సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామాలకు ప్రధాన నీటివనరైన చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భజలాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో చెరువులను పరిరక్షించడంతోపాటు అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విడతల వారీగా చెరువులు పునరుద్ధరించాలంటూ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పనుల కేటాయింపులపైనా ఇంజినీర్లకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు వారంలోగా చెరువుల పునరుద్ధరణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని, వాటి ఆమోదం అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా చర్యలకు దిగిన ఇంజినీర్లు.. జిల్లాలో ఉన్న 3400 చెరువుల్లో తొలివిడత 683 చెరువులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
చెరువుల అభివృద్ధితోపాటు పర్యటక పరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో చెట్ల పెంపకాన్ని సైతం ఈ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చెరువును ఎంచుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువును ఎంచుకుని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దాలని ప్రభుత్వం మార్గనిర్దేశించింది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో రావిరాల చెరువులతోపాటు లక్నాపూర్, కోట్‌పల్లి తదితర ప్రాజెక్టులన్నీ పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు.
ఒక్కో చెరువుకు గరిష్టంగా రూ.50లక్షలు..
చెరువుల మరమ్మతు పనులకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. చెరువులో పూడికతీత, కాల్వ పనులు, ఫీడర్ చానళ్ళ మరమ్మతులు తదితర పనులకు సంబంధించి ఒక్కో చెరువుపై గరిష్టంగా రూ.50లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈలెక్కన తొలివిడత చేపట్టే 683 చెరువుల మరమ్మతుకుగాను రూ.350 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మినీట్యాంక్‌బండ్‌ల అభివృద్ధి ఈ ప్రణాళికలో రూపొందిస్తున్నప్పటికీ.. నిధులు మాత్రం ఇతర కోటాలో ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోచోట ఒక్కోవిధంగా పనులు చేయాల్సి ఉన్నందున ప్రణాళిక తయారైన అనంతరం ప్రభుత్వ ఆమోదంతోనే వీటిని నిధులిస్తారు.
నియోజకవర్గానికో.. మినీ ట్యాంకుబండ్
Published Tue, Nov 18 2014 11:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement