సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘జల’సిరి తరిగిపోతోంది. వర్షాకాలం ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. జిల్లాలో సగటున 13.76 మీటర్ల లోతులో భూగర్భజలాలు లభిస్తున్నట్లు భూగర్భజల వనరుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
గతేడాది ఇదే సమయంలో 11.81 మీటర్ల లోతులో ఉన్న నీరు.. ప్రస్తుతం మరింత దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి అవసరాలు, సాగునీటి వినియోగ భారమంతా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉండడంతో సంపద క్రమంగా తరిగిపోతోంది. వాస్తవానికి సీజన్ మొదట్నుంచి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే భూగర్భ నీటిమట్టం పైకి వచ్చేది. కానీ ఆగస్టు చివరివారం వరకు వర్షాలు ముఖం చాటేయడంతో నీటిమట్టం మరింత పడిపోయింది.
ఈ సీజన్‌లో జిల్లాలో సగటున రెండు మీటర్ల లోతుకు పాతాళగంగ పడిపోయినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరిగి, యాచారం మండలాలు మినహా మిగతా 35 మండలాల్లో నీటిమట్టాల పతనం అధికంగా ఉంది. గతేడాదితో పోలిస్తే బంట్వారం మండలంలో 24.57మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఉప్పల్ మండలంలో 6.57 మీటర్లు, గండేడ్ మండలంలో 6.13 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గింది.
ఆరు మండలాల్లో మరీ అధ్వానం..
జిల్లా వ్యాప్తంగా ఆరుమండలాల్లో భూగర్భ నీటిమట్టాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంట్వారం మండలంలో 34.87 మీటర్ల లోతులో నీటిలభ్యత ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ తాజా నివేదికలు చెబుతున్నాయి. మల్కాజిగిరి మండలంలో, 26.76 మీటర్లు, మొయినాబాద్‌లో 23.26 మీటర్లు, మర్పల్లిలో 22.05 మీటర్లు, మహేశ్వరంలో 19.54 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
హయత్‌నగర్, శేరిలింగంపల్లి, శామీర్‌పేట, తాండూరు మండలాల్లో మాత్రం భూగర్భజలాల పరిస్థితి మెరుగ్గా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున భూగర్భజలాల పరిస్థితి కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురవకుంటే మాత్రం తాగునీటికీ కటకట ఏర్పడక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా తగ్గిన భూగర్భ జలాలు
Published Sun, Sep 7 2014 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement