహ్లాదాన్ని పంచే చెరువు.. దాని పక్కనే మట్టి, బండరాళ్లతో కూడిన కొండ.. ఇలా ప్రకృతి అందాలతో ఆకట్టుకొనఖాజాగూడ పెద్ద చెరువు రూపురేఖలు మార్చే ప్రక్రియ ఇంకా ప్రతిపాదన దశకే పరిమితమైంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో మగ్గుతుండటం విడ్డూరం. చెరువుకు పక్కనే లింకురోడ్లను అభివృద్ధి చేయడం, ఒకవైపు గ్రీనరీ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం కొంత వరకూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే లింకురోడ్డులో కుడివైపు, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎదురుగా 39 ఎకరాల్లో విస్తరించి ఉంది ఖాజాగూడ పెద్ద చెరువు. శివారులోని దుర్గంచెరువు, మల్కంచెరువు తరహాలోనే దీన్ని కూడా అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు సేద తీరి ఆహ్లాదం పొందేందుకు అనువైన ప్రాంతంగా మారేందుకు అవకాశం ఉంది. ఒకప్పుడు బతుకమ్మల నిమజ్జన చెరువు... ఖాజాగూడ పరిసరాల్లోని వారు బతుకమ్మ ఉత్సవాల సమయంలో పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ చేసేది. బతుకమ్మ పండగు సమయంలో మాత్రమే ఈ చెరువు వద్ద సందడి నెలకొనేది. ప్రస్తుతం చెరువును ఆనుకొని లింక్ రోడ్డు ఏర్పాటు చేయడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. లింకురోడ్డుతో కొత్త కళ.. ► ఖాజాగూడ, గచ్చిబౌలి లింకురోడ్డు నిర్మాణంతో ఈ చెరువుకు కొత్త అందం రావడమే కాకుండా ఈ ప్రాంత రూపురేఖలు కూడా మారిపోయాయి. ► ఈ లింకురోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లు, ఆకట్టుకునేలా గ్రీనరీని కూడా ఏర్పాటు చేశారు. ► చెరువు వద్ద లింకురోడ్డు పక్కనే మౌనముద్రలోని శిల్పంపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ► ఈ చెరువుకు ఒకవైపు బండరాళ్లు, మట్టితో కూడిన భారీ కొండ ఉండటంతో ఇది మరింత ఆకట్టుకునేలా మారింది. ► ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, అంతగా ట్రాఫిక్ సమస్య ఉండకపోవడంతో వాకర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ► వాకర్స్, సందర్శకులు గ్రీనరీ మధ్య కూర్చోవడానికి బళ్లలు అందుబాటులోకి తెచ్చారు. ► ఈ లింకురోడ్డు సెంట్రల్ డివైడర్‌పై ఏర్పాటు చేసిన భారీ బండరాళ్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కానరాని వాటర్ ఫౌంటేన్లు...ఫ్లోటింగ్ ప్లాంట్స్ ► ఖాజాగూడ పెద్ద చెరువు పక్కనుంచే లింకురోడ్డు ఏర్పాటు చేయడంతో దాని పక్కనే చెరువుకు ఆనుకొని గ్రీనరీని ఆకట్టుకునే తరహాలో మార్చారు. ► ఇదే సమయంలో ప్రారంభంలో చెరువులో వాటర్ ఫౌంటేన్లు, ఫ్లోటింగ్ ప్లాంట్స్‌ను కూడా ఏర్పాట్లు చేశారు. కానీ అవి నేడు కనుమరుగయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్.. ► సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం సాక్షాత్తు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ చెరువు పక్కనే నిర్మించిన లింకురోడ్డు పనులను తనిఖీ చేశారు. ► ఈ సందర్భంగా రోడ్డు పక్కనే ఉన్న ఈ చెరువును చూసి ఆయన ‘ఖాజాగూడ చెరువు చాలా బాగుంది....దీన్ని అభివృద్ధి చేసి మినీట్యాంక్‌బండ్‌గా మార్చండి....ఈ ప్రాంత ప్రజలు వీకెండ్స్‌లో సేదతీరేలా దీన్ని వీకెండ్స్ స్పాట్‌గా మార్చాలి’ అని అధికారులను ఆదేశించారు. ► అయితే, ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం గ్రీనరీని అభివృద్ధి చేయడంతో పాటు మౌనముద్రలో మనిషి చిత్రాన్ని ఆకట్టుకునే తరహాలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ‘శివారు వీకెండ్స్పాట్’, ‘సండే ఫండే’లకు అనువైన చోటు .. ► ఖాజాగూడ పెద్ద చెరువును వీకెండ్స్ స్పాట్‌గా మార్చి, తొలగించిన రెండు ఫౌంటేన్లు, ఫ్లోటింగ్ ప్లాంట్స్‌ను పునరుద్ధరిస్తే మరింత అందం పెరిగే అవకాశం ఉంది. ► చెరువుకు ఆనుకొనే నిర్మించిన రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌ల మాదిరిగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేయాలి ► శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి ప్రజలు వాకింగ్, సైక్లింగ్ చేయడంతో పాటు, ట్యాంక్‌బండ్‌పై మాదిరిగా ‘సండేఫండే’ ఈవినింగ్ తరహాలా మార్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ► మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, కాఫెటేరియా, టిఫిన్స్ సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తే సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. చదవండి: ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్ అంటూ మహిళకు కాల్స్ చేసి చివరకు.. -
ట్యాంక్‘బంద్’!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ట్యాంక్‌బండ్.. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ఉల్లాస ప్రాంతం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హుస్సేన్ సాగర్ తీరాన ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే స్థలం. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలకు సమీపంలో ఉన్న చెరువులు, ఆనకట్టలు, నీటి వనరులున్న ప్రాంతాలను మినీ ట్యాంక్బండ్లుగా అభివృద్ధి చేయాలని ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని భావించింది. ఈ మేరకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక పథకాన్ని చేపట్టి నిధులు కూడా మంజూరు చేసింది. కానీ చాలాచోట్ల పూర్తిస్థాయిలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కొన్ని చెరువుల వద్ద అసలు పనులే మొదలుపెట్టని పరిస్థితి ఉండగా.. సిద్దిపేట, సిరిసిల్ల వంటి ఒకట్రెండు చోట్ల మాత్రం మినీ ట్యాంక్బండ్లు కళకళలాడుతున్నాయి. ప్రణాళిక ఘనంగా ఉన్నా.. రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల పరిధిలో మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో 98చోట్ల నిర్మాణం కోసం రూ.570.58 కోట్ల వ్యయ అంచనాతో ప్రతిపాదనలకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. వీటిలో 90 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి 2017–18లో టెండర్లు పూర్తయ్యాయి. మినీ ట్యాంక్‌బండ్ కింద మార్చేందుకు.. చెరువు కట్టలను పునరుద్ధరించి, బలోపేతం చేయడం, ఇరువైపులా పచ్చని చెట్లు, నడక కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు, చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపడం, చిన్నారులు ఆడుకునేలా పార్కులు, బోటింగ్, ప్రజలు సేద తీరేందుకు ఏర్పాట్లు చేయాలి. రాత్రివేళల్లో ఆహ్లాదంగా కనిపించేందుకు విద్యుద్దీపాలతో అలంకరించాలి. ఇప్పటివరకు సిద్దిపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, దుబ్బాక, భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, నల్లగొండ, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, జనగామ, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, డోర్నకల్‌లలో మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటు పూర్తయింది. మిగతా వాటిలో చాలాచోట్ల సగం పనులు కూడా కాలేదు. చాలాచోట్ల సుందరీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మినీ ట్యాంక్బండ్ల కోసం ఇప్పటివరకు రూ.291.89 కోట్లు ఖర్చు చేసి నట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. నిర్మాణాల పరిస్థితి ఇదీ.. ఉమ్మడి వరంగల్‌లో 13 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. 9 మాత్రమే మంజూరయ్యాయి. వీటికి రూ.25.06 కోట్లతో టెండర్లు పిలిచారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో నాలుగుచోట్ల పనులు పూర్తయ్యాయి. జనగామ బతుకమ్మకుంటలో గ్రీనరీ, ఇతర పనులు చేయాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో.. రూ.74.62 కోట్లతో 15 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.60.21 కోట్లు ఖర్చు కాగా.. ఐదుచోట్ల మాత్రమే పూర్తయ్యాయి. సిరిసిల్ల కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా రూ.11 కోట్ల ఖర్చుతో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ పర్యాటక క్షేత్రంగా కళ వచ్చిందని స్థానికులు అంటున్నారు. రూ.37.87 కోట్ల వ్యయంతో ఉమ్మడి పాలమూరులో 11 చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నారు. రూ.18.08కోట్లు ఖర్చుకాగా.. మూడుచోట్ల మాత్రమే పూర్తయ్యాయి. మిగతాచోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రధానంగా సుందరీకరణ పనులు ఆగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 మినీ ట్యాంక్‌బండ్‌లను ప్రతిపాదించగా.. 11 మంజూరయ్యాయి. ఇందులో నాలుగు మాత్రమే పూర్తయ్యాయి. సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు పనులను 2016లో రూ.22 కోట్ల అంచనాతో ప్రారంభించారు. సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ చెరువు పూడిక తీయించి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. చుట్టూ రెయిలింగ్, సోలార్ లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండో మినీట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. అది వచ్చే ఏడాది మార్చికి పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు మొదలుపెట్టగా.. నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డిలో పూర్తయ్యాయి. మిగతాచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 12 మినీట్యాంక్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చెరువు, బోథ్ మండలంలోని కరత్వాడ, మంచిర్యాలలో తిలక్‌నగర్ చెరువు, లక్సెట్టిపేట ఇటిక్యాల చెరువు, చెన్నూరులో పెద్ద చెరువు, కుమ్మరికుంట చెరువు, బెల్లంపల్లిలో చెరువు, సిర్పూర్ (టీ)లో నాగమ్మచెరువు, సిర్పూర్(యూ) మండలం రాఘవపూర్ హైమన్ డార్ఫ్ చెరువు, నిర్మల్‌లో ధర్మసాగర్ చెరువు, భైంసాలో సుద్దవాగు చెరువుల వద్ద పనులు చేస్తున్నారు. కానీ ఎక్కడా పూర్తికాలేదు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు ప్రజలకు ఆహ్లాదం, ఆనందాన్ని కలిగించే విధంగా మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జనగామ బతుకమ్మకుంటలో గ్రీనరీతోపాటు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాల్సి ఉంది. డ్రైనేజీ, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, జిమ్, పార్కు, మెటల్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. – రవి, డీఈ, ఇరిగేషన్, జనగామ జిల్లా -
‘కట్ట’లతోనే మమ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పం చేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించ తలపెట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు ఎక్కడివక్క డే ఆగిపోయాయి. పనులు మొదలుపెట్టి నాలుగేళ్లయినా.. డబ్బులొచ్చే కట్టపనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా సుందరీకరణ పనులు చేయకుండా చేతులెత్తేశారు. పనుల పూర్తిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేక..నిధుల విడుదల్లేక ఆహ్లాదం పంచాల్సిన ట్యాంక్‌లు కళావిహీనంగా మారాయి. సగం మాత్రమే పూర్తి... చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ ట్యాంక్‌బండ్‌లను రూ.571.53 కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.290 కోట్ల మేర పనులే పూర్తయ్యాయి. 50చోట్ల మాత్రమే పూర్తిస్థాయి ట్యాంక్బండ్ల నిర్మాణం పూర్తవగా చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మట్టిపనితో కూడిన కట్ట నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పనులు మాత్రమే చేశారు. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగించి, బిల్లులు తీసుకొని మమ అనిపించారు. ఇవి మినహా బతుకమ్మ ఘాట్లు, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌ల పనులు చేయనేలేదు. చాలాచోట్ల కట్టలపై రోడ్డు నిర్మాణాలు జరుగక ట్యాంక్‌బండ్ దగ్గరకు సైతం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల పట్టణాల నుంచి మురుగు ట్యాంక్బండ్ల్లోకే వచ్చి చేరుతూ కంపుకొడుతున్నాయి. నిర్మాణ నిబంధనలు ఇవి.. మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్లతో నిర్మించి రోడ్డు వేయాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. నిధుల్లేక నీరసం... ట్యాంక్బండ్ల పనులు నత్తనడకకు నిధుల లేమి సైతం సమస్యగా మారింది. మిషన్ కాకతీయ సమయంలోనే ఈ పనులూ చేపట్టారు. చెరువుల పను లు చేసిన కాంట్రాక్టర్లే చాలా చోట్ల మినీ ట్యాంక్‌బండ్ పనులు చేపట్టారు. చెరువులు, మినీ ట్యాంక్‌బండ్‌లకు కలిపి మొత్తంగా రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మినీ ట్యాంక్‌బండ్‌లకు సంబంధించి రూ.100 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓ వైపు చెరువుల బిల్లు లు రాక, మినీ ట్యాంక్‌బండ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను పూర్తిగా నిలిపివేశారు. మహబూబాబాద్‌లోని నిజాం చెరువుకు రూ.5.50 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా నేటికి 30 శాతమే పూర్తయ్యాయి. కట్ట పనులు, పంట కాల్వ, మత్తడి పనులు పూర్తి కాగా.. పార్క్, వాకింగ్ ట్రాక్, బ్రిడి ఇతర పనులు చేయాలి. కాంట్రాక్టర్‌కు రూ.2 కోట్లు చెల్లించారు. గడువులు దాటుతున్నా పనులు సాగడం లేదు. చెరువు నుంచి గోపాలపురం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేసి ఏడాదిన్నరయినా పనులు పూర్తి కాలేదు. మరమ్మతులు లేక తెగిపోయిన నిజాం చెరువుకట్ట భైంసాలోని సుద్ధవాగు(గడ్డెన్నవాగు) ప్రాజెక్టులోనే ఓ వైపు మినీ ట్యాంక్‌బండ్ పేరిట పనులను చేపట్టారు. 2017, మార్చి 9న శంకుస్థాపన చేశారు. రూ.3.64 కోట్లతో పనులు చేపట్టగా, రూ.2.42 కోట్ల పనులు పూర్తయినట్లు చూపారు. ప్రాజెక్టు పక్కనే లోతైన గుంతలతో ఉన్న ప్రాంతాన్ని మొరంతో నింపారు. నీళ్లున్నవైపు బతుకమ్మ ఘాట్ నిర్మించారు. చుట్టూ రెయిలింగ్ వేసి, పార్క్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. అసలు ఆ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. మధ్యలో సీసీ పేవ్మెంట్ వేసి వదిలేశారు. భైంసా పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ -
‘మినీ’ని సుందరంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి పెద్దచెరువు మినీట్యాంక్‌బండ్‌పై అందమైన మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని డీపీఓ హనూక్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిని దత్తత తీసుకున్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్స్ సుజీంద్ర, దిలీప్‌దాస్‌తో కలిసి డీపీఓ హనూక్ మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మండలాన్ని దత్తత తీసుకుందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు కౌడిపల్లి గ్రామంలో మొక్కలు నాటడంతోపాటు వాటికి రక్షణ కల్పిస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా మొక్కలు సైతం పెంచనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టి నీరు పోయడంతో పాటు కాపలా ఏర్పాటు చేస్తామన్నారు. కట్టపై అందంగా మొక్కల పెంపకం.. కట్టపై అందంగా కనిపించే పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు పెద్దగా పెరిగే వివిధ రకాల మొక్కలను నాటుతామని తెలిపారు. అనంతరం ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ప్రతినిధి సుజీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ట్యాంక్‌బండ్‌నూ పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు సూచనలు ఖర్చు అంచనాలను కంపెనీకి సమర్పించిన అనంతరం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటిలింగం, ఏపీఓ శ్యాంకుమార్, ఈసీ ప్రేంకుమార్, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పిశ్కె శెట్టయ్య, చంద్రం దుర్గాగౌడ్ పాల్గొన్నారు. -
అంతా అస్తవ్యస్తం..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల పనులు అస్తవ్యస్తంగా మారాయి. సకాలంలో పనులు పూర్తికాకపోగా.. నాసిరకంగా ఉంటున్నాయి. అందుకు మోత్కూరు పెద్ద చెరువు పనులే నిదర్శనం. చెరువుకట్ట, రివిట్మెంట్ అస్తవ్యస్తంగా ఉండి కాంట్రాక్టర్ అలసత్వాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరో వైపు మెట్‌చిప్స్, విద్యుత్ స్తంభాలు ఆగమాగంగా ఉన్నాయి. మే 31తో కాంట్రాక్ట్ గడువు ముగిసినా పనులు పూర్తికాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మోత్కూరు : ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.అందులో భాగంగా జిల్లాలోని మోత్కూరు చెరువును కూడా అధికారులు ఎంపిక చేశారు. మిషన్ కాకతీయ రెండో దశలో ప్రభుత్వం రూ.6.83కోట్ల నిధులు మంజూరు చేసింది. 2017 మే16వ తేదీన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విద్యుత్‌శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. 2016 జూలై 26న అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్.. మే 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, గడువు ముగిసినా పూర్తి కాలేదు. చేపట్టిన పనులు కూడా అస్తవ్యస్తంగా, నాణ్యత లోపించి ఉన్నాయి. చేపట్టాల్సిన పనులు ఏమంటే.. పాత చెరువుకట్ట వెడల్పు 5 మీటర్లు ఉండగా 12 మీటర్లకు పెంచాలి. కట్ట ప్ర«ధాన రహదారి కావడంతో బీటీ రోడ్డు వేసి ఇరువైపులా విద్యుత్ లైటింగ్, రేలింగ్ ఏర్పాటు చేయాలి. చెరువు కట్టకు లోపలి భాగంలో రాతి కట్ట (రివిట్మెంట్)నిర్మించాలి. పార్క్, వాకింగ్ ట్రాక్, మూడు విజిట్ వ్యూ పాయింట్లు, మూడు బతుకమ్మ గాట్లు ఏర్పాటు చేయాలి. బృందావన్ కాల్వ ఫీడర్‌చానల్ అలుగు వద్ద సీసీ, బ్రిడ్జి, ఎఫ్టీఎల్ లెవల్ చెరువు చుట్టూ ఆరు మీటర్ల వెడల్పుతో కట్ట పోయాల్సి ఉంది. కట్టకు ఉత్తరం వైపున ఉన్న వ్యవసాయ బావికి రివైండింగ్ వాల్ (సీసీ రోడ్డు) ఏర్పాటు చేయాలి. పాటించని ప్రమాణాలు.. ఆగమాగంగా పనులు! గడువులోగా పూర్తి చేయాల్సిన పనులు ఆగుతూ సా..గుతూ నడుస్తున్నాయి. పైగా నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండడం.. పనులు జరిగిన తీరు చూస్తుంటే తేటతెల్లమవుతోంది. రివిట్మెంట్ చేసే కట్టలోపలి భాగంతోపాటు కట్ట రహదారి విస్తరణకు చెరువు మట్టినే వినియోగించారు. అంతేకాకుండా కట్టపై బీటీ రోడ్డు పనులు అధ్వానంగా ఉన్నాయి. వాటర్ క్యూరింగ్‌తో రోలింగ్ చేయించకపోవడంతో అప్పుడే రోడ్డుపై కంకరలేచింది. అదే విధంగా మెట్ చిఫ్స్ అస్తవ్యస్తంగా వేశారు. ఓ వైపు మెటల్ చిప్స్ వేసి మరోవైపు వేయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాపతకట్టపై అంతరాయంగా ఉన్న కరెంట్ స్తంభాలను తొలగించలేదు. ప్రస్తుతం స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. 10 కరెంట్ స్తంభాలు వృథాగా ఉన్నాయి. గతంలో చెరువుకట్టపై ఉన్న ప్రధాన రహదారిపై అలుగునీరు ప్రవహిస్తూ ఉండేది. అక్కడ సిమెంట్ గూనలు వేసి తాత్కాలికంగా మరమతులు వేశారు. అలుగు సమీపంలో రహదారిపై బ్రిడ్జి నిర్మాంచాల్సి ఉండగా ఆర్అండ్బీ ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపంతో ఇప్పటి వరకు బ్రిడ్జి పనులకు నోచుకోవడం లేదు. అసలు బ్రిడ్జి నిర్మిస్తారా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 కోట్లకు పెంచి నిధులు ఇదిలా ఉండగా మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.6.83కోట్లు మంజూరు చేసింది. కాగా అధనంగా నిధులు కావాలని స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ నిధులు పెంచుతున్నట్లు వేదికపై ప్రకటించారు. -
ఆహ్లాదం.. ఆలస్యం
ప్రజల ఆహ్లాదం కోసం చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ల పనులు జిల్లాలో ఇంకా పూర్తి కాలేదు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో తమ ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్లు తీర్చిదిద్దుతారని అనుకున్న ప్రజల ఆశ తీరడం లేదు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో ప్రజలు ఆహ్లాదం కోసం బయటకు వెళ్లేందుకు కనీసం పార్క్ అయినా లేదు. ఈ క్రమంలో గోసముద్రం చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్ తరహాలో తీర్చిదిద్దుతారని జనం ఎంతో ఆశపడ్డారు. అయితే 2016 నుంచి మినీ ట్యాంక్‌బండ్ పట్టణ ప్రజలను ఊరిస్తూనే ఉంది. పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. రూ.9.52 కోట్లతో గోసముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మలిచే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మెదక్ పట్టణ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సాక్షి, మెదక్ : తూప్రాన్‌లో పెద్ద చెరువు, కౌడిపల్లిలోని పెద్ద చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే రెండు చోట్లా ఇంకా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. తూప్రాన్‌లోని పెద్ద చెరువును రూ.5.77కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సొంత గ్రామమైన కౌడిపల్లిలోని పెద్ద చెరువును రూ.4.48 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. అధికారుల నివేదికల ప్రకారం ఇక్కడ పనులు పూర్తయ్యాయని చెబుతున్నా ఇంకా బ్యూటిఫికేషన్, ఇతర సివిల్ పనులు పూర్తి కావాల్సి ఉంది. మెదక్, కౌడిపల్లి, తూప్రాన్‌లో మినీ ట్యాంక్‌బండ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో కొనసా..గుతున్న పనులు మెదక్ ప్రజలు సేదదీరేందుకు పట్టణంలో ఒక్క పార్కు కూడా లేదు. దీంతో ప్రజలు ఆహ్లాదానికి, అనుభూతికి నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలోని గోసముద్రంను మినీ ట్యాంక్‌బండ్‌గా చేస్తున్నారని తెలిసి ప్రజలు సంతోషించారు. 2016లో ప్రారంభమైన పనులు ఇంకా ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి 2016లో మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపనచేశారు. పనుల్లో భాగంగా రెండు చెరువు కట్టలను 40 అడుగులకు విస్తరించారు. ఇప్పటి వరకు కట్టపై మట్టిపోసి బలోపేతం చేశారు. గోసముద్రం చెరువుకు సంబంధించి మూడు తూములను, పిట్లం చెరువు నుంచి ఒక తూమును తొలగించి అధునాతన పద్ధతిలో పిట్లం చెరువు వద్ద రిట్నరింగ్ గోడను నిర్మించారు. ఈ పనులు చేపట్టేందుకు రెండు నెలలు పట్టింది. ఏవో కారణాలతో కొంతకాలం కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. పట్టణంలోని మురికి నీరు పిట్లం చెరువులో కలుస్తుంది. మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో మురుగునీరు చెరువులో కలవకుండా భూగర్భ మురికి కాల్వలను నిర్మించారు. ఇందుకోసం పైప్లైన్లను తెప్పించారు. ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రెండు చెరువు కట్టలకు విస్తరణ కోసం వేసిన మట్టి పలుచోట్ల అప్పుడే బీటలు వారింది. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇంకా మెట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఆహ్లాదం కోసం పచ్చిక బయళ్లు, వీధి దీపాలు, బోటింగ్, ఫుట్‌పాత్, పిల్లల ఆట వస్తువులు ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది. కౌడిపల్లిలో బ్యూటిఫికేషన్ పనులు పెండింగ్ కౌడిపల్లిలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల నిధులు వెచ్చించారు. ఇరిగేషన్ అధికారుల సమాచారం ప్రకారం నిధులు విడుదలైన మేరకు పనులు పూర్తయ్యాయి. అయితే వాస్తవంగా ఇంకా మినీ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. అధికారులు పనులు పూర్తయ్యాయని చెబుతున్నా పెద్దచెరువు కట్టకు ఇంకా మినీ ట్యాంక్ బండ్ల పూర్తి స్వరూపం రాలేదు. పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు కట్టకు ఇరువైపులా రెండు అలుగులు నిర్మించారు. పెద్దతూం, మిర్రతూంలను కొత్తగా నిర్మించారు. అలుగుపై కట్టపై రెండు వైపుల సీసీతో దిమ్మెను వేశారు. దీంతోపాటు కట్టపైకి వాహనాలు వెళ్లేందుకు సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. రెండు కల్వర్టులు, రెండు బతుకమ్మ ఘాట్లతోపాటు కట్టపైకి ఎక్కేందుకు మెట్లు నిర్మించారు. అలుగుపై నుంచి వాహనాలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జ్ నిర్మించి రెండు వైపులా పైప్‌లు అమర్చారు. కానీ ఇంకా బ్రిడ్జ్ వద్ద మట్టిని పూర్తిస్థాయిలో పోయలేదు. చెరువు కట్ట లోపలి వైపు నీటితాకిడికి మట్టికొట్టుకుపోకుండా ఉండేందుకు రాళ్ల తెట్టెను పేర్చి పైనుండి సిమెంట్ వేశారు. ట్యాంక్‌బండ్ నిర్మాణం పనుల్లో నాణ్యతను పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు అంచనా కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గార్డెన్ పనులు మిగిలాయి చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు జరుగుతుండగా పూడికతీత పనులు ఇప్పటివరకు చేపట్టలేదు. చెరువు కట్టపై పార్క్ ఏర్పాటు, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే రూ 4.48 కోట్ల నిధులు మంజూరు చేయించగా మరో రూ. 2 కోట్లు మంజూరు చేయించి మిగతా పనులు చేయిస్తామని పలుమార్లు తెలిపారు. ఇప్పటివరకు మంజూరైన నిధులతో పనులు పూర్తిచేశామని, అదనపు నిధులు మంజూరు కాగానే బ్యూటిఫికేషన్ ఇతర పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్ ఏఈ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉంటే చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి పరిహారం అందించే విషయమై తమకెలాంటి ఆదేశాలు రాలేదని కౌడిపల్లి ఇన్చార్జి తహసీల్దార్ శ్రీశైలం స్పష్టం చేశారు. తూప్రాన్‌లో 80శాతం పనులు పూర్తి తూప్రాన్ పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు చేసేందుకు 2016 ఆగస్టులో ప్రభుత్వం రూ.5.70కోట్ల నిధులు కేటాయించింది. అదే ఏడాది డిసెంబర్లో పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 20 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే చెరువు కట్ట మరమ్మతులు జరుగుతున్నా కట్టపైకి వెళ్లాల్సిన చోట చెరువు మత్తడి ఉండడంతో వర్షకాలంలో పైకి వెళ్లలేని పరిస్థితి. దీనికి స్పందించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు మత్తడి పైన వంతెన నిర్మాణం కోసం రూ. 4కోట్లు, చెరువు కట్ట సుందరీకరణ కోసం టూరిజం శాఖ నుంచి అదనంగా మరో రూ.2కోట్ల నిధులను కేటాయించారు. అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. త్వరగా పనులు పూర్తి చేసి అందరికీ ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మినీ ట్యాంక్ బండ్ పనుల ఆలస్యంపై కలెక్టర్ అసంతృప్తి సాక్షి, మెదక్:మెదక్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ ధర్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోసముద్రం చెరువు కట్టపై నడుస్తూ మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం చేపడుతున్న పనులను పరిశీలించారు. బతుకమ్మ ఘాట్ నిర్మాణం, పార్కు, వాకర్స్ జోన్ నిర్మాణం పనులపై ఆరా తీశారు. ట్యాంక్ బండ్ నిర్మాణం పనులకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. ఇరిగేషన్ ఈఈ ఏసయ్య మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. పనులను పరిశీలించిన అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదన్నారు. పనులు మందకొడిగా సాగుతున్నాయని, వేగం పెంచాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. -
నగరానికో నగ..
లకారం సింగారించుకుంది.. కొంగొత్త అందాలతో మురిసిపోతోంది.. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు సిద్ధమవుతోంది.. కోట్లాది రూపాయల వ్యయం.. అత్యాధునిక వసతులు.. బండ్ చుట్టూ పచ్చికబయళ్లు.. ఆకట్టుకునే నాలుగు వంతెనలు.. చెరువు చుట్టూ ఫెన్సింగ్.. వాకింగ్ ట్రాక్.. అక్కడక్కడ హట్ల నిర్మాణం.. మినీ హోటళ్లు.. ఒక్కసారి వీక్షిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.. ఎన్నో సహజ వనరులున్న ఖిల్లా మెడలో మరో నగ వేసేందుకు లకారం చెరువును అందంగా ముస్తాబు చేయడంతోపాటు భూగర్భ జలాలు పెంపొందించేందుకు.. సాగర్ జలాలు మళ్లిస్తూ తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం : నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు సుందరీకరణ పనులను మిషన్ కాకతీయ–1లో భాగంగా తొలుత రూ.7.78కోట్లతో చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్దాలంటే ఈ నిధులు సరిపోవని.. వీటిని పెంచాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరడంతో ఆయన నిధులను రూ.13.59 కోట్లకు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. నిత్యం పనులతో సతమతమయ్యే సగటు మనిషి సాయంత్రం వేళ ఇక్కడికొచ్చి సేద తీరాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ పచ్చటి మొక్కలు, చెరువు నిండా నీరు.. వాకింగ్ ట్రాక్, హట్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. ఆయా పనులు పూర్తి చేసేందుకు మొత్తం రూ.24కోట్లు వెచ్చించారు. లకారం చెరువు ఆధునికీకరణ, ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడే పరిస్థితి తొలుత ఉండటంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఒప్పించి.. వివిధ పథకాల ద్వారా నిర్మాణాలకు నిధులను సమకూర్చగలిగారు. ఆక్రమణలకు గురవుతున్న చెరువు నగర ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడం వెనుక అధికారులు, ఎమ్మెల్యే అజయ్ కృషి దాగుంది. సుందరీకరణ ఇలా.. చెరువు చుట్టూ బండ్ నిర్మించి.. పూడికమట్టి తీసి కట్టలను బలపరిచారు. ఫెన్సింగ్‌తోపాటు రివిట్మెంట్ పనులు చేపట్టారు. బండ్‌కు నాలుగు వంతెనలు నిర్మించారు. దీంతోపాటు అలుగు, తూముల పనులు పూర్తి చేశారు. కలెక్టర్ మంజూరు చేసిన రూ.4కోట్లతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. చుట్టూ రెయిలింగ్, లాన్, టెయిల్స్, హట్స్ నిర్మాణం చేపట్టారు. మినీ హోటళ్లు, టాయిలెట్లు నిర్మించారు. వీటి మధ్యలో పచ్చదనం పరుచుకున్నట్లుగా మొక్కలు పెంచుతున్నారు. బండ్ చుట్టూ సెంట్రల్ లైటింగ్, ప్రధాన రోడ్డుపై రూ.90లక్షలతో బీటీ రోడ్డు వేస్తున్నారు. దీనికి ప్రధాన ముఖద్వారం మమత రోడ్డు వైపు ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకతీయ కళాతోరణం ఆర్చీ తయారు చేశారు. ప్రధాన ద్వారం కాకుండా ట్యాంక్‌బండ్ చుట్టూ నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు. అలాగే చెరువులో నీటిని నింపేందుకు ఇందిరానగర్ నుంచి ఉన్న మేజర్ కాల్వకు రూ.5కోట్లతో కాంక్రీట్ పనులు చేశారు. సిమెంట్ వాల్స్ వేశారు. చెరువు చుట్టూ తిరిగి చూసేందుకు ఒక బ్యాటరీ కారును ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తెలంగాణ ప్రముఖ కవులు, ఉమ్మడి జిల్లావాసులు దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు విజ్ఞానాన్ని పెంచే విధంగా పలు నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. భూగర్భ జలాల పెంపు.. లకారం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు భూగర్భ జలాలు పెంచేందుకు అధికారులు ఈ పనులు చేపట్టారు. నగరం కొన్నేళ్లుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటుండటం.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ చెరువును ఆధునికీకరించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగర్ జలాలతో నీటిని నింపడం వల్ల తాగునీటికి ఉపయోగపడతాయి. 11న ప్రారంభం.. తరలిరానున్న సినీ తారలు లకారం ట్యాంక్‌బండ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈనెల 11 నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆరోజు నుంచి సుందర దృశ్యాలను నగర వాసులు ఆస్వాదించనున్నారు. 11న ఉదయం సినీ తారలచే 5కే రన్ ఏర్పాటు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్యాంక్‌బండ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం అందించేందుకు అంగీకరించింది. ప్రముఖ సినీ తారలు అందరూ ఆరోజు ఉదయం నగర ప్రజలతో కలిసి 5కే రన్లో పాల్గొననున్నారు. సాయంత్రం 3 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభిస్తారు. ‘లకారం’తో ఆహ్లాదం అత్యాధునిక వసతులతో లకారం చెరువు వద్ద సుమారు 80 ఎకరాల్లో ట్యాంక్‌బండ్ నిర్మాణం కొనసాగింది. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా నియోజకవర్గానికో ట్యాంక్‌బండ్‌ను ప్రభుత్వం ప్రకటించడం.. ఇదే సమయంలో నగరం నడిబొడ్డున నిర్జీవంగా, గుర్రపుడెక్కతో ఉన్న లకారం చెరువుకు పునరుజ్జీవం కల్పించి.. అందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. మిషన్ కాకతీయలో మంజూరైన రూ.7.78కోట్లు సరిపోయే అవకాశం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.13 కోట్లకు పెంచేలా చేశారు. ఆ నిధులతో పనులు వేగవంతం కావడంతోపాటు వివిధ శాఖల నుంచి నిధులు సమకూరాయి. రాష్ట్ర, జిల్లా ప్రముఖుల గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా వారి విగ్రహాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నాం. ట్యాంక్‌బండ్ నిర్మాణంలో జిల్లా అధికారులు, మంత్రి తుమ్మల సహకారం మరచిపోలేనిది. – పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే -
‘చెత్త’ చెరువు
అది పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మినీ ట్యాంక్‌బండ్ పేరుతో రూ.5.41కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపట్టింది. ఆహ్లాదం దేవుడెరుగు! కానీ ప్రస్తుతం చెత్తాచెదారంతో చెత్త చెరువుగా మారిపోయింది. అటువైపు నుంచి వెళ్తే దుర్గంధం వెదజల్లుతోంది.. ఇది నల్లచెరువు దైన్యం..! వనపర్తి : జిల్లా కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు విస్తరించి ఉంది. దీని కింద 397.37ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా టన్నుల కొద్దీ ధాన్యం పండుతుంది. మినీ ట్యాంకుబండ్‌గా మార్చిన తర్వాత కేఎల్ఐ నీటితో చెరువును నింపి ఏడాది పొడవునా కృష్ణాజలాలు ఉండేలా ఆధునికీకరణ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించి రూ.5.41కోట్లు వెచ్చించారు. కానీ నిత్యం వనపర్తి పట్టణం నుంచి సేకరిస్తున్న చెత్తను చెరువుకు ఉత్తరం, దక్షిణం దిశలో డంప్ చేస్తున్నారు. మినీ ట్యాంకు అభివృద్ధి పనులు ప్రారంభమైన రెండు నెలల క్రితం కొంతమేర చెత్త వేయగా ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. నల్లచెరువును నీటితో నింపితే ఇక్కడ ఉన్న నీరంతా కలుషితమవడం ఖాయం. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలను ఇక్కడే పారబోస్తున్నారు. పట్టణవాసులకు ఆహ్లాదమైన వాతావరణం అందించేందుకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి అభివృద్ధి చేస్తున్న మినీ ట్యాంకుబండ్‌లో చెత్త వేయడంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెరువు కట్టమీది నుంచి వచ్చేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. బోటుషికారుకు ఇబ్బందే మినీట్యాంకుబండ్లో చెత్త డంపింగ్ ఆపకుంటే మున్ముందు ఇక్కడ ఏర్పాటుచేసే బోటుషికారు మురుగు, కలుషితనీటిలో చేయాల్సిన వస్తుంది. ఒకవేళ పాడి ఆవులు, గేదెలు తాగినా పాల దిగుబడి తగ్గి, విషతుల్యం కానున్నాయి. బతుకమ్మల నిమజ్జనం కష్టమే.. ఏటా దసరా సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే బతుకమ్మలను నల్లచెరువులోనే నిమజ్జనం చేసే విధంగా అధికారులు ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. చెరువు భూభాగంలో చెత్త డంపింగ్ ఆపకపోతే ఘాట్ నిర్మాణం పూర్తిగా చెత్తతో నిండిపోనుంది. ప్రతిష్టాత్మక బతుకమ్మ సంబరాలను చెత్తకుప్పల మధ్య నిర్వహించుకోవాల్సి వస్తోందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డంపింగ్ యార్డుకు ప్రతిపాదనలు ఇంతకుముందు డంపింగ్‌యార్డు వివాదంలో ఉండడంతో కొత్తగా మరోచోట డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే డంపింగ్ ప్రదేశాన్ని మార్చుతాం. ప్రస్తుతానికి చెరువు ప్రదేశంలో చెత్త వేయకుండా మరోచోట వేసేలా చర్య తీసుకుంటాం. – వెంకటయ్య, ఇన్చార్జి కమిషనర్, వనపర్తి మున్సిపాలిటీ -
‘కట్ట’గట్టి దోపిడీ!
చెరువు కట్టల అభివృద్ధి పనుల్లో భారీగా అంచనాల పెంపు ► సిద్దిపేటలోని ‘కోమటి చెరువు’ను సాకుగా చూపుతూ... ► మినీ ట్యాంక్బండ్లుగా చెరువుల అభివృద్ధికి సర్కారు నిర్ణయం ► మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికో చెరువు ఎంపిక ► ఇప్పటివరకు రూ.517 కోట్ల అంచనాతో 85 చెరువులకు అనుమతి ► జోక్యం చేసుకుని భారీగా అంచనాలు పెంచేస్తున్న ప్రజాప్రతినిధులు ► ఒక్కో చెరువు పనులు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుదల ► సవరించిన పలు అంచనాలకు ఇప్పటికే ఆమోదం సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా అభివృద్ధి చేసే పనులు అవకతవకలకు నిలయంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జోక్యంతో పనుల అంచనా వ్యయాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. చెరువుల స్థాయిని, సుందరీకరణ అవసరాన్ని బట్టి చేయాల్సిన పనులే గాకుండా.. అవసరం లేకున్నా మరిన్ని పనులు ప్రతిపాదనల్లో వచ్చి చేరు తున్నాయి. ఎందుకలా అని ప్రశ్నిస్తే మాత్రం సిద్దిపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న కోమటి చెరువు తరహాలో అభివృద్ధి చేస్తామంటూ సాకులు తెరపైకి వస్తున్నాయి. ఆ చెరువు ఆదర్శమంటూ.. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీ య’లో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు మినీ ట్యాంక్‌బండ్‌గా అభి వృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువు నీటి నిల్వ, కట్ట ఎత్తు, పొడవు, వెడల్పులను ఆధారం చేసుకుని.. ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. అయితే చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు సిద్దిపేటలో అభివృద్ధి చేసిన కోమటి చెరువును చూపుతూ... ఆ తరహా నిర్మాణా లు, ఏర్పాట్లను కోరుతున్నారు. వ్యయ అంచనాలను పెంచేలా ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి కోమటి చెరువు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ కాకపోవడం గమనార్హం. చాలా చోట్ల ఇదే తీరు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన 85 మినీ ట్యాంక్‌బండ్‌లలో రెండు మూడు మినహా మిగతా వాటన్నింటికీ అంచనాలు పెరుగుతు న్నాయి. ఈ 85 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణం కోసం మొత్తంగా రూ.517 కోట్లు అవసరమని తొలుత అంచనా వేయగా... తాజాగా మరో రూ.200 కోట్ల మేర పెరిగే అవకాశముందని చెబుతున్నారు. నిబంధనలివీ.. మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్ల వరకు ఉండాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. అడ్డగోలుగా పెంచేస్తున్నారు.. ప్రస్తుతం కట్ట వెడల్పు అంశం వద్దే చెరువు పనుల్లో అంచనాల పెంపు జరుగుతోంది. చెరువు కట్ట నిర్మాణం పూర్తిగా మట్టిపనితో ముడిపడి ఉంటుంది. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగిస్తున్నారు. కానీ ఆ మట్టిని దూర ప్రాంతం నుంచి తెచ్చినట్లుగా చూపిస్తుంటారు. దీంతో ఇటు చెరువు పూడికతీత, అటు కట్ట నిర్మాణంతో రెండు బిల్లులు పొందే అవకాశ«ం కాంట్రాక్టర్లకు లభిస్తోంది. ఇక చాలా చెరువుల కట్టలను ఇప్పటికే వివిధ పథకాల కింద పలుసార్లు పునరుద్ధరించారు. అంటే ప్రస్తుతం ఆయా చెరువు కట్టల పునరుద్ధరణ పనులు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు చెరువు కట్టల పనులపై మక్కువ చూపుతుంటారు. ప్రస్తుతం చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేల బినామీలు లేదా అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉండటంతో... అంచనాల పెంపు కోసం ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కట్ట వెడల్పును కొన్ని చోట్ల 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు పెంచుతుండటం గమనార్హం. ఒకటిరెండు చోట్ల ఏకంగా 25 మీటర్ల వరకు కూడా పెంచారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏమిటీ కోమటి చెరువు? సిద్దిపేటలోని కోమటి చెరువును 2010 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. చెరువుకట్టపై సేద తీరేలా ఏర్పాట్లు, పిల్లల కోసం మినీ పార్కు, చెరువులో బోటింగ్ వంటివి ఏర్పాటు చేశారు. రెయిలింగ్ వంటివాటితో సుందరీకరించారు. ఇందుకోసం మూడు ప్రభుత్వ శాఖలు కలసి వివిధ దశల్లో రూ.15 కోట్లకుపైగా ఖర్చుపెట్టాయి. ఇందులో రూ.9.3 కోట్లతో నీటి పారుదల శాఖ, రూ.2.5 కోట్లతో పర్యాటక శాఖ, మరో రూ.3 కోట్లతో మున్సిపల్ శాఖ పనులు చేశాయి. ఇన్ని సౌకర్యాలు ఉండటంతో రోజూ సాయంత్రాలు సిద్దిపేట, సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. రెండు మూడు రెట్లు పెంపు! మహబూబాబాద్‌లోని అనంతారంలో ఉన్న మైసమ్మ చెరువు పనుల అంచనాను స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు రూ.83.80 లక్షల నుంచి రూ.3.04 కోట్లకు పెంచారు. మళ్లీ రూ.4.50 కోట్లతో కొత్త అంచనాలు వేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని చౌదరి చెరువు మినీ ట్యాంక్‌బండ్ పనుల వ్యయాన్ని రూ.10 కోట్ల నుంచి ఏకంగా రూ.18.78 కోట్లుగా ప్రతిపాదించారు. కానీ అధికారులు ఆ స్థాయిలో పెంచలేమని రూ.16.32 కోట్లకు సవరించారు. ఖమ్మంలోని లాకారం చెరువు తొలి అంచనా రూ.7.78 కోట్లుకాగా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల జోక్యంతో కొత్తగా మరిన్ని నిర్మాణాలు చేరి రూ.13.50 కోట్లకు చేరింది. దీనికి అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. జనగాంలోని ధర్మవాణి కుంట, బెల్లంపల్లిలోని పోచమ్మచెరువు, ములుగులోని తోపుకుంట చెరువు, ఖానాపూర్లోని గోపయ్య చెరువు, మేడ్చల్ పరిధిలోని ఏదులాబాద్ మినీ ట్యాంక్ బండ్ల అంచనాలకు కూడా వ్యయం పెంపు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. మొత్తంగా చాలా చోట్ల నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పలు చోట్ల అధికారులు ఆ ప్రతిపాదనలను పక్కనపెడుతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఒత్తిడికి తలొగ్గి అంచనాలు పెంచేస్తున్నారు. పలు చోట్ల పెంచిన అంచనా వ్యయాలు (రూ.కోట్లలో) నియోజకవర్గం చెరువు పేరు తొలి అంచనా తాజా అంచనా నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం 8 12 సూర్యాపేట చౌదరి చెరువు 10.57 16.32 మహబూబాబాద్ మైసమ్మ చెరువు 3 4.50 ఖమ్మం లాకారం 7.78 13.50 చొప్పదండి కడిచెరువు 1.07 2.23 ఆదిలాబాద్ ధర్మసాగర్ 4.03 5.60 పరకాల దామరచెరువు 3 5 నిజామాబాద్ అర్బన్ రఘునాథచెరువు 6.50 8 డోర్నకల్ కొండ సముద్రం 2.50 3.50 పెద్దపల్లి ఎల్లమ్మగుండం 5.88 7.20 మినీ ట్యాంక్బండ్ల ప్రతిపాదనలివీ.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 98 ప్రతిపాదనలు అందినవి 92 అనుమతులు మంజూరైనవి 85 అనుమతుల విలువ 517 కోట్లు (రూపాయల్లో) -
పేరుకే మల్లె చెరువు.. నీరు కలుషితం
♦ మల్లెచెరువు కలుషితం ♦ దుర్వాసన వెదజల్లుతున్న వైనం ♦ ఇబ్బందులుపడుతున్నపరిసర ప్రాంత ప్రజలు ♦ సుందరీకరణ పనులు చేపట్టాలని స్థానికుల వినతి రామాయంపేట(మెదక్) : ఆహ్లాదాన్ని పంచాల్సిన రామాయంపేటలోని మల్లె చెరువు ప్రజలను అనారోగ్యం పాలుచేస్తోంది. పూర్తిగా కలుషితమైన ఈచెరువు నీరు రంగు కూడా మారింది. చెరువులో నీరు తాగితే పశువులతో పాటు మనుషులు సైతం అనారోగ్యానికి గురికావడం ఖాయం. చెరువు పరిసరాల్లో ఉన్న బోర్లలో మురుగునీరు వస్తున్నా వి«ధిలేక నీటినే వినియోగించుకుంటున్నారు. రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్డును ఆనుకుని ఉన్న మల్లెచెరువు పూర్తిగా కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలోని మురుగు నేరుగా చెరువులోకి చేరుతుంది. దీనికితోడు స్థానికులు చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా చెరువులో వదిలేస్తున్నారు. దీంతో చెరువు నీరు రంగు మారింది. ఏళ్లతరబడి ఈ తతంగం కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో ఉన్నతాధికారులతోపాటు మంత్రి, డీపీఓ, ఇతర అధికారులు పరిశీలించి మురుగు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెరువులోని చేపలు మొత్తం మృత్యువాత పడ్డాయి. చెరువులో పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం పేరుకుపోయింది. చెరువును ఆనుకొని ఉన్న రామాయంపేట, సిద్దిపేట రోడ్డు గుండా వెళ్లేవారు దుర్గంధం భరించలేకపోతున్నామని చెబుతున్నారు. కాగా చెరువు పరిసరాల్లో నివాసం ఉండేవారు బోరునీటిని తాగవద్దని ఆదేశాలు జారీచేశారు. చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తాం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్న మల్లెచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.రూ.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. – పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీస్పీకర్ -
ఆహ్లాదం... ఆలస్యం
► నత్తనడకన మినీ ట్యాంకుబండ్‌ల అభివృద్ధి ► ఐదు నియోజకవర్గాల్లో రెండేళ్లుగా సాగుతున్న పనులు ► మరో ఐదు సెగ్మెంట్లలో ఆరంభంతోనే సరి ► రెండు నియోజకవర్గాల్లో ఎంపిక జరగని వైనం నీటి వనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసా, ప్రజలకు ఆహ్లాదం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మినీ ట్యాంకుబండ్‌ల అభివృద్ధిని చేపట్టింది. ప్రజాప్రతినిధుల అలసత్వం,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు చెరువుల ఎంపికే జరగలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సాక్షి, వరంగల్: మిషన్ కాకతీయలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద చెరువును మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ కార్యక్రమం మొదలైన 2015లోనే మినీ ట్యాంకుబండ్ ప్రక్రియను ఆరంభించింది. నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు ఇచ్చే ప్రతిపాదనల ప్రకారం మినీ ట్యాంకుబండ్ అభివృద్ధి పనులు మొదలవుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెరువుల వారీగా నిధులు కేటాయిస్తూ సాగునీటి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మిటీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే చెరువునే ఇంకా ఎంపిక చేయలేదు. ములుగు, డోర్నకల్, మహబూబాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి సెగ్మెంట్లలో మినీ ట్యాంక్‌బండ్ పనులు ఇటీవలే మొదలయ్యాయి. 2015లో నిధులు మంజూరైన వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, జనగామ, పరకాల సెగ్మెంట్లలో పనులు ఇంకా సాగుతున్నాయి. మొత్తంగా పది నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి రూ.29.99 కోట్లు సాగునీటి శాఖ మంజూరు చేసింది. ఇప్పటికి రూ.4.62 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం పనులు పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందనేది అంతుచిక్కడం లేదని సాగునీటి శాఖ అధికారులే చెబుతున్నారు. ► భూపాలపల్లి నియోజకవర్గంలో మినీ ట్యాంకుబండ్ అభివృద్ధి పనులు మొదలే కావడంలేదు. నియోజకవర్గంలో పెద్ద చెరువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆరు మండలాలు ఉన్నాయి. అయినా ఏ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలనే విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు సాగునీటి శాఖ చెరువును ఎంపిక చేస్తుంది. ఈ నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి ప్రక్రియ ప్రతిపాదనల దశలోనే ఉంది. ► వర్ధన్నపేట నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులు పక్కనపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ చెరువును ఎంపిక చేయాలనే విషయంలోనే ఇప్పటికీ స్పష్టత రాలేదు. హసన్‌పర్తి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ఇటీవల ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాగునీటి శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ► జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ధర్మవాణికుంటను మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1.48 కోట్లు విడుదల చేస్తూ సాగునీటి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 జూన్ 27న ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.1.12 కోట్ల పనులు పూర్తయినట్లు సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ► నర్సంపేట నియోజకవర్గంలో మాధన్నపేట కుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెరువు అభివృద్ధి కోసం సాగునీటి శాఖ రూ.7.51 కోట్లు మంజూరు చేసింది. 2015 డిసెంబరు 15న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రూ.1.15 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. పనుల తీరు ఇలాగే ఉంటే మరో రెండేళ్ల వరకు పూర్తయ్యే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ► ములుగు నియోజకవర్గ కేంద్రంలోని తోపుకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.2.01 కోట్లను విడుదల చేస్తూ సాగునీటి శాఖ 2016 ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి పనులను లాంఛనంగా మొదలుపెట్టారుగానీ ముందుకు సాగడంలేదు. ► డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల కేంద్రంలోని కొండ సముద్రం చెరువును ఎంపిక చేశారు. చెరువును ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.1.89 కోట్లు మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2016 మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. పనులు మొదలయ్యాయి. కానీ ముందుకు కదడంలేదు. ► మహబూబాబాద్ నియోజకవర్గంలో అనంతారం మైసమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని నిర్ణయించారు. రూ.3.10 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు సాగునీటి శాఖ 2016 మే 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది దగ్గరపడుతున్నా ఇక్కడ పనులు ముందుకు సాగడంలేదు. ► పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తొర్రూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.3.60 కోట్లను మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2016 జూన్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. అంచనాల విషయంలో సవరణ కోసం ప్రతిపాదనలు మళ్లీ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ చెరువు పనులకు ఇంకా టెండరు ప్రక్రియ సైతం మొదలుకాలేదు. ► పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల మండలం మేడవరంలోని దామెరు చెరువును మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.3.08 కోట్లను మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2015 జూన్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రూ.51 లక్షల మేరకు పనులు పూర్తయినట్లు సాగునీటి శాఖ నివేదికలు చెబుతున్నాయి. ► స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని పుట్టలమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1.26 కోట్లను విడుదల చేస్తూ సాగునీటి శాఖ 2016 జూలై 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టెండరు ప్రక్రియ ముగిసి పనులు మొదలయ్యాయి. ► వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రంగసముద్రం(ఉర్సు) చెరువును మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ చెరువు అభివృద్ధి కోసం రూ.3.10 కోట్లను మంజూరు చేస్తూ సాగునీటి శాఖ 2015 అక్టోబరు 15న ఉత్తర్వులు జారీ చేసింది. పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.1.37 కోట్ల వరకు పనులు జరిగినట్లు సాగునీటి శాఖ నివేదికలో పేర్కొన్నారు. ► వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బంధం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2.94 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ను అభివృద్ది చేసేందుకు సాగునీటి శాఖ 2015 డిసెంబరు 17న ఉత్తర్వులు జారీ చేసింది. పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.1.58 కోట్ల అంచనాల మేరకు పనులు పూర్తయ్యాయి. -
మినీ ట్యాంక్‌బండ్‌తో మెదక్‌కు కొత్త అందాలు
రూ.10కోట్లతో రూపుదిద్దుకోనున్న పనులు మెదక్ : మెదక్ పట్టణం కొత్త రూపు సంతరించుకోనుంది. పట్టణాభివృద్ధికోసం భారీగా నిధులు మంజూరు కావడంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని గోసముద్రం, పిట్లం చెరువులను మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.9.52కోట్ల నిధులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మంజూరు చేయించారు. దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు పూర్తయితే సాయంత్రం వేళలో పట్టణ ప్రజలు సేదదీరేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండు చెరువు కట్టలపై ఫ్లైఓవర్ నిర్మించి, సందర్శకులు సేదతీరేందుకు అక్కడకక్కడా కుర్చీలు ఏర్పా టు చేయనున్నారు. ఇప్పటికే మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి, చరిత్రాత్మక కట్టడాలు గల ఖిల్లా, సమీపంలోనే పోచారం అభయారణ్యం ఉన్నాయి. మెదక్ పట్టణం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో వారంతపు సెలవుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. చకచకా చెరువుల పనులు పట్టణంలోని మల్లం చెరువు, బంగ్లా చెరువుల అభివృద్ధికీ ప్రభుత్వం రూ.1.70కోట్ల నిధులు విడుదల చేసింది. మల్లం చెరువుకు 70 ఎకరాల ఆయకట్టు ఉండగా, చెరువు శిఖం చాలా వరకు ఆక్రమణకు గురైంది. అలాగే పట్టణ శివారులోని ఇందిరా కాలనీలోని బంగ్లా చెరువు కింద 18 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కట్టమీదుగానే మండలంలోని మక్తభూపతిపూర్, తిమ్మానగర్, శివ్వాయిపల్లి గ్రామాలకు ప్రజలు వేళ్లేందుకు ప్రధానదారి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చెరువు మరమ్మతులు, తూముల బలోపేతం, కట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయితే మెదక్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. -
మొదటిదశ చెరువు పనులు మార్చి నాటికి పూర్తి
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మొదటి దశ మిషన్ కాకతీయలో భాగంగా కోటి రూపాయల కంటే తక్కువగా ఉన్న చెరువు పనులను 2016 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రూ.కోటికి పైన ఉన్న పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సాగుతున్న మిషన్ కాకతీయ పనులపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశ పనుల్లో అలసత్వం వహిస్తున్న ఏజెన్సీలపట్ల కఠినంగా వ్యవహరించాలని, పనిచేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, అవసరమైతే తొలగించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి కేవలం ఒక మినీ ట్యాంక్‌బండ్‌ను మాత్రమే నిర్మించాలని సూచించారు. ఇటీవల చాలామంది చిన్నారులు ఈత కోసం వెళ్లి చెరువుల్లో మృత్యువాత పడుతున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా లోతైన ప్రాంతాలను పూడ్చాలని అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 46 చెరువు పనులకు యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలవాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. -
శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
కీసర: హైదరాబాద్‌లో నివాసాలు ఏర్పచుకున్న వారంతా తెలంగాణవారేనని, ఇక ప్రాంతీయ బేధాలు పక్కనపెట్టి భాగ్యనగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగారంలో కొత్తగా నిర్మించిన చంద్రయ్య ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొల్లగొట్టడం తప్పించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చొరవతో నగర శివారుప్రాంతాల అభివృద్దికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలోపు కృష్ణా జలాల ముడోదశ పనులు పూర్తిచేసి ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ఒక మినీట్యాంక్‌బండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వినతి మేరకు మండలానికి ఇప్పటికే కేటాయించిన నిధులతోపాటు మరో 8 నుంచి 10 చెరువుల మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇక నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 200 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునితా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోర రవికాంత్, ఉపాధ్యక్షుడు కందాడి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గానికో.. మినీ ట్యాంకుబండ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామాలకు ప్రధాన నీటివనరైన చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భజలాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో చెరువులను పరిరక్షించడంతోపాటు అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విడతల వారీగా చెరువులు పునరుద్ధరించాలంటూ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పనుల కేటాయింపులపైనా ఇంజినీర్లకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వారంలోగా చెరువుల పునరుద్ధరణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని, వాటి ఆమోదం అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా చర్యలకు దిగిన ఇంజినీర్లు.. జిల్లాలో ఉన్న 3400 చెరువుల్లో తొలివిడత 683 చెరువులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. చెరువుల అభివృద్ధితోపాటు పర్యటక పరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో చెట్ల పెంపకాన్ని సైతం ఈ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చెరువును ఎంచుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువును ఎంచుకుని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దాలని ప్రభుత్వం మార్గనిర్దేశించింది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో రావిరాల చెరువులతోపాటు లక్నాపూర్, కోట్‌పల్లి తదితర ప్రాజెక్టులన్నీ పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో చెరువుకు గరిష్టంగా రూ.50లక్షలు.. చెరువుల మరమ్మతు పనులకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. చెరువులో పూడికతీత, కాల్వ పనులు, ఫీడర్ చానళ్ళ మరమ్మతులు తదితర పనులకు సంబంధించి ఒక్కో చెరువుపై గరిష్టంగా రూ.50లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈలెక్కన తొలివిడత చేపట్టే 683 చెరువుల మరమ్మతుకుగాను రూ.350 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మినీట్యాంక్‌బండ్‌ల అభివృద్ధి ఈ ప్రణాళికలో రూపొందిస్తున్నప్పటికీ.. నిధులు మాత్రం ఇతర కోటాలో ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోచోట ఒక్కోవిధంగా పనులు చేయాల్సి ఉన్నందున ప్రణాళిక తయారైన అనంతరం ప్రభుత్వ ఆమోదంతోనే వీటిని నిధులిస్తారు. -
ఉద్యమంలా ‘మిషన్ కాకతీయ’
పట్టణ ప్రాంతాల్లో మినీ ట్యాంక్బండ్లు విపక్షాలను కలుపుకొనిపోతాం: మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళతామని శుక్రవారం శాసనమండలిలో నీటిపారుదల, శాసనసభవ్యవహారాల శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. భూగర్భజలాలను పెంచడంతో పాటు వ్యవసాయానికి నీరందించే ఈ కార్యక్రమంలో విపక్షాలను కూడా కలుపుకుపోతామన్నారు. అంతేకాక కవులు, కళాకారులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘చెరువుల పరిరక్షణ గురించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు, పాఠకులు రాసిన లేఖలకు స్పందించిన ప్రభుత్వం వాటి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని’ చెప్పారు. చెరువుల పునరుద్ధరణ వలన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వివిధ కుల వృత్తుల వారికి జీవనోపాధి లభిస్తుందన్నారు. చెరువుగట్లపై ఈత, తాటి చెట్లు పెంచడం వలన గీత కార్మికులకు ఉపయోగపడతాయన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కనీసం గంటపాటు శ్రమదానం చేయనున్నారని మంత్రి తెలిపారు. గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణతో పాటు, పట్టణాల్లోని చెరువులను కూడా పటిష్టం చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్ మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువులను పరిరక్షించేందుకు సోషల్ ఫెన్సింగ్ పేరిట కాలనీవాసులకు బాధ్యతను అప్పగిస్తామన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్‌లోగా టెండర్లు పిలిచి డిసెంబర్ రెండో వారం నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు.