జలగండం!
♦ మెరుగుపడని భూగర్భజలాలు
♦ వర్షాకాలంలోనూ 1.02 మీటర్లు పతనం
♦ సగటున 16.72 మీటర్ల లోతులో జలాలు
♦ గతనెలలో సాధారణ వర్షపాతం నమోదు
♦ అయినా జిల్లాలో పెరగని నీటిమట్టాలు
భూగర్భజలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా జలసిరి పూర్తిగా పాతాళంలోకి జారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం భూగర్భజల మట్టాలు మెరుగుపడలేదని గణాంకాలు చెబుతున్నాయి. వానాకాలంలో కురుస్తున్న వర్షాలు భూగర్భజలాలను సమతుల్యం చేస్తాయని భావించినప్పటికీ.. తాజాగా భూగర్భ జలవనరుల శాఖ వెల్లడించిన గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో కంటే ప్రస్తుత నీటిమట్టాలు మరింత పతనం కావడం కలవరపరుస్తోంది. ఏకంగా 1.02 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమై సగటు 16.72 మీటర్లలోతుకు పడిపోయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత సీజన్‌లో కురిసిన అడపాదడపా వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. గతనెలలో 10.39 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. ఏకంగా 13.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 3.3 సెంటీమీటర్ల వర్షం ఎక్కువగా కురిసింది. అయినా భూగర్భజలాలు మరింత పడిపోయాయి. జూన్ నెలలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. తూర్పు, ఉత్తర ప్రాంతంలో చిన్నపాటి వానలు కురవగా.. తాండూరు, వికారాబాద్, పరిగి డివిజన్లలోని కొన్ని మండలాల్లో కుండపోత వానలు పడ్డాయి. అయితే ఒక్కసారిగా కురిసిన వానలతో వరదలు పెరిగి చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. అయితే భూమిలోకి ఇంకిన నీటి శాతం పెద్దగా లేకపోవ డంతో భూగర్భజల మట్టాలు పైకిరాలేదు. మరోవైపు భూగర్భనీటి వినియోగం తగ్గకపోవడంతో అవి మరింత పతనమై 16.72 మీటర్ల లోతుకు చేరాయి.
30 మీటర్ల లోతులో..
జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జిల్లాలో నీటిప్రాజెక్టులు లేనందున వర్షాధార పంటలను నమ్ముకుని రైతులు సాగుపనులు చేస్తున్నాయి. అయితే జిల్లా అంతటా వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళన కలిగించే విషయమే. పశ్చిమ ప్రాంతంలో గతనెలలో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూగర్భజలాలు మాత్రం మెరుగుపడలేదు. పరిగి, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, గండేడ్ మండలాల్లో 30 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ నీటిమట్టాలు నమోదైనట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా దోమ, వికారాబాద్, మర్పల్లి, పెద్దేముల్, యాచారం, మేడ్చల్, మహేశ్వరం, హయత్‌నగర్ మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భజలాలున్నాయి. మిగతా గ్రామీణ మండలాల్లో జిల్లా సగటు కంటే ఎక్కువలోతులోనే నీటిమట్టాలు నమోదు కావడం ఆందోళనకరం.