నిర్మల్ ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పం చేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించ తలపెట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు ఎక్కడివక్క డే ఆగిపోయాయి. పనులు మొదలుపెట్టి నాలుగేళ్లయినా.. డబ్బులొచ్చే కట్టపనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా సుందరీకరణ పనులు చేయకుండా చేతులెత్తేశారు. పనుల పూర్తిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేక..నిధుల విడుదల్లేక ఆహ్లాదం పంచాల్సిన ట్యాంక్‌లు కళావిహీనంగా మారాయి.
సగం మాత్రమే పూర్తి...
చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ ట్యాంక్‌బండ్‌లను రూ.571.53 కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.290 కోట్ల మేర పనులే పూర్తయ్యాయి. 50చోట్ల మాత్రమే పూర్తిస్థాయి ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం పూర్తవగా చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
మట్టిపనితో కూడిన కట్ట నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పనులు మాత్రమే చేశారు. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగించి, బిల్లులు తీసుకొని మమ అనిపించారు. ఇవి మినహా బతుకమ్మ ఘాట్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌ల పనులు చేయనేలేదు. చాలాచోట్ల కట్టలపై రోడ్డు నిర్మాణాలు జరుగక ట్యాంక్‌బండ్ దగ్గరకు సైతం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల పట్టణాల నుంచి మురుగు ట్యాంక్‌బండ్‌ల్లోకే వచ్చి చేరుతూ కంపుకొడుతున్నాయి.
నిర్మాణ నిబంధనలు ఇవి..
మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్‌లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్లతో నిర్మించి రోడ్డు వేయాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు.
నిధుల్లేక నీరసం...
ట్యాంక్‌బండ్‌ల పనులు నత్తనడకకు నిధుల లేమి సైతం సమస్యగా మారింది. మిషన్ కాకతీయ సమయంలోనే ఈ పనులూ చేపట్టారు. చెరువుల పను లు చేసిన కాంట్రాక్టర్లే చాలా చోట్ల మినీ ట్యాంక్‌బండ్ పనులు చేపట్టారు. చెరువులు, మినీ ట్యాంక్‌బండ్‌లకు కలిపి మొత్తంగా రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మినీ ట్యాంక్‌బండ్‌లకు సంబంధించి రూ.100 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓ వైపు చెరువుల బిల్లు లు రాక, మినీ ట్యాంక్‌బండ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను పూర్తిగా నిలిపివేశారు.
మహబూబాబాద్‌లోని నిజాం చెరువుకు రూ.5.50 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా నేటికి 30 శాతమే పూర్తయ్యాయి. కట్ట పనులు, పంట కాల్వ, మత్తడి పనులు పూర్తి కాగా.. పార్క్, వాకింగ్ ట్రాక్, బ్రిడి ఇతర పనులు చేయాలి. కాంట్రాక్టర్‌కు రూ.2 కోట్లు చెల్లించారు. గడువులు దాటుతున్నా పనులు సాగడం లేదు. చెరువు నుంచి గోపాలపురం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేసి ఏడాదిన్నరయినా పనులు పూర్తి కాలేదు.
మరమ్మతులు లేక తెగిపోయిన నిజాం చెరువుకట్ట
భైంసాలోని సుద్ధవాగు(గడ్డెన్నవాగు) ప్రాజెక్టులోనే ఓ వైపు మినీ ట్యాంక్‌బండ్ పేరిట పనులను చేపట్టారు. 2017, మార్చి 9న శంకుస్థాపన చేశారు. రూ.3.64 కోట్లతో పనులు చేపట్టగా, రూ.2.42 కోట్ల పనులు పూర్తయినట్లు చూపారు. ప్రాజెక్టు పక్కనే లోతైన గుంతలతో ఉన్న ప్రాంతాన్ని మొరంతో నింపారు. నీళ్లున్నవైపు బతుకమ్మ ఘాట్ నిర్మించారు. చుట్టూ రెయిలింగ్ వేసి, పార్క్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. అసలు ఆ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. మధ్యలో సీసీ పేవ్‌మెంట్ వేసి వదిలేశారు.
భైంసా పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్
Comments
Please login to add a commentAdd a comment