శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
కీసర: హైదరాబాద్‌లో నివాసాలు ఏర్పచుకున్న వారంతా తెలంగాణవారేనని, ఇక ప్రాంతీయ బేధాలు పక్కనపెట్టి భాగ్యనగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగారంలో కొత్తగా నిర్మించిన చంద్రయ్య ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొల్లగొట్టడం తప్పించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చొరవతో నగర శివారుప్రాంతాల అభివృద్దికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలోపు కృష్ణా జలాల ముడోదశ పనులు పూర్తిచేసి ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతి మండలంలో ఒక మినీట్యాంక్‌బండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వినతి మేరకు మండలానికి ఇప్పటికే కేటాయించిన నిధులతోపాటు మరో 8 నుంచి 10 చెరువుల మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇక నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 200 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునితా, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోర రవికాంత్, ఉపాధ్యక్షుడు కందాడి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.