* బిట్స్, ఐఐటీ, నాబార్డ్‌లతో నీటిపారుదల శాఖ ఎంఓయూ
* మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పనుల్లో పురోగతికి తోడ్పాటు
* మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంతకాలు
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల్లో ఇరిగేషన్ శాఖకు సాంకేతిక సహకారం అందించేందుకు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్), ఐఐటీ హైదరాబాద్, నాబార్డ్‌లు ముందుకొచ్చాయి. ఈ 3 సంస్థలు గురువారం నీటిపారుదల శాఖతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి సమక్షంలో సాంకేతిక సహకారం విషయమై ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ దేశాయి, బిట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఎస్‌రావు, నాబార్డ్ డెరైక్టర్ సీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 3 సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఇరిగేషన్ శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందని, ఐఐటీ, బిట్స్, నాబార్డ్ సేవలను వినియోగించుకొని దేశానికి మరింత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని, ఈ క్రమంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ అవసరం ఉంటుందని, దీనిద్వారా లోటుపాట్లుంటే తెలిసిపోతుందన్నారు.
నాబార్డ్‌కు అనుసంధానంగా ఉన్న నాప్కాస్ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాలను ఎంచుకొని మిషన్ కాకతీయ ఫలితాలను విశ్లేషిస్తుందని, ఐఐటీ, బిట్స్‌లు పైలట్ ప్రాజెక్టులను ఎంచుకొని ఇరిగేషన్ శాఖ లో జరుగుతున్న పనులపై వారి విద్యార్థులు, అధ్యాపకులతో అధ్యయనం చేయించాలని సూచించారు. శాఖ పరిధిలోని ఇంజనీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి, ప్రాజెక్టుల సమగ్ర వివరాలతో డేటాబేస్‌ను రూపొం దించడానికి సంస్థలు కృషి చేయాలన్నారు.
ఆ సంస్థల డెరైక్టర్లు దేశాయి, వీఎస్‌రావు, సత్యనారాయణలు మాట్లాడుతూ.. సాగునీటిరంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ముఖ్యకార్యదర్శి జోషి మాట్లాడుతూ, మూడు సంస్థలతో ఒక్కరోజే ఎంఓయూ కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని అన్నారు.
ఇరిగేషన్‌కు సాంకేతిక సహకారం
Published Fri, Feb 5 2016 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement